యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
’ఈ దేశం మన యువతదే: వికసిత్ భారత్ 2047 దిశగా సాగే ప్రయాణంలో వారు చురుకైన భాగస్వాములు కావాలి’’: యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే పిలుపు
పార్లమెంట్ భవనంలోని చారిత్రాత్మక సెంట్రల్ హాల్‌లో ఘనంగా ముగిసిన వికసిత్ భారత్ యువ పార్లమెంట్ 2026
వికసిత్ భారత్ స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిన నారీ శక్తి వందన్
प्रविष्टि तिथि:
17 JUN 2026 5:05PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఉన్న యువతలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించే వికసిత్ భారత్ యువ పార్లమెంట్ 2026 జాతీయ స్థాయి సమావేశాలు నేడు పార్లమెంట్ భవనంలో చారిత్రాత్మక సంవిధాన్ సదన్‌లో అవార్డుల ప్రధానోత్సవంతో ఘనంగా ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ జాతీయ స్థాయి సదస్సులో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎంపికైన 105 మంది యువ ప్రతిభావంతులు పాల్గొన్నారు. వీరంతా పార్లమెంటరీ చర్చలు, ప్రజాస్వామ్య భాగస్వామ్యం, వికసిత్ భారత్@2047 సాధనపై లోతైన చర్చలు, ఆలోచనలను పంచుకున్నారు.
ఈ ముగింపు, అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి డాక్టర్ పల్లవి జైన్ గోవిల్, అదనపు కార్యదర్శి శ్రీ నితీష్ కుమార్ మిశ్రా, సంయుక్త కార్యదర్శి శ్రీ శివ్ రతన్ తదితర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి శ్రీమతి ఖడ్సే మాట్లాడుతూ, 'వికసిత్ భారత్@2047' దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో యువత తప్పనిసరిగా క్రియాశీల భాగస్వాములు కావాలని చెప్పారు. యువత ప్రజాస్వామ్య సంస్థలతో మమేకమవ్వడానికి, జాతీయ చర్చలకు, దేశ నిర్మాణానికి దోహదపడటానికి వీలు కల్పించే ఒక వేదికగా యువ పార్లమెంట్‌ను ఆమె అభివర్ణించారు. అలాగే దేశ అభివృద్ధి ప్రయాణంలో యువత ఆకాంక్షలను, భాగస్వామ్యాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు 'మై భారత్' ఒక కీలకమైన కార్యక్రమమని తెలిపారు.
‘వికసిత్ భారత్ యువ పార్లమెంట్ 2026’ వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విజేతల ప్రకటన, బహుమతుల ప్రధానోత్సవంతో ముగిసింది. ఉత్తమ ప్రారంభ వక్త (రియా పాండే,ఢిల్లీ), ఉత్తమ ప్రశ్న (అపూర్వ శర్మ,హర్యానా), ఉత్తమ సమాధానకర్త (కెపోజో కపుహ్, నాగాలాండ్), ఉత్తమ స్వల్పకాలిక చర్చ(సైన్ చిరాగ్ కుమార్, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ దియూ) విజేతలుగా నిలిచారు.
కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన యువజన వ్యవహారాల విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. యువత ప్రజాస్వామ్య ప్రక్రియలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి, వారి నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, దేశ నిర్మాణంలో తమ వినూత్న ఆలోచనలను పంచుకోవడానికి ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన వేదికను కల్పించింది. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలుపొంది, జాతీయ స్థాయికి ఎంపికైన ఈ ప్రతిభావంతులంతా దేశ యువత వైవిధ్యాన్ని, వారి ఉన్నత ఆకాంక్షలను, నాయకత్వ సామర్థ్యాన్ని ఈ వేదికపై ప్రతిబింబించారు.
ఈ కార్యక్రమం జరిగినంత సేపూ యువ ప్రతినిధులు అసలు సిసలు పార్లమెంటరీ తరహా నడుమ చర్చలు, ప్రశ్నోత్తరాల సమయం, స్వల్పకాలిక చర్చలు, జాతీయ ప్రాధాన్యత కలిగిన వివిధ అంశాలపై నేపథ్యపరమైన చర్చల్లో అత్యంత చురుగ్గా పాల్గొన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో, దేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వామ్యం పంచుకోవడంలో భారతీయ యువతకు ఉన్న సామాజిక స్పృహ, సృజనాత్మకత, వారి దృఢ సంకల్పాన్ని ఈ చర్చలు స్పష్టంగా చాటిచెప్పాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ (అంతర్జాతీయ సహకారం) డైరెక్టర్ డాక్టర్ సారా జయల్ సాక్‌మీ.. 2026లో భారతదశ బ్రిక్స్ అధ్యక్షత అనే అంశంపై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ జనాభాలో దాదాపు 45 శాతం మంది బ్రిక్స్ దేశాల్లోనే ఉన్నారని, ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశాల సమూహంగా ఇది నిలిచిందని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ క్రమంలో భారత్‌కు ఉన్నఅపారమైన యువ శక్తి కేవలం దేశానికే కాకుండా, ప్రపంచ బలానికి ఒక ముఖ్యమైన వనరుగా మారిందని అభివర్ణించారు. అలాగే 2026 సంవత్సరానికి గాను భారతదేశ బ్రిక్స్ అధ్యక్షత యొక్క ప్రధాన థీమ్ ‘సహకారం, సుస్థిరత కోసం స్థితిస్థాపకత, ఆవిష్కరణలను పెంపొందించడం’ అనే అంశం గురించి ఆమె యువతకు సుదీర్ఘంగా వివరించారు.
కార్యక్రమ ముగింపు ఉపన్యాసంలో ‘మై భారత్’ సీఈఓ డాక్టర్ ప్రియాంక శుక్లా యువ ప్రతినిధుల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ... ఈ కార్యక్రమం 105 మందితో ప్రారంభమైనప్పటికీ, ముగిసే సమయానికి 105 సరికొత్త కలలు, ఉన్నత ఆకాంక్షలు ‘మై భారత్’తో చేతులు కలిపాయని కొనియాడారు. యువత జరిపిన చర్చలను, వారు కనబరిచిన ప్రతిభను అభినందిస్తూ.. ఇక్కడ విజేతలకు ఇచ్చే అవార్డులు పరిమితంగానే ఉండవచ్చు, కానీ యువతీయువకులు ప్రదర్శించిన ప్రతిభ, వారిలోని అపారమైన సామర్థ్యానికి మాత్రం ఎలాంటి హద్దులు లేవని అన్నారు.
ఈ యువ పార్లమెంట్ కార్యక్రమం.. దేశ నిర్మాణంలో యువతను చురుకైన భాగస్వాములుగా మార్చడానికి, వికసిత్ భారత్@2047 స్వప్నాన్ని సాకారం చేయడంలో వారి పాత్రను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది.
***
(रिलीज़ आईडी: 2274313)
आगंतुक पटल : 7