విద్యుత్తు మంత్రిత్వ శాఖ
బ్రిక్స్- 2026 అధ్యక్ష స్థానంలో 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశాన్ని గురుగ్రామ్‌లో నిర్వహించిన భారత్
దేశ పరిస్థితులు, అభివృద్ధి ప్రాధాన్యాలు, ఇంధన మార్గాలను గౌరవించాల్సిన ఆవశ్యకతను పునరుద్ఘాటించిన బ్రిక్స్ ఇంధన మంత్రులు
బ్రిక్స్ దేశాల సమష్టి సంకల్పాన్నీ, ఏకాభిప్రాయాన్నీ చాటేలా.. 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల ఉమ్మడి ప్రకటన ఆమోదంతో ముగిసిన సమావేశం
స్మార్ట్ గ్రిడ్లు, ఇంధన నిల్వ కోసం బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం.. భారత్ అధ్యక్షతన కీలక ఫలితం
प्रविष्टि तिथि:
25 JUN 2026 3:19PM by PIB Hyderabad
‘పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత’ అన్న ప్రధాన ఇతివృత్తంతో 2026 జూన్ 25న హర్యానాలోని గురుగ్రామ్‌లో 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశాన్ని అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్ విజయవంతంగా నిర్వహించింది.
అంతర్జాతీయ ఇంధన రంగంలోని కీలక సవాళ్లు, అవకాశాలపై చర్చించడంతోపాటు.. ఆయా దేశాల మధ్య ఆచరణాత్మక సహకారాన్ని పెంపొందించడంపై బ్రిక్స్ సభ్య దేశాల ఇంధన మంత్రులు, ఉప మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. వీరితోపాటు అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ), అంతర్జాతీయ జీవ ఇంధన కూటమి (జీబీఏ), న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) సహా ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.
ఇంధన విభాగం ప్రధాన నినాదమైన ‘సర్వేషాం ఊర్జం (అందరికీ ఇంధనం)’ ఆధారంగా నిర్వహించిన ఈ చర్చల్లో మూడు ప్రాధాన్య రంగాలపై దృష్టిని కేంద్రీకరించారు.
ప్రాధాన్యం 1: ఇంధన భద్రత, సుస్థిరత – పటిష్టమైన ఇంధన వ్యవస్థలు, విభిన్న ఇంధన వనరులు, కీలక ఖనిజాలు, పటిష్టమైన సరఫరా వ్యవస్థ, గ్రిడ్ ఆధునికీకరణ, ఇంధన నిల్వ, సురక్షిత, అందుబాటు ధరల్లో ఇంధన సరఫరా వంటి అంశాలపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు.
ప్రాధాన్యం 2: ఇంధన లభ్యత, సమాన అవకాశాలు – అందుబాటు ధరల్లో, నమ్మకమైన, సుస్థిర, ఆధునిక ఇంధన వసతులను అందరికీ అందుబాటులో తేవడం, కాలుష్య రహిత వంట ఇంధన విధానాలు, తక్కువ వడ్డీకి ఆర్థిక సాయం, నైపుణ్యాభివృద్ధి, వర్ధమాన మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు మద్దతును అందించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ప్రాధాన్యం 3: సాంకేతికత, ఆవిష్కరణ – స్మార్ట్ గ్రిడ్లు, ఇంధన నిల్వ, హైడ్రోజన్ రంగంలోని ప్రతీ దశ, ఇంధన వ్యవస్థల డిజిటలీకరణ, కృత్రిమ మేధ, ఇంధన సామర్థ్యం, జీవ ఇంధనాలు, కర్బన శోషణ సాంకేతికతలు, బ్రిక్స్ దేశాల నడుమ పరిశోధన - ఆవిష్కరణల సహకారాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు.
జాతీయ పరిణామాలు, అభివృద్ధి ప్రాధాన్యాలు, ఇంధన మార్గాలను గౌరవించాల్సిన ఆవశ్యకతను బ్రిక్స్ దేశాల ఇంధన మంత్రులు పునరుద్ఘాటించారు.
ఇంధన భద్రత, సుస్థిరత, ఆవిష్కరణ, పటిష్టమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై బ్రిక్స్ దేశాల సమష్టి సంకల్పాన్నీ, ఏకాభిప్రాయాన్నీ చాటేలా.. 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల ఉమ్మడి ప్రకటనను ఆమోదించడంతో ఈ సమావేశం ముగిసింది.
భారత ఇంధన పరివర్తన, అంతర్జాతీయ స్థాయి నేతృత్వం
ఈ మంత్రుల సమావేశాన్నుద్దేశించి కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ప్రసంగిస్తూ.. ఆర్థిక వృద్ధికీ, సామాజిక పురోగతికీ, మానవాభివృద్ధికీ ఇంధనమే పునాది అన్నారు. ప్రజల న్యాయబద్ధ ఆకాంక్షలను నెరవేరుస్తూ సుస్థిరాభివృద్ధిని సాధించడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన సమయం, వనరులు, విధానపరమైన స్వేచ్ఛ అవసరమని ఆయన స్పష్టం చేశారు. ‘సర్వేషాం ఊర్జం (అందరికీ ఇంధనం)’ అనే నినాద మార్గనిర్దేశంలో.. పటిష్టమైన, భవిష్యత్ అవసరాలకు తగిన, ప్రజలే కేంద్రంగా సాగే ఇంధన వ్యవస్థల నిర్మాణానికి భారత్ కట్టుబడి ఉందన్నారు.

గత దశాబ్ద కాలంలో ఇంధన రంగంలో భారత్ సాధించిన విశేష పురోగతిని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. దేశంలో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం దాదాపు 540 గిగావాట్లకు చేరుకుందనీ, ఇందులో సగానికి పైగా శిలాజేతర వనరుల నుంచే లభిస్తోందని పేర్కొన్నారు. విద్యుదుత్పత్తి, వినియోగంలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించిందని తెలిపారు. దేశంలో శుద్ధ ఇంధన విస్తరణ వేగంగా జరుగుతోందన్నారు. 2014లో మూడు గిగావాట్లుగా ఉన్న సౌర విద్యుత్ సామర్థ్యం.. నేడు 154 గిగావాట్లకు పైగా పెరిగిందని ఆయన వివరించారు. ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాల ఏర్పాటును వేగవంతం చేయడంలోనూ, ఇంధన పరివర్తనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడంలోనూ ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’ వంటి ప్రతిష్టాత్మక పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
2032 నాటికి 400 జీడబ్ల్యూహెచ్‌కు పైగా నిల్వ సామర్థ్యాన్నీ, 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్నీ సాధించాలన్న భారత్ లక్ష్యాలను మంత్రి ఈ సందర్భంగా వివరించారు. వీటితోపాటు పెట్రోలులో 20 శాతం ఇథనాల్ మిశ్రణ లక్ష్యాన్ని నిర్ణీత గడువు కన్నా ముందే భారత్ విజయవంతంగా చేరుకుందని గుర్తుచేశారు. అంతర్జాతీయ జీవ ఇంధన కూటమి, అంతర్జాతీయ సౌర కూటమి వంటి వేదికలపై భారత నాయకత్వ పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు.
బ్రిక్స్‌కు భారత్ అధ్యక్షత సందర్భంగా సాధించిన విజయాలు
బ్రిక్స్ ఇంధన పరిశోధన సహకార వేదిక (ఈఆర్‌సీపీ) పరిధిలో ‘స్మార్ట్ గ్రిడ్లు, ఇంధన నిల్వ కోసం బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (https://brics-dcoe.global/)ను ప్రారంభించడం... భారత్ అధ్యక్షతన జరిగిన సదస్సులో ఒక కీలకమైన విజయంగా పేర్కొనవచ్చు. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య విజ్ఞానాన్ని పంచుకోవడానికి, నైపుణ్యాభివృద్ధికి, అత్యుత్తమ విధానపరమైన, నియంత్రణ పద్ధతులపై చర్చించుకోవడానికి, ప్రయోగాత్మక కార్యక్రమాల రూపకల్పనకు స్వచ్ఛంద సహకార వేదికగా ఈ కేంద్రం ఉపయోగపడుతుంది.
‘స్మార్ట్ గ్రిడ్లు, ఇంధన నిల్వపై బ్రిక్స్ మార్గదర్శక సూత్రాలను ఆమోదించడం ఈ సమావేశంలో మరొక ముఖ్యాంశం. పునరుత్పాదక ఇంధనం, సరికొత్త సాంకేతికతల అనుసంధానాన్ని సులభతరం చేస్తూ.. నమ్మకంగా, తక్కువ ధరల్లో ఇంధనాన్ని అందించడంలో ఆధునిక, పటిష్టమైన, డిజిటల్ ఆధారిత వ్యవస్థల ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ ఈ మార్గదర్శకాలను రూపొందించారు.
హైడ్రోజన్ సాంకేతికతలు, ప్రమాణాలు, పారిశ్రామిక వినియోగం, భవిష్యత్ వ్యవస్థాగతత్వంపై సహకారాన్ని బలోపేతం చేయడంలో పునాదిగా నిలిచే.. ‘హైడ్రోజన్ వ్యవస్థలపై బ్రిక్స్ ఉమ్మడి నివేదిక- 2026’కు తుది రూపం ఇచ్చేందుకు జరుగుతున్న నిరంతర ప్రయత్నాలను మంత్రులు అభినందించారు.
బ్రిక్స్ దేశాల మధ్య పరిశోధన, సాంకేతిక సహకారం, పరస్పర వైజ్ఞానిక వినిమయానికి సంబంధించి సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో... ‘బ్రిక్స్ ఇంధన పరిశోధన సహకార వేదిక (ఈఆర్‌సీపీ) నవీకరించిన నిబంధనల పత్రాన్ని ఈ సమావేశం ఆమోదించింది.
భారత్ అధ్యక్షతన ‘ఇంధన రంగంలో ఉన్నతాధికారుల’ స్థాయిలో జరిగిన పలు విడతల సంప్రదింపులు.. ఈ 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశం విజయవంతమైన ఫలితాలను రాబట్టడంలో ఎంతగానో దోహదపడ్డాయి. ప్రాధాన్యతా రంగాలపై సుదీర్ఘమైన చర్చలకూ, ఏకాభిప్రాయ సాధనకూ ఈ చర్చలు మార్గం సుగమం చేశాయి. తద్వారా మంత్రుల సమావేశంలో కీలక ఫలితాలను సాధించడానికి అనువైన సానుకూల వాతావరణానికి దోహదపడ్డాయి.
ఇంధన రంగ ఉన్నతాధికారుల సమావేశంలో భాగంగా.. కాలుష్య రహిత బొగ్గు సాంకేతికతలు, విద్యుత్ పరికరాల ప్రమాణాలను పెంపొందించడమనే రెండు అనుబంధ కార్యక్రమాలను కూడా భారత్ నిర్వహించింది. బ్రిక్స్ సభ్య దేశాల ఉన్నతాధికారులు, విధాన నిర్ణేతలు, పారిశ్రామిక ప్రముఖులు, నిపుణులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. బ్రిక్స్ దేశాల్లో ఇంధన భద్రత, సుస్థిరత, ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడానికి అవసరమైన అనుభవాలనూ, ఉత్తమ పద్ధతులనూ, వినూత్న విధానాలనూ పరస్పరం పంచుకోవడానికి ఇది వేదికగా నిలిచింది.
ఇంధన భద్రత, సమాన అవకాశాలు, ఆవిష్కరణల పట్ల సమష్టి నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ సంయుక్త ప్రకటన
బ్రిక్స్ సహకారానికి ఇంధన భద్రత మూలాధారంగా ఉంటుందని సంయుక్త ప్రకటన పునరుద్ఘాటించింది. వైవిధ్యభరితమైన, పటిష్టమైన, పారదర్శకమైన ఇంధన వ్యవస్థలు, సరఫరా వ్యవస్థల ఆవశ్యకతను స్పష్టం చేసింది.
సురక్షిత, విశ్వసనీయ, అందుబాటు ధరల్లో లభించే, సుస్థిర ఇంధన లభ్యత... ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పన, పారిశ్రామికీకరణ, మానవ గౌరవానికి అత్యంత ప్రాథమికమైనదని మంత్రులు స్పష్టం చేశారు.
అందరికీ అందుబాటులో ఉండేలా తక్కువ వడ్డీతో ఆర్థిక సాయం అందాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటిస్తూ... సమతౌల్యం, వివిధ ఇంధన వనరుల సమ్మేళనం, కాలుష్య రహిత - సమర్థమైన ఇంధన సాంకేతికతలకు ప్రోత్సాహం వంటి అంశాల ప్రాధాన్యాన్ని మంత్రులు ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే శిలాజ ఇంధనాల్లో సరికొత్త సాంకేతికతలు, పునరుత్పాదక ఇంధనం, బయోఫ్యూయల్స్, జీవ ఇంధనాలు, హైడ్రోజన్, ఇంధన నిల్వ, కీలక ఖనిజాలు, కర్బన శోషణ సాంకేతికతలు, డిజిటలీకరణ, ఇంధన సామర్థ్యం వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతనూ వారు ప్రస్తావించారు.
భవిష్యత్ ఇంధన వ్యవస్థల రూపకల్పనలో పరిశోధనల ప్రాధాన్యాన్నీ, యువత భాగస్వామ్య పాత్రను గుర్తిస్తూ... భారత్ అధ్యక్షత వహిస్తున్న ఈ సమయంలో ‘బ్రిక్స్ యువజన ఇంధన సదస్సు’ నిర్వహణకు మంత్రులు మద్దతు తెలిపారు. బ్రిక్స్ ఇంధన పరిశోధన సహకార వేదిక ద్వారా పరస్పర సహకారాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని వారు పునరుద్ఘాటించారు.
11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించడంలో భారత్ కృషినీ, తన అధ్యక్ష కాలంలో బ్రిక్స్ దేశాల మధ్య ఇంధన సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రదర్శించిన నాయకత్వ పటిమనూ సభ్య దేశాల మంత్రులు ఈ సందర్భంగా అభినందించారు. సురక్షిత, తక్కువ ధరల్లో లభించే, సుస్థిర, పటిష్టమైన ఇంధన వ్యవస్థలను రూపొందించుకునే దిశగా.. పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామనీ, 2027లో చైనా అధ్యక్షతన జరగబోయే కార్యక్రమంలో ఈ సహకారాన్ని కొనసాగిస్తామనీ వారు స్పష్టం చేశారు.
***
(रिलीज़ आईडी: 2278171)
आगंतुक पटल : 8