పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇంధన దృఢత్వంపై భారతదేశ పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ, జపాన్ దేశ ఆర్థిక-వాణిజ్య- పరిశ్రమల మంత్రిత్వ శాఖల సంయుక్త ప్రకటన

प्रविष्टि तिथि: 02 JUL 2026 5:54PM by PIB Hyderabad

భారత గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, జపాన్ గౌరవ ప్రధాని శ్రీమతి తకాయిచి సనాయె 2026 జూలై 2న ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆసియాలో బాధ్యతాయుతమైన శక్తులుగా, ఇంధనాన్ని అత్యధికంగా వినియోగించే ప్రధాన దేశాలుగా ఇంధన దృఢత్వాన్ని ఉమ్మడిగా బలోపేతం చేయడానికి కలిసి పనిచేయాలనే తమ ఉమ్మడి సంకల్పాన్ని ఇరు పక్షాలు వ్యక్తం చేశాయి.

ఇంధన దృఢత్వాన్ని పెంపొందించడానికి ప్రాంతీయ కార్యక్రమాలు ఎంతో ప్రాముఖ్యమైనవని ఇరు పక్షాలూ ప్రధానంగా పేర్కొన్నాయి. ఇందులో భాగంగా జపాన్ చేపట్టిన 'పార్టనర్‌షిప్ ఆన్ వైడ్ ఎనర్జీ అండ్ రిసోర్సెస్ రెసిలియెన్స్' (పవర్ ఆసియా), దక్షిణాసియాలో ఇంధన భద్రతకు భారత్ అందిస్తున్న మద్దతును ప్రత్యేకంగా ప్రస్తావించాయి. ఇరు దేశాల నాయకుల చర్చల ఆధారంగా భారత పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ, జపాన్ ఆర్థిక- వాణిజ్య- పరిశ్రమల మంత్రిత్వ శాఖలు కింది నిర్దిష్ట అంశాలపై సహకరించుకోనున్నాయి:

1. వ్యూహాత్మక నిల్వల వ్యవస్థలో సహకారం

ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వ వ్యవస్థలు, రిజర్వ్ యంత్రాంగాలకు సంబంధించి తమ తమ విజ్ఞానాన్ని, అనుభవాలను పంచుకోవడం.. తగిన సందర్భాలలో నిర్దిష్ట సహకారాన్ని పెంపొందించుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనదని ఇరు పక్షాలు పునరుద్ఘాటించాయి. ఈ సహకారం ముఖ్యంగా ఈ అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది:

  • పారిశ్రామిక నిల్వలతో సహా జాతీయ నిల్వ వ్యవస్థలు, రిజర్వులకు సంబంధించిన యంత్రాంగాలు

  • ఉత్పత్తి దేశాలతో కుదుర్చుకునే ఒప్పందాల పరంగా సమన్వయం

  • అత్యవసర స్పందన, మార్కెట్ స్థిరీకరణ

2. ఇంధన వినియోగ దేశాల వాణిని బలోపేతం చేయడం

సరఫరా భరోసా, దృఢత్వ పెంపు, మార్కెట్ అస్థిరతను తగ్గించే యంత్రాంగాల ఏర్పాటు ద్వారా ఇంధన లభ్యత, అందరికీ అందుబాటులో ఉండే ధరలు వంటి ఉమ్మడి సవాళ్లను పరిష్కరించడానికి సహకరించుకోవడం అత్యవసరమని ఇరు పక్షాలు స్పష్టం చేశాయి. తద్వారా చమురు, గ్యాస్ వినియోగించే దేశాల వాణిని బలోపేతం చేయొచ్చని రెండు దేశాలు పేర్కొన్నాయి. ఈ సహకారం ముఖ్యంగా కింది అంశాలపై దృష్టి సారిస్తుంది:

  • మార్కెట్ పోకడలపై సమాచార మార్పిడి, మార్కెట్ స్థిరీకరణ కోసం ఉమ్మడి ప్రయత్నాలలో సహకారం

  • మూడో దేశాల (థర్డ్ కంట్రీస్) నుంచి ఇంధన సరఫరాల కోసం గల అవకాశాలను పరిశీలించడం

  • మూడో దేశాల్లో అప్‌స్ట్రీమ్ రంగంలో పెట్టుబడుల కోసం వాణిజ్యపరమైన భాగస్వామ్యాల అవకాశాలను అన్వేషించడం

3. ఇంధన రవాణాలో సహకారం

ఇరు దేశాల ఇంధన భద్రతకు అత్యంత కీలకమైన పునాదులుగా చమురు- గ్యాస్‌ల దృఢత్వం, స్వయం సమృద్ధి, సమర్థవంతమైన సముద్ర రవాణాకు ఉన్న ప్రాముఖ్యతను రెండు దేశాలు పునరుద్ఘాటించాయి. సముద్ర ఇంధన రవాణా విలువ గొలుసు అంతటా ఉమ్మడి పెట్టుబడులతో సహా పరస్పర సహకార అవకాశాలను అన్వేషించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.

4. సంస్థాగత సహకారం

సాంకేతిక, ఆర్థిక సహకారంతో పాటు ఇంధన రంగంలో సమగ్రమైన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కింద పేర్కొన్న సంస్థలతో సహా సంబంధిత భాగస్వాముల మధ్య సంస్థాగత సహకారాన్ని పెంపొందించాలనే తమ సంకల్పాన్ని ఇరు పక్షాలు ధ్రువీకరించాయి:

  • జపాన్ సంస్థలు: జపాన్ ఆర్గనైజేషన్ ఫర్ మెటల్స్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ (జాగ్‌మెక్), జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ (జేబీఐసీ), ఇతర సంబంధిత భాగస్వాములు. 

  • భారతీయ సంస్థలు: భారత ప్రభుత్వ చమురు సంస్థలు, ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ (ఐఎస్‌పీఆర్ఎల్), ఇతర సంబంధిత భాగస్వాములు

5. చర్చల వేదిక

ఈ ప్రకటనలో గుర్తించిన ప్రాధాన్యత రంగాల్లో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో  'భారత్-జపాన్ ఇంధన చర్చల' కింద 'పెట్రోలియం, సహజ వాయువుపై భారత్-జపాన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్' పరిధిలో చర్చలు జరపాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. ఈ వేదిక ద్వారా ఇరు పక్షాలు తాజా విజ్ఞానాన్ని, అనుభవాలను పంచుకోవడంతో పాటు పరస్పర ప్రయోజనకరమైన సహకార అవకాశాలను అన్వేషిస్తాయి.

 

***


(रिलीज़ आईडी: 2280627) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Tamil , Kannada