రక్షణ మంత్రిత్వ శాఖ
అమర సైనికులకు సముచిత గౌరవం
प्रविष्टि तिथि:
27 JUN 2026 7:47PM by PIB Hyderabad
ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆరుగురు వీర జవానులు చేసిన అత్యున్నత త్యాగాన్ని ఇటీవల కాలంలోనే మొదటిసారిగా గుర్తించారని లేదా బహిరంగంగా వెల్లడించారంటూ కొన్ని మీడియా వర్గాలలో, సోషల్ మీడియా వేదికలపై వస్తున్న కథనాలు కేవలం అపోహ మాత్రమేనని, అవి పూర్తిగా తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. మీడియా కథనాల్లో పేర్కొన్నదానికంటే చాలా ముందే, ఆ వీర జవానులకు దేశం ఘన నివాళులు అర్పించిందని అధికారికంగా స్పష్టం చేశారు. 2025 మే 11న జరిగిన అధికారిక విలేకరుల సమావేశంలోనే, అప్పటి మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ (డీజీఎంఓ) ఆ వీర సైనికులకు ఘన నివాళులు అర్పించారని, ఆపరేషన్ సింధూర్ విధి నిర్వహణలో వారు చేసిన త్యాగాన్ని ప్రత్యేకంగా కొనియాడారని పేర్కొన్నారు.
భారత సాయుధ దళాల అత్యున్నత సంప్రదాయాలకు అనుగుణంగా, దేశ రక్షణ కోసం వారు ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలకూ, చేసిన అత్యున్నత త్యాగానికి గానూ అధికారిక, జాతీయ స్థాయి గుర్తింపుగా ఈ వీర జవానులను శౌర్య పురస్కారాలతో సత్కరించడం జరిగిందని, దీనిపై 2025 ఆగస్టు 14న పత్రికా ప్రకటన కూడా వెలువడిందని స్పష్టం చేశారు.
దీనితో పాటే, ఎటువంటి ఆలస్యం లేకుండా భారత సైన్యానికి చెందిన అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా ఆ వీర జవానులకు ఘన నివాళులు అర్పించినట్టు పేర్కొన్నారు.
ఆ వీర జవానులకు దేశం నుంచి గుర్తింపు, గౌరవం ఆ తర్వాత కూడా నిరంతరాయంగా కొనసాగాయి. 2026 జనవరి 15న జైపూర్‌లో జరిగిన ఆర్మీ డే పరేడ్ సందర్భంగా ఆర్మీ చీఫ్ వారిలో ముగ్గురు వీర సైనికుల కుటుంబ సభ్యులకు సేవా పతకాలను అందజేశారు. అంతకుముందు 2025 అక్టోబర్ 8న జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా ఇలాగే పురస్కారాలను అందజేసి నివాళులర్పించారు. దేశ సేవలో ప్రాణాలర్పించిన వారిని సదా గౌరవించుకుంటామనే సాయుధ దళాల నిబద్ధతను ఈ కార్యక్రమాలు మరోసారి చాటిచెప్పాయి.
జాతీయ యుద్ధ స్మారకంపై వీరమరణం పొందిన జవానుల పేర్లను చెక్కే ప్రక్రియకు సంబంధించి ఈ పవిత్రమైన కార్యక్రమం ఒక నిర్దిష్టమైన, సుస్థిరమైన ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ పురస్కారానికి ఉన్న అత్యున్నత పవిత్రత, గౌరవాలకు అనుగుణంగా సాయుధ దళాలు అత్యంత శ్రద్ధతో, గౌరవపూర్వకంగా ఈ నిర్దేశిత విధివిధానాలను అనుసరిస్తాయి. కాబట్టి, ఈ విషయంలో సరైన ప్రక్రియను అనుసరించలేదంటూ వస్తున్న వార్తలు లేదా ఊహాగానాలు పూర్తిగా వాస్తవ విరుద్ధం.
ఈ విషయమై ఎటువంటి ఆధారం లేని, అనవసరమైన వివాదాన్ని సృష్టించడం అత్యంత విచారకరమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇలాంటి తప్పుడు కథనాలు వాస్తవాలను వక్రీకరించడమే కాకుండా దేశం కోసం అత్యున్నత త్యాగాలు చేసిన వీరుల కుటుంబాలకు తీరని మనోవేదన మిగులుస్తాయని, అలాగే ఆ అమరవీరుల గౌరవాన్ని, ప్రతిష్టను తగ్గించేలా ఉంటాయని ఆ వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి. వీరమరణం పొందిన సైనికులకు సంబంధించిన విషయాలపై వార్తలను ప్రసారం చేసేటప్పుడు మీడియా, సామాజిక మాధ్యమాలతో పాటు భాగస్వాములందరూ అత్యంత బాధ్యతాయుతంగా, సంయమనంతో వ్యవహరించాలని, ఎలాంటి అధికారిక ధృవీకరణ లేని సమాచారాన్ని ప్రచారంలోకి తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.
దేశ రక్షణ కోసం అత్యున్నత త్యాగాలు చేసిన ప్రతి సైనికుడిని గౌరవించుకోవడంలో భారత సాయుధ దళాలు ఎల్లప్పుడూ అచంచలమైన నిబద్ధతతో ఉంటాయని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ లో వీరమరణం పొందిన ఆరుగురు జవాన్లు దేశానికి నిజమైన వీరులు. వారి ధైర్యసాహసాలు, విధి నిర్వహణ పట్ల వారికున్న అంకితభావం, వారి త్యాగం రాబోయే తరాల భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. వారి స్మృతికి దేశం ఎల్లప్పుడూ తగిన గౌరవంతో, కృతజ్ఞతతో, భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.
***
(रिलीज़ आईडी: 2278536)
आगंतुक पटल : 11