పార్లమెంటరీ వ్యవహారాలు
కేంద్రీయ విద్యాలయాల స్థాయి ‘36వ జాతీయ యువజన పార్లమెంటు పోటీ 2025-26’ విజేతలకు శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ బహుమతి ప్రదానం
ప్రజాస్వామ్య విలువలు.. పార్లమెంటరీ నైతికత.. జాతీయ సామరస్యాన్ని అలవరచుకోవాలని యువతరానికి కేంద్ర
మంత్రి పిలుపు
న్యూఢిల్లీ ఉత్తర మండలంలోని ప్రెసిడెంట్ ఎస్టేట్‌లోగల ‘డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయానికి ప్రథమ బహుమతి
प्रविष्टि तिथि:
25 JUN 2026 8:05PM by PIB Hyderabad
దేశంలోని కేంద్రీయ విద్యాలయాల స్థాయిలో నిర్వహించిన 36వ జాతీయ యువజన పార్లమెంటు పోటీ 2025–26 విజేతలకు ఈ రోజు న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవన ప్రాంగణంలోని గ్రంథాలయ భవనంలోగల జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు.

చట్టం-న్యాయ వ్యవహారాలు (స్వతంత్ర బాధ్యత), పార్లమెంటరీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులతోపాటు కేంద్రీయ విద్యాలయాలకు ఆయన బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ- పార్లమెంటరీ విధానాలను అద్భుతంగా ప్రదర్శించిన విద్యార్థులను అభినందించారు. దేశ ప్రగతికి మాత్రమేగాక భవిష్యత్తుకూ వారే నాయకులని పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం స్ఫూర్తిదాయక సందేశాన్ని గుర్తుచేస్తూ- విద్యార్థులు సమున్నత స్థాయికి చేరడంపై కలలుగనాలని, వాటిని లక్ష్యంగా మార్చుకుని, సాకారం చేసుకునే దిశగా స్పష్టమైన ప్రణాళికతో కృషి చేయాలని ఉద్బోధించారు. దేశ పురోగమనంలో విద్యార్థులు అర్థవంతంగా కృషి చేయగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్తు ప్రయత్నాలన్నింటా వారు తిరుగులేని విజయం సాధించాలని ఆకాంక్షించారు.

అలాగే, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఆరోగ్యకర జీవనశైలిని అలవరచుకునేలా అందరినీ ఉత్తేజపరుస్తూ-‘లైఫ్’ (పర్యావరణం కోసం జీవనశైలి) కార్యక్రమాన్ని అనుసరిస్తామని మంత్రి ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ యువజన పార్లమెంటు పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకున్న న్యూఢిల్లీలోని ప్రెసిడెంట్ ఎస్టేట్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయ (ఢిల్లీ ప్రాంతం, ఉత్తర జోన్) విద్యార్థులు తమ ప్రతిభను అందరి సమక్షంలో మరోసారి ప్రదర్శించి, హాజరైన ప్రముఖులందరి ప్రశంసలను అందుకున్నారు.

విద్యార్థుల ప్రతిభాపాటవాలు అద్భుతమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ నికుంజ బిహారీ ధల్ తన ప్రసంగంలో కొనియాడారు. చట్టసభ హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడుతూ, పార్లమెంటరీ విధానాలపై తమకుగల అవగాహనను వారు ప్రశంసనీయంగా ప్రదర్శించారని పేర్కొన్నారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులందరూ పార్లమెంటరీ నియమ నిబంధనలపై తమ పరిజ్ఞానాన్ని చాటుకోవడంతోపాటు ఆత్మవిశ్వాసంతో కూడిన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారని ఆయన అభినందించారు.

యువతరంలో ప్రజాస్వామ్య విలువలను పాదుకొల్పే దిశగా యువజన పార్లమెంట్ పోటీల నిర్వహణ ఓ కీలక వేదికని శ్రీ ధల్ అన్నారు. ఏటా సుమారు 200 కేంద్రీయ విద్యాలయాలు ఈ పోటీలలో పాల్గొంటున్నాయని, దీని పరిధిని 250-300 విద్యాలయాలకు విస్తరించే దిశగా మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
బహుమతి ప్రదానోత్సవానికి హాజరైన ప్రముఖులకు, ఆహూతులకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ సత్య ప్రకాష్ సాదర స్వాగతం పలికారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలతో చురుగ్గా మమేకమై వాటిని నిలబెట్టాలని విద్యార్థులను ప్రోత్సహించారు. భారత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తూ- కృత్రిమ మేధ, ఆవిష్కరణ, సాంకేతికత, పరిశోధన వంటి పురోగమన రంగాల్లో దేశానికి నాయకత్వం వహించాలని ఆయన విద్యార్థులను కోరారు. తద్వారా భారత్ కేవలం వస్తుసేవలందించేదిగా కాకుండా ఆలోచనలు, జ్ఞానం, అత్యాధునిక సాంకేతికతలకు ప్రపంచ కూడలిగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను, ప్రజాస్వామ్య విలువలను పాదుకొల్పడంలో యువజన పార్లమెంటు కార్యక్రమం పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అదనపు కమిషనర్ (అకడమిక్) శ్రీమతి చందన మండల్ కూడా సభనుద్దేశించి ప్రసంగించారు. యువజన పార్లమెంట్ కార్యక్రమం వేలాది విద్యార్థులకు ఒక ప్రత్యేక అభ్యసన అవకాశాన్నిచ్చే అద్భుత కార్యక్రమమని అభివర్ణించారు. ఇది పార్లమెంటరీ పద్ధతులను పరిచయం చేయడమే కాకుండా, వారి భిన్నాభిప్రాయాలను ఓపికగా వింటుందన్నారు. అంతేగాక నిర్మాణాత్మక సంభాషణలో పాల్గొనే దిశగా కీలక జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుందని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల సంపూర్ణ వికాసానికి యువజన పార్లమెంటు పోటీల ద్వారా సాగుతున్న గణనీయ కృషిని ఆమె ప్రశంసించారు.

ఈ ఏడాది 25 ప్రాంతాల్లోని 200 కేంద్రీయ విద్యాలయాల మధ్య నిర్వహించిన పోటీలో ప్రాంతీయ విజేతలు జోనల్/జాతీయ స్థాయిలలో తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ జాతీయ స్థాయి పోటీలో ప్రథమ స్థానం సాధించిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయం, (ప్రెసిడెంట్ ఎస్టేట్, న్యూఢిల్లీ, ఉత్తర జోన్)కు “సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ రన్నింగ్ పార్లమెంటరీ షీల్డ్”తోపాటు జాతీయ జ్ఞాపికను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విజేత విద్యాలయం తమ ప్రతిభను మరోసారి ప్రదర్శించి, అందర్నీ అలరించడంతో సభికులు ఎంతగానో ప్రశంసించారు.
జోనల్ స్థాయిలో జ్ఞాపికలు అందుకున్న విద్యాలయాల జాబితా ఇలా ఉంది:
1. కేంద్రీయ విద్యాలయ, మధుర కంటోన్మెంట్, మథుర, ఉత్తరప్రదేశ్ (ఆగ్రా ప్రాంతం)-వెస్ట్ జోన్
2. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నం.1 ఏఎఫ్‌ఎస్, మధురై, (చెన్నై ప్రాంతం)-సౌత్ జోన్
3. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నం.2, శివాజీ నగర్, భోపాల్ (భోపాల్ ప్రాంతం)-సెంట్రల్ జోన్
4. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, బోర్ఝర్ గౌహతి (గౌహతి ప్రాంతం)- ఈస్ట్ జోన్
ప్రాంతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన 20 విద్యాలయాల జాబితా ఇలా ఉంది:
1. కేంద్రీయ విద్యాలయ నం.2, అఖ్నూర్, – జమ్మూ ప్రాంతం
2. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ కపుర్తలా కంటోన్మెంట్- చండీగఢ్ ప్రాంతం
3. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, సోలన్ - గుర్గావ్ ప్రాంతం
4. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, పితోరాగఢ్ - డెహ్రాడూన్ ప్రాంతం
5. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, సబర్మతి - అహ్మదాబాద్ ప్రాంతం
6. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నం.1, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, సూరత్‌గఢ్,- జైపూర్ ప్రాంతం
7. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నం.1, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, పూణే - ముంబై ప్రాంతం
8. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, టాటానగర్, తూర్పు సింగ్‌భూమ్ - రాంచీ ప్రాంతం
9. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నం. 1, సత్నా - జబల్‌పూర్ ప్రాంతం
10. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ సీఆర్‌పీఎఫ్, పల్లిపురం, తిరువనంతపురం - ఎర్నాకులం ప్రాంతం
11. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, నెల్లూరు - హైదరాబాద్ ప్రాంతం
12.పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నం. 1, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, సాంబ్రా - బెంగళూరు ప్రాంతం
13.పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నం.1, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చకేరి, కాన్పూర్ - లక్నో ప్రాంతం
14.పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, దానాపూర్ కాంట్., పాట్నా - పాట్నా ప్రాంతం
15.పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నం.2, ఎన్‌టీపీసీ, కోర్బా - రాయ్‌పూర్ ప్రాంతం
16.పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, బీహెచ్‌యూ క్యాంపస్ (ఎఫ్‌ఎస్), వారణాసి - వారణాసి ప్రాంతం
17.కేంద్రీయ విద్యాలయ నం.1 ఇంఫాల్ - టిన్సుకియా ప్రాంతం
18.పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, బల్లిగంజ్, కోల్‌కతా - కోల్‌కతా ప్రాంతం
19.కేంద్రీయ విద్యాలయ ఓఎన్‌జీసీ, శ్రీకోన - సిల్చార్ ప్రాంతం
20. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, బార్గర్, భువనేశ్వర్ - భువనేశ్వర్ ప్రాంతం

కార్యక్రమంలో చివరగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ శ్రీ ఎ.బి.ఆచార్య వందన సమర్పణ చేశారు. పోటీలను విజయవంతం చేయడంలో విలువైన సహకారాన్ని అందించిన విశిష్ట అతిథులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, కేంద్రీయ విద్యాలయ సంఘటన్, మంత్రిత్వ శాఖ అధికారులు, ఇతర భాగస్వాములందరికీ కృతజ్ఞతలు తెలిపారు. యువజన పార్లమెంటులో ఉత్సాహంగా పాల్గొన్న పాఠశాలలు, ప్రశంసనీయ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులను ఆయన అభినందించారు.
***
(रिलीज़ आईडी: 2278174)
आगंतुक पटल : 7