కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
అధునాతన కమ్యూనికేషన్ సాంకేతికతల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుపై ఐఐటీ – హైదరాబాద్, టెలిమాటిక్స్ అభివృద్ధి కేంద్రం (సి-డాట్) మధ్య అవగాహన ఒప్పందం
అధునాతన కమ్యూనికేషన్ రంగాల్లో దేశీయ పరిశోధనలు, ఆవిష్కరణ, సామర్థ్యాభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యం
అత్యంత ప్రభావశీల పరిశోధన, ఆవిష్కరణలకు నిలయంగా సేవలందించనున్న సీవోఈ
ఐఐటీ- హైదరాబాద్ విద్యా ఔన్నత్యాన్నీ, సి-డాట్ నైపుణ్యాన్నీ మేళవిస్తూ.. విద్యాసంస్థలు - పరిశ్రమల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయనున్న సీవోఈ
కాన్పూర్, గాంధీనగర్, రూర్కీ ఐఐటీల అనంతరం హైదరాబాద్‌లో నాలుగో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తున్న సి-డాట్
అధునాతన సమాచార సాంకేతికతల్లో అత్యంత ప్రభావశీల పరిశోధన – అభివృద్ధికి నోడల్ కేంద్రంగా నిలవనున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
प्रविष्टि तिथि:
24 JUN 2026 7:59PM by PIB Hyderabad
తదుపరి తరం కమ్యూనికేషన్ సాంకేతికతల్లో పరిశోధనలు, ఆవిష్కరణలను వేగవంతం చేయడం లక్ష్యంగా - జాతీయ ప్రాధాన్యమున్న ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటీహెచ్)తో.. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్ల విభాగం (డీవోటీ) కి చెందిన ప్రముఖ టెలికాం పరిశోధన, అభివృద్ధి సంస్థ టెలిమాటిక్స్ అభివృద్ధి కేంద్రం (సీ-డీవోటీ) అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఈ వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా ఐఐటీ హైదరాబాద్‌లో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సి-డాట్ ఏర్పాటు చేయబోతోంది. వైర్‌లెస్ కమ్యూనికేషన్లు, క్వాంటం సాంకేతికతలు, సైబర్ భద్రత, కృత్రిమ మేధ ఆధారిత అప్లికేషన్లపై ప్రధానంగా దృష్టి సారిస్తూ.. అత్యాధునిక కమ్యూనికేషన్ రంగాల్లో దేశీయ పరిశోధనలు, ఆవిష్కరణలు, సామర్థ్యాభివృద్ధిని వేగవంతం చేయడం ఈ కేంద్రం ముఖ్య లక్ష్యం. దేశ ఆవిష్కరణల వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా.. సి-డాట్ ఏర్పాటు చేస్తున్న నాలుగో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇది. ఇంతకుముందు కాన్పూర్, గాంధీనగర్, రూర్కీ ఐఐటీల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సులను సీ-డాట్ నెలకొల్పింది.
అత్యంత ప్రభావవంతమైన ఒక ప్రత్యేక పరిశోధన - అభివృద్ధి కార్యకలాపాల కేంద్రంగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సేవలందించనుంది. ఐఐటీ - హైదరాబాద్ విద్యా నైపుణ్యాన్నీ, దేశీయ టెలికాం రంగంలో సి-డాట్‌కు ఉన్న అపార అనుభవాన్నీ మేళవించడం ద్వారా.. విద్యాసంస్థలు - పరిశ్రమల మధ్య సమన్వయాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది. సాంకేతిక రంగంలో దేశ స్వయంసమృద్ధికీ, ఆవిష్కరణల దిశగా దేశ ప్రయాణంలో విద్యార్థులు, పరిశోధకులు, అంకుర సంస్థలు తమ వంతు సహకారాన్ని అందించడానికీ ఈ కేంద్రం దోహదపడుతుంది. 5జీ అధునాతన/ 6జీ సాంకేతికతలు, అత్యంత భారీ స్థాయి మైమో వ్యవస్థలు, సమీకృత గ్రాహక - కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఏఐ ఆధారిత కమ్యూనికేషన్ నెట్‌వర్కులు - పరికరాలు, క్వాంటం – పోస్ట్ క్వాంటం కమ్యూనికేషన్ల వంటి అత్యాధునిక రంగాల్లో ఉమ్మడి పరిశోధనలనూ, నమూనాల అభివృద్ధినీ ఈ కేంద్రం చేపడుతుంది.
ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి, సి-డాట్ సీఈవో డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్, సంస్థలోని అధ్యాపకులు, సి-డాట్ సీనియర్ అధికారుల సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. అనంతరం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సును ప్రారంభించారు. దీంతో సంయుక్త పరిశోధన కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
వికేంద్రీకృత 5జీ ఓ-రాన్ సాధనాల అభివృద్ధి, విస్తరణ కోసం.. హైదరాబాద్ ఐఐటీలో ప్రారంభమైన వైసిగ్ అనే అంకుర సంస్థతో సి-డాట్ ఇప్పటికే భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ బలమైన పునాదిపై ఏర్పాటు కాబోతున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్.. మరిన్ని అంకుర సంస్థలకు అండగా ఉండడమే కాకుండా మేధో సంపత్తి సంబంధ అవకాశాలను మరింత సమర్థంగా అందిపుచ్చుకునేలా చేస్తుంది. అలాగే వర్క్‌షాప్‌లు, శిక్షణ కార్యక్రమాలు, విద్యాసంస్థలు - పరిశ్రమల భాగస్వామ్యాల ద్వారా నిరంతర విజ్ఞాన ప్రసారాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ వినూత్న ప్రయత్నం ప్రపంచ టెలికాం ఆవిష్కరణల రంగంలో భారత్ స్థానాన్ని విశేషంగా మెరుగుపరచడమే కాకుండా.. పటిష్టమైన, స్వయం సమృద్ధ డిజిటల్ వ్యవస్థ నిర్మాణానికి ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు.
‘వికసిత భారత్ కోసం దేశీయ కమ్యూనికేషన్ సాంకేతికతల అభివృద్ధి’ అనే అంశంపై డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ ఈ సందర్భంగా ప్రసంగించారు. భారత టెలికాం రంగ సమగ్ర స్వరూపం, భారత్ 6జీ లక్ష్యం, టెలికాం రంగానికి సంబంధించి ప్రతీ దశలోనూ వస్తున్న మార్పులు, అంతర్జాతీయ ప్రమాణాలు, సరికొత్త అవకాశాలను ఆయన తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 4జీ/ 5జీ సాంకేతికతలు, త్రినేత్ర సైబర్ సెక్యూరిటీ సూట్, సురక్షిత క్వాంటం కమ్యూనికేషన్లు (క్యూకేడీ, పీక్యూసీ), విపత్తు నిర్వహణ వేదికలతోపాటు సంచార్ సాథి, మోసాల గుర్తింపు వ్యవస్థల వంటి ఏఐ ఆధారిత అప్లికేషన్లనూ, అలాగే మిషన్ క్రిటికల్ కమ్యూనికేషన్ (ఎంసీఎక్స్) వంటి సి-డాట్ రూపొందించిన దేశీయ సాంకేతిక సాధనాలను ఆయన వివరించారు.
ఈ ఒప్పంద ముఖ్య లక్ష్యాన్ని వివరిస్తూ.. సి-డాట్ సీఈవో డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ ఇలా పేర్కొన్నారు - “భారత్‌లో తదుపరి తరం కమ్యూనికేషన్ సాంకేతికతలకు సంబంధించి ఒక పటిష్టమైన ఆవిష్కరణల వ్యవస్థను రూపొందించే దిశగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు ఒక వ్యూహాత్మకమైన ముందడుగు. అత్యాధునిక విద్యా పరిశోధనలనూ, వాస్తవికంగా వాటిని ఆచరణలోకి తెచ్చే సామర్థ్యాలతో మేళవించడం ద్వారా.. ప్రపంచస్థాయిలో పోటీ పడగల, సురక్షిత, విస్తరించదగిన టెలికాం మార్గాలను రూపొందించడమే మా లక్ష్యం. తద్వారా టెలికాం రంగంలో భారత్ అగ్రగామిగా నిలవాలని మేం ఆకాంక్షిస్తున్నాం.”
“దేశ తదుపరి తరం టెలికాం సామర్థ్యాలను పెంపొందించేందుకు సి-డాట్‌తో చేతులు కలపడం.. ఐఐటీ హైదరాబాద్ ప్రయాణంలో ఒక కీలకమైన మైలురాయి. కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, సెమీకండక్టర్ సాంకేతికతలు, సరికొత్త వైర్‌లెస్ వ్యవస్థల్లో ఐఐటీ హైదరాబాద్‌కు ఉన్న నైపుణ్యం.. సురక్షితమైన దేశీయ టెలికాం వ్యవస్థల కోసం సి-డాట్ చేపట్టిన జాతీయ స్థాయి కార్యక్రమానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. వ్యూహాత్మక ప్రాధాన్యమున్న సాంకేతికతలను ఉమ్మడిగా అభివృద్ధి చేయడానికి మా అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులకు ఒక అద్భుతమైన వేదికను ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అందిస్తుంది. తద్వారా సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిలవాలన్న భారత దీర్ఘకాలిక లక్ష్య సాధనలో ఇదెంతగానో దోహదపడుతుంది” అంటూ ఐఐటీ - హైదరాబాద్ డైరెక్టర్ బి.ఎస్. మూర్తి ఈ భాగస్వామ్యం ప్రాధాన్యాన్ని వివరించారు.
ప్రముఖ విద్యాసంస్థలతో భాగస్వామ్యాల ద్వారా దేశీయ టెలికాం ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో సి-డాట్ నిరంతర నిబద్ధతను ఈ భాగస్వామ్యం ప్రతిబింబిస్తోంది. పరిశోధనలకు అండగా నిలవడం, నైపుణ్యం కలిగిన మానవ వనరులను పెంపొందించడం, తదుపరి తరం సాంకేతికతలను అందుబాటులోకి తేవడం ద్వారా.. సాంకేతిక స్వయంసమృద్ధి సాధించాలన్న దేశ లక్ష్యానికి దోహదపడడమే కాకుండా, ప్రపంచ టెలికాం రంగంలో భారత్ స్థానాన్ని ఈ ప్రయత్నం మరింత బలోపేతం చేస్తుంది.
***
(रिलीज़ आईडी: 2277673)
आगंतुक पटल : 5