జాతీయ మానవ హక్కుల కమిషన్
హిసార్, రోహ్‌తక్ జిల్లాల్లోని మూడు ఆసుపత్రులకు వెళ్లినా దక్కని వెంటిలేటర్... 24 గంటల నరకం తర్వాత హర్యానాలో నవజాత శిశువు మృతి
ఈ దారుణ ఘటనపై సుమోటోగా స్పందించి విచారణకు ఆదేశించిన జాతీయ మానవ హక్కుల సంఘం
ఈ విషయంపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ... హర్యానా ప్రధాన కార్యదర్శికి కమిషన్ నోటీసులు జారీ
प्रविष्टि तिथि:
06 JUL 2026 1:34PM by PIB Hyderabad
హర్యానాలోని హిసార్, రోహ్‌తక్ జిల్లాల్లో మూడు పెద్ద ఆసుపత్రులు తిరిగినా దాదాపు 24 గంటల పాటు వెంటిలేటర్ సౌకర్యం దొరకకపోవడంతో ఒక నవజాత శిశువు మృతి చెందిన ఉదంతంపై జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. పత్రికలలో వచ్చిన ఈ కథనాన్ని కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మీడియా నివేదికల ప్రకారం... ఆ నవజాత శిశువు తండ్రి తన బిడ్డకు వెంటిలేటర్ సౌకర్యం కోసం హిసార్, రోహ్‌తక్ జిల్లాల్లోని ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తిరిగినప్పటికీ ఎక్కడా వెంటిలేటర్ లభించకపోవడంతో చివరకు ఆ పసికందు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
వార్తా కథనాల్లోని అంశాలు నిజమైతే అవి తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఎన్‌హెచ్ఆర్‌సీ పేర్కొంది. ఈ దారుణ ఘటనపై రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాల్సిందిగా హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.
జూలై 3న వెలువడిన మీడియా నివేదికల ప్రకారం... జూలై 1న హర్యానాలోని హిసార్ సివిల్ ఆసుపత్రిలో ఒక మహిళకు సిజేరియన్ కాన్పు ద్వారా మగబిడ్డ జన్మించాడు. అయితే, పుట్టిన వెంటనే ఆ శిశువుకు అత్యవసరంగా వెంటిలేటర్ మద్దతు అవసరమైంది. అక్కడి వైద్యులు తొలుత ఆ శిశువును హిసార్ జిల్లాలోని అగ్రోహా మెడికల్ కళాశాలకు సిఫార్సు చేశారు. కానీ అగ్రోహాలో కూడా వెంటిలేటర్ ఖాళీగా లేదని సివిల్ ఆసుపత్రి వర్గాలు నిర్ధారించడంతో శిశువును రోహ్‌తక్‌లోని పీజీఐఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా వెంటిలేటర్ దొరకకపోవడంతో బిడ్డను తిరిగి హిసార్‌కు తీసుకువచ్చి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన ప్రైవేటు వైద్యులు ఆ పసికందు అప్పటికే మరణించినట్లు ప్రకటించారు.
***
(रिलीज़ आईडी: 2281708)
आगंतुक पटल : 12