నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

పరిశ్రమల నేతృత్వంలోని ఆవిష్కరణలు, అంకురాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ‘జీసీసీ కాన్‌క్లేవ్ ఆన్ ఇన్నోవేషన్ 2026’ను నిర్వహించిన ఏఐఎం, ఎస్‌టీపీఐ

నాడు పోస్టు చేయడమైనది: 30 JUN 2026 12:47PM by PIB Hyderabad

నీతి ఆయోగ్‌ పరిధిలోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం), సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) భాగస్వామ్యంతో ‘జీసీసీ కాన్‌క్లేవ్ ఆన్ ఇన్నోవేషన్ 2026’ సదస్సును బెంగళూరులో నిర్వహించింది. దేశంలోని ఆవిష్కరణలు, వ్యవస్థాపక వ్యవస్థలో మరింత లోతైన భాగస్వామ్యానికి గల మార్గాలను అన్వేషించడం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) నాయకులు, పరిశోధన, అభివృద్ధి విభాగాల అధినేతలు, ఆవిష్కరణ రంగానికి చెందిన నాయకులు, స్టార్టప్ వ్యవస్థ నిర్వహకులు, ఇంక్యుబేటర్లు, ప్రభుత్వ విధాన రూపకర్తలు హాజరయ్యారు.

ఈ సదస్సులో ఇంటెల్, ఐబీఎం, బాష్, అమెజాన్, ఎస్ఏపీ, థర్మో ఫిషర్ సైంటిఫిక్, సీజీఐ, షెల్, మెర్సిడెస్ బెంజ్, ఫిలిప్స్, మోర్గాన్ స్టాన్లీ, ఎన్విడియా, శాంసంగ్, శాన్‌డిస్క్, విప్రో, యాహూ వంటి ప్రముఖ జీసీసీలు, సాంకేతిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వీరితోపాటు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ఏటిఎల్స్), అటల్ ఇంక్యుబేషన్ కేంద్రాలు, అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ కేంద్రాలు, ఎస్‌టీపీఐ సెంటర్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, కర్ణాటక డిజిటల్ ఎకానమీ మిషన్ ప్రతినిధులు, ఇతర పరిశ్రమల భాగస్వాములు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.

దేశ ఆవిష్కరణల రంగానికి, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీ) మధ్య బలమైన సంబంధాలను ఏర్పరచడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అందిస్తున్న వివిధ కార్యక్రమాల ద్వారా సరికొత్త అవకాశాలను అన్వేషించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలను పెంచే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నుంచి కొత్త కంపెనీల ఏర్పాటుకు మద్దతు ఇచ్చే ఇంక్యుబేషన్ కేంద్రాల వరకు అన్ని దశల్లోనూ భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ఈ కార్యక్రమంలో చర్చించారు. వీటితోపాటు అంకుర సంస్థలను పెద్ద కంపెనీలుగా మార్చేందుకు త్వరలో రాబోతున్న పరిశ్రమల ఆధారిత యాక్సిలరేటర్ కార్యక్రమం ‘యాక్సెస్’ (అటల్ యాక్సిలరేషన్ సెంటర్స్ ఫర్ స్కేల్ అప్ ఆఫ్ స్టార్టప్స్) ద్వారా కలిగే ప్రయోజనాలపై కూడా చర్చించారు.

 

ఈ సదస్సులో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ శ్రీ అరవింద్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో సాంకేతిక, ఆవిష్కరణల రంగాన్ని శక్తిమంతం చేయడంలో ఎస్‌టీపీఐ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చే సరికొత్త ఆవిష్కరణలను ప్రపంచ మార్కెట్ స్థాయికి తీసుకెళ్లడానికి ఈ జీసీసీ సదస్సు ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తుందని తెలిపారు.

 

‘‘దేశవ్యాప్తంగా 2,100కు పైగా కేంద్రాలతో భారత్ జీసీసీ వ్యవస్థ దాదాపు 100 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రపంచ స్థాయి లక్ష్యాలకు భారతీయ ప్రతిభ తోడైతే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ఇది నిరూపించింది. 1991 నుంచి ఈ ప్రయాణంలో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా బలమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. సాంకేతిక మౌలిక సదుపాయాలు, విధానపరమైన నిర్ణయాలు, వ్యవస్థల అనుసంధానతను పటిష్టం చేయడం ద్వారా భారత్‌ను ప్రపంచ స్థాయి సామర్థ్యాల అభివృద్ధికి అత్యుత్తమ కేంద్రంగా మార్చింది. ప్రస్తుతం మేం ఈ భాగస్వామ్యాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌టీపీఐ సాంకేతిక పార్కులు, వ్యవస్థాపక కేంద్రాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలను అటల్ ఇన్నోవేషన్ మిషన్ పరిధిలోని పాఠశాలలు, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేషన్ కార్యక్రమాలతో నేరుగా అనుసంధానిస్తున్నాం. ఈ ఏకీకరణ ద్వారా జీసీసీలు భారతీయ అంకుర సంస్థలతో కలిసి కొత్త ఆవిష్కరణలు రూపొందించడానికి, సరికొత్త సాంకేతికతలను పరీక్షించడానికి, దేశ ఆవిష్కరణల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో చురుకైన పాత్ర పోషించడానికి ప్రభుత్వం మద్దతుతో కూడిన ఒక వ్యవస్థీకృత, ప్రభుత్వ మద్దతుగల వేదిక లభిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి జీసీసీని ఈ లక్ష్యంలో భాగస్వాములు కావాలని నేను ఆహ్వానిస్తున్నాను. అందరం కలిసి అంతర్జాతీయంగా పోటీపడగల పరిశ్రమలను నిర్మిస్తూ, ‘వికసిత్ భారత్ 2047’ దిశగా భారత్ పయనాన్ని మరింత వేగవంతం చేద్దాం’’ అని తెలిపారు.

 

ఈ సదస్సును ఉద్దేశించి నీతి ఆయోగ్ పరిధిలోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం) మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా మాట్లాడుతూ.. దేశ ఆవిష్కరణల ఆధారిత వృద్ధి ప్రస్థానాన్ని రూపొందించడంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

‘‘అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించడంలో ‘జై అనుసంధాన్’ కీలక చోదక శక్తిగా మారాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎప్పుడూ చెబుతుంటారు. గత దశాబ్ద కాలంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10,000కి పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా యువ ఆవిష్కర్తలను ప్రోత్సహిస్తూ, 100కు పైగా ఇంక్యుబేటర్ల ద్వారా అంకుర సంస్థలకు, క్షేత్రస్థాయి పరిశోధకులకు అండగా నిలుస్తూ ఈ దార్శనికతను సాకారం చేసేందుకు కృషి చేస్తోంది. నేడు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు భారత్‌ను సాంకేతికత, ఇంజనీరింగ్, సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా నిలబెట్టాయి. మనకున్న బలాలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురావడం ద్వారా కొత్త ప్రతిభను పెంపొందించవచ్చు. వ్యవస్థాపకతను వేగవంతం చేయవచ్చు. పరిశ్రమల్లో నూతన విధానాల అవలంబనను ప్రోత్సహించడంతోపాటు వికసిత్ భారత్ 2047 దార్శనికతకు దోహదపడే ప్రపంచ పోటీతత్వ సంస్థలను నిర్మించవచ్చు’’ అని పేర్కొన్నారు.

 

పాఠశాల విద్యార్థులలో ఉత్సుకతను పెంపొందించడం నుంచి అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వ సంస్థలను నిర్మించడం వరకు ఆవిష్కరణల ప్రయాణం ఎక్కడా ఆగకుండా నిరంతరాయంగా సాగడమే ఏఐఎం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. దేశీయ అంకుర సంస్థలకు మార్గదర్శకత్వం అందించడం, ఆవిష్కరణల సవాళ్లను ఎదుర్కొనడం, ప్రయోగాత్మక ప్రాజెక్టులు చేపట్టడం, అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను కల్పించడం, స్టార్టప్ పరిశ్రమల మధ్య భాగస్వామ్యాలను పెంపొందించడం ద్వారా ఏఐఎం కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా జీసీసీ ప్రతినిధులను ఆయన ఆహ్వానించారు.

 

ఈ సదస్సులో ఎస్‌టీపీఐ బెంగళూరు డైరెక్టర్ డాక్టర్ సంజయ్ త్యాగి మాట్లాడుతూ.. దేశీయ స్టార్టప్ వ్యవస్థ, ఇంక్యుబేషన్ మౌలిక సదుపాయాలు, జీసీసీ వ్యవస్థల మధ్య పరస్పర సమన్వయ అవసరాన్ని వివరించారు.

‘‘దేశంలోనే అత్యధిక సంఖ్యలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు కలిగిన నగరంగా బెంగళూరు ప్రత్యేక గుర్తింపు పొందింది. గత మూడు దశాబ్దాలుగా ఈ వ్యవస్థ అభివృద్ధిలో ఎస్‌టీపీఐ బెంగళూరు కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలో జీసీసీలు తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి, ఆవిష్కరణలను పెంచుకోవడానికి అవసరమైన సాంకేతిక మౌలిక సదుపాయాలను, నిబంధనల అమలు మద్దతును, ప్రభుత్వ విధానపరమైన మద్దతును ఇది అందిస్తుంది. ఈ సదస్సు ద్వారా అటల్ ఇన్నోవేషన్ మిషన్ పరిధిలోని వివిధ ఆవిష్కరణల దశలతో జీసీసీలు నేరుగా భాగస్వామ్యం కావడానికి మేం స్పష్టమైన, ఆచరణాత్మక మార్గాలను అన్వేషిస్తున్నాం. దీనివల్ల జీసీసీ ప్రతినిధులు అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌లోని యువ విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించవచ్చు. అటల్ ఇంక్యుబేషన్ కేంద్రాల్లోని అంకుర సంస్థలతో కలిసి కొత్త ఉత్పత్తులను సృష్టించవచ్చు. త్వరలో ప్రారంభం కాబోయే యాక్సెస్ ఇండస్ట్రియల్ యాక్సిలరేటర్ కార్యక్రమాల్లో భాగస్వాములు కావచ్చు. దేశంలోని జీసీసీ వ్యవస్థ కేవలం తక్కువ ఖర్చుతో పనులు పూర్తి చేసే కేంద్రాల స్థాయి నుంచి నేడు సాంకేతిక అభివృద్ధి, ఉత్పత్తి ఇంజనీరింగ్, సరికొత్త ఆవిష్కరణలకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన శక్తిమంతమైన కేంద్రంగా ఎదిగింది. ఎస్‌టీపీఐ, ఏఐఎంల పరస్పర బలాలు, జీసీసీల అంతర్జాతీయ సామర్థ్యాలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి, స్టార్టప్‌లు పెద్ద కంపెనీలుగా ఎదగడానికి, పరిశ్రమల నేతృత్వంలోని వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి కొత్త మార్గాలను అన్వేషించవచ్చు. ఈ వ్యవస్థల కలయికకు పూర్తి మద్దతు ఇవ్వడానికి ఎస్‌టీపీఐ బెంగళూరు కట్టుబడి ఉంది. నేడు ఇక్కడ కుదిరిన భాగస్వామ్యాలు భారత్‌ను ప్రపంచంలోనే తిరుగులేని ఆవిష్కరణల రాజధానిగా నిలబెట్టడానికి సహాయపడతాయని నేను భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

ఈ సదస్సులో నాలుగు కీలక అంశాలపై చర్చించారు. అవి…

1. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా పాఠశాల ఆవిష్కరణలకు కొత్త రూపం

2, ఏఐసీలు, ఏసీఐసీల ద్వారా ఆవిష్కరణలను వ్యాపార స్థాయికి ప్రోత్సహించడం

3. ఏఐఎం ఇండస్ట్రియల్ యాక్సిలరేటర్ కార్యక్రమం (యాక్సెస్) ద్వారా ఆవిష్కరణలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం

4. ఉమ్మడి యాక్సిలరేటర్ వేదికలు, ఎస్‌టీపీఐ వ్యవస్థాపక కేంద్రాల ద్వారా పరిశ్రమల నేతృత్వంలోని ఆవిష్కరణలు

 

ఈ సదస్సులో ఏఐఎం మద్దతిస్తున్న ఆవిష్కర్తలు, అంకుర సంస్థలు, ఇంక్యుబేటర్లతో జీసీసీలు ఏ విధంగా కలిసి పనిచేయవచ్చనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా అంకుర సంస్థలకు మార్గదర్శకత్వం అందించడం, కొత్త సాంకేతికతలను పరీక్షించడం, ప్రయోగాత్మక ప్రాజెక్టుల అమలు, సవాళ్లతో కూడిన ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించడం, మార్కెట్ అవకాశాలను కల్పించడం, నిర్దిష్ట రంగాలపై ఆధారపడిన ఉమ్మడి యాక్సిలరేటర్ కార్యక్రమాను రూపొందించడం వంటి అవకాశాలపై చర్చించారు.

ఈ చర్చల్లో ఏఐఎం త్వరలో ప్రారంభించబోయే యాక్సెస్ ఇండస్ట్రియల్ యాక్సిలరేటర్ కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వృద్ధి దశలో ఉన్న అంకుర సంస్థలు పారిశ్రామిక వాతావరణంలో తమ ఉత్పత్తులను పరీక్షించుకోవడానికి, ప్రయోగాత్మక ప్రాజెక్టులు చేపట్టడానికి, పరిశ్రమల నిపుణుల నుంచి మార్గదర్శకత్వం పొందడానికి, తమ వ్యాపారాలను విస్తరించడానికి ఈ కార్యక్రమం ఎంతో తోడ్పడుతుంది. ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా రూపొందించడం కోసం జీసీసీలు, ప్రముఖ పరిశ్రమలు తమ ఆలోచనలను, భాగస్వామ్య నమూనాలను పంచుకోవాలని ఏఐఎం ఆహ్వానించింది. అంకుర సంస్థల వృద్ధికి, సరికొత్త సాంకేతికతలను పరిశ్రమలు స్వీకరించడానికి తద్వారా దేశ ఆర్థిక వృద్ధికి ఎలా సహకరించవచ్చో వివరించాలని కోరింది.

దేశవ్యాప్తంగా ఉన్న ఆవిష్కర్తలు, అంకుర సంస్థలు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక సంస్థలను ప్రోత్సహించడంలో ఒకరికొకరు ఏ విధంగా తోడ్పడగలమనే పరస్పర ప్రయోజనకరమైన సహకార రంగాలపై కూడా అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఎస్‌టీపీఐ ఈ సదస్సులో లోతుగా చర్చించాయి. దేశాన్ని ప్రపంచ ఆవిష్కరణల, సాంకేతిక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ఈ సదస్సు ముగిసింది. ఇందులో భాగంగా కొత్త ఆవిష్కరణలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి భవిష్యత్తులోనూ ఇలాంటి సంయుక్త చర్చలు, భాగస్వామ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని భాగస్వామ్య పక్షాలన్నీ తీర్మానించాయి.

***


(రిలీజ్ ఐడి: 2279468) సందర్శకుల సూచీ సంఖ్య : : 56
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Tamil , Kannada