19వ ఎంఐఎఫ్ఎఫ్ చలనచిత్రోత్సవం: మానవ భావోద్వేగాలకు అద్దం పట్టిన చిత్రాలు
ప్రేక్షకులను కట్టిపడేసిన మిడ్ ఫెస్ట్ చిత్రాలు.. ‘ఈనీ, మీనీ మినీ, మో’, ‘హైనా’, ‘ఐ లవ్ యు, ఐ లీవ్ యు ’
19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్) 2026లో భాగంగా ప్రదర్శించిన ‘ఈనీ, మీనీ, మినీ, మో!’, ‘హైనా’, ‘ఐ లవ్ యు, ఐ లీవ్ యు’ చిత్రాలు ప్రేక్షకులను అద్భుతమైన భావోద్వేగాలు, దృశ్యరూపంలో మంత్రముగ్ధులను చేశాయి. ఈ చలనచిత్రోత్సవంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రత్యేక ‘మిడ్ ఫెస్ట్’ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాలు ప్రదర్శితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ షార్ట్ ఫిక్షన్, యానిమేషన్, డాక్యుమెంటరీ చిత్రాలతో రూపొందించిన ఈ ప్రత్యేక విభాగం.. ఈ ఏడాది ‘మిఫ్’ ఎంఐఎఫ్ఎఫ్ వేడుకల్లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
19వ ఎంఐఎఫ్ఎఫ్‌లో ప్రదర్శితమైన ‘ఈనీ, మీనీ, మైనీ, మో!’ యానిమేషన్ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రదర్శన ద్వారా ఈ సినిమా అంతర్జాతీయ ప్రీమియర్ గుర్తింపును దక్కించుకుంది. సూర్యుడిలా ప్రకాశించే తల కలిగిన ‘ఇయోస్’ అనే ఒక ఒంటరి పౌరాణిక బాలుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మేఘాల మధ్య ఉండే ఇతర పిల్లలతో కలవలేక, ఇయోస్ తీవ్రమైన ఒంటరితనాన్ని, అపార్థాలను ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో జరిగిన ఒక దురదృష్టకరమైన అల్లరి చేష్ట వల్ల అతను భూమిపైకి పడిపోతాడు. అక్కడ అతనికి ఒక చిన్న బాలుడు పరిచయమై, వెంటనే స్నేహంగా మారుతుంది.. ఈ ఊహించని పరిచయం.. ఇయోస్ తన గురించి తాను ఆలోచించే విధానాన్ని, సమాజంలో తన ఉనికిని పూర్తిగా మార్చేస్తుంది. సహచరులతో కలవలేక, సమాజంలో ఒంటరిగా మిగిలిపోయామని భావించే పిల్లలు ఎదుర్కొనే మానసిక సవాళ్లను ఈ చిత్రం అత్యంత సున్నితమైన కథనంతో, ఊహాజనిత దృశ్యాలతో అద్భుతంగా ఆవిష్కరించింది. తోటివారిని ఆదరించడం, సానుభూతి చూపడం, కలుపుకుపోవడం అనేవి ఒకరి జీవితాన్ని ఎలా మారుస్తాయో ఈ చిత్రం చూపించింది. అందుకే ఇది అన్ని వయసుల వారిని ఆకట్టుకునేలా సాగింది. ఈ చిత్ర దర్శకురాలు ఆండ్రియా స్జెలెసోవా. ‘మలాడీ’, ‘మాన్ అమీ’, ‘అనిడాక్ 19 20 18’, ‘ఆఫ్టర్‌నూన్ టీ’ వంటి చిత్రాల ద్వారా సమకాలీన యానిమేషన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె అవార్డు గెలుచుకున్న గ్రాడ్యుయేషన్ చిత్రం ‘సిస్టర్స్’ 2021లో ప్రతిష్టాత్మక అనెసీ అంతర్జాతీయ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమవడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదరించారు. ముంబయిలో జరిగిన ఈ సినిమా ప్రదర్శనకు చిత్ర లేఅవుట్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్ ఎంఎస్ ఆండ్రియా ఆర్సే హాజరయ్యారు. ఆసియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ చలనచిత్రోత్సవంలో భాగం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఎంఐఎఫ్ఎఫ్‌లో మిడ్ ఫెస్ట్ విభాగంలో ప్రదర్శితమైన రెండో చిత్రం ‘హైనా’ ప్రేక్షకులను ఎంతగానో ఆలోచింపజేసింది. ఆల్టే ఉలన్ యాంగ్ దర్శకత్వం వహించిన ఈ మాండరిన్ (చైనీస్) భాషా లఘు కథా థ్రిల్లర్ చిత్రం.. ఈ ప్రదర్శన ద్వారా భారత్‌లో తన తొలి ప్రదర్శన గుర్తింపును సాధించింది. దర్శకుడు తన 16వ ఏట ఎదుర్కొన్న నిజజీవిత అనుభవాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హింసను కేవలం ఒక వేధింపుల కోణంలోనే కాకుండా, మనుషుల్లో ఉండే ప్రాథమిక భావోద్వేగాల రూపంలో చాలా వినూత్నంగా చూపించారు దర్శకుడు. గతంలో తోటి విద్యార్థుల వేధింపులకు గురైన మాస్టర్ అనే విద్యార్థి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సమాజంలో గుర్తింపు, ఆదరణ కోసం అతను తన వ్యక్తిగత నైతికతను పక్కనబెట్టి, ఆధిపత్యం చలాయించే అబ్బాయిల సమూహంలో చేరడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత, ఈ బృందం ‘90’ అనే సాధుస్వభావం, అద్భుతమైన ప్రతిభ గల ఒక కొత్త విద్యార్థిని లక్ష్యంగా చేసుకుంటుంది. వారు చేసే శారీరక హింసలో భాగంగా ఆ బాలుడి కళను ధ్వంసం చేస్తారు. చివరికి ఈ దారుణంలో మాస్టర్ కూడా భాగస్వామి అవుతాడు. అయితే వేధింపులు భరించలేని ‘90’ సహనం కోల్పోయి తిరగబడతాడు.. దీంతో గుంపుగా చేరి చేసే క్రూరత్వానికి, వేధింపుల వెనుక ఉండే భయంకరమైన మనస్తత్వానికి లోనవ్వడం ఎంత తప్పో మాస్టర్ గ్రహించడంతో కథ ముగుస్తుంది.
ఎంఐఎఫ్ఎఫ్ 2026 ‘మిడ్ ఫెస్ట్’ విభాగంలో ప్రదర్శితమైన చివరి చిత్రం ‘ఐ లవ్ యు, ఐ లీవ్ యు’ ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసింది. ఈ ప్రదర్శన ద్వారా ఈ సినిమా అంతర్జాతీయ ప్రీమియర్ గుర్తింపును దక్కించుకుంది. స్విస్ సంగీత విద్వాంసుడు డైనో బ్రాండావో తనను తాను ఆవిష్కరించుకునేందుకు, సమాజంలోని మూస పద్ధతులపై చేసిన పోరాటాన్ని ఈ చిత్రం కళ్ళకు కట్టింది. స్విస్ చలనచిత్ర దర్శకుడు మోరిస్ ఫ్రీబర్గ్‌హాస్ తెరకెక్కించిన బహుభాషా పూర్తి నిడివి చిత్రం.. ఇప్పటికే జూరిచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీగా గోల్డెన్ ఐ అవార్డుతో పాటు ఆడియన్స్ అవార్డును కూడా గెలుచుకుంది. పరిశీలకుడు, పాత్ర మధ్య ఉన్న సరిహద్దును చెరిపేస్తూ రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో స్వేచ్ఛాయుత స్వభావం కలిగిన స్విస్ సంగీతకారుడు డినో బ్రాండావో జీవితం ప్రధానాంశంగా నిలుస్తుంది. తన అసలైన వ్యక్తిత్వాన్ని దాచుకోవాలని కోరే సమాజంలో అతడు ఎదుర్కొనే సవాళ్లను ఈ చిత్రం చూపిస్తుంది. తన మెదడులోని తీవ్రమైన ఆలోచనల ఒత్తిడిని అధిగమించడానికి డినోకు సంగీతమే ఒక లయగా మారుతుంది. సినిమాటిక్ దృశ్యాలు, ఎలాంటి ఎడిటింగ్ చేయని సహజమైన దృశ్యాల కలయికతో రూపొందిన ఈ చిత్రం.. మానవ భావోద్వేగాల సంక్లిష్టతను అద్భుతంగా దాటి చూపించింది. ఒక వ్యక్తి తన భావాలను వ్యక్తపరిచినందుకు అతనిపై పిచ్చివాడనే ముద్ర వేయకుండా, తనలా తను జీవించే హక్కును, ఆనందించే హక్కును ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. దర్శకుడు ఫ్రీబర్గ్‌హాస్ కథ సాగుతున్న కొద్దీ క్రమంగా తనను తాను కూడా ఈ కథనంలో భాగం చేసుకుంటారు. దీనివల్ల ఇది కేవలం దర్శకుడి సినిమాగా కాకుండా, దర్శకుడు, పాత్రధారి ఇద్దరూ కలిసి సాగించిన ఒక సానుభూతి, అవగాహనతో కూడిన ప్రయాణంగా మారుతుంది. చిత్ర సంగీతాన్ని కేవలం నేపథ్య సంగీతంగానే కాకుండా... ఆనందానికీ, విముక్తికీ ప్రతీకగా ఉపయోగించారు. జీవితంలో ఎదురయ్యే పోరాటాలు, వాటిని అధిగమించి సాధించే ఆత్మవిశ్వాసం ఎలా ఒక వలయంగా మళ్లీ మళ్లీ వస్తుంటాయో ఈ సినిమా కథా గమనం చూపిస్తుంది. సమాజంలో అనారోగ్యంతో ఉన్నవారు, ఆరోగ్యంగా ఉన్నవారు అనే విభజనల మధ్య ఉన్న బలమైన వ్యత్యాసాన్ని ఈ చిత్రం అద్భుతంగా ప్రదర్శించింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు ప్రస్తుత కాలానికి అవసరమైన సందేశాన్ని అందిస్తూ... సమకాలీన డాక్యుమెంటరీ చిత్రాల్లో ‘ఐ లవ్ యూ, ఐ లీవ్ యూ’ ఒక విశేషమైన, ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది.
ఈ మూడు చిత్రాలు మానవ భావోద్వేగాల సంక్లిష్టతను ప్రతిబింబించే బలమైన కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. 19వ ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2026లో సినిమా వైభవాన్ని, స్థాయిని మరింతగా పెంచాయి.
***
रिलीज़ आईडी:
2275226
| Visitor Counter:
6