ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
‘జాతీయ అంబులెన్స్ సేవల (ఎన్ఏఎస్) కార్యాచరణ మార్గదర్శకాలు - 2026’ను విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా
దేశవ్యాప్తంగా అత్యవసర వైద్య రవాణా సేవలను ప్రామాణీకరించేందుకు జాతీయ విధానాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం
సాంకేతికత ఆధారిత అత్యవసర ప్రతిస్పందన, ఏఐఎస్-125 ప్రమాణాలకు అనుగుణంగా ఉండే అంబులెన్సులు, సమగ్ర కమాండ్ సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోన్న మార్గదర్శకాలు
प्रविष्टि तिथि:
29 JUN 2026 6:41PM by PIB Hyderabad
భారతదేశ అత్యవసర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలక అడుగు పడింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా ఈ రోజు 'జాతీయ అంబులెన్స్ సేవల (ఎన్ఏఎస్) కార్యాచరణ మార్గదర్శకాలు - 2026'ను విడుదల చేశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ మార్గదర్శకాలు.. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అంబులెన్స్ సేవల ప్రణాళిక, నిర్వహణ, పర్యవేక్షణ కోసం మొదటిసారిగా ఒక సమగ్ర జాతీయ విధానాన్ని అందిస్తున్నాయి. ప్రతి పౌరుడికి సకాలంలో, సురక్షితమైన, నాణ్యమైన అత్యవసర వైద్య రవాణా సేవలను అందించడమే దీని ముఖ్య ఉద్దేశం.
అత్యవసర వైద్య పరిస్థితుల్లో రోగులు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మధ్య మొదటి అనుసంధాన వేదికగా నిలిచే అంబులెన్స్ సేవలు... సమర్థవంతమైన అత్యవసర వైద్య సంరక్షణకు అత్యంత ప్రాథమికమైనవి. ఆసుపత్రికి చేరడానికి ముందు అందే వైద్యం, రోగుల పరిస్థితి విషమించకుండా స్థిరపరచడం, సరైన వైద్య సదుపాయాలు ఉన్న ఆసుపత్రులకు వారిని సకాలంలో చేర్చడంలో అంబులెన్స్ సేవలు పోషించే కీలక పాత్రను గుర్తిస్తూ... దేశవ్యాప్తంగా అత్యవసర ప్రతిస్పందన సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు ఒకే విధమైన కార్యాచరణ ప్రమాణాలను నెలకొల్పాలని ఈ మార్గదర్శకాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
అంబులెన్స్ సేవల నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఈ ఫ్రేమ్‌వర్క్ కలిగి ఉంది. ఇందులో అంబులెన్స్‌ల వర్గీకరణ, జనాభా ప్రాతిపదికన అంబులెన్స్ వాహనాల కేటాయింపు, మానవ వనరుల నిబంధనలు, వైద్య పరికరాల నిర్దేశాలు, మందులు, ఇతర వినియోగ వస్తువులు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల (ఈఎంటీ) కొరకు నైపుణ్య ఆధారిత శిక్షణ, ఇన్‌ఫెక్షన్ల నివారణ, నియంత్రణ పద్ధతులు, వాహనాల నిర్వహణ నిబంధనలు, నాణ్యతా ప్రమాణాల హామీ (క్వాలిటీ అస్యూరెన్స్), పనితీరు పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు ఉన్నాయి. అత్యవసర వైద్య రవాణాలో ఏకరూపత, భద్రత, నాణ్యతను నిర్ధారించడానికి వీలుగా అన్ని అంబులెన్స్‌లు తప్పనిసరిగా 'ఏఐఎస్-125' ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని ఈ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.
అంబులెన్స్ సేవల సమన్వయాన్ని, ప్రతిస్పందన సామర్థ్యాన్ని మరింత పెంచడం కోసం ఈ మార్గదర్శకాలు 'సమగ్ర కమాండ్, డిస్పాచ్ సెంటర్ల' (ఐసీడీసీ) ఏర్పాటును గట్టిగా సమర్థిస్తున్నాయి. ఈ కేంద్రాలు జీపీఎస్ ఆధారిత అంబులెన్స్ ట్రాకింగ్, డిజిటల్ కాల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలు, రోగుల అత్యవసర తీవ్రతను బట్టి క్రమబద్ధంగా వర్గీకరించే పద్ధతులు (ట్రయాజ్ ప్రోటోకాల్స్), ఇంటెలిజెంట్ డిస్పాచ్ వ్యవస్థలు, నిజసమయ పర్యవేక్షణ డ్యాష్‌బోర్డ్‌ల సహాయంతో పనిచేస్తాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు సులభంగా అందేలా చూడటం కోసం.. ఈ అంబులెన్స్ సేవలను క్రమంగా ఏకీకృత అత్యవసర ప్రతిస్పందన నంబర్ '112'తో అనుసంధానించాలని ఈ విధానం నిర్దేశిస్తోంది.
అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికల కోసం అధునాతన డిజిటల్ సాంకేతికతలను ఉపయోగించడాన్ని ఈ మార్గదర్శకాలు ప్రోత్సహిస్తున్నాయి. జీఐఎస్ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) ఆధారిత మ్యాపింగ్ ద్వారా ఆసుపత్రులు, రిఫరల్ కేంద్రాలు, అంబులెన్స్ కేంద్రాలు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, ఎక్కువ ముప్పు ఉన్న ప్రాంతాలు, ఖాళీగా ఉన్న బెడ్‌ల వివరాలు, అత్యవసర చికిత్స సన్నద్ధతను డిజిటల్‌గా అనుసంధానిస్తారు. దీనివల్ల కంట్రోల్ రూమ్ సిబ్బంది రోగికి అత్యంత సమీపంలో సరైన వసతులు ఉన్న ఆసుపత్రిని వెంటనే గుర్తించగలుగుతారు. తద్వారా అంబులెన్స్ వచ్చే సమయం తగ్గడమే కాకుండా రోగుల ప్రాణాలను కాపాడే అవకాశాలు మెరుగవుతాయి.
డేటా ఆధారిత ప్రణాళికలకు ప్రాధాన్యతనిస్తూ అత్యవసర కాల్స్ ట్రెండ్స్, రోగులను వేరే ఆసుపత్రులకు పంపించే విధానాలు, ట్రాఫిక్ సాంద్రత, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, భౌగోళిక ఇబ్బందులు, జనాభా విస్తరణ వంటి అంశాలను విశ్లేషించడం ద్వారా కచ్చితమైన ఆధారాల ప్రాతిపదికన అంబులెన్స్‌లను కేటాయించాలని ఈ విధానం సిఫార్సు చేస్తోంది. ఇటువంటి శాస్త్రీయ విధానం ద్వారా వనరులను సరైన రీతిలో వినియోగించుకోవడానికి, సేవలు అందరికీ సులభంగా అందుబాటులోకి రావడానికి.. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల, చేరుకోవడానికి కష్టంగా ఉన్న ప్రాంతాలలో సమానమైన అత్యవసర వైద్య సేవలు అందేలా చూడటానికి వీలవుతుంది.
అత్యవసర ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడానికి, ఆసుపత్రికి చేరడానికి ముందే అందించే ప్రాథమిక చికిత్సా సేవలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిరంతరం చేస్తున్న ప్రయత్నాలలో 'జాతీయ అంబులెన్స్ సేవల (ఎన్ఏఎస్) కార్యాచరణ మార్గదర్శకాలు - 2026' ఒక ప్రధాన ఘట్టంగా నిలుస్తాయి.
***
(रिलीज़ आईडी: 2279194)
आगंतुक पटल : 6