గనుల మంత్రిత్వ శాఖ
దేశ కీలక ఖనిజాల మిషన్‌కు ఊతం: 56 కీలక ఖనిజాల బ్లాకులు, 11 అన్వేషణ లైసెన్సు బ్లాకులకు విజయవంతంగా వేలం
प्रविष्टि तिथि:
23 JUN 2026 4:31PM by PIB Hyderabad
కీలక, వ్యూహాత్మక ఖనిజాల బ్లాకుల వేలాన్ని ఇటీవల విజయవంతంగా పూర్తిచేయడం ద్వారా.. దేశ కీలక ఖనిజ భద్రతనూ, ఖనిజాన్వేషణ వ్యవస్థనూ బలోపేతం చేయడంలో కీలక మైలురాళ్లను కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ అధిగమించింది. తాజా వేలం ప్రక్రియలు విజయవంతం కావడంతో.. ఇప్పటి వరకు దేశంలో విజయవంతంగా వేలం వేసిన మొత్తం కీలక, వ్యూహాత్మక ఖనిజాల బ్లాకుల సంఖ్య 56కు చేరింది. దేశీయ ఖనిజ సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడంతోపాటు, దేశ కీలక ఖనిజాల మిషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఇదొక కీలకమైన ముందడుగు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఏడో విడత కింద.. 10 కీలక, వ్యూహాత్మక ఖనిజాల బ్లాకులను గనుల మంత్రిత్వ శాఖ విజయవంతంగా వేలం వేసింది. దీంతో దేశంలో విజయవంతంగా వేలం పూర్తయిన మొత్తం కీలక, వ్యూహాత్మక ఖనిజాల బ్లాకుల సంఖ్య 56కు చేరింది. కేంద్ర ప్రభుత్వం వేలం చేపట్టిన మొత్తం 88 ప్రత్యేక ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులకు.. అంటే 63 శాతానికి పైగా విజయవంతంగా వేలం పూర్తయింది.
దేశ కీలక ఖనిజాన్వేషణ పరిధిని విస్తరించడంలో ఏడో విడత వేలం ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. గుజరాత్, ఉత్తరాఖండ్, తెలంగాణల్లో కీలక ఖనిజాల బ్లాకులను మొదటిసారిగా ఈ దశలోనే కేంద్ర ప్రభుత్వం వేలం వేసింది. ఈ విడతలో గ్రాఫైట్, అరుదైన ఖనిజ మూలకాలు (ఆర్ఈఈ), వెనాడియం, టైటానియం, గ్లకోనైట్, శిలా ఫాస్ఫేట్, వాటి అనుబంధ ఖనిజాలున్నాయి. దేశంలో కీలక ఖనిజాల అన్వేషణకు సంబంధించి భౌగోళిక విస్తృతిని ఇది మరింత పెంచింది.
2026 మార్చి 23న జారీ చేసిన టెండర్ల ఆహ్వాన ప్రకటన ద్వారా ఈ ఏడో విడత వేలం ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా కీలక, వ్యూహాత్మక ఖనిజాలున్న 19 ఖనిజాల బ్లాకులను వేలానికి ఉంచారు. ఎప్పటికప్పుడు సవరిస్తూ వచ్చిన.. గనులు - ఖనిజాల (అభివృద్ధి - నియంత్రణ) చట్టం - 1957, ఖనిజాల (వేలం) నియమాలు- 2015 లోని నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ వేలం ప్రక్రియను నిర్వహించింది.
కీలక ఖనిజాల వేలంతోపాటు, దేశ ఖనిజాన్వేషణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా.. ఖనిజాన్వేషణ లైసెన్సుల (ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్సులు) వేలం రెండో విడతను కూడా గనుల మంత్రిత్వ శాఖ విజయవంతంగా పూర్తి చేసింది. లైసెన్సుల విధానాన్ని మొదటిసారిగా అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఈ విడతలో విస్తరించింది. కీలక, భూగర్భ లోతుల్లో ఉండే ఖనిజాలను గుర్తించడంలో కొత్త అవకాశాలనూ ఇది అందుబాటులోకి తెచ్చింది.
ఈ రెండో విడత విజయవంతంగా పూర్తి కావడంతో.. దేశంలో ఖనిజాన్వేషణ లైసెన్సుల (ఈఎల్) వేలం విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా వేలం వేసిన మొత్తం ఈఎల్ బ్లాకుల సంఖ్య 11కి చేరింది. ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా.. దేశంలో భూగర్భంలో చాలా లోతున ఉండే ఖనిజాలు, కీలక ఖనిజాల క్రమబద్ధమైన అన్వేషణకు ఈ లైసెన్సు విధానం వీలు కల్పిస్తుంది.
దేశ ఖనిజ రంగంపై పరిశ్రమ భాగస్వామ్య పక్షాల్లో నమ్మకం పెరుగుతోందనేందుకు.. కీలక ఖనిజాలు, అన్వేషణ అనుమతుల వేలం ప్రక్రియలు ఎప్పటికప్పుడు విజయవంతమవుతుండడమే నిదర్శనం. దేశంలో క్రమబద్ధమైన అన్వేషణను ప్రోత్సహించడానికీ, పెట్టుబడులను ఆకర్షించడానికీ, దేశీయ ఖనిజ సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడానికీ ప్రభుత్వం చేపట్టిన విధానపరమైన సంస్కరణల ప్రభావాన్ని ఇది స్పష్టం చేస్తోంది.
హరిత ఇంధన సాంకేతికతలు, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, అధునాతన తయారీ రంగం, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగ అప్లికేషన్లు, దేశ ఆర్థిక వ్యవస్థలోని ఇతర వ్యూహాత్మక రంగాలకు అత్యంత ఆవశ్యకమైన కీలక ఖనిజాల అన్వేషణ, అభివృద్ధిని ఈ చర్యలు మరింత వేగవంతం చేస్తాయి.
జాతీయ కీలక ఖనిజాల మిషన్ లక్ష్యాలను సాధించడం, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ఇతర దేశాల నుంచి దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడంతోపాటు.. దేశం కోసం కీలక, వ్యూహాత్మక ఖనిజ సంపద నిల్వలను సృష్టించే దిశగా కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ఈ విజయవంతమైన వేలం ప్రక్రియలు పునరుద్ఘాటిస్తున్నాయి.
వేలం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మద్దతును, సహకారాన్ని అందించిన బిడ్డర్లు, రాష్ట్ర ప్రభుత్వాలు, సాంకేతిక సంస్థలు, ఇతర భాగస్వాములందరినీ గనుల మంత్రిత్వ శాఖ అభినందిస్తోంది. దేశంలో ఖనిజాన్వేషణ అవకాశాలను విస్తరించడంతోపాటు.. పారదర్శకమైన, సమర్థమైన, పెట్టుబడిదారులకు అనుకూలమైన ఖనిజ వ్యవస్థను నిర్మించడానికి గనుల మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.
***
(रिलीज़ आईडी: 2277343)
आगंतुक पटल : 6