చిత్రరూపకర్తలకు కెమెరా కన్నా జిజ్ఞాసే గొప్ప సాధనం: ఎమ్ఐఎఫ్ఎఫ్-2026 మాస్టర్‌క్లాస్‌లో సంజీవ్ శివన్
ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో భాగంగా ఈ రోజు "సామాజిక హితమైన సినిమా: సమస్యలను కథనాలుగా మార్చడం, వాటిని ప్రపంచం దృష్టికి తీసుకురావడం" అంశంపై జాతీయ పురస్కార గ్రహీత, డాక్యుమెంటరీ చిత్రాల రూపకర్త అయిన శ్రీ సంజీవ్ శివన్ మాస్టర్‌క్లాస్ ఇచ్చారు. వర్ధమాన కథకులు సాంకేతికత కన్నా జిజ్ఞాసకే ప్రాధాన్యమివ్వాలని కోరారు.
చిత్రోత్సవంలో కొనసాగుతున్న మాస్టర్‌క్లాస్ సిరీస్‌లో భాగంగా నిర్వహించిన ఈ కార్యశాలలో శివన్ తన కెరీర్‌లోని 75కు పైగా డాక్యుమెంటరీలు, 30కి పైగా షార్ట్ ఫిల్మ్‌లు, అనేక ఫీచర్ ఫిల్మ్‌ల నుంచి పలు ఉదాహరణలను ఉటంకిస్తూ... నిజ జీవిత సమస్యలను ప్రభావవంతమైన సినిమా కథనాలుగా మార్చే తెర వెనుక సంగతులను వివరించారు.
"మీ దగ్గర ఉండవలసిన అత్యంత ముఖ్యమైన సాధనం కెమెరాలు కాదు... జిజ్ఞాస అని నేను భావిస్తున్నాను" అని శివన్ అన్నారు. ఖరీదైన పరికరాల కన్నా పరిశీలన, పరిశోధన, ప్రజలతో వాస్తవికంగా మమేకమవడం ద్వారానే ఆకట్టుకునే కథలు పుడతాయని ఆయన జోడించారు.
తన సినీ ప్రస్థానంలోని సంఘటనలను పంచుకున్న శివన్... ఎన్నో ప్రశంసలు పొందిన తన చిత్రాలు రూపుదిద్దుకున్న తీరును వివరించారు. అమెరికాలో అనుకోకుండా ఒక ఓజా బోర్డును చూడటం తనలో కుతూహలాన్ని ఎలా రేకెత్తించింది... అది మొదట 15 నిమిషాల డాక్యుమెంటరీకి, చివరికి మమ్ముట్టి నటించిన మలయాళ ఫీచర్ చిత్రం 'అపరిచితన్'కు ఎలా దారితీసిందో ఆయన గుర్తుచేసుకున్నారు. "ఆ సినిమా మొదట డాక్యుమెంటరీగా మొదలై, తర్వాత ఫీచర్ చిత్రంగా మారింది" అని తెలిపిన ఆయన... ఒకే ఆలోచన వివిధ ఫార్మాట్లలో ఎలా రూపాంతరం చెందుతుందో వివరించారు.
డాక్యుమెంటరీలు అంతిమంగా విషయాల గురించి కాకుండా ప్రజల గురించినవేనని శివన్ ఔత్సాహిక చిత్రరూపకర్తలకు గుర్తు చేశారు. "మీరు జాలర్లపై డాక్యుమెంటరీ తీస్తుంటే, ఆ కథ చేపలు పట్టడం గురించి కాదు... అది వారి మనుగడ గురించి. మీరు ఒక గ్రామంపై సినిమా తీస్తుంటే, అది ఆ భౌగోళిక ప్రదేశం గురించి కాదు... ఆ ప్రాంత గుర్తింపు గురించి" అని ఆయన వ్యాఖ్యానించారు.
డాక్యుమెంటరీ విషయాల పట్ల నమ్మకాన్ని పెంచుకోవాల్సిన ప్రాముఖ్యతనూ ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. "ప్రజలు మనసు విప్పి మాట్లాడటానికి ముందు వారికి సౌకర్యంగా అనిపించాలి. దానికి రోజులు, నెలలు, సంవత్సరాలూ పట్టవచ్చు" అని ఆయన అన్నారు.
నాన్-ఫిక్షన్ చిత్రాల రూపకల్పనలో నైతిక బాధ్యతల గురించి ప్రస్తావిస్తూ, సంచలనాల కోసం తప్పు మార్గంలో వెళ్లవద్దని హెచ్చరించారు. "మీరు ఒక డాక్యుమెంటరీ చేస్తున్నప్పుడు, మీకు ఒక బాధ్యత ఉంటుంది. కేవలం నాటకీయంగా చూపించడం కోసం మీరు తప్పుడు విషయాలను చూపించకూడదు, వివరించకూడదు," అని ఆయన అన్నారు.
మానవ అక్రమ రవాణా, వ్యభిచారం తర్వాత తమ జీవితాలను పునర్నిర్మించుకుంటున్న మహిళల జీవితాలను అన్వేషించిన 'లిటిల్ విమెన్', సంగీతకారుడు శంకర్ మహదేవన్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'డీకోడింగ్ శంకర్' డాక్యుమెంటరీ, భారత నావికాదళం కోసం చేపట్టిన ప్రాజెక్టుల వంటి తన రచనల గురించి ఆయన చర్చించారు. తన డాక్యుమెంటరీ 'ఆఫ్టర్ లైఫ్'... తనకు పురస్కారం అందించిన మలయాళ చలనచిత్రం 'వెనలోడుంగతే' (అంతులేని వేసవి)కి ఎలా స్ఫూర్తినిచ్చిందో ఆ సీనియర్ చిత్రరూపకర్త వెల్లడించారు. డాక్యుమెంటరీ పరిశీలనలు కల్పనకు ఎలా పునాదిగా నిలుస్తాయో ఇది నిరూపించింది.
డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, ఓటీటీ సేవలు కల్పించిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని యువ చిత్రరూపకర్తలను ప్రోత్సహిస్తూ... సినిమా రూపకల్పన గతంలో కంటే ఇప్పుడు మరింత సులభమైందని శివన్ అన్నారు. "మీకు పెద్ద బృందం అవసరం లేదు. మంచి లైవ్ సౌండ్ ఉంటే చాలు. అంతకు మించి, ఒక సినిమా తీయడానికి ముగ్గురి కంటే ఎక్కువ మంది అవసరం లేదు" అని ఆయన అన్నారు.
సమావేశాన్ని ముగిస్తూ, శివన్ తన కెరీర్‌కు మార్గదర్శకమైన అంశాన్ని పునరుద్ఘాటించారు. "మీరు కలిసే ప్రతి వ్యక్తిలో, ప్రతిచోటా ఒక కథ ఉంటుంది. మీ కథను మీరే సృష్టించుకోండి. గుర్తింపును పెంచుకోవడానికి, పంపిణీ అవకాశాలను దక్కించుకోవడానికి వాటిని ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో వ్యూహాత్మకంగా ప్రదర్శించండి" అని ఆయన సూచించారు.
***
रिलीज़ आईडी:
2275429
| Visitor Counter:
9