పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
చార్‌ధామ్-2026 తొలిదశ హెలికాప్టర్ కార్యకలాపాలు విజయవంతం
కట్టుదిట్టంగా భద్రత నిబంధనల అమలుతో అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కార్యకలాపాలు సమాప్తం
प्रविष्टि तिथि:
27 JUN 2026 8:14PM by PIB Hyderabad
చార్‌ధామ్ యాత్ర-2026 తొలిదశలో హెలికాప్టర్ కార్యకలాపాలు సురక్షితంగా, విజయవంతంగా పూర్తి కావడంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సగర్వంగా హర్షం ప్రకటించింది. యాత్రికులకు నిరంతరాయ, సురక్షిత, విశ్వసనీయ గగన సంధాన కల్పనలో చిత్తశుద్ధితో కూడిన ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనం.
చార్‌ధామ్ యాత్ర తొలిదశ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభం కాగా జూన్ 26న ముగిసిన నేపథ్యంలో యాత్రికులకు నిత్యం సుమారు 400 వంతున హెలికాప్టర్ రాకపోకల సేవలు అందాయి. ఈ మేరకు 12,032 షటిల్ సర్వీసుల ద్వారా 67,064 మంది యాత్రికులు ప్రయాణించారు. దీనికితోడు 2,065 చార్టర్ సర్వీసుల ద్వారా 11,715 మంది సేవలు పొందారు. ఈ విధంగా చార్‌ధామ్ సెక్టార్ పరిధిలో యాత్ర తొలి దశకు ఆసాంతం సురక్షిత, విశ్వసనీయ, సమర్థ అనుసంధానం విజయవంతమైంది.
ఈసారి తొలి దశలో కార్యకలాపాలు విజయవంతం కావడంపై పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- “ఈ యాత్రలో ప్రతి భక్తుడికీ సులభ, సౌకర్య సహిత, సురక్షిత ప్రయాణం దిశగా దూరదృష్టి గల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని మా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిచ్చింది. ఈ పవిత్ర యాత్రను ప్రతి ఒక్కరూ సురక్షితంగా, పూర్తి విశ్వాసంతో పూర్తి చేసేలా చూడటమే ప్రథమ కర్తవ్యంగా మేం కృషి చేశాం. ఇందులో భాగంగా డీజీసీఏ, హెలికాప్టర్ ఆపరేటర్లు, ‘యూసీఏడీఏ’ వంటి భాగస్వాములందరితో సన్నిహిత సమన్వయం నిమిత్తం యాత్ర ఆరంభానికి చాలా ముందుగానే పలు స్థాయిలలో సమీక్షలు నిర్వహించాం. తదనుగుణంగా సమగ్ర సన్నాహాలపై శ్రద్ధ వహించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామిని నేను ప్రత్యేకంగా అభినందించడంతోపాటు ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని పేర్కొన్నారు.
విమానయానానికి దేశంలోనే అత్యంత కఠిన వాతావరణంగల చార్‌ధామ్ పరిధిలో హెలికాప్టర్ సేవలు ఏటా అందిస్తున్నాం. ఇక్కడి భౌగోళిక కఠిన పరిస్థితులు, అనుక్షణం మారిపోయే వాతావరణం, ఇరుకైన లోయలు, కార్యకలాపాలకు పరిమిత వ్యవధి సహా హెలికాప్టర్ రాకపోకల సాంద్రత అధికంగా ఉంటుంది. అందువల్ల అత్యున్నత ప్రమాణాలతో కార్యాచరణ ప్రణాళిక సహా కఠిన నియంత్రణ-పర్యవేక్షణలు అత్యావశ్యకం.
ఆ మేరకు హిమాలయ ప్రాంతంలో హెలికాప్టర్ సేవల సంబంధిత ప్రత్యేక కార్యాచరణ సవాళ్లను గుర్తించి, ఈ ఏడాది యాత్రల ఆరంభానికి ఎంతో ముందుగానే తమ మంత్రిత్వశాఖ విస్తృత సన్నాహాలు ప్రారంభించిందని మంత్రి తెలిపారు.
ఇందులో భాగంగా కార్యాచరణ సంసిద్ధత, భద్రత సన్నద్ధతపై సమగ్ర అంచనా లక్ష్యంగా మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు స్వయంగా పలుమార్లు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. కార్యాచరణ విధివిధానాలు, భద్రత నియమావళి, వాతావరణ సన్నద్ధత, అత్యవసర ప్రతిస్పందన యంత్రాంగాల మధ్య పూర్తి సమన్వయంపై నిశిత పర్యవేక్షణ కొనసాగించారు. ఈ దిశగా వివిధ సమావేశాల్లో ఆ మంత్రిత్వ శాఖతోపాటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ), ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి ప్రాధికార సంస్థ (యూసీఏడీఏ), భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రతినిధులతోపాటు హెలికాప్టర్ సేవాప్రదాతలు, ఉత్తరాఖండ్ ప్రభుత్వం సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ సిన్హా, ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఆనంద్ వర్ధన్‌ల సంయుక్త అధ్యక్షతన మరో ఉన్నత స్థాయి సమావేశంలో యాత్ర సంబంధిత సమగ్ర భద్రత చట్రాన్ని ఖరారు చేశారు. యాత్రా కాలమంతటా నిరంతర పర్యవేక్షణ కోసం వారిద్దరి నాయకత్వాన వారాంతపు సమీక్ష నిర్వహణను సంస్థాగతం చేశారు. కార్యాచరణలో తలెత్తే సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి ఇది వీలు కల్పించింది.
దీనిపై మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ- “మునుపటి యాత్రల సందర్భంగా చోటుచేసుకున్న దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా హెలికాప్టర్ కార్యకలాపాల సంబంధిత ప్రతి అంశంపై మేం సమగ్ర సమీక్ష నిర్వహించాం. మూల కారణాలను గుర్తించి, నియంత్రణ-పర్యవేక్షణల బలోపేతం ద్వారా గగనతల రద్దీని సమన్వయం చేశాం. అలాగే, కార్యాచరణ మౌలిక సదుపాయాలను ఉన్నతీకరించి, విమానయాన భద్రతనే ఉమ్మడి లక్ష్యం ప్రధానంగా ప్రతి భాగస్వామిని అప్రమత్తంగా ఉంచాం” అని వివరించారు.
గగనతల రాకపోకల మెరుగైన నిర్వహణతోపాటు నిఘా, సమాచార ప్రసారం, వాతావరణ పర్యవేక్షణ, పైలట్ నైపుణ్యం, మౌలిక సదుపాయాల పెంపు, కార్యాచరణపై పర్యవేక్షణ సహిత బహుళ అంచెల భద్రత వ్యూహాన్ని అనుసరించామని ఆయన తెలిపారు.
మెరుగైన భద్రత చట్రం రూపకల్పనలో భాగంగా లోయ అంతటా హెలికాప్టర్ల క్రమబద్ధ రాకపోకల కోసం ‘ఏఏఐ’ ప్రత్యేక ‘కె-రూట్స్’ ప్రచురించింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్-కమ్యూనికేషన్-నావిగేషన్ అండ్ సర్వైలెన్స్ (సీఎన్‌ఎస్) సిబ్బందిని వ్యూహాత్మకంగా మోహరించారు. తద్వారా సహస్రధార, సెర్సీలలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సేవలను ‘ఏఏఐ’ ప్రవేశపెట్టింది. బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లలో శాశ్వత ‘ఏటీసీ’ మౌలిక సదుపాయాల కల్పన కోసం భూ సేకరణ సహా సురక్షిత హెలికాప్టర్ కార్యకలాపాల దిశగా తాత్కాలిక కార్యాచరణ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
నిఘా సంసిద్ధత ప్రణాళికలో భాగంగా కార్యాచరణ నిఘాను బలోపేతం చేస్తూ కీలక ప్రదేశాలలో 33 ‘పీటీజడ్’ (పాన్-టిల్ట్-జూమ్) కెమెరాలను ‘యూసీఏడీఏ’ ఏర్పాటు చేసింది. హెలిప్యాడ్ కార్యకలాపాలు, ట్రాకింగ్, వాతావరణ నిఘా కేంద్రీకృత పర్యవేక్షణ కోసం సహస్రధార, సీతాపూర్‌లలో రెండు సమీకృత కమాండ్-కంట్రోల్-కమ్యూనికేషన్-సమన్వయ కేంద్రాలను (ఐ4సీ) ఏర్పరచారు.
‘ఐఎండీ’తో సన్నిహిత సమన్వయం ద్వారా వాతావరణ పర్యవేక్షణ సామర్థ్యం కూడా గణనీయంగా మెరుగుపడింది. వాతావరణ నిఘాను మరింత బలోపేతం చేయడం కోసం సీతాపూర్, కేదార్‌నాథ్, బద్రీనాథ్, ఝాలా, ఖర్సాలీలలో 5 ఆటోమేటిక్ వెదర్ అబ్జర్వేషన్ సిస్టమ్స్, సీలోమీటర్లను ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష, ముందస్సు వాతావరణ అంచనా సమాచారాన్ని హెలికాప్టర్ ఆపరేటర్లకు నిరంతరం చేరవేసేలా ‘ఏటీసీ’ అధికారులు చురుగ్గా వ్యవహరించారు.
చార్‌ధామ్ యాత్ర సమయంలో ప్రతి హెలికాప్టర్‌కు ట్రాకింగ్ పరికరాన్ని అమర్చి, ‘ఐ4సీ’ ద్వారా నిరంతర కేంద్రీకృత పర్యవేక్షణను కొనసాగించారు. ఇందుకోసం ఇప్పటికేగల కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌కు అదనంగా, 3 అదనపు వెరీ హై ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ సెట్లను సమకూర్చారు. తద్వారా కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేశారు.
నిరంతర నిఘా, ఆకస్మిక తనిఖీ, భద్రత పరిశీలన కోసం కీలక హెలిప్యాడ్‌ల వద్ద ప్రత్యేక ఫ్లైట్ ఆపరేషన్స్-ఎయిర్‌వర్దీనెస్ బృందాలను మోహరించడం ద్వారా ‘డీజీసీఏ’ నియంత్రణ- పర్యవేక్షణను గణనీయంగా పెంచింది. అలసట సంబంధిత కార్యాచరణ ప్రమాదాల నివారణ దిశగా పైలట్ల ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్‌డీటీఎల్)ను రోజువారీగా పర్యవేక్షించింది.
హిమాలయాల్లో హెలికాప్టర్ కార్యకలాపాల క్లిష్టతను గుర్తించిన ‘డీజీసీఏ’ పైలట్ అర్హత నిబంధనలను మరింత పకడ్బందీగా నిర్వచించింది. ఈ యాత్ర సమయంలో పనిచేసే పైలట్లకు, కొండ ప్రాంతాల్లో విమానం నడిపిన అనుభవం వ్యవధిని 750 గంటలుగా నిర్దేశించింది. ఇందులోనూ గత ఏడాది కాలంలో 100 గంటల అనుభవంసహా కేదార్‌నాథ్‌లో కనీసం 10 టేకాఫ్-ల్యాండింగ్ చేసి ఉండాలని నిబంధన విధించింది. తద్వారా, ఈ కఠిన వాతావరణంలో అనుభవజ్ఞులైన పైలట్లు మాత్రమే హెలికాప్టర్లను నడిపేలా జాగ్రత్తలు తీసుకుంది.
భద్రత పెంపు దిశగానూ అనేక అదనపు చర్యలు తీసుకున్నారు. ముఖ్యంఆ హెలికాప్టర్లలో ప్రయాణిక గరిష్ఠ సామర్థ్యాన్ని 70 శాతానికి పరిమితం చేశారు. చార్టర్ హెలికాప్టర్ కార్యకలాపాలను ఇదేవిధంగా హేతుబద్ధీకరించారు. పైలట్లకు స్పష్టంగా కనిపించేలా హై-టెన్షన్ ట్రాన్స్‌మిషన్ లైన్లకు విమానయాన భద్రత గుర్తులు, హెచ్చరిక బెలూన్లను అమర్చారు. ప్రయాణిక రాకపోకల సౌలభ్యం దిశగా నేలపై సమన్వయం మెరుగుకు అన్ని హెలిప్యాడ్‌లలో ఉమ్మడి గ్రౌండ్-హ్యాండ్లింగ్, క్రౌడ్-మేనేజ్‌మెంట్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు.
చివరగా పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోన్ నాయుడు మాట్లాడుతూ- “విమానయానంలో భద్రతకే మేం అగ్ర ప్రాధాన్యమిచ్చాం. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. భద్రత నిబంధనల ఉల్లంఘనను ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశాం. పవిత్ర చార్‌ధామ్ యాత్రకు వచ్చే లక్షలాది భక్తుల భద్రతకు సంపూర్ణ భరోసా ఇవ్వడమే మా ప్రథమ కర్తవ్యంగా పరిగణించాం” అన్నారు.
దేశవ్యాప్తంగా హెలికాప్టర్ భద్రత నిరంతర బలోపేతానికి తమ శాఖ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. భద్రత ప్రమాణాల విషయంలో రాజీపడకుండా అత్యంత కఠిన భౌగోళిక ప్రదేశాల్లో ‘చార్‌ధామ్ యాత్ర-2026’ తొలి దశ విజయవంతమయ్యేలా హెలికాప్టర్ కార్యకలాపాలను నిర్వహించామని చెప్పారు.
***
(रिलीज़ आईडी: 2278568)
आगंतुक पटल : 2