నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
పీఎం సేతు దేశవ్యాప్త విస్తరణ: జిందాల్, ఆర్సెలర్ మిట్టల్, అపోలో మెడ్-స్కిల్స్ కీలక భాగస్వామ్యంతో ఒడిశా, గుజరాత్, తెలంగాణల్లో రూ. 1,237.58 కోట్లతో ఐటీఐల ఆధునికీకరణ
దేశవ్యాప్తంగా 200 ఐటీఐ క్లస్టర్లలో పీఎం-సేతు విస్తరణకు 4వ జాతీయ స్టీరింగ్ కమిటీ ఆమోదం
ఒడిశాలో జిందాల్, గుజరాత్‌లో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్, తెలంగాణలో అపోలో మెడ్‌స్కిల్స్ సారథ్యంలో వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్
प्रविष्टि तिथि:
07 JUL 2026 1:46PM by PIB Hyderabad
‘ఆధునీకరించిన ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి, ఉపాధి పరివర్తన పథకం (పీఎం సేతు) 4వ జాతీయ స్టీరింగ్ కమిటీ (ఎన్‌ఎస్‌సీ)’ సమావేశం ఈరోజు కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డీఏ) కార్యదర్శి శ్రీమతి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో డీజీటీ డైరెక్టర్ జనరల్ శ్రీ దిలీప్ కుమార్, సంయుక్త కార్యదర్శి శ్రీమతి మానసి సహాయ్ ఠాకూర్‌లతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ ప్రతినిధులు, బహుళ పక్ష అభివృద్ధి భాగస్వాములు, పారిశ్రామిక ప్రముఖులు, ఇతర కీలక వాటాదారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కమిటీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం సేతు పథకాన్ని ప్రయోగాత్మక దశ నుంచి దేశవ్యాప్త విస్తరణకు ఆమోదం తెలిపడం ఈ సమావేశంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం. ఇందులో భాగంగా గుర్తించిన మొత్తం 200 ఐటీఐ క్లస్టర్లలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. పరిశ్రమల సన్నద్ధత, అమలు చేయగల సామర్థ్యాల ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కమిటీ వీలు కల్పించింది. దీనితో పాటు పథకం అమలును మరింత సరళతరం చేయడం, పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచడం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రమేయాన్ని విస్తృతం చేయడం, పీఎం సేతు అమలుకు మద్దతుగా నిలిచే సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలను కూడా కమిటీ ఆమోదించింది.
మొత్తం రూ. 1,237.58 కోట్ల వ్యయంతో కూడిన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికలకు కమిటీ ఆమోదం తెలిపింది. ఆయా రాష్ట్రాల స్టీరింగ్ కమిటీలు సిఫార్సు చేసిన ఈ ప్రణాళికల ద్వారా దేశవ్యాప్తంగా పలు ఐటీఐ క్లస్టర్లను పరిశ్రమల ఆధ్వర్యంలో ఆధునీకరించేందుకు మార్గం సుగమమైంది. ఇందులో భాగంగా ప్రముఖ పారిశ్రామిక సంస్థలైన జిందాల్ నవీన్ ఆవాసార్ లిమిటెడ్ ఒడిశాలోనూ, ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా గుజరాత్‌లోనూ కీలక భాగస్వాములుగా ముందుకు వచ్చాయి. వీటితో పాటు తెలంగాణలో అపోలో మెడ్‌స్కిల్స్, ఆమోదం పొందిన మరో రెండు ఐటీఐ క్లస్టర్లు ఈ ప్రతిష్టాత్మక ఆధునికీకరణ భాగస్వామ్యంలో చేరాయి.
ఒడిశా..
ఒడిశాలో మంజూరైన ఐటీఐ క్లస్టర్‌కు ప్రభుత్వ ఐటీఐ ‘బార్బిల్’ ప్రధాన కేంద్రంగా వ్యవహరిస్తుంది. దీనికి అనుబంధంగా ఆనంద్‌పూర్, కోయిరా, కరంజియా, బార్కోట్ ప్రభుత్వ ఐటీఐలు పనిచేస్తాయి. ఈ క్లస్టర్‌కు మెసర్స్ జిందాల్ నవీన్ ఆవాసార్ లిమిటెడ్ కీలక పారిశ్రామిక భాగస్వామిగా వ్యవహరిస్తుండగా... ఇక్కడ రూ. 240.21 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు.
గుజరాత్..
గుజరాత్‌లో ప్రభుత్వ ఐటీఐ ‘సూరత్’ ప్రధాన కేంద్రంగా ఎంపికైంది. హజీరా, బార్డోలి, సచిన్, సూరత్ (మహిళా) ప్రభుత్వ ఐటీఐలు దీనికి అనుబంధంగా ఉంటాయి. ఈ క్లస్టర్ అభివృద్ధికి మెసర్స్ ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా సంస్థ కీలక పారిశ్రామిక భాగస్వామిగా నిలిచింది. ఇక్కడ ప్రతిపాదించిన పెట్టుబడి వ్యయం రూ. 240.18 కోట్లు.
తెలంగాణ..
· తెలంగాణలో మొత్తం మూడు ఐటీఐ క్లస్టర్లకు ఆమోదం లభించింది. అందులో మొదటిది ప్రభుత్వ ఐటీఐ ‘ఓల్డ్ సిటీ’ ప్రధాన కేంద్రగా ఉండగా... వరంగల్, నల్గొండ (బాలుర), వికారాబాద్ (బాలికల), పంజాగుట్ట ఐటీఐలు అనుబంధంగా ఉంటాయి. దీనికి మెసర్స్ అపోలో మెడ్-స్కిల్స్ లిమిటెడ్ భాగస్వామిగా వ్యవహరిస్తూ రూ. 241.01 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
· రెండో క్లస్టర్: ప్రభుత్వ ఐటీఐ ‘పటాన్‌చెరు’ ప్రధాన కేంద్రంగా... షాద్‌నగర్, మర్పల్లి, నల్గొండ (కొత్తది), భువనగిరి ఐటీఐలు అనుబంధంగా ఉంటాయి. దీనికి మెసర్స్ శ్రీ సిద్ధార్థ ఇన్‌ఫ్రాటెక్, సర్వీసెస్ (ఐ) ప్రైవేటు లిమిటెడ్ (ఎస్‌ఎస్‌ఐఎస్‌పీఎల్) కీలక పారిశ్రామిక భాగస్వామిగా ఎంపికైంది. దీని పెట్టుబడి విలువ రూ. 275.24 కోట్లు.
· మూడో క్లస్టర్: ప్రభుత్వ ఐటీఐ ‘సంగారెడ్డి’ ప్రధాన కేంద్రంగా ఉండగా... హథ్నూర, మెదక్, దుబ్బాక, ఎల్లారెడ్డి ఐటీఐలు దీని పరిధిలోకి వస్తాయి. మెసర్స్ న్యూలాండ్ ఫౌండేషన్ కీల పారిశ్రామిక భాగస్వామిగా వ్యవహరించనుంది. ఈ క్లస్టర్ కోసం రూ. 240.94 కోట్ల పెట్టుబడిని ప్రతిపాదించారు.
పీఎం సేతు పథకం గురించి...
భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకమైన పథకాల్లో పీఎం-సేతు ఒకటి. దేశంలోని ఐటీఐ వ్యవస్థను బలోపేతం చేసి, ఆధునీకరించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. బలమైన పరిశ్రమ భాగస్వామ్యాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణమైన పాఠ్యప్రణాళికలు, మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఇది దోహదపడుతుంది.
***
(रिलीज़ आईडी: 2282209)
आगंतुक पटल : 24