ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇ-గవర్నెన్స్-2026 జాతీయ పురస్కారాల్లో ‘ఐసీఎంఆర్‌’కు స్వర్ణం


కృత్రిమ మేధ ఆధారిత పౌర కేంద్రక ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణపై ‘ఐసీఎంఆర్-మైండ్స్‌’కు ‘డీఏఆర్‌పీజీ’ సత్కారం

ప్రామాణిక మానసిక ఆరోగ్య సంరక్షణ ప్రదానం కోసం క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తలకు డిజిటల్ వేదిక ద్వారా సాధికారత

నాడు పోస్టు చేయడమైనది: 05 JUL 2026 12:43PM by PIB Hyderabad

కేంద్ర సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పింఛన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిపాలన సంస్కరణలు-ప్రజా ఫిర్యాదుల విభాగం (డీఏఆర్‌పీజీ) ప్రదానం చేసే ఇ-గవర్నెన్స్ జాతీయ పురస్కారాలు-2026లో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కి స్వర్ణ పతకం లభించింది. జాతీయ ఆరోగ్య పరిశోధన ప్రధాన ప్రాజెక్టు ‘ఐసీఎంఆర్-మైండ్స్‌’ కింద యొక్క ప్రతిష్టాత్మక కార్యక్రమం “పౌర కేంద్రక సేవా ప్రదానం కోసం కృత్రిమ మేధ.. ఇతర ఆధునిక సాంకేతికతల వినియోగం ద్వారా ఆవిష్కరణ”కుగాను కేటగిరీ-2 కింద ఈ ఘనత దక్కింది. ఈ మేరకు ‘డీఏఆర్‌పీజీ’ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అవార్డును బహూకరించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ రాష్ట్ర సమాచార సాంకేతిక-కమ్యూనికేషన్ల శాఖ మంత్రి కల్నల్ రాజవర్ధన్ రాఠోర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ వి.శ్రీనివాస్, ‘డీఏఆర్‌పీజీ’-పెన్షన్లు-పెన్షనర్ల సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి నివేదిత శుక్లా వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 1-2 తేదీల్లో రాజస్థాన్‌లోని జైపూర్‌లో 29వ జాతీయ ఇ-గవర్నెన్స్ సదస్సు (ఎన్‌సీఈజీ)-2026లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

అసాంక్రమిక వ్యాధులతోపాటు మానసిక-మాదకద్రవ్య వ్యసన రుగ్మతల నిర్ధారణ పరీక్షలు- నిర్వహణను ఏకీకృతం చేస్తూ ‘ఐసీఎంఆర్‌’ రూపొందించిన పరిశోధనాధ్యయన కార్యక్రమమే ‘మైండ్స్‌’. ఇందులో భాగంగా వైద్యపరమైన నిర్ణాయక వ్యవస్థ (సీడీఎస్‌ఎస్‌)ను సంస్థ తయారు చేసింది. ప్రామాణిక మానసిక ఆరోగ్య పరీక్షలు, అంచనాలు, అనుసరణ, సాధారణ నిర్వహణ వంటి కార్యకలాపాల్లో నిపుణుల ద్వారా శిక్షణ పొందిన, నిపుణులు కాని క్షేత్రస్థాయి ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు ప్రదాతలకు కొన్ని సేవల బదిలీ కోసం ఈ నిదర్శనాధారిత డిజిటల్ నిర్ణయ మద్దతు వ్యవస్థ వీలు కల్పిస్తుంది.

సేవల ప్రదానంపై పర్యవేక్షణ, నిపుణులపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా ప్రత్యక్ష అడ్మినిస్ట్రేటివ్ డాష్‌బోర్డులు సహా వినియోగదారులను నిమగ్నం చేయడం, ప్రామాణిక డిజిటల్ స్క్రీనింగ్-అసెస్‌మెంట్ వర్క్‌ఫ్లో, పాత్ర-ఆధారిత వైద్య మార్గనిర్దేశం, ఆఫ్‌లైన్ కార్యకలాపాలు, బహుభాషా సదుపాయం, గేమిఫైడ్ ఫీచర్లు వంటివి ఈ వేదిక ద్వారా అందుబాటులో ఉంటాయి. నిరంతర ఆరోగ్య సంరక్షణ విధానమే దీని ప్రధాన బలం. క్రమబద్ధ రెఫరల్, ద్విదిశాత్మక బ్యాక్-రెఫరల్ వంటివాటికి ఇది మద్దతిస్తుంది. తద్వారా నిపుణులు సంక్లిష్ట కేసులపై దృష్టి సారిస్తే, ఆరోగ్యం నిలకడగా గల రోగులు తమకు సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో తదుపరి సంరక్షణ సేవలు పొందడం వీలవుతుంది. దీనివల్ల పుణుల సమయం సద్వినియోగం కావడమే కాకుండా ప్రామాణిక మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలందించడంలో క్షేత్రస్థాయి సిబ్బందికి సాధికారత లభిస్తుంది. క్రమం తప్పకుండా చికిత్స పొందేవిధంగా పరిస్థితులను మెరుగుపరుస్తుంది, తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై భారం తగ్గడంతోపాటు సంరక్షణ ప్రక్రియలో రోగులు మధ్యలోనే చికిత్స మానేయడాన్ని నివారిస్తుంది.

ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం 7 రాష్ట్రాల్లో వివిధ సంస్థల సహకారంతో అమలు చేస్తున్నారు. ఈ మేరకు అస్సాంలో ‘ఆల్ ఇండియా ఇనిన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), గువహటి, గుజరాత్‌లో అహ్మదాబాద్‌లోని ‘గుజరాత్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్’, హర్యానాలో ఎయిమ్స్, న్యూఢిల్లీ, కర్ణాటకలో బెంగళూరులోని సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్, మధ్యప్రదేశ్‌లో భోపాల్‌లోని ఎయిమ్స్, ఒడిషాలో భువనేశ్వర్‌లోని ఎయిమ్స్, పంజాబ్‌లో చండీగఢ్‌లోని ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’ (పీజీఐఎంఇఆర్) ద్వారా సేవలు అందుతున్నాయి.

తమకు ఈ జాతీయ గుర్తింపు లభించడంపై ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శి, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే “సంక్లిష్ట ప్రజారోగ్య సమస్యల పరిష్కారం దిశగా డేటా ఆధారిత, విస్తరణీయ సాంకేతిక కార్యకలాపాలకు ‘ఐసీఎంఆర్’ మార్గనిర్దేశం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న సంస్థలు, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలతో సహకారం ద్వారా  దేశంలోని ప్రజలందరికీ చౌకగా, ప్రామాణిక, అధిక నాణ్యత గల ఆరోగ్య సంరక్షణ వేదికలను సమకూర్చడానికి ఐసీఎంఆర్ నిబద్ధతతో కృషి చేస్తోంది” అని పేర్కొన్నారు.

అస్సాం, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిషా, పంజాబ్ రాష్ట్రాల ఆరోగ్య శాఖలు సహా ఆయా రాష్ట్రాల మానసిక ఆరోగ్య-‘ఎన్‌సీడీ’ కార్యక్రమ బృందాలు, జిల్లా ఆరోగ్య అధికారులు, ప్రధాన పరిశోధకులు, సహ-ప్రధాన పరిశోధకులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, క్షేత్రస్థాయి బృందాల మధ్య సన్నిహిత సహకారంతోనే ‘ఐసీఎంఆర్-మైండ్స్’ విజయం సాధ్యమైంది.

 

***


(రిలీజ్ ఐడి: 2281441) సందర్శకుల సూచీ సంఖ్య : : 67
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Tamil