గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
జాతీయ గ్రామీణ అభివృద్ధి సదస్సును ప్రారంభించిన కేంద్రమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
టీం భారత్, టీం గ్రామీణాభివృద్ధి: నినాదంతో ఐక్యత, సేవాభావానికి పిలుపునిచ్చిన కేంద్రమంత్రి
అభివృద్ధి చెందిన గ్రామాలు లేకుండా వికసిత్ భారత్ సాధ్యపడదు: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
గ్రామాలే దేశానికి జీవనాడి, వాటిని సుసంపన్నం చేయడం మనకు ప్రథమం, అత్యంత కీలకం’’: కేంద్రమంత్రి
కేవలం ప్రణాళికలు రూపొందించడమే కాదు, అర్హులైన లబ్ధిదారులకు వాటిని చేరవేయడమే అన్నిటికంటే పెద్ద బాధ్యత: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
గ్రామీణ సమృద్ధిపై రెండు రోజుల పాటు జరగనున్న జాతీయ సమ్మేళనం... మొదటి రోజు అధికారులు, రెండో రోజు ఢిల్లీలో సమావేశం కానున్న దేశవ్యాప్త మంత్రులు
प्रविष्टि तिथि:
28 JUN 2026 8:54PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పించిన ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని క్షేత్రస్థాయిలో ఆచరణాత్మకంగా సాకారం చేసే దిశగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల ‘రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళన్’ (జాతీయ గ్రామీణ అభివృద్ధి సదస్సు) ఢిల్లీలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సును కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రులు శ్రీ కమలేష్ పాశ్వాన్, డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉన్నత స్థాయి సదస్సులో భాగంగా మొదటి రోజు వివిధ రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొన్నారు. వీరంతా దేశవ్యాప్తంగా అమలవుతున్న వివిధ రకాల గ్రామీణాభివృద్ధి పథకాలపై లోతైన చర్చలు, సంప్రదింపులు జరిపారు. సదస్సులో రెండో రోజైన జూన్ 29న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు సదస్సులో పాల్గొంటారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర వికాసానికి అవసరమైన విధానపరమైన మార్గదర్శకాలను ఖరారు చేయడంతో పాటు, అందరం కలిసికట్టుగా ముందుకు సాగేందుకు ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపై చర్చించనున్నారు.

ఈ సదస్సు కేవలం ఒక లాంఛనప్రాయ కార్యక్రమం కాదని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్’ దార్శనికతను సాకారం చేసేలా ఎంతో ఆలోచనాత్మకంగా రూపొందించిన వ్యూహాత్మక ప్రణాళికగా కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ జాతీయ స్థాయి చర్చా వేదిక ప్రాథమికంగా ‘టీమ్ ఇండియా-టీమ్ రూరల్ డెవలప్మెంట్’ల సమష్టి ప్రయత్నానికి నిదర్శనమని తెలిపారు. ఈ వేదికపై ఎవరూ ముఖ్య అతిథిగా లేరని, కేంద్రం, రాష్ట్రాల నుంచి వచ్చిన మంత్రులు, అధికారులందరూ ఒక సమష్టి బృందంగా ఇక్కడ ఉన్నారని తెలిపారు. తాను కూడా ఈ బృందంలో ఒక సభ్యుడిని మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి రాసిన కవితా పంక్తులను ఉటంకిస్తూ... మనం ఇతరులను కౌగిలించుకోలేనంత ఎత్తుకు ఎదగకూడదని, ఇదే విధమైన భావన గ్రామీణాభివృద్ధి విధానాల్లో, వాటి అమలులో కూడా ప్రతిబింబించాలని పిలుపునిచ్చారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ‘సరికొత్త ఆలోచనల స్వరూపం’గా అభివర్ణిస్తూ... అభివృద్ధి చెందిన, సాధికారత కలిగిన, స్వావలంబన, స్వయం సమృద్ధి, వైభవోపేతమైన భారత్‌ను చూడాలనే బలమైన ఆకాంక్ష ప్రధాని గుండెల్లో ఉందని కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ రోజు, రేపు ఇక్కడ హాజరైన అధికారులందరూ, రేపు రాబోయే మంత్రులందరూ రాత్రింబవళ్లు ఇదే మంత్రం, సంకల్పంతో శ్రమించినప్పుడే ఈ తపన విజయవంతమైన ఫలితాలుగా మారుతుందని పేర్కొన్నారు. తద్వారా గ్రామాల అభివృద్ధి కథను నేరుగా ‘వికసిత్ భారత్’ ప్రస్థానంతో అనుసంధానించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్రామాలే దేశానికి ప్రాణం, ప్రజాస్వామ్యానికి బలమైన పునాది
కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తన ప్రసంగంలో గ్రామాల ప్రాముఖ్యతను వివరించారు. గ్రామాలు లేని దేశాన్ని ఊహించలేమని, దేశ జీవనాడి, ఆర్థిక వ్యవస్థ, గుర్తింపు, నాగరికత, సంస్కృతికి గ్రామాలే కేంద్ర బిందువులని ఆయన పేర్కొన్నారు. గ్రామాలను ప్రజాస్వామ్యానికి అత్యంత బలమైన పునాదిగా అభివర్ణించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు గ్రామీణ శ్రేయస్సు కోసం జరిగే ఒక అమృత మథనం వంటిదని, దీని నుంచి వచ్చే అమృతం రాబోయే సంవత్సరాల్లో దేశంలోని ప్రతి గ్రామానికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. కేవలం పథకాలను రూపొందించడం మాత్రమే సరిపోదని, వాటిని క్షేత్ర స్థాయిలో లబ్దిదారులకు విజయవంతంగా చేరవేయడమే అత్యంత పెద్ద బాధ్యతని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనలను పంచుకుంటూ.. ‘‘ప్రభుత్వం కేవలం ఫైళ్లలో మాత్రమే కాకుండా ప్రజల జీవితాల్లో కనిపించాలి’’ అని పేర్కొన్నారు. ప్రతి పథకం ప్రయోజనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా, లంచాలకు తావులేకుండా, సమయం వృథా కాకుండా అర్హులైన లబ్ధిదారునికి చేరినప్పుడే ఇది సాధ్యమవుతుందని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
సంస్కరణలు, వికసిత్ భారత్- వీబీ-జీ రామ్-జీపై ప్రత్యేక దృష్టి
వివిధ సమావేశాల్లో నిజమైన సంస్కరణలు, లోతైన చర్చలు జరగాలని కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. కేవలం పథకాన్ని రూపొందించడం మాత్రమే సరిపోదని, దానిని లబ్ధిదారులకు సరిగ్గా చేరవేయడం అత్యంత ముఖ్యమని అన్నారు. నిబంధనలు, విధానాలు, అమలు ప్రక్రియలో ఎక్కడైనా అడ్డంకులు ఉంటే, వాటిని నిజాయితీగా గుర్తించి మార్చాలని అధికారులను కోరారు. ఉపాధి హామీ పథకం గురించి శ్రీ శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన ఒక అధ్యయనాన్ని ప్రస్తావించారు. చాలా చోట్ల కూలీలకు బదులుగా యంత్రాలతో పనులు చేయించారని, హాజరు పట్టికలో అక్రమాలు జరిగాయని, తప్పుడు హజరు నమోదు చేయడం వల్ల నిధులను భారీగా దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లోపాలన్నింటినీ సరిదిద్దుతూ మార్పులు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే కూలీల పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచామని, అవసరమున్న ఏ ఒక్క కూలీ కూడా పని లేకుండా ఉండిపోకూడదన్నదే తమ సంకల్పమని వెల్లడించారు. వార్షిక బడ్జెట్‌లో కేటాయించే రూ. 1.5 లక్షల కోట్లకు పైగా నిధులు, రాబోయే ఐదేళ్లలో చేయబోయే రూ. 75 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు గనుక పంచాయతీలకు సరిగ్గా చేరి, సమర్థవంతంగా వినియోగిస్తే గ్రామాల ప్రాథమిక రూపురేఖలను నిర్ణయాత్మకంగా మార్చవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
గ్రామీణాభివృద్ధి సమగ్ర వ్యవస్థే లక్ష్యంగా సదస్సు
ఈ రెండు రోజుల సదస్సు కేవలం ఏదో ఒక పథకానికి మాత్రమే పరిమితం కాలేదని, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన సమగ్ర వ్యవస్థపైనే ప్రత్యేకంగా దృష్టి సారించిందని కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)(వీబీ-జీ రామ్-జీ) కింద అభివృద్ధి చెందిన భారత్ కోసం అభివృద్ధి చెందిన గ్రామాలు అనే భావనను పెంపొందించడం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) ద్వారా గౌరవమైన గ్రామీణ గృహ నిర్మాణం, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా పటిష్టమైన రోడ్ల వ్యవస్థ, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, గ్రామీణ నైపుణ్యాల ద్వారా జీవనోపాధి, వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ద్వారా సామాజిక భద్రత కల్పించడం వంటి వాటన్నింటినీ ఒకే ఉమ్మడి వ్యవస్థగా అనుసంధానిస్తున్నారు. తద్వారా ప్రధానమంత్రి ‘వికసిత్ భారత్’ దృక్పథం క్షేత్రస్థాయిలో మరింత వేగం పుంజుకోనుంది.
ప్రస్తుతం పీఎంఏవై-జీ కింద కొనసాగుతున్న భౌతిక ధ్రువీకరణ ప్రచారాన్ని ప్రస్తావిస్తూ.. అధికారులను కేంద్రమంత్రి హెచ్చరించారు. అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారులను అనుర్హులుగా ప్రకటించడం మహాపాపమని, కేవలం ఎవరిదైనా ఏకపక్ష నిర్ణయాలు లేదా పక్షపాతం కారణంగా ఏ పేద కుటుంబం కూడా ఇల్లు దక్కకుండా నష్టపోకూడదని స్పష్టం చేశారు. దీంతో పాటు రాష్ట్రాల్లో సమష్టి ముడి పదార్థాల కొనుగోలు, మేస్త్రీలకు శిక్షణ, వివిధ పథకాల అనుసంధానం వంటి వినూత్న పద్ధతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
లఖ్‌పతి దీదీలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు, మహిళా శక్తి
జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద మహిళలు పోషిస్తున్నపాత్రను కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేకంగా కొనియాడారు. ఇప్పటి వరకు కోట్లాది మంది సోదరీలు స్వయం సహాయక బృందాలలో చేరి తమ ఆదాయాన్ని పెంచుకున్నారని, తద్వారా లక్షలాది మంది లఖ్‌పతి దీదీలు ఆవిర్భవించారని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో ఈ సంఖ్యను 6 కోట్లకు చేర్చడమే లక్ష్యమని, ఇందుకోసం సోదరీలను ఇప్పుడు కేవలం సంఘాల స్థాయిలో మాత్రమే కాకుండా, వ్యక్తిగత స్థాయిలో కూడా ఆధునిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేవలం అప్పడాలు, పచ్చళ్ల తయారీకే పరిమితం కాకుండా, గ్రామీణ సోదరీలను ఆహార శుద్ధి, వ్యవసాయ ఆధారిత వ్యాపారం, సేవా రంగం, డిజిటల్ వేదికల వైపు ముందుకు తీసుకెళ్లాలని, అప్పుడే గ్రామీణ పారిశ్రామికవేత్తలుగా మారి నిజంగా ‘వికసిత్ భారత్’కు వెన్నెముకగా మారగలరని అన్నారు.
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, ఎన్ఎస్ఏపీ: రవాణా సౌకర్యం, సామాజిక భద్రత
మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రారంభించిన ‘ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన’ గ్రామీణ భారత్ రూపురేఖలను మార్చిన ఒక చారిత్రాత్మక కార్యక్రమమని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అభివర్ణించారు. సరైన రహదారులు లేక వెనుకబడిన గ్రామాలను దేశ ప్రధాన స్రవంతిలోకి అనుసంధానించే ప్రక్రియ ప్రస్తుతం అత్యంత వేగంగా సాగుతోందని చెప్పారు. మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి రావడం వల్ల గ్రామాలకు విద్యా, వైద్య, మార్కెట్ సౌకర్యాలు చేరువవుతున్నాయని, రైతులు సైతం తమ పంటలకు మంచి ధరలు పొందగలుగుతున్నారని పేర్కొన్నారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద అందించే వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, దివ్యాంగుల పింఛన్ల వంటి పథకాల పురోగతిని సమీక్షించడం కూడా ఈ రెండు రోజుల సదస్సు అజెండాలో కీలక భాగమని ఆయన తెలిపారు. డిజిటల్ వేదికల ద్వారా పింఛన్ల పంపిణీలో పారదర్శకతను, సమయపాలనను పాటించాలని పేర్కొన్నారు. సమగ్ర భారత్ నిర్మాణంలో సామాజిక భద్రతను బలోపేతం చేయడం అవసరమని అన్నారు.
జట్టు స్ఫూర్తి, కార్యాచరణ విధానం
ప్రభుత్వ ఉద్యోగాన్ని కేవలం ఒక జీవనోపాధిగా కాకుండా, దేశ సేవ కోసం ఒక పవిత్రమైన లక్ష్య సాధనగా భావించాలని రేపు సమావేశానికి హాజరుకానున్న అధికారులకు, మంత్రులకు కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. మన దృక్పథం మారితే మనం చేసే పనిలో ఉండే శక్తి కూడా మారుతుందని, గ్రామీణ భారత్ రూపురేఖలను మార్చే గొప్ప అదృష్టంగా మన పనిని భావిస్తే.. ప్రతి సమావేశం, ప్రతి కార్యక్రమం, ఈ రెండు రోజుల సదస్సు ఒక ‘అమృత మథనం’గా మారగలదని అన్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు వివరించిన సాత్విక కార్యకర్త లక్షణాలైన బంధాలకు అతీతంగా ఉండటం, అహంకారం లేకపోవడం, ఓర్పు, ఉత్సాహాన్ని కలిగి ఉండటం వంటి వాటిని కేంద్రమంత్రి ప్రస్తావించారు. ఒక్క వ్యక్తి ఒక గ్రామాన్ని మార్చగలరని, ఒక్క అధికారి మొత్తం జిల్లాను మార్చగలరని, ఒక్క నాయకుడు దేశాన్నే మార్చగలరని, నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ విధంగా దేశాన్ని మార్చే పనిలో ఉన్నారని తెలిపారు. రాష్ట్రాలన్నీ తమ పరిధిలో గ్రామీణాభివృద్ధిని లక్ష్య సాధనగా భావించి, ఈ సదస్సు నుంచి వచ్చే ‘అమృతాన్ని’ తమ రాష్ట్రాలకు తీసుకెళ్లి, గ్రామ గ్రామానికి చేర్చాలని కోరారు.
రెండు రోజుల సదస్సు: మొదటి రోజు అధికారులు, రెండో రోజు మంత్రులు
ప్రారంభోత్సవ రోజు పథకాల అమలు, పురోగతి సమీక్ష, సంస్కరణల సూచనలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. వికసిత్ భారత్-గ్రామ్ (వీబీజీ రామ్ -జీ) ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్), జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, గ్రామీణ నైపుణ్యాలు, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాలపై వివిధ హాళ్లలో సుదీర్ఘ చర్చా సమావేశాలు నిర్వహించారు. పథకాల సమగ్ర పరిశీలన, రాష్ట్రాల వారీగా పురోగతి సమీక్ష, ఉత్తమ పద్ధతుల ప్రదర్శన, సాంకేతిక, కృత్రిమ మేధ వినియోగం, ఆర్థిక నిర్వహణపై అధికారులు లోతైన చర్చలు జరిపారు. రెండో రోజు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు ఈ ప్లీనరీ సమావేశాల్లో పాల్గొనడం ద్వారా రాజకీయ నాయకత్వం అధికారికంగా ఈ చర్చల్లో భాగస్వామ్యం కానుంది.
నగరాల్లో పెరుగుతున్న వలసలను, జనాభా ఒత్తిడిని నియంత్రించాలంటే గ్రామీణ సమాజాలను బలోపేతం చేయడం, స్థిరమైన జీవనోపాధిని పెంపొందించడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని చెప్పారు. ఉపాధి హామీ పథకం నుంచి వీబీజీ రామ్ -జీగా మారడాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ఇది కేవలం తాత్కాలిక ఉపాధి కల్పన మాత్రమే కాకుండా, ఆస్తులు, సంపద సృష్టిగా మారుతుందని వివరించారు. దీని ద్వారా గ్రామాల్లో 300కిపైగా రకాల ఉత్పాదక, శాశ్వత మౌలిక సదుపాయాలను కల్పించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ కమలేష్ పాశ్వాన్ మాట్లాడుతూ.. గత రెండేళ్లలో రాష్ట్రాల సహకారంతో గ్రామాలను బలోపేతం చేయడంలో, వలసలను అరికట్టడంలో, ‘లఖ్‌పతి దీదీ’ పథకం, స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామీణ మహిళలను స్వావలంబన వైపు నడిపించడంలో తమ మంత్రిత్వ శాఖ అద్భుతమైన పనితీరు కనబరిచిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రోడ్డు వసతి లేని గ్రామాలను పక్కా రోడ్లతో అనుసంధానిస్తున్నామని, అర్హులైన ప్రజలందరికీ ప్రాథమిక వసతులతో కూడిన పక్కా ఇళ్లను అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఉపాధి హామీ పథకంలో నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడం ద్వారా రాబోయే 20 ఏళ్ల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని దానికి ‘వీబీజీ రామ్ -జీ’ రూపంలో ఒక కొత్త రూపురేఖలను, ప్రణాళికను అందించామని తెలిపారు.
గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ రోహిత్ కన్సాల్ గత 12 ఏళ్లలో తమ శాఖ సాధించిన అద్భుత విజయాలను వెల్లడించారు. ఈ కాలంలో దేశంలో దాదాపు 8 లక్షల కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించినట్లు, 3 కోట్ల పక్కా ఇళ్లు సిద్ధమయ్యాయని, 3 కోట్ల మంది లఖ్‌పతి దీదీలను సృష్టించామని, 10 కోట్ల మంది గ్రామీణ మహిళలను స్వయం సహాయక సంఘాలతో అనుసంధానించామని తెలిపారు. రాబోయే దశాబ్ద కాలంలో ఈ గ్రామీణ ఆస్తుల నిర్వహణ, పథకాల పూర్తిస్థాయి అమలు, దేశ ప్రజల జీవన సౌలభ్యాన్ని మరింత పెంపొందించడంపై అందరూ కలిసికట్టుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ విషయాల్లో తమ శాఖ ఇప్పుడు ఒక కీలక దశలో ఉందని ఆయన స్పష్టం చేశారు.
***
(रिलीज़ आईडी: 2278999)
आगंतुक पटल : 9