MIFF banner

ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2026: ఆస్కార్ అవార్డు గ్రహీత లఘు చిత్రాలకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులు

ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్) 2026 చివరి దశకు చేరుకుంది. లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు, యానిమేషన్ ద్వారా ప్రపంచ స్థాయి కథనాన్ని (స్టోరీటెల్లింగ్) చాటిచెబుతూ ఈ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి.  

ఈ చలనచిత్రోత్సవంలో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్న విభాగాల్లో 'ఆస్కార్ విజేతలు' ఒకటి. ఇందులో భాగంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అకాడమీ అవార్డు గ్రహీతల లఘుచిత్రాలను ప్రదర్శించారు. ఈ ప్రత్యేక విభాగం సమకాలీన ప్రపంచ సినిమాలోని కొన్ని అత్యుత్తమ చిత్రాలను భారతీయ ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. అద్భుతమైన సృజనాత్మకత, ఆవిష్కరణలు, భావోద్వేగభరితమైన కథనాలను ఇవి ఇక్కడ ఆవిష్కరిస్తున్నాయి. 

ముంబయిలోని చలనచిత్ర ప్రియులకు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన నాలుగు అద్భుతమైన కళాఖండాలను వీక్షించే అరుదైన అవకాశం లభించింది:

ఎంఐఎఫ్ఎఫ్ 2026లో ప్రదర్శితమౌతున్న ఆస్కార్ అవార్డు గ్రహీత చిత్రాల జాబితా:

  • ఐ యామ్ నాట్ ఎ రోబోట్ (బెల్జియం, నెదర్లాండ్స్)

విక్టోరియా వార్మర్‌డ్యామ్ దర్శకత్వం వహించిన ఈ ‘డార్క్ సైన్స్ కాల్పనిక కామెడీ’ చిత్రం.. 'ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్' విభాగంలో 2025 అకాడమీ అవార్డును గెలుచుకుంది. ఆన్‌లైన్ క్యాప్చా పరీక్షల్లో పదే పదే విఫలమయ్యే లారా అనే మ్యూజిక్ ప్రొడ్యూసర్ కథ చుట్టూ ఇది తిరుగుతుంది. ఈ క్రమంలో ‘నేను నిజంగానే రోబోనా?’ అనే ఒక ఇబ్బందికరమైన ప్రశ్న ఆమెను తీవ్రమైన ఒత్తిడి, ఆలోచనకు గురిచేస్తుంది.

  • ఇన్ ది షాడో ఆఫ్ సైప్రస్ (ఇరాన్)

షిరిన్ సోహానీ, హొస్సేన్ మొలాయెమి సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రభావవంతమైన చిత్రం.. 'ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్' విభాగంలో 2025 అకాడమీ అవార్డును గెలుచుకుంది. సముద్ర తీర నేపథ్యంలో సాగే ఈ కథ.. పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో బాధపడుతున్న ఒక విశ్రాంత సముద్ర కెప్టెన్, అతని కుమార్తె మధ్య ఉన్న ఉద్రిక్త సంబంధాల చుట్టూ తిరుగుతుంది.

  • ది గర్ల్ హూ క్రైడ్ పర్ల్స్ (కెనడా)

ప్రఖ్యాత యానిమేషన్ ద్వయం క్రిస్ లావిస్, మాసిక్ స్జెర్బోవ్స్కి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. 98వ అకాడమీ అవార్డులలో 'ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్' విభాగంలో 2026 ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. 20వ శతాబ్దపు ఆరంభంలో మాంట్రియల్ నేపథ్యంలో సాగే ఈ కథ.. కన్నీళ్లు ముత్యాలుగా మారే ఒక అమ్మాయితో ప్రేమలో పడిన ఒక పేద అబ్బాయి జీవితాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ క్రమంలో అతడు తన దురాశకు, నిజమైన ప్రేమకు మధ్య దేనిని ఎంచుకోవాలనే సంఘర్షణను ఈ చిత్రం అద్భుతంగా చూపిస్తుంది.

  • టూ పీపుల్ ఎక్స్ఛేంజింగ్ సలైవా (ఫ్రాన్స్, అమెరికా)

ఫ్రెంచ్, భారతీయ సంతతికి చెందిన బ్రూక్లిన్ విజువల్ ఆర్టిస్ట్ అలెగ్జాండర్ సింగ్, నటాలీ ముస్టేటా సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అద్భుతమైన ఊహాజనిత చిత్రం.. 2026 అకాడమీ అవార్డుల్లో 'ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్' విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఒకరినొకరు కొట్టుకునే 'చెంపదెబ్బలు' కరెన్సీగా చలామణి అయ్యే, అలాగే 'ముద్దు పెట్టుకున్నందుకు' మరణశిక్ష విధించే ఒక వింత సమాజం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇది ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన, ఆలోచింపజేసే సినిమా అనుభూతిని అందిస్తుంది.

ముంబయి నగరాన్ని దాటకుండానే అంతర్జాతీయ లఘు చిత్ర నిర్మాణంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన చిత్రాలను వీక్షించే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ చలనచిత్ర ప్రదర్శనలు ఇక్కడి విద్యార్థులు, కాబోయే దర్శకులు, సినీ ప్రియులకు కల్పించాయి.

ఈ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రదర్శనలు ముగిసిన తర్వాత హర్షధ్వానాలు చేస్తూ చిత్రాలలోని విభిన్న కథన శైలులను, కళాత్మక నైపుణ్యాన్ని, భావోద్వేగాల లోతును వారు ఎంతగానో అభినందించారు. 

ఎంఐఎఫ్ఎఫ్ 2026 ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో 'ఆస్కార్ విజేతల' విభాగం ఈ చలనచిత్రోత్సవంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రదర్శనలలో ఒకటిగా నిలిచింది. ఇది ప్రపంచ సినిమాకు ముంబయి నగరం ఒక శక్తిమంతమైన వేదిక అని మరోసారి నిరూపించింది.

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2275790   |   Visitor Counter: 8