ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ సంస్థ పదో స్నాతకోత్సవంలో ప్రసంగించిన కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో వైద్య విద్యలో ‘హార్డ్‌వేర్’, ‘సాఫ్ట్‌వేర్’కు సమ ప్రాధాన్యమిస్తోన్న ప్రభుత్వం

స్వాస్థ్య భారత్ ద్వారానే వికసిత్ భారత్ సాధ్యమవుతుంది: శ్రీ నడ్డా

సమాజం పట్ల బాధ్యతను నెరవేర్చే అవకాశాన్నిచ్చేదే సూపర్–స్పెషాలిటీ విద్య

प्रविष्टि तिथि: 30 JUN 2026 2:42PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో జరిగిన లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్) పదో స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా ప్రసంగించారు.

విద్యార్థుల విద్యా, వృత్తి ప్రయాణంలో చిరస్మరణీయంగా నిలిచిపోయే సందర్భంగా ఈ స్నాతకోత్సవాన్ని శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా వర్ణించారు. పట్టభద్రులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రోగుల సంరక్షణ, వైద్య విద్య, పరిశోధన, ఆవిష్కరణల్లో ఉత్తమ పనితీరుకు గుర్తింపు పొందిన లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్) లాంటి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన, ప్రతిష్ఠాత్మకమైన విద్యా సంస్థ నుంచి పట్టభద్రులు కావడం వారికి దక్కిన అదృష్టమన్నారు.

image.png

ప్రజారోగ్యంలో ఐఎల్‌బీఎస్ సంస్థ చేసిన సేవలను శ్రీ నడ్డా వివరించారు. దేశవ్యాప్తంగా ఫ్యాటీ లివర్ గురించి అవగాహన కల్పించడంలో ఈ సంస్థ ప్రధాన పాత్ర పోషించిందన్నారు. వైద్య సేవలు, పరిశోధన, ప్రచారం ద్వారా ఫ్యాటీ లివర్‌, దానికి గల కారణాలు, నివారణ, దీర్ఘకాలంగా ఆరోగ్యంపై చూపించే ప్రభావాలపై అవగాహనను విస్తరించేందుకు ఈ సంస్థ గణనీయమైన కృషి చేసింది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలోని ప్రభుత్వం వైద్య విద్యను బలోపేతం చేయడానికి సమగ్ర విధానాన్ని స్వీకరించిందని కేంద్ర ఆరోగ్య మంత్రి చెప్పారు. దీనికోసం వైద్య విద్యకు సంబంధించిన ‘హార్డ్‌వేర్’, ‘సాఫ్ట్‌వేర్’ రెండింటిపైనా దృష్టి సారిస్తోందని తెలియజేశారు. ‘హార్డ్‌వేర్’ అంటే అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, వైద్య సంస్థలు, ఆరోగ్య సేవల సౌకర్యాలని తెలిపారు. అలాగే విద్యార్థులు, పరిశోధకులు, ఆరోగ్య నిపుణులు రాణించేలా వ్యవస్థను, విధానాలను, విద్యా రంగాన్ని ‘సాఫ్ట్‌వేర్’ సూచిస్తుందని చెప్పారు. దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బలం.. కేవలం సంస్థలను ఏర్పాటు చేయడంలోనే కాకుండా… సామర్థ్యం వికసించేలా వ్యవస్థను నిర్మించడంలో కూడా ఉందని ఆయన తెలియజేశారు.

విధానపరమైన సంస్కరణలు తీసుకొచ్చే పరివర్తనాత్మక ప్రభావాల గురించి శ్రీ నడ్డా వివరించారు. దూరదృష్టితో కూడిన విధానాల రూపకల్పన, వాటికి తోడ్పాటును అందించే వ్యవస్థ కలసి శాశ్వతమైన మార్పును ఎలా సృష్టిస్తాయో విద్యార్థులు తెలుసుకోవాలని అన్నారు. 20వ శతాబ్దం చివరి నాటికి భారత దేశంలో ఒకే ఒక్క ఎయిమ్స్ ఉండేదని చెప్పారు. మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజపేయి హయాంలో మరో ఆరు ఎయిమ్స్‌ సంస్థలకు ఆమోదం లభించింది. ఆ తర్వాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో పదహారు కొత్త ఎయిమ్స్ సంస్థలు కార్యకలాపాలను ప్రారంభించాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం ఇరవై మూడు ఎయిమ్స్ సంస్థలున్నాయి.

image.png

దేశవ్యాప్తంగా వైద్య విద్య మౌలిక వసతుల విస్తరణలో సాధిస్తున్న అపూర్వమైన పురోగతిని కేంద్ర మంత్రి వివరించారు. వైద్య కళాశాలల సంఖ్య 387 నుంచి 818కు పెరిగిందని ఆయన వెల్లడించారు. అదే విధంగా, అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు సుమారుగా 50,000 నుంచి 1.20 లక్షలకు పైగా పెరిగాయని చెప్పారు. ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి చేసిన ప్రకటనను ఉటంకిస్తూ.. వచ్చే అయిదేళ్లలో అదనంగా మరో 75,000 అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలియజేశారు. ఇప్పటికే 25,000 సీట్లను జోడించామని, ఇది లక్ష్యసాధనలో స్థిరంగా సాధిస్తున్న పురోగతిని ప్రతిబింబిస్తుందని తెలియజేశారు. అలాగే, పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు సైతం సుమారుగా 30,000 నుంచి 80,000కు పైగా పెరిగాయని చెప్పారు. దీనివల్ల దేశంలో స్పెషలిస్టు డాక్టర్లు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి వస్తారని తెలియజేశారు.

దాదాపు 1.5 బిలియన్ల మంది ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి ఆరోగ్య సేవల పంపిణీ వ్యవస్థకు పునాదిని బలోపేతం చేయడం అవసరమని శ్రీ నడ్డా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా 1.85 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేయడం గురించి ఆయన వివరించారు. వాటిని ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే మొదటి సంప్రదింపుల కేంద్రాలుగా వర్ణించారు. నివారణ, ఆరోగ్యాన్ని పెంపొందించే, చికిత్స, పునరావాస సేవలకు సమప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవల దిశగా దేశ విధానాన్ని ఈ కేంద్రాలు మారుస్తున్నాయని ఆయన వివరించారు.

నివారణ ఆరోగ్య సేవల ప్రాధాన్యం గురించి కేంద్ర మంత్రి వివరిస్తూ.. అసాంక్రమిక వ్యాధులను గుర్తించడంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు సాధించిన విజయాలను ప్రస్తావించారు. సుమారు 42 కోట్ల మందికి పైగా రక్తపోటు పరీక్షలు నిర్వహిస్తే.. వారిలో 7.3 కోట్ల మందిలో నిర్ధారణ అయిందని చెప్పారు. అలాగే, 42 కోట్లకు పైగా ప్రజలకు మధుమేహ పరీక్షలు నిర్వహిస్తే… వారిలో దాదాపు 5 కోట్ల మందిలో వ్యాధి నిర్ధారణ అయింది. 35 కోట్లకు పైగా ప్రజలకు నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తే.. వారిలో 2.3 లక్షలకు పైగా కేసులను గుర్తించారు. 16 కోట్లకు పైగా మహిళలకు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తే.. 86,000 కంటే ఎక్కువ మందిలో వ్యాధి నిర్ధారణ అయింది. 9 కోట్ల మందికి పైగా సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తే.. సుమారుగా ఒక లక్ష మందిలో ఈ క్యాన్సర్‌ను గుర్తించారు. సకాలంలో పరీక్షలు నిర్వహించడం, ప్రారంభంలోనే వ్యాధిని గుర్తించడం ద్వారా నివారణ ఆరోగ్య సేవలు ఎలా బలోపేతమవుతాయో, మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ఎలా వీలు కలుగుతుందో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయని శ్రీ నడ్డా చెప్పారు.

స్వాస్థ్య భారత్ లేకుండా వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యం కాదని కేంద్ర మంత్రి అన్నారు. భవిష్యత్తులో భారతదేశంలో ఆరోగ్య సేవల వ్యూహంలో నివారణ ఆరోగ్య సేవలు, ముందుగానే పరీక్షలు నిర్వహించడం, సకాలంలో వ్యాధిని నిర్ధారించడం ప్రధానాంశాలుగా మారతాయని ఆయన స్పష్టం చేశారు. 

image.png

సూపర్–స్పెషాలిటీ విద్యను అభ్యసించడం అదృష్టం, బాధ్యత రెండూ అని పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి శ్రీ నడ్డా అన్నారు. అంకితభావంతో కూడిన సేవలు, అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య నైతిక విలువలు, వృత్తి జీవితంలో దయతో వ్యవహరించడం, నిజాయతీతో, అత్యుత్తమ నైపుణ్యాలతో మానవాళికి సేవ చేయాలనే నిబద్ధతతో ఉండటం ద్వారా సమాజానికి సేవ చేయాలని సూచించారు. తమ విజ్ఞానం, నైపుణ్యాలు, చిత్తశుద్ధితో ఆరోగ్యకరమైన, బలమైన భారత దేశాన్ని  నిర్మించే బాధ్యతను తీసుకోవాలని వారిని ప్రోత్సహించారు.

ఈ స్నాతకోత్సవంలో కాలేయ వ్యాధులు, హెపటాలజీ, అవయవ మార్పిడి చికిత్స, సంబంధిత రంగాల్లో వివిధ సూపర్-స్పెషాలిటీ, అనుబంధ విభాగాల్లో డిగ్రీలు, అకడమిక్ డిస్టింక్షన్‌లు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం పట్టభద్రులైన విద్యార్థులకు ముఖ్యమైన మజిలీగా నిలిచిపోతుంది.

జాతీయ రాజధాని ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ సూపర్-స్పెషాలిటీ సంస్థ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్). ఇది హెపటాలజీ, కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స, పిత్తాశయ శాస్త్రాలు, అనుబంధ విభాగాల్లో రోగుల సంరక్షణ, వైద్య విద్య, పరిశోధనలో అత్యుత్తమ సంస్థగా పేరు తెచ్చుకుంది. వైద్య సేవలు, నాణ్యమైన విద్య, అత్యాధునిక పరిశోధనల్లో సమగ్ర విధానాన్ని అనుసరించడం ద్వారా దేశంలో పెరుగుతున్న కాలేయ వ్యాధుల భారాన్ని పరిష్కరించడంలో ఈ సంస్థ గణనీయమైన కృషి చేసింది. 

image.png

ఈ స్నాతకోత్సవానికి అధ్యాపకులు, ఆరోగ్య సేవల నిపుణులు, పరిశోధకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఇతర విశిష్ట అతిథులు హాజరయ్యారు.

 

***


(रिलीज़ आईडी: 2279530) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Kannada