ఎంఎఫ్‌ఐఐ వేదికపై ‘రేపటి సృజనాత్మక మేధావుల’ అద్భుత దృక్పథం… యువ దర్శకులను ప్రోత్సహిస్తూ 9 చిత్రాల ప్రదర్శన
ముంబై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఎంఎఫ్‌ఐఐ) 2026 ప్రత్యేక కార్యక్రమమైన క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో (సీఎంఓటీ) కింద అద్భుతమైన లఘు చిత్రాల సమూహారాన్ని గర్వంగా ప్రదర్శిస్తోంది. ఈ వేదిక భారత్ నలుమూలల నుంచి వచ్చిన యువ చలనచిత్ర దర్శకుల సృజనాత్మకత, ఊహాశక్తి, కథా నైపుణ్యాలను వేడుకగా ఆవిష్కరిస్తోంది.
ఎంపిక చేసిన తొమ్మిది లఘు చిత్రాలు సాంకేతికత, బంధాలు, మానసిక ఆరోగ్యం, గుర్తింపు, మానవీయ సంబంధాలు వంటి ఆధునిక సమాజ ఇతివృత్తాల చుట్టూ తిరుగుతాయి.
అర్షాలీ జోస్ దర్శకత్వం వహించిన గుల్లు చిత్రం గుల్షన్ అనే వ్యక్తి కథ చుట్టూ తిరుగుతుంది. గోవాలో తన ఫోన్‌ను పోగొట్టుకున్న అతనికి సలీమ్ అనే ఒక విచిత్రమైన డ్రైవర్ ద్వారా ఊహించని విధంగా జీవిత సత్యాలు, ఉపశమనం లభిస్తాయి.
సూర్యాన్ష్ దేవ్ శ్రీవాస్తవ దర్శకత్వం వహించిన హే మాయ చిత్రంలో ఒక జంట తమ ప్రేమ బంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ఒక ఏఐ రిలేషన్‌షిప్ అడ్వైజర్ (కృత్రిమ మేధస్సు సలహాదారు) సహాయం తీసుకుంటుంది. అయితే మనసుకు సంబంధించిన విషయాల్లో సాంకేతికతపై ఆధారపడటం వల్ల ఎలాంటి చిక్కులు వస్తాయనేది ఇందులో చూపించారు.
విష్ణు పీకే దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఖాలీ ఖోప్డీ ఒక ఆలోచనాత్మక ప్రయాణాన్ని ప్రదర్శిస్తుంది. రేపటి రోజు అనేది ఎప్పటికీ రాకూడదని కోరుకునే ఒక వ్యక్తి జీవితం ప్రయాణాన్ని ప్రదర్శిస్తుంది. చివరకు నిజమైన జీవితం విలువను ఆయన ఎలా తెలుసుకున్నాడనేది ఈ కథాంశం.
దర్శకురాలు సృష్టి గార్గ్ రూపొందించిన కోకుమ్ చిత్రం యానిమేషన్, లైవ్ యాక్షన్ కలయికతో సాగుతుంది. డిజిటల్ బంధాల్లోని శూన్యతను గ్రహించి, నిజమైన మానవ సంబంధాల ప్రాధాన్యతను తెలుసుకునే ఒక యువతి కథను ఇది తెలియజేస్తుంది.
సూర్యాన్ష్ దేవ్ శ్రీవాస్తవ దర్శకత్వం వహించిన లవ్ ఫిక్స్ సబ్‌స్క్రిప్షన్ చిత్రంలో.. ఓ యువతి తన ప్రియుడిని మెరుగుపరిచేందుకు రూపొందించిన ఒక ప్రత్యేక సేవాకు చందా కడుతుంది. దీనివల్ల ఆమె జీవితంలో ఎలాంటి ఊహించని, హాస్యాస్పదమైన పరిణామాలు చోటుచేసుకున్నాయనేది ఈ కథాంశం.
రఘునాథ్ ఎస్ఎన్ దర్శకత్వం వహించిన ది పేపర్ స్కై చిత్రం.. నీరజ అనే మహిళ కథ ఆధారంగా సాగుతుంది. ఒకప్పుడు ముంబైలో ట్రాఫిక్ గర్ల్‌గా గుర్తింపు పొందిన ఆమె జీవితం గోవాలో ఒక జర్నలిస్ట్ ఆమెను వెతుక్కుంటూ వచ్చిన తర్వాత ఎలాంటి ఊహించని మలుపులు తిరిగిందనేది ఇందులో చూపించారు.
పీయూష్ శర్మ దర్శకత్వం వహించిన ది విండో చిత్రం.. 70 ఏళ్ల వయసున్న ఒక బామ్మ, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఆమె మనవరాలి మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో అందంగా అన్వేషిస్తుంది. వేర్వేరు ప్రపంచాలకు చెందినవారైనప్పటికీ, వారు తమ మధ్య ఉన్న ఉమ్మడి భావాలను ఎలా కనుగొన్నారనేది ఈ కథ.
దర్శకురాలు సంజోలి మలానీ రూపొందించిన ది ఉమెన్ హూ హాస్ ఎ నేమ్ చిత్రం... ధైర్యం, స్థితిస్థాపకతతో కూడిన ఒక శక్తిమంతమైన కథను తెలియజేస్తుంది. ఆన్‌లైన్ వేధింపులు, బహిరంగ అవమానాలకు గురైన ఆ మహిళ వాటిపై తిరిగి ఎలా పోరాడింది అనేది ఇందులో శక్తిమంతంగా చూపించారు.
ఈ విభాగంలోని చిత్రాల జాబితాను పూర్తి చేస్తూ.. బోనితా రాజ్‌పురోహిత్ దర్శకత్వంలో వచ్చిన వి కెన్ హియర్ ద సేమ్ మ్యూజిక్ చిత్రం మనసును హత్తుకునే ప్రేమకథ. మాట్లాడలేని ఒక వ్యక్తి, చూపులేని ఒక మహిళ.. తమ మధ్య ఉన్న కమ్యూనికేషన్ అడ్డంకులను అధిగమించడానికి, తమ భావాలను పంచుకోవడానికి సాంకేతికతను ఎలా ఉపయోగించుకున్నారనేది ఈ చిత్రం ఎంతో ఆకట్టుకునేలా వివరిస్తుంది.
ఈ చిత్రాలన్నీ సమకాలీన సమస్యలను ధైర్యంగా ప్రస్తావిస్తూనే సానుభూతి, ప్రేమ, మానవీయ సంబంధాల శాశ్వత ప్రాధాన్యతను చాటిచెప్పే నవతరం చలనచిత్ర నిర్మాతల గళాన్ని ప్రతిబింబిస్తాయి.
క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో కార్యక్రమం ద్వారా ఎదుగుతున్న కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి, యువ కథకులకు తమ సృజనాత్మకతను జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల ముందు ప్రదర్శించే ఒక ప్రతిష్టాత్మక వేదికను అందించడానికి ఎంఐఎఫ్‌ఎఫ్ తన నిబద్ధతను కొనసాగిస్తోంది.
క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో (సీఎంఓటీ) గురించి
క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో అనేది భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ సంయుక్తంగా చేపట్టిన ఒక దార్శనిక కార్యక్రమం. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎదుగుతున్న సరికొత్త తారలను గుర్తించడం, వారిని తీర్చిదిద్దడం, ప్రపంచానికి పరిచయం చేయడం కోసం దీనిని రూపొందించారు. ఇది కేవలం ఒక ప్రతిభా కార్యక్రమం మాత్రమే కాదు.. దేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే భవిష్యత్తు కథకులకు ఇదొక అద్భుతమైన వేదిక
ప్రతి సంవత్సరం సీఎంఓటీ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న నూతన చలనచిత్ర దర్శకుల్లో సహజమైన అభిరుచిని వెలికితీసి, వారిని సినిమా రంగంలో అత్యుత్తమంగా రాణించేలా తీర్చిదిద్దుతోంది. ఆసియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చలన చిత్రోత్సవాల్లో ఒకటైన అంతర్జాతీయ వేదికపై తమ నైపుణ్యాలను ప్రదర్శించే అసాధారణ అవకాశాన్ని ఇది యువతకు కల్పిస్తోంది.
భారతదేశపు ప్రముఖ చలన చిత్రోత్సవమైన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికగా ఈ కార్యక్రమం ఇప్పటి వరకు నాలుగు విడతలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
***
रिलीज़ आईडी:
2275583
| Visitor Counter:
4