వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిజిదుకాన్ ద్వారా దేశంలోని 1.4 కోట్ల కిరాణా దుకాణాల డిజిటలైజేషన్‌కు డీపీఐఐటీ, ఓఎన్‌డీసీ ముందడుగు.. డిజిదుకాన్ ద్వారా ఎఫ్‌ఎంసీజీ రంగాన్ని అనుసంధానించే యత్నం


డిజిదుకాన్ విస్తరణపై పరిశ్రమ భాగస్వాముల విస్తృత చర్చలు... సాధారణ వాణిజ్య రంగ డిజిటలైజేషన్‌పై కీలక సూచనలు



प्रविष्टि तिथि: 12 JUN 2026 7:34PM by PIB Hyderabad

దేశంలోని సాధారణ వాణిజ్య రంగాన్ని డిజిటలైజ్ చేయడంపై చర్చించేందుకు పరిశ్రమల ప్రోత్సహాక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ), ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) భాగస్వామ్యంతో 12 జూన్ 2026న ‘సీపీజీ రౌండ్‌టేబుల్‌-భారత్ కామర్స్ చింతన్ శిబిరాన్ని’ నిర్వహించింది. ఈ సదస్సులో ప్రముఖ వినియోగదారు వస్తువుల సంస్థలు, పంపిణీదారుల వ్యవస్థలు, సాంకేతికత, సరుకు రవాణా భాగస్వామ్య సంస్థల అధినేతలు పాల్గొన్నారు.

 

మన దేశంలో 1.4 కోట్లకు పైగా ఉన్న కిరాణా దుకాణాలు దేశీయ నిత్యావసర వస్తువుల అమ్మకాల్లో దాదాపు 75 నుంచి 80 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అయినప్పటికీ ఈ రంగం ఇప్పటికీ పాత పద్ధతులు, విడివిడిగా ఉండే ఆర్డరింగ్ వ్యవస్థలు, పరిమిత ఇన్వెంటరీ సమాచారం, మాన్యువల్ విక్రయాల ప్రక్రియలపైనే నడుస్తోంది. దీనివల్ల అటు రిటైలర్లు, ఇటు పంపిణీదారులు, బ్రాండ్లు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

 

ఈ సదస్సులో ప్రధానంగా బీ2బీ కొనుగోళ్ల కోసం కిరాణా దుకాణాలను డిజిటలైజ్ చేసే లక్ష్యంతో ఓఎన్‌డీసీ తీసుకొచ్చిన డిజిదుకాన్ కార్యక్రమంపై చర్చించారు. వ్యాపార వ్యవస్థలో సామర్థ్యాన్ని పెంచేలా రూపొందించిన ఈ డిజిదుకాన్.. కిరాణా వ్యాపారులు నేరుగా వస్తువులను కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తుంది. దీనివల్ల కంపెనీల పథకాలపై స్పష్టత ఉండటం, సరుకు సకాలంలో అందడం మరియు పెట్టుబడి నిధుల నిర్వహణ మెరుగై వ్యాపారుల లాభాలు పెరుగుతాయి. ఈ కార్యక్రమం ద్వారా పంపిణీదారులు అదనపు క్షేత్రస్థాయి ఖర్చులు లేకుండానే ఆర్డర్లు, వసూళ్లను డిజిటలీకరించి తమ మార్కెట్ పరిధిని విస్తరించుకోవడంతో పాటు రిటైలర్లకు చేరువను పెంచుకోగలుగుతారు. బ్రాండ్ల విషయానికొస్తే, రిటైలర్ల డిమాండ్‌ను నేరుగా తెలుసుకోవడానికి, రిటైల్ కౌంటర్ల సమాచారాన్ని పొందడానికి, తాము ప్రవేశపెట్టే పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి పర్యవేక్షించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది.

 

డిజిదుకాన్ ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రారంభ దశలోనే మంచి ఆదరణ పొందింది. ఇక్కడ క్విపోయాప్ ద్వారా 10,000 కంటే ఎక్కువ మంది రిటైలర్లు, 35కి పైగా బ్రాండ్లు ఇందులో చేరాయి. హైదరాబాద్‌లో విజయవంతం కావడంతో తదుపరి విడతగా 19 జూన్ 2026న జైపూర్‌లో సేల్స్‌కోడ్ ద్వారా దీనిని ప్రారంభించనున్నారు. రాబోయే నెలల్లో ముంబై, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్ నగరాలకు కూడా దీనిని విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.

 

సాధారణ వాణిజ్య వ్యవస్థలో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లపై పరిశ్రమల అధినేతలు ఈ సదస్సులో చర్చించారు. రిటైలర్లతో సమన్వయ లోపం, పెరుగుతున్న సేల్స్‌ఫోర్స్ వ్యయాలు, ఇన్వెంటరీ నిర్వహణలో ఇబ్బందులు, ద్వితీయ అమ్మకాలపై పరిమిత అవగాహన, డిజిటల్-ఫస్ట్ రిటైల్ నమూనాల నుంచి పెరుగుతున్న పోటీ వంటివి ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ విలువ వ్యవస్థ అంతటా రిటైలర్లకు మెరుగైన అందుబాటును, పంపిణీదారుల ఉత్పాదకతను, డిమాండ్ ప్రణాళికను, పథకాల ప్రభావాన్ని ఓపెన్ డిజిటల్ మౌలిక సదుపాయాలు ఎలా మెరుగుపరుస్తాయో కూడా చర్చించారు.

 

పంపిణీదారుల డిజిటలైజేషన్‌, ఉత్పత్తుల వివరాల ప్రామాణీకరణ, రిటైలర్ల నమోదు, సాంకేతికత అనుసంధానం వంటి అంశాలపై సూచనలను పంచుకునేందుకు ఈ రౌండ్‌టేబుల్ వేదికగా నిలిచింది. డిజిదుకాన్ విస్తరణ తదుపరి దశలో వ్యవస్థాపక భాగస్వాములుగా సహకరించాలని పాల్గొన్న సంస్థలను కూడా ఆహ్వానించారు.

 

ఈ రౌండ్‌టేబుల్ సమావేశానికి డీపీఐఐటీ అదనపు కార్యదర్శి అతీష్ కుమార్ సింగ్ అధ్యక్షత వహించారు. సమావేశంలో హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, కోకా-కోలా, టీసీపీఎల్, కావిన్‌కేర్, మారికో, బికానో, లోరియల్, మూన్ బెవరేజెస్, అన్మోల్ ఇండస్ట్రీస్, నెస్లే, కిరానా కింగ్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. డిజిదుకాన్ కార్యక్రమంతో కలిసి పనిచేయడానికి, మద్దతు ఇచ్చేందుకు ఈ సంస్థలు ఆసక్తిని వ్యక్తం చేశాయి.

***


(रिलीज़ आईडी: 2272773) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil