ప్రధాన మంత్రి కార్యాలయం
సుస్థిర ఇంధన సామర్థ్యంపై భారత్-జపాన్ సంయుక్త ప్రకటన
प्रविष्टि तिथि:
02 JUL 2026 9:53PM by PIB Hyderabad
జపాన్ ప్రధానమంత్రి గౌరవ సనాయే తకాయిచితో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితి దృష్ట్యా... ఆసియాలో బాధ్యతాయుత శక్తులుగా, ప్రధాన ఇంధన వినియోగ దేశాలుగా కలిసి పనిచేయడం ద్వారా సుస్థిర ఇంధన సామర్థ్యాన్ని సంయుక్తంగా బలోపేతం చేసుకోవాలనే తమ ఉమ్మడి ఉద్దేశాన్ని వారు స్పష్టం చేశారు.
దక్షిణాసియాలో ఇంధన భద్రతకు భారత్ అందిస్తున్న మద్దతు... జపాన్ విస్తృత ఇంధన-వనరుల సామర్థ్య భాగస్వామ్యం (పవర్‌ఆర్ ఏషియా) వంటి ఇంధన సామర్థ్యాన్ని బలోపేతం చేసే ప్రాంతీయ కార్యక్రమాల ప్రాముఖ్యతను ఇరుపక్షాలు ప్రధానంగా ప్రస్తావించాయి. భారత పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ... జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింది నిర్దిష్ట కార్యక్రమాల్లో పరస్పరం సహకరించుకోవాలని చర్చల ద్వారా నిర్ణయించాయి:
1. వ్యూహాత్మక నిల్వల వ్యవస్థ విషయంలో సహకారం
తమ పరిజ్ఞానాన్ని, అనుభవాన్ని పంచుకోవాల్సిన ప్రాముఖ్యతను... అవసరం మేరకు ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వ వ్యవస్థలు, రిజర్వ్ యంత్రాంగాలకు సంబంధించి నిర్దిష్ట సహకారాన్ని ప్రోత్సహించడాన్ని ఇరు పక్షాలూ పునరుద్ఘాటించాయి. ఇతర అంశాలతో పాటు, కింది అంశాలపై ఈ సహకారం ప్రధానంగా దృష్టి సారిస్తుంది:
పారిశ్రామిక నిల్వలు సహా జాతీయ నిల్వ వ్యవస్థలు, నిల్వలకు సంబంధించిన యంత్రాంగాలు
ఇంధనం ఉత్పత్తి చేస్తున్న దేశాలతో ఒప్పందాలకు సంబంధించి సమన్వయం
అత్యవసర ప్రతిస్పందన, మార్కెట్ స్థిరీకరణ
2. ఇంధన వినియోగ దేశాల ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయడం
సరఫరాకు హామీనిచ్చే, సామర్థ్యాలను పెంపొందించే, అస్థిరతను తగ్గించే యంత్రాంగాల ఏర్పాటు ద్వారా ఇంధన లభ్యత, అందుబాటు ధరల వంటి ఉమ్మడి సవాళ్లను పరిష్కరించేందుకు పరస్పర సహకారం ప్రాముఖ్యతను ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. తద్వారా చమురు, గ్యాస్ వినియోగించే దేశాల ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డాయి. ఈ సహకారం కింది అంశాలపై దృష్టి సారిస్తుంది:
మార్కెట్ ధోరణుల గురించి సమాచారాన్ని పంచుకోవడంలో సహకారం, మార్కెట్ స్థిరీకరణ కోసం ఉమ్మడి ప్రయత్నాలు
ఇంధన సరఫరా కోసం ఇతర దేశాలతో ఒప్పందాలకు ప్రయత్నించడం
ఇతర దేశాల్లో అప్‌స్ట్రీమ్ రంగంలో పెట్టుబడుల కోసం వాణిజ్యపరమైన ఒప్పందాలకు ప్రయత్నించడం.
3. ఇంధన రవాణాలో సహకారం
విపత్తులను తట్టుకునే, స్వయం సమృద్ధి గల, సమర్థమైన సముద్ర మార్గ చమురు, గ్యాస్ రవాణా ప్రాముఖ్యతను ఇరు దేశాల ఇంధన భద్రతకు కీలక ఆధారంగా ఇరు పక్షాలు పునరుద్ఘాటించాయి. సముద్ర మార్గంలో జరిగే సమగ్ర ఇంధన రవాణా, వాణిజ్య కార్యకలాపాల వ్యాప్తంగా ఉమ్మడి పెట్టుబడులు సహా పరస్పర సహకారానికి గల అవకాశాలను అన్వేషించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.
4. సంస్థాగత సహకారం
ఇంధన రంగంలో సాంకేతిక, ఆర్థిక సహకారం సహా సమగ్ర సహకారాన్ని మరింతగా పెంపొందించుకునేందుకు, కింది జాబితాలో పేర్కొన్న వారితో సహా సంబంధిత భాగస్వాముల మధ్య సంస్థాగత సహకారాన్ని ప్రోత్సహించాలనే తమ ఉద్దేశాన్ని ఇరుపక్షాలు ధ్రువీకరించాయి:
భారతీయ సంస్థలు: భారత జాతీయ చమురు కంపెనీలు, ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్, ఇతర సంబంధిత వాటాదారులు
జపనీస్ సంస్థలు: జపాన్ ఆర్గనైజేషన్ ఫర్ మెటల్స్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ, జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్, ఇతర సంబంధిత వాటాదారులు
5. చర్చల కోసం వేదిక
ఈ ప్రకటనలో గుర్తించిన ప్రాధాన్యతా రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో... ‘భారత్-జపాన్ ఎనర్జీ డైలాగ్’ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత్-జపాన్ పెట్రోలియం, సహజ వాయువుల సంయుక్త కార్యాచరణ బృందం ద్వారా చర్చలు నిర్వహించాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. ఈ వేదిక ద్వారా, ఇరుపక్షాలు తాజా పరిజ్ఞానాన్ని, అనుభవాలను పంచుకోవడంతో పాటు, పరస్పర ప్రయోజనకరమైన సహకార అవకాశాలనూ అన్వేషిస్తాయి.
***
(रिलीज़ आईडी: 2280632)
आगंतुक पटल : 14