ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వైద్య సంస్థల చట్టంలో జనవిశ్వాస్ సవరణలను ప్రవేశపెట్టిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ... నిబంధనల భారాన్ని తగ్గించడం, నియంత్రణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం


జనవిశ్వాస్ సంస్కరణల్లో భాగంగా వైద్య సంస్థల చట్టం - 2010లోని అయిదు నిబంధనల హేతుబద్ధీకరణ

प्रविष्टि तिथि: 25 JUN 2026 1:21PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా రోగుల భద్రతను, వైద్య సేవల్లో నాణ్యతను ఎప్పటికప్పుడు కాపాడుతూనే.., నమ్మకమే ప్రాతిపదికగా పాలనను ప్రోత్సహించడం, నిబంధనల భారాన్ని తగ్గించడం, వాణిజ్య సౌలభ్యాన్ని మెరుగుపరచడం, తగిన రీతిలో నియంత్రణల అమలు లక్ష్యాలుగా కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా 2026 ఏప్రిల్ 8న అధికారిక గెజిట్‌లో ప్రచురించిన జనవిశ్వాస్ (నిబంధనల సవరణ) చట్టం- 2026కు అనుగుణంగా... కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 22న వైద్య సంస్థల (నమోదు, నియంత్రణ) చట్టం- 2010’కి సవరణలను ప్రకటించింది.

జనవిశ్వాస్ (నిబంధనల సవరణ) చట్టం – 2026 ద్వారా 23 మంత్రిత్వ శాఖలు, విభాగాల పరిధిలోని 79 కేంద్ర చట్టాల్లోని నిబంధనలను ప్రభుత్వం హేతుబద్ధీకరించింది. ఆరోగ్య రంగంలో చిన్న చిన్న విధివిధానాల ఉల్లంఘనలను క్రిమినల్ నేరాలుగా పరిగణించకుండా మినహాయించడం, ప్రజలే కేంద్రంగా నియంత్రణ పద్ధతులను బలోపేతం చేయడం లక్ష్యంగా... ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని అయిదు చట్టాల్లో 35 నిబంధనలను సవరించారు. మరింత బాధ్యతాయుతమైన, సహాయక నియంత్రణ వ్యవస్థను నెలకొల్పే లక్ష్యంతో చేపట్టిన ఈ విస్తృత స్థాయి సంస్కరణల్లో భాగంగానే... వైద్య సంస్థల చట్టం - 2010కి ఈ తాజా సవరణలను ప్రకటించారు.

సవరించిన నిబంధనల ప్రకారం... ఈ చట్టంలోని 40, 43, 46 సెక్షన్లలో ఉన్న జరిమానా (ఫైన్) అనే పదం స్థానంలో అపరాధ రుసుము (పెనాల్టీ) అనే పదాన్ని చేర్చారు. తద్వారా నిబంధనల అమలు ప్రక్రియ క్రిమినల్ విచారణ పరిధి నుంచి పరిపాలనాపరమైన విచారణ పరిధిలోకి వస్తుంది. అలాగే కంపెనీలు చేసే నిబంధనల ఉల్లంఘనల తీవ్రతను బట్టి వాటి స్వభావానికి తగ్గ క్రమబద్ధమైన, తగిన అపరాధ రుసుములను (పెనాల్టీ) విధించే విధంగా... సెక్షన్- 44ను సవరించారు. దీనితోపాటు మరింత పారదర్శకమైన, సమర్థమైన, జవాబుదారీతనంతో కూడిన విచారణను పెంపొందించడం కోసం... సెక్షన్- 41 కింద ఉన్న న్యాయ నిర్ణాయక అధికార యంత్రాంగాన్ని బలోపేతం చేసింది. అంతేకాకుండా 40, 43, 44 సెక్షన్ల పరిధిలోని విచారణలనూ దీని పరిధిలోకి తేవడంతో... పారదర్శకంగా, సమర్థంగా, జవాబుదారీతనంతో వాటి అమలు సాధ్యపడుతుంది.

ఒక వ్యవస్థీకృత విచారణ ప్రక్రియకు కూడా ఈ సవరణలు వీలు కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా పెనాల్టీలు విధించడానికి ముందు సదరు సంస్థకు తమ వాదనను వినిపించే అవకాశం ఇవ్వడం, పెనాల్టీల రికవరీ కోసం ప్రత్యేక యంత్రాంగాల ఏర్పాటు, బాధితులు అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ చర్యల ద్వారా వైద్య సంస్థలపై ప్రభుత్వ పర్యవేక్షణను నిరంతరం కొనసాగిస్తూనే... ఈ కొత్త చర్యల ద్వారా సంస్థలు స్వచ్ఛందంగా నిబంధనలను పాటించేలా ప్రోత్సహించడం, అనవసరమైన కోర్టు వ్యాజ్యాలను తగ్గించడం, చిన్నచిన్న విధివిధానాల ఉల్లంఘనల విషయంలో వాటి తీవ్రతకు తగినట్టుగానే చర్యలు ఉండేలా చూసుకోవడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు.

నియంత్రణ సంస్కరణలపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను ఈ ప్రకటన అమలు చేస్తుంది. పారదర్శకమైన, సమర్థమైన, ప్రజలే కేంద్రంగా ఉండే నియంత్రణ వ్యవస్థను పెంపొందించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఇది స్పష్టం చేస్తోంది. విధివిధానాల లోపాలకు క్రిమినల్ శిక్షలను రద్దు చేసి, వాటి స్థానంలో నిష్పాక్షికమైన, సమతౌల్యంతో కూడిన పరిపాలన యంత్రాంగాన్ని ప్రవేశపెట్టడం ద్వారా... రోగుల సంరక్షణ, భద్రత, జవాబుదారీతనంలో అత్యున్నత ప్రమాణాలను కాపాడుతూ వైద్య రంగంలో వాణిజ్య సౌలభ్యాన్ని మరింత మెరుగుపరచడానికి ఈ సంస్కరణలు తోడ్పడనున్నాయి.  

***


(रिलीज़ आईडी: 2277781) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Odia , Tamil , Malayalam