ఏఐ వల్ల సినిమా నిర్మాణం మరింత సులభంగా, చౌకగా మారుతుంది: ఎంఐఎఫ్ఎఫ్‌లో ఆనంద్ పాండే
సినిమా రంగానికి మానవ సృజనాత్మకతే ఎప్పటికీ ముఖ్యం: ఆనంద్ పాండే
సినిమా నిర్మాణ రంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నప్పటికీ చలనచిత్ర రంగానికి చెందిన నిపుణులను పూర్తిగా అది తొలగించే అవకాశం మాత్రం లేదని ఆనంద్ పాండే పేర్కొన్నారు. 19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (ఎంఐఎఫ్ఎఫ్) జరిగిన ‘‘సమీప భవిష్యత్తులో సినిమా’’ ఇతివృత్తంపై జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.
ప్రముఖ యానిమేషన్ ప్రొడ్యూసర్, క్రియేటివ్ సాంకేతిక నిపుణుడైన ఆనంద్ పాండే.. స్క్రీన్‌యుగ్ క్రియేషన్స్, మెర్జ్ ఎక్స్ఆర్ సంస్థల వ్యవస్థాపకుడు కూడా. భారత యానిమేషన్ పరిశ్రమ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ‘లిటిల్ కృష్ణ , శక్తిమాన్, కృష్ణ ఔర్ కన్స్’ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లకు ఆయన పనిచేశారు.
వర్క్‌షాప్‌లో పాల్గొన్న వారితో ఆనంద్ పాండే మాట్లాడుతూ ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్ రోజురోజుకూ ఎలా అత్యాధునికంగా, అందరికీ సులభంగా అందుబాటులోకి వస్తున్నదీ వివరించారు. కొన్ని అధునాతన ఏఐ మోడల్స్ నేరుగా భారత్‌లో అందుబాటులో లేనప్పటికీ.. దర్శకులు, సినీ నిర్మాతలు ఏపీఐ, ఓపెన్-సోర్స్ వేదికలను ఉపయోగించి చాలా తక్కువ ఖర్చుతోనే ఈ సరికొత్త సాంకేతికతలను ఉపయోగించొచ్చని ఆయన పేర్కొన్నారు.
‘అసిస్టెంట్ డైరెక్టర్లు, లైన్ ప్రొడ్యూసర్లు, ప్రొడక్షన్ మేనేజర్ల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుందా?’ అనే ఒక ప్రశ్నకు పాండే సమాధానమిస్తూ... ఏఐ, సంప్రదాయ చలనచిత్ర నిర్మాణం భవిష్యత్తులోనూ కలిసి పనిచేస్తాయని చెప్పారు. గతంలో ఫిలిం కెమెరాల నుంచి డిజిటల్ సాంకేతికతకు మారిన రోజులను గుర్తు చేసిన ఆయన.. ప్రతి కొత్త సాంకేతికత పని చేసే విధానాన్ని మార్చినప్పటికీ సరికొత్త అవకాశాలను కూడా సృష్టిస్తుందని పేర్కొన్నారు.
సినిమా రంగానికి మానవ సృజనాత్మకత ఎల్లప్పుడూ అత్యంత ముఖ్యమైందని ఆయన చెప్పారు. ప్రేక్షకులు మనుషుల కథలకు, వారి నటనకే ఎక్కువగా కనెక్ట్ అవుతారని.. సాంకేతికత మానవ భావోద్వేగాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేదని ఆయన అభిప్రాయపడ్డారు. దర్శకులు తమ సమయం- డబ్బును ఆదా చేసుకోవడానికి, నిర్మాణ సమయంలో జరిగే తప్పులను సరిదిద్దడానికి, పోస్ట్-ప్రొడక్షన్ పనులను మరింత సులభతరం చేయడానికి ఏఐ ఎంతగానో సహాయపడుతుందని ఆయన వివరించారు.
రచయితలు, క్రియేటర్లు, స్వతంత్ర దర్శకులు తమ ఆలోచనలను పదును పెట్టుకోవడానికి, సన్నివేశాలను ఊహించుకునేందుకు, వారి సృజనాత్మక ఆలోచనలను ఇతరులకు మరింత సమర్థవంతంగా వివరించడానికి ఏఐ ఎలా సహాయపడుతుందనే అంశాలపై కూడా ఈ వర్క్‌షాప్‌లో చర్చించారు.
వర్క్‌షాప్‌కు హాజరైన వారు ఆనంద్ పాండేతో ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు. విభిన్న ఏఐ టూల్స్, ఏపీఐ యాక్సెస్, క్రియేటివ్ పరిశ్రమలో భవిష్యత్తు కెరీర్ అవకాశాల గురించి ఆయన్ను అడిగి తెలుసుకున్నారు. కథలు చెప్పే రచయితలు, దర్శకులకు మద్దతుగా నిలవడానికి.. చలనచిత్ర నిర్మాణంలో సరికొత్త అవకాశాలను విస్తరించడానికి ఏఐకి ఉన్న సామర్థ్యాన్ని తెలియజేస్తూ ఈ సెషన్ ఎంతో సానుకూల దృక్పథంతో ముగిసింది.
19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో నిర్వహించిన వరుస వర్క్‌షాప్‌లలో ఇదే చివరిది కావడం విశేషం.
***
रिलीज़ आईडी:
2276067
| Visitor Counter:
4