ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

‘నాయకత్వం అంటే సేవ... అధికారం కాదు’: యువతకు ఉపరాష్ట్రపతి పిలుపు ప్రాంతం, కులాలకు అతీతంగా దేశమే ముఖ్యం కావాలి: ఉపరాష్ట్రపతి



‘మీలోనే రేపటి భారత ఉపరాష్ట్రపతి ఉండొచ్చు’: యువతకు గొప్ప కలలు కనేలా స్ఫూర్తినిచ్చిన ఉపరాష్ట్రపతి

‘భారత్ గతంలో ఒక్కటిగానే ఉంది, ఇప్పుడూ ఒక్కటే, ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుంది’: ఉపరాష్ట్రపతి

प्रविष्टि तिथि: 02 JUL 2026 5:57PM by PIB Hyderabad

రాజ్యసభ సభ్యుడు డాక్టర్ అజీత్ మాధవరావు గోప్‌చడే ప్రారంభించిన రెండు నెలల ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో ఎంపీ లీడ్ ఫెలోషిప్ భాగస్వాములతో నేడు ఉపరాష్ట్రపతి భవన్‌లో భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువతతో సంభాషిస్తూ... దేశ సేవకు అంకితమయ్యే నైతిక విలువలు గల నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. నాయకత్వం అధికారంతో వచ్చేది కాదని... సమాజానికి వినయం, చిత్తశుద్ధి, కరుణతో సేవ చేసే సామర్థ్యాన్ని బట్టే నాయకత్వాన్ని కొలుస్తారని ఆయన స్పష్టం చేశారు.

 

దేశ సాంస్కృతిక,నాగరికత ఏకత్వాన్ని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘భారత్ గతంలో ఒక్కటిగానే ఉంది, ప్రస్తుతం ఒక్కటిగానే ఉంది, మున్ముందు కూడా ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు.. యువ ప్రతిభావంతులు అంతా ప్రాంతం, భాష, కులం వంటి విభేదాలకు అతీతంగా పైకి ఎదగాలని కోరారు. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న దేశ ఉమ్మడి సాంస్కృతిక వారసత్వమే ఈ దేశాన్ని ఎల్లప్పుడూ ఏకతాటిపైకి తెస్తుందని, అదే దేశం అతిపెద్ద బలమని పేర్కొన్నారు.

 

1960ల కాలంలో తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొన్న భారత్‌.. నేడు ప్రపంచంలోనే అత్యధికంగా ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే దేశాలలో ఒకటిగా ఎలా మారిందో శ్రీ సీపీ రాధాకృష్ణన్ గుర్తుచేశారు. మునుపటి తరాలు పడిన కష్టాలను, ఇబ్బందులను నేటి యువత తప్పకుండా అర్థం చేసుకోవాలని, దేశం సాధించిన ఈ అద్భుతమైన అభివృద్ధి ప్రస్థానం నుంచి యువత స్ఫూర్తిని పొందాలని ఆకాంక్షించారు.

 

ఈ ప్రత్యేక అధ్యయన కార్యక్రమం యువత తమ వృత్తి జీవితాన్ని ప్రారంభించడానికి ఒక అద్భుతమైన వేదిక అని ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ కొనియాడారు. ఇది తరగతి గదుల పరిధిని దాటి బయటి ప్రపంచాన్ని చూసేలా చేస్తుందని, యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, జాతీయ నాయకులతో ముచ్చటించే అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పారు. మనకు వచ్చే అవకాశాలకు తగినట్టుగా ప్రతిభను, నిరంతర అభ్యసనాన్ని పెంపొందించుకోవాలని.. ప్రతి ఒక్కరూ అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

 

యువ ప్రతిభావంతుల సామర్థ్యంపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తంచేసిన ఉపరాష్ట్రపతి... భవిష్యత్తులో మీలో చాలామంది ప్రజా జీవితంలో, పరిపాలనారంగంలో, న్యాయవ్యవస్థలో అత్యున్నత బాధ్యతాయుతమైన పదవులను అధిరోహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఎవరికి తెలుసు, రేపు మీలో ఒకరు భారత ఉపరాష్ట్రపతి పదవిని కూడా చేపట్టవచ్చు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. యువత అంతా పెద్ద కలలు కనాలని, పూర్తి అంకితభావంతో దేశానికి సేవ చేయాలని ప్రోత్సహించారు.

 

రాజ్యాంగ విలువల ప్రాధాన్యతను శ్రీ సీపీ రాధాకృష్ణన్ గుర్తుచేశారు. పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను, విధులను కూడా సక్రమంగా నిర్వహించినప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని స్పష్టం చేశారు. కొత్త విషయాలను జిజ్ఞాసతో నేర్చుకోవాలని, నిర్భయంగా ఆవిష్కరణలు చేయాలనిచ ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకే కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ ‘ఎంపీ లీడ్’ అధ్యయన కార్యక్రమం భవిష్యత్తులో అభివృద్ధి చెందిన, ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించే నాయకులను తీర్చిదిద్దుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

 

రాజ్యసభ సభ్యుడు డాక్టర్ అజీత్ మాధవరావు గోప్‌చడే ఆలోచనల నుంచి పుట్టిన ఈ ఎంపీ లీడ్ ఫెలోషిప్ రెండు నెలల పాటు సాగే ఒక ఇంటర్న్‌షిప్ కార్యక్రమం. ఇది యువతకు ప్రభుత్వ పాలన, ప్రభుత్వ విధానాలు, శాసనసభ ప్రక్రియలపై ప్రత్యక్ష అవగాహన కల్పిస్తుంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 5,000 కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోగా... వారి నుంచి ఎంపికైన 40 మంది ప్రతిభావంతులను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా ఈ బ్యాచ్‌లో 62 శాతం మంది మహిళలు ఉండటం, వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

 

***


(रिलीज़ आईडी: 2280562) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Malayalam