బ్రిక్స్ దేశాల మాదక ద్రవ్య నిరోధక సంస్థల అధిపతుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 6-7 తేదీల్లో అస్సాంలోని గౌహతిలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బ్రిక్స్ కూటమిలోని మాదక ద్రవ్య నియంత్రణ సంస్థల మధ్య సంస్థాగత కొనసాగింపు బలోపేతం, లోతైన కార్యాచరణ సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన మాదక ద్రవ్య నిరోధక సంస్థల అధిపతులు, సీనియర్ అధికారులు సమావేశం కానున్నారు.
కృత్రిమ మందులు, నూతన సైకోయాక్టివ్ పదార్థాలు (ఎన్‌పీఎస్), డార్క్‌నెట్ ద్వారా జరిగే అక్రమ రవాణా, క్రిప్టోకరెన్సీ ఆధారిత ఆర్థిక వ్యవహారాల విస్తరణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా స్వరూపం గణనీయంగా మారిపోయింది. వీటి కారణంగా సంక్లిష్టమైన అంతర్జాతీయ సవాళ్లూ పెరుగుతున్నాయి. అక్రమ రవాణాను అడ్డుకునే సాంకేతికతలు, డేటా విశ్లేషణ, ఆర్థిక నిఘాలో వచ్చిన పురోగతులు... మెరుగైన అంతర్జాతీయ సహకారానికి, సమన్వయంతో కూడిన చర్యలకు గణనీయ అవకాశాలను కల్పిస్తున్నాయి. బ్రిక్స్ సహకారాన్ని కేవలం చర్చలకే పరిమితం చేయకుండా... నిర్మాణాత్మక, కార్యాచరణ-ఆధారిత సహకారంగా మార్చడంలో ఈ సమావేశం కీలక ముందడుగు అవుతుందని భారత్ భావిస్తోంది. కార్యాచరణ సమన్వయాన్ని బలోపేతం చేయడం, నిఘా సమాచారాన్ని పంచుకోవడం, సామర్థ్యాలను పెంపొందించడం, కొత్తగా తలెత్తుతున్న మాదకద్రవ్యాల సంబంధిత ముప్పులకు సమష్టిగా ప్రతిస్పందించడంపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశం మూడు కీలక ప్రాధాన్యాలపై దృష్టి సారిస్తుంది:
I. కృత్రిమ మందులు, వాటి తయారీకి ఉపయోగించే పదార్థాల మళ్లింపును నిరోధించడం.
II. నిఘా సమాచారాన్ని పంచుకోవడం, కార్యాచరణ సమన్వయాన్ని బలోపేతం చేయడం.
III. సామర్థ్యాలను పెంపొందించడం, సంస్థాగత సహకారం.
మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై భారత్ పోరాటం: మాదక ద్రవ్య రహిత భారత్ దార్శనికత
మాదకద్రవ్యాల ముప్పును ఎదుర్కోవడంలో భారత్ తీసుకుంటున్న నిర్ణయాత్మక చర్యలను చర్చించేందుకు ఈ సమావేశం అవకాశం కల్పిస్తుంది. మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల దుర్వినియోగం ప్రజల భద్రతకు, ఆరోగ్యానికి, దేశ యువత భవిష్యత్తుకు పెను ముప్పుగా మారుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగానికి వ్యతిరేకంగా భారత్ తన పోరాటాన్ని గణనీయంగా బలోపేతం చేసింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాల ముఠాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూనే... అవగాహన కల్పన, సామాజిక భాగస్వామ్యం, వ్యసనం బారిన పడిన బాధితులకు చికిత్స అందించడానికీ అంతే ప్రాధాన్యమిస్తోంది. ప్రభుత్వంలోని అన్ని విభాగాల భాగస్వామ్యం, నెట్‌వర్క్-కేంద్రిత విధానాన్ని అవలంబిస్తూ... మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో సంస్థాగత సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా భారత్ ఇటీవలే మాదకద్రవ్యాల నియంత్రణపై విజన్ డాక్యుమెంట్ (2026–2029)నూ విడుదల చేసింది.
రహస్య ప్రయోగశాలలు, అభివృద్ధి చెందుతున్న సింథటిక్ డ్రగ్ ధోరణుల గురించి సమాచారాన్ని పంచుకోవడం, ముడి పదార్థాల సంబంధిత రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్‌పై పర్యవేక్షణను మెరుగుపరచడం, నిఘా సమాచారన్ని పంచుకోవడం, ఉత్తమ పద్ధతులను పంచుకోవడం, ఉమ్మడి శిక్షణా కార్యక్రమాలు, నిపుణుల అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా సహకారాన్ని బలోపేతం చేయడానికి అధ్యక్ష హోదాలో భారత్ ప్రయత్నిస్తోంది.
పెరుగుతున్న సవాళ్ల పరిష్కారం కోసం ప్రత్యేక సమావేశాలు
రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో, సభ్య దేశాలు తమ దేశాల్లో మాదకద్రవ్యాల పరిస్థితిని చర్చిస్తాయి. తీవ్రమైన, కొత్తగా తలెత్తుతున్న ప్రపంచ సవాళ్ల ఆధారంగా 06 అంశాలతో నిర్వహించే ప్రత్యేక సమావేశాల్లో సభ్య దేశాలు పాల్గొంటాయి. ఈ సమావేశాలు కింది అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తాయి:
I. ఎప్పటికప్పుడు మాదకద్రవ్యాల నిరోధానికి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం.
II. డార్క్ నెట్ ద్వారా జరిగే మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడం.
III. పెరుగుతున్న నూతన సైకోయాక్టివ్ పదార్థాలను (ఎన్‌పీఎస్) ఎదుర్కోవడం.
IV. ముడిపదార్థాల మళ్లింపు, రసాయన లీకేజీకి వ్యతిరేకంగా ప్రపంచ సరుకు రవాణా వ్యవస్థలను బలోపేతం చేయడం.
V. మాదకద్రవ్యాల డిమాండ్‌ను తగ్గించడం లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు, సంబంధిత చర్యలు.
VI. సంస్థాగత యంత్రాంగాలను బలోపేతం చేయడం.
ఈ సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగుస్తుంది.
"సమర్థత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత నిర్మాణం" అనే ప్రధాన ఇతివృత్తం ఆధారంగా 2026లో భారత్ బ్రిక్స్ సారథ్యం ముందుకు సాగుతోంది. బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే ప్రపంచంలోని 11 ప్రధాన అబివృద్ధి చెందుతున్న మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాలను బ్రిక్స్ ఒకచోట చేర్చుతుంది. ప్రపంచ, ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగిన సమకాలీన సమస్యలపై, ప్రపంచస్థాయి రాజకీయ, ఆర్థిక పాలనకు సంబంధించిన అంశాలపై సంప్రదింపులు, సహకారం కోసం ప్రయోజనకరమైన వేదికగా ఇది పనిచేస్తుంది.
***