నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘కౌశల్ మహోత్సవ్ – వరంగల్ 2026’లో తెలంగాణకు చెందిన 1,000 మందికి పైగా యువతకు ఉద్యోగాలు

प्रविष्टि तिथि: 27 JUN 2026 7:31PM by PIB Hyderabad

వరంగల్‌లోని కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో (కిట్స్) కేంద్ర నైపుణ్యాభివృద్ధి- వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డీఈ), తెలంగాణ ప్రభుత్వం, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌డీసీ) సంయుక్తంగా ‘కౌశల్ మహోత్సవ్ – వరంగల్ 2026’ పేరిట నిర్వహించిన మెగా జాబ్ మేళాలో తెలంగాణ వ్యాప్తంగా 1,000 మందికి పైగా నిరుద్యోగ యువతీయువకులు ఉద్యోగ నియామక పత్రాలను అందుకున్నారు. ఈ ఒకరోజు కార్యక్రమం స్పాట్ ఇంటర్వ్యూలు, నియామకాలు, అప్రెంటిస్‌షిప్ అవకాశాలు, ఉద్యోగ జీవన మార్గదర్శకత్వం ద్వారా నైపుణ్యం కలిగిన యువతను పరిశ్రమలతో అనుసంధానించడానికి ఒక అద్భుతమైన వేదికగా నిలిచింది.

ఈ మహోత్సవానికి వరంగల్, దాని పరిసర జిల్లాల యువత నుంచి విశేష స్పందన లభించింది. ఈ ఉద్యోగ మేళా కోసం 4,500 మందికి పైగా అభ్యర్థులు నమోదు చేసుకోగా 2,200 మందికి పైగా అభ్యర్థులు ప్రత్యక్ష నియామక ప్రక్రియలో పాల్గొన్నారు. అభ్యర్థులు వివిధ రంగాలకు చెందిన 90కి పైగా ప్రముఖ కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ సంస్థలు ఉమ్మడిగా వివిధ రంగాల్లో వేలాది ఉపాధి అవకాశాలను అందించాయి. 

ఈ ప్రత్యక్ష నియామక ప్రక్రియలో ఎంపిక కాని అభ్యర్థులను కూడా సదరు కంపెనీలు పరిశీలనలోకి తీసుకుంటాయి. కంపెనీల నియామక ప్రక్రియలో భాగంగా వారి దరఖాస్తులను మరింతగా విశ్లేషించి అర్హులైన అభ్యర్థులను తదుపరి ఎంపిక ప్రక్రియల కోసం నేరుగా సంప్రదించనున్నారు. 

రోజంతా జరిగిన ఈ ప్రక్రియలో తయారీ, వాహనాలు, రవాణా, వస్త్రాలు, రిటైల్, వైద్యారోగ్యం, ఐటీ-ఐటీఈఎస్, టెలికాం, పర్యాటకం- ఆతిథ్యం, బ్యాంకింగ్- ఆర్థిక సేవలు- బీమా (బీఎఫ్ఎస్ఐ) వంటి పలు రంగాల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగ పత్రాలను అందించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన వారి నుంచి ఐటీఐ పూర్తి చేసిన వారు, డిప్లొమా కలిగిన వారు, డిగ్రీ పూర్తి చేసిన వారు, నైపుణ్యం కలిగిన నిపుణుల వరకు వివిధ విద్యా నేపథ్యాల అభ్యర్థులకు ఈ ఉద్యోగ మేళా ఎంతో ఉపయోగపడింది. అన్ని పరిశ్రమల్లో నైపుణ్యం కలిగిన వారికి ఉన్న డిమాండ్‌ను ఈ కార్యక్రమం మరోసారి తెలియజేసింది. 

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, కిట్స్ కళాశాల ఛైర్మన్ శ్రీ వీ. సతీష్ కుమార్.. వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కే.ఆర్. నాగరాజు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీ కపిలవాయి దిలీప్ కుమార్,  తెలంగాణ ఆర్‌డీఎస్‌డీఈ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీ రవి చిలుకోటి (ఐఎస్‌డీఎస్), వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీ సున్‌ప్రీత్ సింగ్ (ఐపీఎస్), తెలుగు అకాడమీ ఛైర్మన్ ప్రొఫెసర్ కురపాటి వెంకటనారాయణ, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ శాఖ మాజీ డీన్ శ్రీ గాలి వినోద్ కుమార్,  యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ శ్రీ చంద్రశేఖర్, కిట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే. అశోక రెడ్డి‌లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రముఖులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. దీనితో పాటు యువతకు ఉపాధి అవకాశాలను పెంచటం… ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యాలను మరింత పటిష్ఠం చేయడం గురించి చెప్పారు. నైపుణ్యం కలిగిన యువతకు నాణ్యమైన ఉపాధిని అందించడంలో ‘కౌశల్ మహోత్సవ్’ వంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని.. నైపుణ్యంతో కూడిన సాధికారత కలిగిన స్వయంసమృద్ధ భారత్ నిర్మించాలనే స్వప్నాన్ని సాకారం చేయడంలో ఇవి ఎంతగానో దోహదపడతాయని వారు పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి- వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డీఈ) డైరెక్టర్ శ్రీ వీ. ఎస్. అరవింద్ మాట్లాడుతూ... "వరంగల్ కౌశల్ మహోత్సవ్‌కు అద్భుతమైన స్పందన లభించింది. దీని కోసం 4,500 మందికి పైగా యువత నమోదు చేసుకోగా 2,200 మందికి పైగా అభ్యర్థులు ప్రత్యక్ష నియామక ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ మహోత్సవానికి హాజరైన వారిలో దాదాపు 50 శాతం మంది అంటే 1,000 మందికి పైగా అభ్యర్థులు ఇప్పటికే ఉద్యోగ పత్రాలను అందుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ కార్యక్రమం ముగిసినప్పటికీ నియామక ప్రక్రియ ఇక్కడితో ఆగిపోదు. ఇందులో పాల్గొన్న కంపెనీలు అభ్యర్థుల దరఖాస్తులను మరింతగా పరిశీలించి అర్హులైన వారిని తదుపరి ఎంపిక ప్రక్రియల కోసం నేరుగా సంప్రదిస్తాయి" అని వ్యాఖ్యానించారు. 

***


(रिलीज़ आईडी: 2278535) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil