డాక్యుమెంటరీ చిత్రరూపకర్తలకు అవకాశాలను అందిస్తున్న ఓటీటీ వేదికలు
19వ ఎమ్ఐఎఫ్ఎఫ్ ఓపెన్ ఫోరమ్‌లో అభిప్రాయపడిన నిపుణులు
భవిష్యత్ తరాల కోసం చరిత్ర, సంస్కృతిని పరిరక్షించడంలో డాక్యుమెంటరీలు సహాయపడతాయి: రమేష్ పతంగే
19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎమ్ఐఎఫ్ఎఫ్)లో భాగంగా జరిగిన ఇండియన్ డాక్యుమెంటరీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐడీపీఏ) ఓపెన్ ఫోరమ్‌లో, “స్ట్రీమింగ్ విప్లవం: ఓటీటీ యుగంలో డాక్యుమెంటింగ్” అనే అంశంపై సమావేశం నిర్వహించారు. స్ట్రీమింగ్ వేదికలు డాక్యుమెంటరీ చిత్రాల రూపకల్పనను మారుస్తున్న తీరు... చిత్ర రూపకర్తల కోసం కొత్త అవకాశాలను కల్పిస్తున్న విషయాలను చర్చించడానికి ఓటీటీ, మీడియా, డాక్యుమెంటరీ రంగాల నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
షెమరూ బిజినెస్ హెడ్ కిన్నారి డేవ్... వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ సౌత్ ఏషియా కంటెంట్ హెడ్ సాయి అభిషేక్... సీనియర్ జర్నలిస్ట్, రచయిత, పద్మశ్రీ పురస్కార గ్రహీత రమేష్ పతంగే... ప్రముఖ సినిమాటోగ్రాఫర్, చిత్రరూపకర్త ధరం గులాటి ఈ ప్యానెల్‌లో ఉన్నారు. ఈ సమావేశానికి చిత్రరూపకర్త లలిత్ వచాని అనుసంధానకర్తగా వ్యవహరించారు.
ఫెస్టివల్స్, ఫిల్మ్ సొసైటీలు, పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ల పరిధిని దాటి... భారత్‌లోని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విస్తృత ప్రేక్షకులకు సినిమాలను తీసుకువెళ్లడం ద్వారా ఓటీటీ వేదికలు డాక్యుమెంటరీల పంపిణీని మార్చివేసిన తీరుపై ప్రధానంగా చర్చ జరిగింది. చిత్రరూపకర్తలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి, వీక్షకులతో నేరుగా అనుసంధానమయ్యేందుకు స్ట్రీమింగ్ వేదికలు కొత్త అవకాశాలను సృష్టించాయని ప్యానెలిస్టులు అంగీకరించారు.
వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ అనుసరించే కంటెంట్ వ్యూహంలో డాక్యుమెంటరీలు కీలక భాగంగా కొనసాగుతున్నాయని సాయి అభిషేక్ అన్నారు. చరిత్ర, పురాణాలు, సాహసం, జీవిత చరిత్రలు, క్రైమ్ వంటి జానర్‌లు ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకోగల అసలైన కథలు, ప్రత్యేక వినియోగ అవకాశం, సరికొత్త దృక్కోణాల కోసం... ముఖ్యంగా భారత్‌కు చెందిన కథల కోసం ఈ వేదికలు చూస్తున్నాయని ఆయన తెలిపారు.
మారుతున్న ప్రేక్షకుల అభిరుచులను అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యతను కిన్నారి షా ప్రధానంగా ప్రస్తావించారు. నేటి ప్రేక్షకులు ఆకట్టుకునే కథనాలను ఆశిస్తున్నారని, చిత్రరూపకర్తలు తమ కథల వాస్తవికతను నిలుపుకుంటూనే... మారుతున్న వీక్షణ అలవాట్లకు అనుగుణంగా మారాలని ఆమె అన్నారు. డాక్యుమెంటరీ రూపకర్తలు వినూత్న ఆలోచనలతో ఓటీటీ వేదికలను సమగ్రంగా వినియోగించుకోవాలని ఆమె ప్రోత్సహించారు.
డాక్యుమెంటరీలకు మరింత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని ధరం గులాటి స్పష్టం చేశారు. ఎన్నో ప్రశంసలు పొందిన డాక్యుమెంటరీ చిత్రాలు అంతర్జాతీయ ఉత్సవాల్లో గుర్తింపు పొందుతున్నప్పటికీ... భారత్‌లో విస్తృత పంపిణీని, ప్రేక్షకులను పొందడంలో తరచుగా ఇబ్బందులు పడుతున్నాయని ఆయన గమనించారు.
డాక్యుమెంటరీల సామాజిక పాత్ర గురించి ప్రస్తావించిన రమేష్ పతంగే... అవి మహనీయుల జీవితాలు, వారు చేసిన సేవ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఒక ముఖ్యమైన మాధ్యమంగా ఉపయోగపడతాయని అన్నారు. డాక్యుమెంటరీలు చరిత్రను పరిరక్షించడంలో, సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలో, యువ తరాలకు భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని, జాతీయ విలువలను పరిచయం చేయడంలో సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.
కథనం, పంపిణీ, ప్రేక్షకుల భాగస్వామ్యం, ఓటీటీ యుగంలో డాక్యుమెంటరీ చిత్రరూపకల్పన భవిష్యత్తుపై జరిగిన సమగ్ర చర్చతో ఈ సమావేశం ముగిసింది.
* * *
रिलीज़ आईडी:
2275329
| Visitor Counter:
8