పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత పర్యాటక రంగంలో డిజిటల్ ప్రచారం బలోపేతం లక్ష్యంగా గూగుల్ ఇండియాతో పర్యాటక మంత్రిత్వ శాఖ ఒప్పందం


భారత సాంస్కృతిక ప్రదేశాల వైభవాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే అద్భుత అనుభవాలను డిజిటల్ సాంకేతికతలు సృష్టించగలవు: శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్

प्रविष्टि तिथि: 30 JUN 2026 5:49PM by PIB Hyderabad

డిజిటల్ సాంకేతికతలు, కృత్రిమ మేధ, డేటా ఆధారిత అవగాహనను, సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా భారత పర్యాటక గమ్యస్థానాల డిజిటల్ ప్రచారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఈ రోజు గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై ఇరు పక్షాలూ సంతకాలు చేశాయి.

పర్యాటక మంత్రిత్వ శాఖ, గూగుల్ ఇండియా మధ్య డిజిటల్ పర్యాటక ప్రోత్సాహం, జ్ఞాన భాగస్వామ్యం, సామర్థ్య నిర్మాణం, సందర్శకుల భాగస్వామ్యాన్ని పెంపొందించడం కోసం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం వంటి కీలక రంగాల్లో సహకారానికి ఈ అవగాహన ఒప్పందం ఒక విధాన ప్రణాళికను రూపొందిస్తుంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల్లో భారత పర్యాటక గమ్యస్థానాలు, అనుభవాలు, సాంస్కృతిక వారసత్వానికి మరింత ప్రాచుర్యం కల్పించడానికి, గూగుల్ డిజిటల్ వ్యవస్థ నైపుణ్యాలను ఈ భాగస్వామ్యం వినియోగించుకుంటుంది. ఈ సహకారం వాణిజ్యేతరమైనది, కట్టుబడి ఉండాల్సిన అవసరం లేనిది, ప్రత్యేకత లేనిది. దీనివల్ల ఇరుపక్షాలకు ఎలాంటి ఆర్థికపరమైన చిక్కులూ ఉండవు.

ఈ కార్యక్రమానికి పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ భువనేష్ కుమార్, అదనపు కార్యదర్శి-డైరెక్టర్ జనరల్ (పర్యాటకం) శ్రీ సుమన్ బిల్లా, మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్-వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ప్రీతి లోబానా, గూగుల్ ఇండియా ప్రతినిధులు హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, "ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు భారత సాంస్కృతిక ప్రదేశాల వైభవాన్ని, గొప్పతనాన్ని ప్రదర్శించే అద్భుతమైన అనుభవాలను సృష్టించగల సామర్థ్యం డిజిటల్ సాంకేతికతలకు ఉంది. అత్యాధునిక డిజిటల్ సాంకేతికతలను ఉపయోగించుకోవడం ద్వారా, పర్యాటకులు భారత గొప్ప సాంస్కృతిక, సహజ వారసత్వాన్ని తెలుసుకునే, అనుభవించే, దానితో మమేకమయ్యే విధానాన్ని మనం మార్చేయగలం" అని వ్యాఖ్యానించారు.

'ఇన్‌క్రెడిబుల్ ఇండియా' కార్యక్రమం కింద పర్యాటక ప్రోత్సాహానికి వినూత్నమైన, సాంకేతికత ఆధారిత విధానాలను అవలంబించాలనే మంత్రిత్వ శాఖ నిబద్ధతను ఈ సహకారం ప్రతిబింబిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. ప్రపంచ పర్యాటక రంగంలో భారత్ ఉనికిని బలోపేతం చేయడానికి... డిజిటల్ ప్రచారాన్ని మెరుగుపరచడానికి... దేశాన్ని ఒక ఆధునిక, సులభంగా చేరుకోగల, ప్రపంచంతో పోటీపడగల పర్యాటక గమ్యస్థానంగా నిలపడానికి ఈ భాగస్వామ్యం సహాయపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ సహకారంలో భాగంగా... ప్రపంచ పర్యాటక ధోరణులు, పర్యాటకుల ప్రవర్తన, డిజిటల్ నిమగ్నతా సరళికి సంబంధించి గూగుల్ అందించే సమాచారాన్ని ఉపయోగించుకోవడం ద్వారా, ఆధారాల ఆధారిత పర్యాటక ప్రచార వ్యూహాలకు మద్దతు లభిస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా మరింత కచ్చితమైన, ప్రభావవంతమైన, కొలవగల ప్రచారాన్ని సాధ్యం చేయడం కోసం డిజిటల్ మార్కెటింగ్ సాధనాలు, ప్రచార మెరుగుదల, కంటెంట్ సృష్టి, కృత్రిమ మేధ సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై మంత్రిత్వ శాఖ అధికారులకు శిక్షణను, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలనూ నిర్వహించాలని ప్రణాళిక చేస్తున్నారు.

 

భారత పర్యాటక రంగాన్ని మెరుగుపరచడం, దేశాన్ని ప్రపంచంలోనే ప్రాధాన్య పర్యాటక గమ్యస్థానంగా ప్రోత్సహించడం, సాంకేతికత-ఆవిష్కరణలను వినియోగించుకోవడం పట్ల తమ ఉమ్మడి నిబద్ధతను పర్యాటక మంత్రిత్వ శాఖ, గూగుల్ ఇండియా పునరుద్ఘాటించాయి.

 

***


(रिलीज़ आईडी: 2279559) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Malayalam