ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘పశ్చిమబంగ దివస్’ సందర్భంగా హుగ్లీలో నిర్వహించిన వేడుకలకు హాజరైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


రైల్వేలు.. వ్యవసాయం.. గ్రామీణాభివృద్ధి.. మత్స్య-పశుసంవర్ధక రంగాల సంబంధిత వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. జాతికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి

“ఈ ఏడాది పశ్చిమ బెంగాల్ దినోత్సవం మరింత ప్రత్యేకం... స్వాతంత్ర్యం తర్వాత రాష్ట్ర ఉజ్వల భవితపై మహనీయుల కలలు ఫలించడాన్ని నేడు మనం తొలిసారి చూస్తున్నాం”

“ఈ చారిత్రక దినం పశ్చిమ బెంగాల్ ప్రగతికి స్ఫూర్తినిస్తూ మనమూ ఒక అద్భుత.. వినూత్న చరిత్ర సృష్టించేందుకు తోడ్పడాలి”

“ఈ రోజు రూ.వందల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం.. శంకుస్థాపన చేశాం”

“రైల్వేలు.. రహదారులు.. వ్యవసాయం.. మత్స్య-పశుసంవర్ధక రంగాల్లోని ఈ ప్రాజెక్టులు బెంగాల్ అభివృద్ధికి నవ్యోత్తేజమిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి”

“బెంగాల్ రక్తపాతాన్ని సహించింది.. తన ప్రజలను కోల్పోయింది.. మాతృభూమి విభజనను కళ్లారా చూసింది.. అయినప్పటికీ అస్తిత్వాన్ని.. ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకుంది”

“పశ్చిమబంగ దివస్’ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటున్నది తేదీ ఒక్కటే కాదు.. సంపూర్ణ చరిత్రను స్మరించుకుంటూ వేల ఏళ్లనాటి బెంగాల్ వారసత్వానికి నివాళి అర్పిస్తున్నాం”

“దేశం 2047 నాటికి వికసిత భారత్‌గా మారాలనే లక్ష్యంతో కృషి చేస్తోంది.. ఈ సంకల్ప సాకారంలో తూర్పు భారతం ప్రగతి కీలక పునాది.. ఈ దిశగా ‘మిషన్ పూర్వోదయ’ కార్యక్రమం అమలు చేస్తున్నాం”

प्रविष्टि तिथि: 20 JUN 2026 7:42PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ‘పశ్చిమబంగ దివస్’ (పశ్చిమ బెంగాల్ దినోత్సవం) వేడుకల్లో పాల్గొన్నారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీతో చారిత్రక సంబంధం గల హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది “పశ్చిమ బెంగాల్: వారసత్వం-సామరస్యం-అభివృద్ధి” ఇతివృత్తంగా రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని, సామాజిక ఐక్యతను, ప్రగతిపై ప్రజాకాంక్షలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన, జాతికి అంకితం చేశారు. రైల్వేలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మత్స్య-పశుసంవర్ధక రంగాలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులతో మౌలిక సదుపాయాలు బలోపేతమై జీవనోపాధి మెరుగుపడుతుంది. అలాగే, రైతుల సంక్షేమానికి తోడ్పడుతూ, రాష్ట్రవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయి.

ఈ సందర్భంగా ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం కింద 23వ విడత నిధులను కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు. తదనుగుణంగా దేశంలోని 9.44 కోట్ల మందికిపైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ₹18,880 కోట్లకు పైగా నగదు నేరుగా జమ అయింది.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం, కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రానికి తొలిసారి వచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించారు. ముందుగా పశ్చిమ బంగ ఉత్సవాల నేపథ్యంలో రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుక నేడు ఆశావాదం, విశ్వాసం పెల్లుబుకుతుండటమే కాకుండా పురోగతిని ప్రతిబింబించే చారిత్రక ఘట్టంగా నిలుస్తున్నదని ఆయన అభివర్ణించారు. “పశ్చిమ బెంగాల్ వృద్ధి, దేశ పురోగమనం దిశగా రాష్ట్రం ఓ కొత్త పయనం ఆరంభించింది. ఉజ్వల భవిష్యత్తుపై పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రజలలో కనిపిస్తున్న ఉత్సాహం, రాష్ట్రంలోని సానుకూల వాతావరణం ప్రతిబింబిస్తున్నాయి” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

“స్వచ్ఛత సే స్వాగత్” (పరిశుభ్రతతో స్వాగతం) కార్యక్రమంలో పాల్గొన్న పౌరులను ప్రధానమంత్రి అభినందించారు. పరిశుభ్రత అనేది దైనందిన జీవితంలోనే కాకుండా సుస్థిర ప్రగతిలోనూ అంతర్భాగం కావాలని స్పష్టం చేశారు. ‘పశ్చిమబంగ దివస్’ ప్రాధాన్యాన్ని వివరిస్తూ- స్వాతంత్ర్యం, విభజనకు దారితీసిన క్లిష్ట పరిస్థితుల్లో బెంగాల్ సాంస్కృతిక అస్తిత్వం, వారసత్వం సహా దేశంలో తన స్థానం కాపాడుకోవడానికి చేసిన త్యాగాలను ఈ సందర్భం గుర్తుచేస్తుందని శ్రీ మోదీ అన్నారు. బెంగాల్ ప్రజల ప్రయోజనాలు, ఆకాంక్షల పరిరక్షణకు కృషి చేసిన దార్శనికులు, సామాజిక నాయకులు, పండితులు, ప్రముఖులకు ఆయన నివాళి అర్పించారు.

దేశ విభజన వేళ బెంగాల్‌లోని కొంత భాగం భారత్‌లోనే ఉండేవిధంగా చూడటంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ సేవలను ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. ఆ చారిత్రక ఉద్యమంలో పాల్గొన్న మేధావులు, పండితులు, సంఘ సంస్కర్తలు, సామాజిక నాయకులు, పారిశ్రామికవేత్తల మద్దతును కూడా ఆయన స్మరించుకున్నారు. “రవీంద్రనాథ్ టాగోర్, బంకించంద్ర చటోపాధ్యాయ, స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వంటి మహనీయులు రూపుదిద్దిన పశ్చిమ బెంగాల్ సుసంపన్న వారసత్వం దేశానికి నేడు కూడా స్ఫూర్తినిస్తూనే ఉంది. భవిష్యత్తరాలకు కొత్త అవకాశాలను సృష్టిస్తూ, ఈ వారసత్వాన్ని పరిరక్షించడంతోపాటు ఘనంగా చాటాల్సిన  అవసరం ఎంతయినా ఉంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

రాష్ట్రంలో దశాబ్దాల నుంచి పేరుకుపోయిన సవాళ్లను కొత్త ప్రభుత్వం పరిష్కరించడం ప్రారంభించిందని శ్రీ మోదీ అన్నారు. మరోవైపు పురోగమన వేగం పెంచడానికి కృషి చేస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక సామర్థ్యాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకునేందుకు సత్వర నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దీర్ఘకాలం నుంచి స్తంభించిన ప్రాజెక్టులను నేడు పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా “ఇవాళ్టి కార్యక్రమంలో రైల్వేలు, రహదారులు, వ్యవసాయం, మత్స్య రంగాలకు సంబంధించిన రూ.వందల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశాం. ఈ కార్యక్రమాలు గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతోపాటు అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ఊతమిస్తూ ఉపాధి, అభివృద్ధి దిశగా కొత్త అవకాశాలను సృష్టిస్తాయి” అని శ్రీ మోదీ విశదీకరించారు.

దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికిపైగా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ‘పీఎం కిసాన్’ పథకం 23వ విడత విడుదల-జమ గురించి ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. లబ్ధి పొందిన రైతు కుటుంబాలన్నింటికీ ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర చరిత్ర నుంచి స్ఫూర్తి పొందాలని పౌరులకు పిలుపునిస్తూ- పశ్చిమ బెంగాల్‌కు అపార సాంస్కృతిక, మేధా, ఆర్థిక బలం ఉందని, భారత ప్రగతి ప్రస్థానంలో మరోసారి అగ్రగామిగా నిలవగలదని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. “పశ్చిమ బెంగాల్ దినోత్సవం కేవలం చరిత్రను స్మరించుకునేదిగా కాకుండా అభివృద్ధి, పురోగమనం, జాతీయ ఐక్యతకు సరికొత్త నిబద్ధతగానూ ఉండాలి. మరింత శక్తియుత, సుసంపన్న భారత్‌ను తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రజలు ప్రధాన పాత్ర పోషిస్తారు” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

ఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్ ప్రజలకిచ్చిన హామీలను నిర్దేశిత వ్యవధిలోగా నెరవేరుస్తామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హతగల ప్రతి పేద కుటుంబానికీ ఇకపై ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం ద్వారా ఉచిత ఆరోగ్యం సంరక్షణ లభిస్తుందని ఆయన ప్రకటించారు. అన్నపూర్ణ పథకం ప్రారంభం, జల్ జీవన్ మిషన్ ద్వారా సురక్షిత తాగునీటి సరఫరా విస్తరణ, ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితిలో సడలింపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం వగైరాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. “ఏళ్ల తరబడి స్తంభించిన సంక్షేమ పథకాలను నేడు ప్రజా కార్యక్రమ శిబిరాల ద్వారా నేరుగా లబ్ధిదారులకు చేరువ చేస్తున్నాం. దీనివల్ల పారదర్శకత, సామర్థ్యం మెరుగుపడి, దళారీ వ్యవస్థ అంతమవుతుంది” అని శ్రీ మోదీ ప్రకటించారు.

మౌలిక సదుపాయాల కల్పనను ప్రస్తావిస్తూ- దీర్ఘకాలం నుంచీ మూలపడిన అనేక ప్రాజెక్టులు ఇప్పుడు వేగం పుంజుకున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. వీటిలో చింగ్రిఘాట క్రాసింగ్ వద్ద కోల్‌కతా మెట్రో ఆరెంజ్ లైన్ పనులు పూర్తి కావడం, హౌరాలో కొత్త డివిజనల్ రైల్వే ఆసుపత్రికి శంకుస్థాపన, పూరబ్‌ మేదినీపూర్‌లో రోడ్ ఓవర్‌బ్రిడ్జిలు, సంక్రయిల్-సంత్రాగచ్చి రైలు మార్గం ప్రాజెక్ట్ వంటివి ఉన్నాయి. రైతుల సంక్షేమంపై దృష్టి సారిస్తూ, పంట నష్టాల నుంచి వారికి ఆర్థికంగా రక్షణ కల్పించే ‘ప్రధాన మంత్రి పంటల బీమా పథకం’ పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రైతు రిజిస్ట్రీలు, డిజిటల్ భూ రికార్డులు, వ్యవసాయ సేవలు, ప్రయోజనాల పంపిణీలో మెరుగుదల దిశగా ‘డిజిటల్ అగ్రికల్చర్ మిషన్’తో రాష్ట్రాన్ని సంధానిస్తున్నామని ఆయన ప్రకటించారు. “పీఎం ధన్‌ధాన్య కృషి యోజన కింద రాష్ట్రంలోని పురూలియా, అలీపుర్‌దువార్, ఝార్‌గ్రామ్‌, డార్జిలింగ్ జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకత పెంపు, నిల్వ మౌలిక సదుపాయాల బలోపేతం, రుణ లభ్యతను మెరుగుదలకు ప్రత్యేకంగా చేయూతనిస్తాం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మత్స్య రంగం ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ- దక్షిణ 24 పరగణాలలో ఫ్రేజర్‌గంజ్ ఫిషింగ్ హార్బర్ విస్తరణ, బీర్భమ్‌లో ఆధునిక చేపల మార్కెట్ ఏర్పాటును ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇవి జీవనోపాధిని పెంచి, మత్స్య రంగాన్ని బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ‘ఖేత్ బచావో అభియాన్’లో పాలుపంచుకుంటూ భూసారాన్ని పెంచి, రసాయన ఎరువుల పరాధీనతను తగ్గిస్తూ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని దేశవ్యాప్తంగా గల రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

దేశం 2047 నాటికి వికసిత భారత్‌గా రూపొందాలన్న ప్రభుత్వ దార్శనికతను పునరుద్ఘాటిస్తూ- ఈ లక్ష్య సాధనలో ‘పూర్వోదయ’ పథకం కింద తూర్పు భారతం అభివృద్ధి కీలకం కాగలదని ప్రధానమంత్రి అన్నారు. తద్వారా ప్రాంతీయ, జాతీయ వృద్ధికి తోడ్పాటులో పశ్చిమ బెంగాల్ ప్రధాన పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. “సుస్థిర ప్రగతి, శాంతి, సామాజిక సామరస్యం, సాంస్కృతిక పరిరక్షణ సహితమైనదిగా ఉండాలి. సామూహిక పురోగమనం దిశగా భుజం కలిపి పనిచేస్తూ బెంగాల్ సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని, సామాజిక చట్రాన్ని బలోపేతం చేయాలి” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

చివరగా- రాష్ట్ర ప్రజలంతా జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాలుపంచుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద, శ్రీ అరబిందోల జన్మభూమి అయిన ఈ రాష్ట్రం యోగా, ఆరోగ్యం, మానవాళి ఐక్యత సందేశంతో ప్రపంచానికి మరోసారి స్ఫూర్తినిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ ఆయన తన ప్రసంగం ముగించారు.

 

***


(रिलीज़ आईडी: 2276070) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam