ఆర్థిక మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా డీఆర్ఐ నిర్వహించిన దాడుల్లో అక్రమ బంగారం తయారీ కేంద్రం గుట్టు రట్టు
9 కిలోల స్మగ్లింగ్ బంగారం, 42 కిలోల వెండి, రూ. 8.5 కోట్ల విదేశీ మారక ద్రవ్యం స్వాధీనం
ఢిల్లీలో అక్రమ బంగారం కరిగించే కేంద్రాన్ని ధ్వంసం చేసిన డీఆర్ఐ; బంగారం స్మగ్లింగ్ కేసులో ఎనిమిదిమంది అరెస్టు
प्रविष्टि तिथि:
01 JUL 2026 4:11PM by PIB Hyderabad
దేశ సరిహద్దుల ద్వారా బంగారం అక్రమ రవాణాపై నిరంతర నిఘాలో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మరో పెద్ద స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠా ఈశాన్య ప్రాంతం నుంచి విదేశీ మార్కు ఉన్న బంగారాన్ని వేర్వేరు వ్యక్తులతో రైళ్ల ద్వారా ఢిల్లీకి స్మగ్లింగ్ చేస్తోంది. వారు పట్టుబడే అవకాశం లేకుండా ప్రయాణ సమయాలను ఒక పద్ధతి ప్రకారం మారుస్తూ వస్తోంది. వీరు ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే ఒక నివాస ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా బంగారం కరిగించే కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు కూడా డీఆర్ఐ అధికారులు గుర్తించారు.
జూన్ 26న అత్యంత పకడ్బందీగా సమన్వయం చేసుకుంటూ డీఆర్ఐ అధికారులు నిర్వహించిన ఒక ఆపరేషన్‌లో, పశ్చిమ బెంగాల్‌లోని న్యూ కూచ్ బెహార్ రైల్వే స్టేషన్, బిహార్‌లోని మాన్సీ జంక్షన్ వద్ద ఇద్దరు వ్యక్తులను అడ్డుకున్నారు. వారి శరీర భాగాల్లో దాచి ఉంచిన సుమారు 2 కిలోల బరువున్న బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో ఢిల్లీలో కూడా సుమారు 1.2 కిలోల స్మగ్లింగ్ బంగారంతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు ఢిల్లీలో గుట్టుచప్పుడు కాకుండా పని చేస్తున్న అక్రమ బంగారం కరిగించే కేంద్రాన్ని గుర్తించేందుకు దారి తీసింది. మొత్తం నలుగురు వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు.
అదే రోజున, మరో దాడిలో అధికారులు సైరంగ్ న్ నుంచి కోల్‌కతాకు రైలులో ప్రయాణిస్తున్న ఒక అనుమానిత మహిళను గుర్తించి ఆమె వద్ద నుంచి విదేశీ భాషా ముద్రలు కలిగిన సుమారు 3.3 కిలోల 20 విదేశీ బంగారు కడ్డీలను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన నడుము బెల్ట్ లో ఈ బంగారాన్ని దాచి ఉంచిన ఆ ప్రయాణీకురాలిని అధికారులు అరెస్ట్ చేశారు.
చెన్నైలో కూడా డొమెస్టిక్ ఎయిర్ కార్గో కన్సైన్‌మెంట్ల ద్వారా విదేశీ కరెన్సీని అక్రమంగా రవాణా చేస్తూ, ఆ సొమ్మును భారతదేశంలోకి వ్యవస్థీకృత పద్ధతిలో బంగారం, వెండి స్మగ్లింగ్ చేయడానికి ఉపయోగిస్తున్న ఒక పెద్ద స్మగ్లింగ్ రాకెట్‌ను డీఆర్ఐ విజయవంతంగా ఛేదించింది. చెన్నై ఎయిర్ కార్గో వద్ద కొన్ని కన్సైన్‌మెంట్లను అడ్డుకున్న డీఆర్ఐ అధికారులు.. వాటి నుంచి 7,58,500 అమెరికన్ డాలర్లు, 35,00,000 థాయ్ భట్ లతో కూడిన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. దీని మొత్తం విలువ సుమారు రూ. 8.15 కోట్లుగా తేలింది. విదేశీ కరెన్సీని అక్రమంగా రవాణా, సరఫరా చేయడంలో భాగస్వాములైన ముగ్గురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విదేశీ కరెన్సీని వివిధ రహస్య మార్గాల ద్వారా భారతదేశం వెలుపలికి స్మగ్లింగ్ చేస్తున్నారని, ఆ సొమ్మును తిరిగి దేశంలోకి విలువైన లోహాల అక్రమ రవాణాకు పెట్టుబడిగా ఉపయోగిస్తున్నారని తదుపరి విచారణలో వెల్లడైంది.
ఈ దర్యాప్తులో భాగంగా, ఇటువంటి విదేశీ కరెన్సీ గ్రహీతలలో ఒకరిని దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా బెంగళూరు విమానాశ్రయంలో పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 1.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతని నివాసంలో జరిపిన తనిఖీల్లో సుమారు 42 కిలోల వెండి, 700 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 26.67 లక్షల భారతీయ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. భారత్‌లో అక్రమంగా విదేశీ కరెన్సీ సేకరించడం, దానిని విదేశాలకు రహస్యంగా తరలించడం, అనంతరం బంగారం, వెండిని సంఘటిత ముఠాల ద్వారా తిరిగి దేశంలోకి అక్రమంగా రవాణా చేయడం - ఈ మూడు కార్యకలాపాల మధ్య ప్రత్యక్ష కార్యాచరణ సంబంధం ఉన్నట్లు ఈ కేసుతో స్పష్టమైంది.
ఈ మొత్తం దాడుల్లో సుమారు 9 కిలోల విదేశీ మార్కు ఉన్న స్మగ్లింగ్ బంగారం, 42 కిలోల వెండి, రూ. 8.15 కోట్ల విలువైన విదేశీ కరెన్సీతో పాటు రూ. 26.67 లక్షల భారతీయ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఎనిమిది మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు.
***
(रिलीज़ आईडी: 2280116)
आगंतुक पटल : 6