రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
రవాణా, రాకపోకలు, సరఫరా వ్యవస్థల్లో ఆర్థిక పరిశోధన కేంద్రం ఏర్పాటుపై ఎన్సీఏఈఆర్‌తో ఎన్‌హెచ్ఏఐ అవగాహన ఒప్పందం
ఆయా వ్యవస్థల్లో స్పష్టమైన ఆధారాలే ప్రాతిపదికగా... విధాన రూపకల్పన బలోపేతం, పరిశోధనలకు ప్రోత్సాహం దిశగా కార్యక్రమం
प्रविष्टि तिथि:
23 JUN 2026 3:16PM by PIB Hyderabad
రోడ్డు రవాణా రంగంలో స్పష్టమైన ఆధారాలే ప్రాతిపదికగా విధాన రూపకల్పనను బలోపేతం చేయడం, అత్యుత్తమ పరిశోధనలను ప్రోత్సహించే దిశగా.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) కీలక ముందడుగు వేసింది. జాతీయ అనువర్తిత ఆర్థికశాస్త్ర పరిశోధన మండలి (ఎన్సీఏఈఆర్)తో ఎన్‌హెచ్‌ఏఐ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఎన్‌సీఏఈఆర్ ప్రాంగణంలో ‘ఎన్హెచ్ఏఐ రవాణా, రాకపోకలు, సరఫరా వ్యవస్థల్లో ఆర్థిక పరిశోధనల కేంద్రా’న్ని ఏర్పాటు చేయనున్నారు. దేశంలో ఆయా రంగాల్లో ప్రత్యేకంగా పరిశోధనలు చేయడం కోసం ఏర్పాటవుతున్న మొదటి శాశ్వత, స్వతంత్ర పరిశోధన కేంద్రం ఇదే. ఈ కేంద్రం స్థాపనకు ఎన్‌హెచ్‌ఏఐ ప్రారంభ విరాళాన్ని అందించింది. అలాగే ఇతర అనుబంధ సంస్థలు, భాగస్వాముల నుంచి మరిన్ని నిధులను సమకూర్చడానికి ఎన్‌సీఏఈఆర్ కట్టుబడి ఉంది.
ఎన్‌హెచ్‌ఏఐ ప్రధాన కార్యాలయంలో.. ఆ సంస్థ చైర్మన్, ఎన్సీఏఈఆర్ డైరెక్టర్ జనరల్, ఇరు సంస్థలకు చెందిన ఉన్నతాధికారుల సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. పరిశోధనలు, గణాంకాల విశ్లేషణ, రుజువులు ప్రాతిపదికగా నిర్ణయ ప్రక్రియలను... దేశంలో వేగంగా విస్తరిస్తున్న జాతీయ రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిర్వహణలో భాగం చేయాలన్న ఎన్‌హెచ్‌ఏఐ అంకిత భావాన్ని ఈ వినూత్న కార్యక్రమం ప్రతిబింబిస్తోంది.
ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘దేశీయ రవాణా అనుసంధానాన్నీ, సరఫరా వ్యవస్థల సామర్థ్యాన్నీ పెంపొందించడంలో ఎన్‌హెచ్‌ఏఐ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటోంది. ఎన్సీఏఈఆర్‌తో కుదిరిన ఈ భాగస్వామ్యం.. అత్యుత్తమ పరిశోధనలు, విధానపరమైన విశ్లేషణల కోసం ఒక ప్రత్యేక వేదికగా నిలుస్తుంది. రవాణా రంగంలో ప్రణాళికలు, పెట్టుబడులు, ఆస్తుల నిర్వహణ నిర్ణయాలను మరింత బలోపేతం చేయడంలో ఇది దోహదపడుతుంది’’ అని పేర్కొన్నారు.
రోడ్డు, రవాణా రంగంలో దీర్ఘకాలిక ప్రణాళికలు, పెట్టుబడులు, విధాన రూపకల్పనకు అవసరమైన ఆచరణాత్మక విశ్లేషణలను అందించడం లక్ష్యంగా.. రవాణా, రాకపోకలు, సరఫరా వ్యవస్థలపై అనువర్తిత ఆర్థిక పరిశోధనలు చేసే ప్రత్యేక వేదికగా ఈ కేంద్రం సేవలందిస్తుంది. జాతీయ రహదారుల ఆర్థిక వ్యవస్థ, సరుకు రవాణా, వివిధ రవాణా విధానాల అనుసంధానం, జాతీయ రహదారుల్లో పెట్టుబడుల వల్ల ప్రాంతీయ ఆర్థిక వృద్ధిపై చూపే ప్రభావం, టోల్ విధానం, ఆస్తుల నుంచి ద్రవ్యాన్ని సమకూర్చుకోవడం, రహదారి భద్రత చర్యలు, జాతీయ రహదారుల నిర్వహణలో అత్యాధునిక సాంకేతికతను జోడించడం వంటి విస్తృతమైన అంశాలపై ఈ కేంద్రం విధానపరమైన పరిశోధనలు చేస్తుంది. రవాణా వ్యవస్థలో సామర్థ్యాన్నీ, స్థిరత్వాన్నీ పెంచడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని అందించేలా సరికొత్త విధానాలు, కార్యక్రమాలను రూపొందించడంలో.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, ఎన్హెచ్ఏఐ, ఇతర ప్రభుత్వ సంస్థలకు ఇక్కడి పరిశోధనల ఫలితాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
పరిశోధనలకే పరిమితం కాకుండా.. రవాణా రంగానికి సంబంధించి వైజ్ఞానిక కేంద్రంగానూ ఈ కేంద్రం సేవలందించనుంది. ఇందులో భాగంగా విధాన పత్రాలు, తాత్కాలిక ముసాయిదాలు, ప్రామాణిక నివేదికలు, భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు, వర్క్‌షాపులు, విద్యాసంబంధిత కార్యక్రమాల ద్వారా పరిశోధన ఫలితాలను అందరికీ చేరవేస్తుంది. వీటితోపాటు రవాణా ఆర్థిక రంగంలో భావి నిపుణులను తీర్చిదిద్దడంలోనూ, సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించడంలోనూ ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రముఖ ఆర్థికవేత్తలు, రవాణా రంగ నిపుణులు, ప్రజా విధాన నిపుణులు, విశిష్ట విద్యావేత్తలతోపాటు ఎన్‌హెచ్ఏఐ నుంచి ఒక సభ్యులు (ఆర్థిక), ఎన్సీఏఈఆర్ డైరెక్టర్ జనరళ్లతో కూడిన ఒక సలహా సంఘం ఆధ్వర్యంలో ఈ కేంద్రం పనిచేస్తుంది. దీనితోపాటు ఎన్హెచ్ఏఐ ఏర్పాటు చేసే ఒక స్టీరింగ్ కమిటీ.. ఈ కేంద్రం పరిశోధన ప్రాధాన్యాలను పర్యవేక్షిస్తుంది. అలాగే పరిశోధన ఫలితాలను సమీక్షించడంతోపాటు.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ విధానపరమైన, కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా ఈ పరిశోధనలు సాగేలా చూస్తుంది. ఈ సంస్థ ఏర్పాటు, నిర్వహణ కోసం పదేళ్ల కాలానికి ఎన్‌హెచ్ఏఐ మద్దతు అందిస్తుంది.
రవాణా మౌలిక సదుపాయాలు, రాకపోకల వ్యవస్థలు, సరఫరా వ్యవస్థల్లో ఆర్థిక కోణాలపై లోతైన అవగాహనను పెంపొందించడం ద్వారా... భవిష్యత్తులో మరింత సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి, విధానాల సమర్థతను పెంచడానికి ఈ సంస్థ తోడ్పడుతుంది. తద్వారా దేశంలో మరింత దృఢమైన, ఆధునిక, ప్రపంచ స్థాయి జాతీయ రహదారి వ్యవస్థ అభివృద్ధికి దోహదపడుతుంది.
***
(रिलीज़ आईडी: 2277339)
आगंतुक पटल : 5