సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని జాతీయ మీడియా కేంద్రంలో యోగా సెషన్‌ నిర్వహించిన అధికారులు


దైనందిన జీవితంలో యోగా ఒక అంతర్భాగం కావాలి..

యోగ కేవలం వార్షిక వేడుకలకే పరిమితం కాకూడదు: శ్రీ చంచల్ కుమార్

నాడు పోస్టు చేయడమైనది: 21 JUN 2026 12:34PM by PIB Hyderabad

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం- 2026ను పురస్కరించుకొని ఈ రోజు ఢిల్లీలోని జాతీయ మీడియా కేంద్రంలో ఒక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రిత్వ శాఖ, పత్రికా సమాచార కార్యాలయానికి (పీఐబీ) చెందిన ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఏడాది యోగా దినోత్సవం ప్రధాన ఇతివృత్తమైన 'ఆరోగ్యకరంగా ఎదిగేందుకు యోగా'కు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ మాట్లాడుతూ.. యోగా కేవలం వార్షిక వేడుకకే పరిమితం కాకూడదని, దానిని దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం అనేది సమగ్ర శారీరక ఎదుగుదలకు ఎంతో అవసరమని.. ఇది వ్యక్తిగత, వృత్తిపరమైన శ్రేయస్సు రెండింటికీ గణనీయంగా తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని రకాల వృత్తులు, అన్ని వయసుల వారికి యోగా ఎంతో ఉపయోగకరమన్న ఆయన.. యోగాను కేవలం ఒకే సందర్భానికి పరిమితం చేయకుండా ప్రజలు దాని విలువలను అలవర్చుకోవాలని, ప్రతిరోజూ సాధన చేయాలని కోరారు.

శిక్షణ పొందిన యోగా శిక్షకుల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ఆసనాలు, శ్వాసక్రియ పద్ధతులు (ప్రాణాయామం), ధ్యాన ప్రక్రియల ప్రదర్శనలు ఉన్నాయి. కామన్ యోగా ప్రోటోకాల్‌కు అనుగుణంగా నిర్వహించిన వివిధ కార్యకలాపాల్లో (యాక్టివిటీస్) అధికారులు, సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది ఆరోగ్యం, శ్రేయస్సు పట్ల వారి నిబద్ధతను పునరుద్ఘాటించింది.

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదన మేరకు 2014లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆమోదించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవాన్ని పాటిస్తున్నారు. కాలక్రమేణా ఈ వేడుక ఒక అంతర్జాతీయ ఉద్యమంగా రూపాంతరం చెందింది. శారీరక- మానసిక దృఢత్వం, సమగ్ర ఆరోగ్యాన్ని పెంపొందించడంలో యోగాకు ఉన్న ప్రాముఖ్యతను ఈ కార్యక్రమాలు చాటిచెబుతున్నాయి.

***


(రిలీజ్ ఐడి: 2276423) సందర్శకుల సూచీ సంఖ్య : : 45
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Punjabi , Urdu , Assamese , Tamil , Kannada