అనేక రూపాలు ఒకే దృక్పథం
చలనచిత్రోత్సవాల్లో వైవిధ్యం, ఆవిష్కరణ, కమ్యూనిటీని ప్రముఖంగా ప్రస్తావించిన ఎమ్ఐఎఫ్ఎఫ్ రౌండ్ టేబుల్
ప్రామాణిక గళాలు, మాతృభాషా కథనాలు ప్రపంచ సినిమాను పునర్నిర్మిస్తున్నాయి: ఆనంద్ వరదరాజ్
సామూహిక వీక్షణను కొనసాగిస్తూ, సినిమా సంస్కృతిని బలోపేతం చేస్తున్న చలనచిత్రోత్సవాలు: ప్రేమేంద్ర మజుందార్
యానిమేషన్‌కు మరింత గుర్తింపు, మద్దతు, ప్రపంచవ్యాప్త అవకాశాలు అవసరం: సావిత్రి హరి
స్థానిక సంప్రదాయాలు, భాషలతో ముడిపడిన చిత్రాలకు పెరుగుతున్న గుర్తింపు
ప్రామాణికత భౌగోళిక సరిహద్దులను అధిగమించిన తీరుకు ఇదే నిదర్శనం: దీపక్ కుమార్ బేష్రా
డాక్యుమెంటరీలు సమష్టి అభిప్రాయాలను నడిపిస్తాయి... చారిత్రక స్పృహను పరిరక్షిస్తాయి: నీలోత్పల్ మజుందార్
ప్రయోగాత్మక, వాణిజ్యేతర సినిమాకు ముఖ్య వేదికగా చలనచిత్రోత్సవాలు: పాట్రిసియా సాంచెజ్ మోరా
‘‘విభిన్న గళాలను వినిపించడంలో, వర్ధమాన ప్రతిభను పోషించడంలో, సినిమా వారసత్వాన్ని పరిరక్షించడంలో, సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడంలో చలనచిత్రోత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయి’’...
ఇది... 19వ ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎమ్ఐఎఫ్ఎఫ్) సందర్భంగా ఈరోజు జరిగిన “అనేక రూపాలు, ఒకే దృక్పథం: చలనచిత్రోత్సవాల్లో వైవిధ్యాల ప్రదర్శన” శీర్షికతో జరిగిన రౌండ్ టేబుల్ చర్చలో వక్తలు వ్యక్తం చేసిన అభిప్రాయం.
చిత్రరూపకర్తలు, విమర్శకులు, చిత్రోత్సవ డైరెక్టర్లు, పరిశ్రమ నిపుణులను ఒకచోట చేర్చిన ఈ చర్చ... సాంకేతిక ఆవిష్కరణలు, మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు, వాస్తవిక కథనానికి పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ యుగంలో చలనచిత్రోత్సవాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్న తీరును అన్వేషించింది.
ఈ సమావేశానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన పురస్కార గ్రహీత నటి షీనా చోహన్... విభిన్న సంస్కృతులు, అనుభవాలు గల ప్రజలను అనుసంధానించడంలో కథనానికి గల శక్తిని ప్రధానంగా ప్రస్తావించారు. ఒక చలనచిత్రోత్సవం ప్రపంచాన్ని విభిన్న కోణాల నుంచి చూసేందుకు... అవగాహనను, సానుభూతిని పెంపొందించగల కథలతో మమేకమయ్యేందుకు ప్రేక్షకులకు అవకాశం కల్పిస్తుందని ఆమె ఈ చర్చ ప్రారంభోపన్యాసంలో పేర్కొన్నారు. క్రెడిట్స్ ముగిసిన చాలా కాలం తర్వాత కూడా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే చిత్రాలు, తరచుగా స్థానిక అనుభవాల ద్వారా సార్వత్రిక సత్యాలను వ్యక్తపరిచేవేనని ఆమె పేర్కొన్నారు.
చిత్రోత్సవ వాతావరణంలో సినిమాలు చూడటంలోని విశిష్టమైన అనుభవం గురించి బెంగళూరు అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ (బీఐఎస్ఎఎఫ్ఎఫ్) వ్యవస్థాపకులు, ఆర్టిస్టిక్ డైరెక్టర్ ఆనంద్ వరదరాజ్ మాట్లాడుతూ... సినిమా ప్రాథమికంగా ఒక సామూహిక అనుభవమని అన్నారు. చీకటిగా ఉండే థియేటర్‌లో ఇతరులతో కలిసి సినిమా చూడటం... మరెక్కడా పునరావృతం చేయలేని ఒక ఉమ్మడి భావోద్వేగ ప్రయాణాన్ని సృష్టిస్తుందని ఆయన తెలిపారు. ఒక శక్తిమంతమైన సన్నివేశానికి ప్రేక్షకుల సామూహిక స్పందన, ఒక కళారూపంగా సినిమా సారాంశాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాన స్రవంతికి చెందని భాషల్లో నిర్మిస్తున్న చిత్రాల సంఖ్య పెరుగుతోందని పేర్కొంటూ... ప్రపంచ సినిమాలో మారుతున్న ధోరణులనూ ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. చిత్రరూపకర్తలు, రచయితలు తమ మాతృభాషల్లో చిత్రాలను రూపొందించడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, దీని ఫలితంగా మరింత సుసంపన్నమైన, ప్రామాణికమైన కథనాలు వెలువడుతున్నాయని ఆయన అన్నారు. కేవలం మెట్రో నగరాల నుంచే కాకుండా, ఇప్పుడు చిన్న పట్టణాలు, మారుమూల ప్రాంతాల నుంచి ఎన్నో అద్భుతమైన చిత్రాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో, చిత్రరూపకర్తలు తమ కథలను చెప్పడానికి యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, కృత్రిమ మేధ వంటి అధునాతన పద్ధతులను సృజనాత్మక సాధనాలుగా స్వీకరిస్తున్నారని ఆయన తెలిపారు.
లఘు చిత్రాలకు పెరుగుతున్న ప్రజాదరణ గురించి చర్చిస్తూ... నేటి ప్రేక్షకులు సమకాలీన జీవనశైలికి సరిపోయేవి, అర్థవంతమైనవి అయిన కథనాలను అందించే కంటెంట్‌ను కోరుకుంటున్నారని ఆయన అన్నారు. సమయం ఒక విలాసంగా మారిన ఈ రోజుల్లో, చలన చిత్రోత్సవాలు నాణ్యమైన లఘు చిత్రాలను గుర్తించి, ప్రదర్శించడం ద్వారా ఒక గురుతర బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి. దిగ్గజ చిత్రరూపకర్తలు రూపొందించిన అంతగా ప్రాచుర్యం పొందని చిత్రాలనూ ప్రేక్షకులకు పరిచయం చేయడానికీ ఈ ఉత్సవాలు సహాయపడతాయి. బీఐఎస్ఎఫ్ఎఫ్‌లో రిత్విక్ ఘటక్ రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శించడంతో... ఆయన గొప్ప లఘు చిత్రాలనూ తీశారని ప్రేక్షకులకు తెలిసింది.
సినిమా సంస్కృతిని తీర్చిదిద్దడంలో చలనచిత్రోత్సవాల పాత్రను ప్రముఖంగా ప్రస్తావించిన సినీ విమర్శకులు, ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు ప్రేమేంద్ర మజుందార్... సినిమాను ఒక సామూహిక కళారూపంగా, సినిమా వీక్షణను ఒక సామూహిక కార్యకలాపంగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా అర్థవంతమైన సినిమాను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించిన భారత సుదీర్ఘకాల ఫిల్మ్ సొసైటీ ఉద్యమానికి చలనచిత్రోత్సవాలు ఒక సహజమైన కొనసాగింపు అని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చలనచిత్రోత్సవాల వేగవంతమైన వృద్ధికి డిజిటల్ విప్లవం దోహదపడిందనీ ఆయన పేర్కొన్నారు. ఈ విస్తరణ చిత్రనిర్మాతలకు మరిన్ని అవకాశాలను సృష్టించినప్పటికీ... ఇది నాణ్యత, నియంత్రణకు సంబంధించిన సవాళ్లనూ తెచ్చిపెట్టింది. కళాత్మక శ్రేష్ఠతను ప్రోత్సహించడం, సాంస్కృతిక చర్చలు కొనసాగించడం, చలనచిత్రోత్సవ ఉద్యమానికి మొదట స్ఫూర్తినిచ్చిన విలువలను పరిరక్షించాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు.
చలనచిత్రోత్సవాలు తరతరాలుగా ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉన్నాయని ప్రేమేంద్ర మజుందార్ పేర్కొన్నారు. వాణిజ్య ప్రదర్శనల వలె కాకుండా, ఈ చిత్రోత్సవ ప్రేక్షకుల్లో తరచుగా చిత్రరూపకర్తలు, విమర్శకులు, సినిమా ఔత్సాహికులు భాగమై... ఆయా చిత్రాల కథనాల్లో పూర్తిగా లీనమయ్యేలా ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టిస్తారు. చాలా మంది పేరు పొందిన చిత్రరూపకర్తలు... వారి తొలి గుర్తింపు చిత్రోత్సవాల ద్వారా పొందినవారే.
యానిమేషన్ చిత్రం రూపకర్తలకు గల అవకాశాలు, ఆ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై మాట్లాడిన తెలంగాణ వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ (టీవీఏజీఏ) కన్సల్టెంట్ సావిత్రి హరి... యానిమేషన్‌ను ఇప్పటికీ ప్రధానంగా పిల్లల వినోద మాధ్యమంగానే చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. యానిమేషన్‌లో కళాత్మకంగా కథ చెప్పే సామర్థ్యం ఉన్నప్పటికీ... ఈ అభిప్రాయం ఫైనాన్సింగ్, పంపిణీలో అడ్డంకులను సృష్టిస్తోందని ఆమె అన్నారు. అంతర్జాతీయ ఉత్సవాల్లో భారతీయ యానిమేషన్‌కు గుర్తింపు పెరుగుతోందని ఆమె పేర్కొన్నారు. అయితే, భాషా ప్రాధాన్యాలు, పంపిణీ పద్ధతులు అనేక ప్రాజెక్టుల ప్రపంచవ్యాప్త విస్తరణను పరిమితం చేస్తున్నాయని ఆమె అన్నారు. చిత్ర రూపకర్తలు కేవలం సృజనాత్మకంగానే కాకుండా... మేధో సంపత్తి వ్యూహాలను అభివృద్ధి చేసుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లను అర్థం చేసుకోవడం ద్వారా వాణిజ్యపరంగానూ సిద్ధంగా ఉండాలని సావిత్రి హరి ప్రోత్సహించారు. మార్గదర్శకులు, పరిశ్రమ నిపుణులు, ప్రపంచవ్యాప్త ప్రేక్షకులతో చిత్రరూపకర్తలు అనుసంధానం కావడానికి ఈ చిత్రోత్సవాలు సహాయపడతాయని ఆమె తెలిపారు.
నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ మగ్దుమ్ మాట్లాడుతూ... భవిష్యత్ తరాల కోసం చిత్రాలను పరిరక్షించాల్సిన ప్రాముఖ్యతను స్పష్టం చేశారు. చిత్ర పరిరక్షణ వల్ల సినిమా చరిత్ర రాబోయే తరాలకు, కొత్త ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రధాన చలనచిత్రోత్సవాలు ఇప్పుడు పునరుద్ధరించిన క్లాసిక్ చిత్రాల కోసం ప్రత్యేక విభాగాలను కేటాయిస్తున్నాయని ఆయన వివరించారు. చిత్ర నిర్మాణం, చలనచిత్రోత్సవాలపై సాంకేతికత ప్రభావం గురించీ ఆయన మాట్లాడారు. డిజిటల్ వేదికలు, విభిన్న నేపథ్యాలకు చెందిన చిత్రరూపకర్తలు ప్రపంచవ్యాప్త ఉత్సవాలకు తమ చిత్రాలను సమర్పించడాన్ని సులభతరం చేశాయి. యానిమేషన్, మోషన్ గ్రాఫిక్స్, కృత్రిమ మేధలో పురోగతి సృజనాత్మక అవకాశాలను విస్తరింపజేస్తోంది. ఏఐ చిత్రాల కోసం ప్రత్యేకంగా ఎమ్ఐఎఫ్ఎఫ్ ఏర్పాటు చేసిన విభాగాన్ని ప్రస్తావిస్తూ... ఒక చిత్రాన్ని రూపొందించడానికి ఉపయోగించిన సాంకేతికత కంటే, అందులోని భావోద్వేగ ప్రామాణికతకే ప్రేక్షకులు ఎక్కువగా స్పందిస్తారని ఆయన అన్నారు.
సొసైటీ ఫర్ ఆదివాసీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ (ఎస్ఏఎఫ్‌డీఎఫ్), బరిపడ నేషనల్ ఇండీజీనస్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వ్యవస్థాపకులు, పురస్కార గ్రహీత, ప్రముఖ చిత్రరూపకర్త దీపక్ కుమార్ బేష్రా మాట్లాడుతూ... ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ప్రామాణికత కీలకంగా ఉంటుంది. ఆదివాసీ, గిరిజన వర్గాలు తమ కథలను విస్తృత ప్రేక్షకులతో పంచుకోవడానికి చలనచిత్రోత్సవాలు అమూల్యమైన అవకాశాలను అందిస్తాయని ఆయన అన్నారు. తమ సొంత జీవితాలు, సంస్కృతులు, అనుభవాలను ప్రతిబింబించే కథలతోనే ప్రేక్షకులు తరచుగా బలంగా మమేకమవుతారని దీపక్ కుమార్ బేష్రా పేర్కొన్నారు. ప్రామాణికత భౌగోళిక సరిహద్దులను అధిగమించి ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకర్షించగలదనడానికి... స్థానిక సంప్రదాయాలు, భాషలతో ముడిపడిన చిత్రాలకు పెరుగుతున్న గుర్తింపే నిదర్శమని ఆయన పేర్కొన్నారు.
ఆసియాలోనే తొలి డాక్యుమెంటరీ ఇంక్యుబేటర్ డాస్‌ఎడ్జ్ కోల్‌కతా వ్యవస్థాపక-అధ్యక్షులు నీలోత్పల్ మజుందార్ మాట్లాడుతూ... డాక్యుమెంటరీ చిత్రనిర్మాణంలో మారుతున్న పరిస్థితుల గురించి ప్రస్తావించారు. గత దశాబ్ద కాలంలో భారతీయ డాక్యుమెంటరీలు గణనీయ పరివర్తనకు లోనయ్యాయని, చిత్రరూపకర్తలు విస్తృత శ్రేణి అంశాలను, కథ చెప్పే విధానాలనూ అన్వేషిస్తున్నారని ఆయన గమనించారు. డాక్యుమెంటరీలు... సమస్యలు, భావోద్వేగాలు, వాస్తవ జీవితాలను ఒకచోట చేర్చి, చారిత్రక చైతన్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయని ఆయన అన్నారు. చాలా మంది డాక్యుమెంటరీ చిత్రాల రూపకర్తలు పరిమిత వనరులతోనే పనిచేస్తున్నప్పటికీ... వారి నిబద్ధత, అభిరుచి ఫలితంగా ఎన్నో ప్రభావవంతమైన చిత్రాలు వెలువడుతున్నాయని ఆయన తెలిపారు. వర్ధమాన డాక్యుమెంటరీ చిత్రరూపకర్తలు తమ సామర్థ్యాన్ని గ్రహించేలా సహాయపడటానికి మార్గదర్శకత్వం, నైపుణ్యాభివృద్ధి, సంస్థాగత మద్దతు అవసరమని ఆయన స్పష్టం చేశారు.
అంతర్జాతీయ దృక్కోణాన్ని అందిస్తూ... ఎల్'ఆల్టర్నెటివా ప్రో, ఎక్స్‌ట్రీమ్‌ల్యాబ్ ఫెస్ట్ డైరెక్టర్ ప్యాట్రిసియా సాంచెజ్ మోరా ఇలా అన్నారు. చలనచిత్రోత్సవాలు ప్రయోగాత్మక, వాణిజ్యేతర సినిమాకు ఒక ముఖ్యమైన వేదికను అందిస్తాయి. అవి చలనచిత్ర రూపకర్తలకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల సృజనాత్మక పద్ధతులను కనుగొనడానికి వీలు కల్పిస్తూనే, సంస్కృతుల మధ్య చర్చలనూ, సహకారాన్నీ ప్రోత్సహిస్తాయి.
కళాత్మక అన్వేషణ, సాంస్కృతిక వినిమయం, సామాజిక భాగస్వామ్యం కోసం చలనచిత్రోత్సవాలు కీలక వేదికలుగా నిలుస్తాయనే ఏకాభిప్రాయంతో చర్చ ముగిసింది. విభిన్న గళాలకు మద్దతునివ్వడం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, చిత్రరూకర్తలు-ప్రేక్షకుల మధ్య అర్థవంతమైన సంభాషణలకు అవకాశాలు కల్పించడం ద్వారా... చలనచిత్రోత్సవాలు స్థానిక కథల ప్రత్యేకతను చాటుతూనే, సినిమా ప్రపంచ భాషను బలోపేతం చేస్తున్నాయి. చర్చ ముగింపులో, ప్యానలిస్టులు చిత్రనిర్మాణ ప్రాథమిక ఉద్దేశంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చిత్రరూపకర్తలు ముందుగా తాము చెప్పాలనుకుంటున్న కథ గురించి, దానిని చెప్పడానికి సినిమా అత్యంత ప్రభావవంతమైన మాధ్యమమేనా కాదా అనే దాని గురించి ప్రగాఢ విశ్వాసం కలిగి ఉండాలనే సమష్టి అభిప్రాయం వెల్లడైంది. చిత్రాలు ప్రామాణికత, దృఢ విశ్వాసంతో నడవాలనీ వారు స్పష్టం చేశారు.
ఎమ్ఐఎఫ్ఎఫ్‌లో జరిగే రోజువారీ కార్యక్రమాల పత్రికా ప్రకటనలు, నాణ్యమైన ఫోటోలను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
***
रिलीज़ आईडी:
2274910
| Visitor Counter:
13