మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ముగిసిన యువ సంఘం ఆరో విడత కార్యక్రమం
దేశవ్యాప్తంగా జరిగిన 22 పర్యటనల్లో పాల్గొన్న1,100 మందికి పైగా యువ ప్రతినిధులు
प्रविष्टि तिथि:
30 JUN 2026 6:45PM by PIB Hyderabad
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత విద్యా విభాగం నిర్వహించిన ‘యువ సంఘం’ ఆరో విడత కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. జూన్ 19, 2026న మధ్యప్రదేశ్ నుంచి జార్ఖండ్‌కు సాగిన చివరి పర్యటనతో ఈ విడత పూర్తయింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ (ఈబీఎస్‌బీ) పథకం కింద ప్రారంభించిన ఈ ప్రధాన కార్యక్రమం.. దేశంలోని యువతలో జాతీయ సమగ్రతను పెంపొందించడం, సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడం, అనుభవపూర్వక అభ్యాసాన్ని అందించడం ప్రధాన లక్ష్యంగా సాగింది.
ఈ కార్యక్రమం దేశంలోని విభిన్న సంస్కృతులు, భాషలు, విద్యా, సామాజిక వైవిధ్యాన్ని యువత స్వయంగా అనుభవించడానికి ఒక గొప్ప వేదికగా నిలిచింది. ఈ ఆరో విడతలో మొదటి పర్యటన మే 8, 2026న రాజస్థాన్ నుంచి కర్ణాటకకు ప్రారంభమైంది. పరస్పరం అనుసంధానించిన 22 రాష్ట్రాల నుంచి 1,26,000 మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకోగా, వారి నుంచి సుమారు 1,100 మంది ప్రతినిధులను తుది పర్యటనల కోసం ఎంపిక చేశారు. వివిధ రాష్ట్రాలను సందర్శించిన యువ బృందాలు ఆయా రాష్ట్రాల గవర్నర్లను, అలాగే కేంద్రపాలిత ప్రాంతాలను సందర్శించిన బృందాలు లెఫ్టినెంట్ గవర్నర్లను కలిసి.. పరిపాలన, రాజ్యాంగ విలువల ప్రాధాన్యత, న్యాయకత్వం, సమ్మిళిత అభివృద్ధి వంటి అంశాలపై విలువైన అవగాహనను పెంపొందించుకున్నాయి. ఈ పర్యటనల్లో భాగంగా ఒక ప్రత్యేక సందర్భంలో దేశ రాజధాని ఢిల్లీని సందర్శించిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర యువ బృందం ప్రత్యేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రితో సమావేశమై చర్చలు జరిపింది.
దేశంలోని ప్రముఖ ఉన్నత విద్యాసంస్థలు ఈ యువ ప్రతినిధుల బృందాలకు ఆతిథ్యం ఇచ్చాయి. ఈ పర్యటనల్లో భాగంగా విద్యాసంబంధిత చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వారసత్వ ప్రదేశాల సందర్శనలు, నూతన ఆవిష్కరణల ప్రదర్శనలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత చురుగ్గా పాల్గొన్నారు. పరస్పరం అనుసంధానించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంప్రదాయాలు, అభివృద్ధి నమూనాలు, అక్కడి ఉత్తమ పద్ధతుల గురించి ఈ పర్యటనల ద్వారా విద్యార్థులు ప్రత్యక్ష అవగాహనను పెంపొందించుకున్నారు.
ఈ కార్యక్రమం అంతటా యువతీ యువకులు ప్రభుత్వ ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, కళాకారులు , స్థానిక ప్రజలతో కూడా సంభాషించారు. విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలు, పారిశ్రామిక సంస్థలు, మ్యూజియాలు, సాంస్కృతిక ప్రదేశాల సందర్శన, దేశ వైవిధ్యం, ఉమ్మడి వారసత్వంపై వారి అవగాహనను సుసంపన్నం చేసింది. ప్రతినిధులు సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రదర్శనశాలలు, ముఖాముఖి చర్చల ద్వారా తమ సొంత ప్రాంతీయ సంప్రదాయాలను ప్రదర్శించారు. తద్వారా పరస్పర ప్రశంసలను మరియు జీవితకాల స్నేహాలను పెంపొందించుకున్నారు.
ఈ యువ సంఘం ఆరో విడతలో భాగంగా లభించిన ఈ అనుభవపూర్వక అభ్యాసంలో విద్యార్థులు ప్రముఖ విద్యాసంస్థలతో పాటు.. అంకుర సంస్థల ఆవిష్కరణలు, వ్యాపార వ్యవస్థలను పరిశీలించారు. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మక టీ-హబ్ వంటి ప్రముఖ ఇన్‌క్యుబేటర్ కేంద్రాలను, పరిశోధనా సంస్థలను, ప్రభుత్వ అభివృద్ధి ప్రాజెక్టులను, ప్రధాన మౌలిక వసతుల కేంద్రాలను సందర్శించారు. వీటితో పాటు యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలను, జాతీయ ప్రాధాన్యత కలిగిన ఇతర చారిత్రక ప్రాంతాలను సందర్శించడం ద్వారా దేశ సాంస్కృతిక, నాగరికతా వారసత్వంపై యువతకు మరింత లోతైన అవగాహన లభించింది.
ఈ పర్యటనల కార్యక్రమం కేవలం సందర్శనలకే పరిమితం కాకుండా కలంకారీ పెయింటింగ్, వార్లీ పెయింటింగ్, గిరిజన కళారూపాలు, కుండల తయారీ, వివిధ హస్తకళల ప్రదర్శనలను యువత స్వయంగా నేర్చుకునేలా సాగింది. ఇందులో భాగంగా విద్యార్థులు స్థానిక కళాకారులు, వ్యవస్థాపకులు, స్థానిక సమాజాలతో ముఖాముఖి చర్చలు జరిపారు. వీటితో పాటు ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ అభియాన్ కింద పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు, గ్రామ సందర్శనలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇవి పాల్గొన్న ప్రతినిధుల్లో సామాజిక బాధ్యతను, పర్యావరణ పరిరక్షణ పట్ల స్పృహను మరింత బలోపేతం చేశాయి.
దాదాపు ఆరు వారాల పాటు సాగిన యువ సంఘం ఆరో విడత యువ ప్రతినిధులు దేశంలోని విభిన్న భౌగోళిక ప్రాంతాలు, భాషలు, ఆహార సంస్కృతులు, సంప్రదాయాలు, దేశం సాధించిన అభివృద్ధి విజయాలను ప్రత్యక్షంగా అనుభవించేలా చేసింది. భౌగోళిక సరిహద్దులను దాటి సరికొత్త స్నేహ బంధాలను నిర్మించుకోవడానికి ఇది ఒక వేదికగా నిలిచింది. ప్రజల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందిస్తూ, భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తిని బలోపేతం చేసిన ఈ కార్యక్రమం.. “ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్” దార్శనికతను ప్రతిబింబించింది.
***
(रिलीज़ आईडी: 2279703)
आगंतुक पटल : 5