ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మాతా, నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణను మరింత బలోపేతం చేయడం కోసం ‘సుమన్ రోడ్‌మ్యాప్ 2030’ ను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా
మాతా,నవజాత శిశువుల ఆరోగ్యానికి సంబంధించిన 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా భారత్ కు మార్గనిర్దేశం చేసే సమగ్ర వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక
प्रविष्टि तिथि:
29 JUN 2026 6:43PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా మాతా, నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణలో సమూల మార్పులు తీసుకురావడమే కాకుండా 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా భారత పురోగతిని వేగవంతం చేసే ఉద్దేశ్యంతో రూపొందించిన సమగ్రమైన, దూరదృష్టితో కూడిన వ్యూహాత్మక ప్రణాళిక - సుమన్ రోడ్‌మ్యాప్ 2030ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా ఈ రోజు ప్రారంభించారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మండలి (సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ - సీసీహెచ్ఎఫ్డబ్ల్యూ) 16వ సదస్సులో శ్రీ నడ్డా ఈ ప్రణాళికను ఆవిష్కరించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రులు శ్రీమతి అనుప్రియ పటేల్, శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, ఇతర ప్రముఖ ప్రతినిధులు హాజరయ్యారు.
గత దశాబ్ద కాలంలో నిరంతర విధానపరమైన జోక్యాలు, బలోపేతం చేసిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల ద్వారా మాతా, నవజాత శిశువుల ఆరోగ్యంలో భారత్ గణనీయమైన ప్రగతిని సాధించింది. అయితే, ఈ అద్భుతమైన పురోగతి ఉన్నప్పటికీ, కొన్ని నిర్దిష్ట అంశాలలోముఖ్యంగా అధిక ప్రాధాన్యత కలిగిన రాష్ట్రాలలో మాతా, నవజాత శిశువుల మరణాల రేటు ఇప్పటికీ ఒక సవాలుగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో మరింత లక్షిత, విభిన్నమైన విధానం అవసరమని గుర్తించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 'సుమన్ రోడ్‌మ్యాప్ 2030'ను రూపొందించింది. దేశవ్యాప్తంగా సమానమైన, అత్యంత నాణ్యమైన ప్రసవ కాల, నవజాత శిశు ఆరోగ్య సంరక్షణను అందించడానికి జాతీయ ప్రాధాన్యతలను స్థానిక పరిస్థితులతో ముడిపెడుతూ పక్కా ఆధారాలతో కూడిన వ్యూహంగా దీనిని తీర్చిదిద్దారు.
సంతానోత్పత్తి, మాతృత్వ, నవజాత శిశు, బాల్య యుక్తవయస్సు ఆరోగ్యం + పోషకాహారం (ఆర్ఎమ్ఎన్‌సిహెచ్ఏ+ఎన్) నిబంధనల ఆధారంగా జీవిత చక్రం మొత్తాన్ని దృష్టిలో ఉంచుకున్న సమగ్ర విధానంగా ఈ రోడ్ మ్యాప్ రూపుదిద్దుకుంది. ఇది గర్భధారణ ముందు కాలం మొదలుకొని.. గర్భధారణ, ప్రసవం, ప్రసవానంతర సమయాల వరకు అవసరమైన వైద్య సహాయాలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తుంది. అలాగే దీనిని బాలల ఆరోగ్యం, యుక్తవయస్సు ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, పోషకాహార కార్యక్రమాలతో కూడా ఏకీకృతం చేస్తుంది. పునరుత్పత్తి, మాతృ ఆరోగ్య శ్రేణిలోని ప్రతి దశలోనూ ఎటువంటి అంతరాయం లేని, రోగి ప్రాధాన్య సంరక్షణను అందించేలా ఈ వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించారు.
ఈ రోడ్‌మ్యాప్ ప్రధానంగా అత్యంత ప్రమాదకరమైన గర్భధారణలను ప్రసవ పూర్వ సంరక్షణ, మూడవ త్రైమాసిక సంరక్షణ, ప్రసవ సమయం, ప్రసవానంతర కాలం అనే నాలుగు క్లిష్టమైన దశల ద్వారా గుర్తించి, ట్రాక్ చేసి, పర్యవేక్షించడానికి ఒక క్రమబద్ధమైన విధానాన్ని కలిగి ఉంది. దీనివల్ల సకాలంలో వైద్య సహాయం అందించి, మెరుగైన క్లినికల్ ఫలితాలను సాధించడానికి వీలవుతుంది. క్షేత్రస్థాయి అనుభవాలు, కార్యక్రమాల అమలు ద్వారా లభించిన ఆధారాల ఆధారంగా రవాణా సౌకర్యాలు, గిరిజన, మారుమూల ప్రాంతాలలో ఆరోగ్య సేవలు, మెరుగైన అత్యవసర ప్రసవ సంరక్షణ, 'సుమన్ పంచాయతీల' ద్వారా సమాజ భాగస్వామ్యం, మాతా, నవజాత శిశువుల ఆరోగ్యంపై వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న ప్రభావం వంటి సవాళ్లను కూడా ఈ వ్యూహం ద్వారా పరిష్కరిస్తారు.
సమస్య తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలలో త్వరితగతిన మార్పులు తీసుకురావడం కోసం ఈ రోడ్‌మ్యాప్ 13 అధిక కేంద్రీకృత రాష్ట్రాలలోని (అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్) 130 జిల్లాలలో నిర్దిష్ట కాలపరిమితితో కూడిన కార్యక్రమాలను ప్రవేశపెడుతోంది. మెరుగైన మాతా, నవజాత శిశు ఆరోగ్య సంరక్షణ సేవలను నిలబెట్టుకుంటూ, దేశంలో అందరికీ వీటిని అందించేందుకు వీలుగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం ప్రత్యేక వ్యూహాలను కూడా ఈ ప్రణాళిక నిర్దేశిస్తుంది.
అధిక సమస్యాత్మక రాష్ట్రాలకోసం ఈ రోడ్‌మ్యాప్ ఒక సమగ్ర కార్యాచరణ ప్యాకేజీని ప్రతిపాదిస్తోంది. ఇందులో భాగంగా గర్భిణుల కోసం 'సుమన్ ప్యాకేజీ' ని అందిస్తారు; ఇది ముందస్తు నమోదు, పూర్తి ప్రసవ పూర్వ సంరక్షణ, మెరుగైన క్లినికల్ పరీక్షలు, ప్రసవానంతరం తగినన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండేలా ప్రోత్సహిస్తుంది. ప్రమాద సంకేతాలను ముందుగానే గుర్తించడం, పోషకాహార సంబంధ అవగాహన, కౌన్సిలింగ్, ప్రసవ సన్నద్ధత, ఆసుపత్రి ప్రసవాలను పెంపొందించడం కోసం గర్భధారణ ఎనిమిది, తొమ్మిదవ నెలలలో ఆశా కార్యకర్తలు వారానికి రెండుసార్లు వారి ఇళ్లకు వెళ్లేలా కూడా ఇది నిబంధనలను కల్పిస్తోంది. ఇంకా క్లినికల్ పరంగా అత్యంత కీలకమైన ప్రసవానంతర కాలంలో గర్భిణులను చూసుకునే సంరక్షకులకు ఆర్థిక సహాయం అందించడం, ప్రసవ సమయ అత్యవసర పరిస్థితుల్లో రవాణా సౌకర్యం కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటివి కూడా ఉన్నాయి. వీటితో పాటు రవాణా సౌకర్యాలు లేని, వైద్య సేవలు సరిగ్గా అందే అవకాశం లేని మారుమూల ప్రాంతాలలో బర్త్ వెయిటింగ్ హోమ్స్, మాతా శిశు ఆరోగ్య విభాగాలు, అబ్స్టెట్రిక్ హై డిపెండెన్సీ యూనిట్లు, ఐసీయూల ఏర్పాటు ద్వారా ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయనున్నారు.
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మాతా, నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణను మరింత బలోపేతం చేయడానికి ఈ రోడ్‌మ్యాప్ ఒక సమగ్రమైన కార్యాచరణను నిర్దేశిస్తోంది. ఇందులో గర్భధారణను ప్లాన్ చేసుకుంటున్న మహిళలకు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు అందించడం ద్వారా గర్భధారణకు పూర్వపు సంరక్షణను ఒక వ్యవస్థాగత ప్రక్రియగా మార్చడం, గర్భిణులలో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించడానికి పోషకాహార కార్యక్రమాలను విస్తరించడం, చికిత్స/సంరక్షణ ప్రక్రియలో భాగంగా అత్యంత ప్రమాదకరమైన గర్భధారణల పర్యవేక్షణ, నిర్వహణను బలోపేతం చేయడం, సుమన్ పంచాయతీలు, మదర్స్ పిక్నిక్ వంటి కార్యక్రమాల ద్వారా సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించడం వంటి చర్యలు ఉన్నాయి.
ప్రసవ సమయాల్లో వచ్చే తీవ్ర రక్తస్రావాన్ని అరికట్టేందుకు నాన్-న్యూమాటిక్ యాంటీ-షాక్ గార్మెంట్స్ (ఎన్ఏఎస్జీ) దుస్తులను విస్తృతంగా అందుబాటులోకి తేవడం, కృత్రిమ మేధ సాంకేతికతతో కూడిన కాన్పు గదులను ఏర్పాటు చేయడం, జనని పోర్టల్ ద్వారా డిజిటల్ పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడం వంటి వ్యూహాలకు కూడా ఈ ప్రణాళిక ప్రాధాన్యతనిస్తోంది. మాతృ మరణాల నిఘా-స్పందన (ఎండిఎస్ఆర్), మెటర్నల్ నియర్ మిస్ (ఎంఎన్ఎం) సమీక్షలను పటిష్టం చేయడం, గర్భిణులు, నవజాత శిశువుల కోసం వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించడం, సిజేరియన్ పద్ధతులను క్రమబద్ధీకరించడం వంటి చర్యలను కూడా ప్రతిపాదిస్తోంది. అలాగే, నవజాత శిశువులకు పుట్టినప్పటి నుంచి 36 నెలల వయస్సు వచ్చే వరకు ఎటువంటి అంతరాయం లేకుండా ఇంటి వద్దే ఆరోగ్య సంరక్షణ అందించడానికి సమగ్ర శిశు బాల స్వస్థ్య కార్యక్రమం(ఎస్ఎస్బీఎస్కే) ను కూడా దీనితో అనుసంధానించనున్నారు.
ఈ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసి, స్థిరమైన ఫలితాలను సాధించడానికి మాతా, నవజాత శిశు ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక నైపుణ్య సేవా కేంద్రాలను అభివృద్ధి చేయడం, ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్రీకృత సుమన్ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయడం, వివిధ ఆరోగ్య కేంద్రాల మధ్య మెరుగైన రెఫరల్ అనుసంధానాన్ని పెంపొందించడం, జనని పోర్టల్ ద్వారా పటిష్టమైన డిజిటల్ పర్యవేక్షణ, నివేదికల వ్యవస్థలను తీసుకురావడాన్ని ఈ రోడ్‌మ్యాప్ నిర్దేశిస్తోంది.
సాక్ష్యాధారాలతో కూడిన జోక్యాలు, డిజిటల్ ఆవిష్కరణలు, ఆరోగ్య వ్యవస్థల బలోపేతం, సమాజ భాగస్వామ్యాల సమ్మిళితం ద్వారా తల్లుల ఆరోగ్యం, నవజాత శిశు సంరక్షణ, కుటుంబ నియంత్రణ, పోషకాహార సేవలను బలోపేతం చేసే ఒక మార్పు దాయక జాతీయ వ్యూహాన్ని కూడా సుమన్ రోడ్‌మ్యాప్ 2030 ప్రతిబింబిస్తోంది. ఆర్ఎమ్ఎన్‌సిహెచ్ఏ+ఎన్ నిబంధనల కింద కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన మాతా ఆరోగ్య విభాగం (మెటర్నల్ హెల్త్ డివిజన్) నేతృత్వంలోని ఈ కార్యక్రమం 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా భారత్ పురోగతిని మరింత వేగవంతం చేయడానికి కృషి చేస్తుంది.
ఈ రోడ్‌మ్యాప్ ప్రకారం 2030 నాటికి ప్రతి లక్ష సజీవ జననాలకు మాతృ మరణాల నిష్పత్తిని (ఎంఎం ఆర్) 70 లోపు తగ్గించడం, నవజాత శిశు మరణాల రేటు (ఎన్ఎంఆర్), శిశు మరణాల రేటు (ఐఎంఆర్)లను మరింతగా తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మాతా, నవజాత శిశు ఆరోగ్య సేవలను ప్రతి ఒక్కరికీ సంపూర్ణంగా అందుబాటులోకి తీసుకురావడం, తద్వారా నివారించదగిన మాతా, నవజాత శిశు మరణాలను అసలు లేని స్థాయిని సాధించడమే అంతిమ ధ్యేయంగా ఈ ప్రణాళిక ను అమలు చేస్తారు
'సుమన్ రోడ్‌మ్యాప్ 2030' ఆవిష్కరణ.. సురక్షితమైన మాతృత్వాన్ని, ఆరోగ్యకరమైన నవజాత శిశువులను అందించడంలో భారత్ నిరంతర నిబద్ధతకు ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. వైజ్ఞానిక ఆధారాలు, నిర్దిష్ట కార్యక్రమాలు, బలోపేతం చేసిన ఆరోగ్య వ్యవస్థలు చురుకైన సమాజ భాగస్వామ్యాలను ఏకం చేయడం ద్వారాఈ రోడ్‌మ్యాప్ మరింత పటిష్టమైన, సమానమైన, వేగంగా స్పందించే మాతా శిశు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బలమైన పునాది వేస్తోంది. తద్వారా దేశంలో ఏ ఒక్క తల్లి లేదా నవజాత శిశువు కూడా ఈ వైద్య సేవలకు దూరం కాకుండా ఉండేలా భరోసా కల్పిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2279251)
आगंतुक पटल : 7