రక్షణ మంత్రిత్వ శాఖ
హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్‌లో ‘అధునాతన ఆయుధ వ్యవస్థ సముదాయాన్ని’ ప్రారంభించిన రక్షణ మంత్రి
ఆపరేషన్ సిందూర్ సమయంలో స్వదేశీ క్షిపణి వ్యవస్థలు కనబరిచిన అద్భుతమైన పనితీరు మన రక్షణ రంగ పరిశోధన- అభివృద్ధి వ్యవస్థ పెరుగుతున్న సామర్థ్యానికి నిదర్శనం: శ్రీ రాజ్‌నాథ్ సింగ్
భారత ఆధునిక బహుళ-అంచెల క్షిపణి రక్షణ వ్యవస్థగా నిలవనున్న 'మిషన్ సుదర్శన్ చక్ర': శ్రీ రాజ్‌నాథ్ సింగ్
జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడటంలో ముప్పులను తట్టుకునే సామర్థ్యం, శత్రువులను నిరోధించే శక్తి కీలకం: శ్రీ రాజ్‌నాథ్ సింగ్
భారత్‌కు వ్యూహాత్మక ఆధిక్యతను అందించేందుకు డీఆర్‌డీఓ భవిష్యత్ సాంకేతికతలపై పనిచేస్తూనే ప్రస్తుత సవాళ్లను సైతం ఎదుర్కొనేలా కృషి చేయాలి: శ్రీ రాజ్‌నాథ్ సింగ్
प्रविष्टि तिथि:
12 JUN 2026 8:14PM by PIB Hyderabad
తెలంగాణలోని హైదరాబాద్ పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ 2026 జూన్ 12న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం క్షిపణి సముదాయం ప్రాంగణంలోని డీఆర్‌డీఓకు చెందిన ‘డీఆర్‌డీఎల్’లో (డిఫెన్స్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ లాబొరేటరీ) ‘అధునాతన ఆయుధాల వ్యవస్థ సముదాయాన్ని’ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత సాంకేతిక శ్రేష్ఠత, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, జాతీయ భద్రతకు అత్యంత కీలకమైన సహకారాన్ని అందిస్తున్న డీఆర్‌డీఓకు సంబంధించిన 'ఆయుధ వ్యవస్థలు, వ్యూహాత్మక వ్యవస్థల క్లస్టర్'ను ప్రశంసించారు. 'ఆపరేషన్ సిందూర్' సమయంలో స్వదేశీ క్షిపణి వ్యవస్థలు ప్రదర్శించిన అద్భుతమైన పనితీరు పెరుగుతున్న భారత రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి (ఆర్-డీ) వ్యవస్థ సామర్థ్యానికి సజీవ నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.
డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన ఆకాశ్, బ్రహ్మోస్ వంటి వ్యవస్థలు ప్రపంచ రక్షణ రంగంలో పోటీపడే సామర్థ్యం భారత్‌కు ఉందని నిరూపించాయి. శాంతి స్థాపనకు బలం ఎంతో అవసరం. ఆ బలానికి స్వయం ప్రతిపత్తి అనేది అత్యంత నమ్మదగిన ఆధారం. ఈ సత్యాన్ని డీఆర్‌డీఓ నిరూపించి చూపించింది" అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
'ఆపరేషన్ సిందూర్' సమయంలో వైమానిక రక్షణ పోషించిన కీలక పాత్రను గుర్తు చేసిన రక్షణ మంత్రి.. "సరిహద్దుల్లో వైమానిక ముప్పులు పొంచి ఉన్నప్పుడు మన వైమానిక రక్షణ వ్యవస్థ శత్రువుల కుతంత్రాలను పూర్తిగా తిప్పికొట్టింది" అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మధ్యప్రాచ్య యుద్ధ ప్రాంతాల్లో వైమానిక రక్షణ పోషిస్తున్న అత్యంత కీలకమైన పాత్రను మనం ప్రత్యక్షంగా చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 'మిషన్ సుదర్శన్ చక్ర' ద్వారా దేశంలో ఒక బహుళ-అంచెల క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించేందుకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
“2025 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించిన 'మిషన్ సుదర్శన్ చక్ర'.. భారతదేశ ఆధునిక బహుళ-అంచెల క్షిపణి రక్షణ వ్యవస్థగా మారడానికి సిద్ధంగా ఉంది. ఇది కేవలం సైనిక స్థావరాలను, కీలకమైన మౌలిక సదుపాయాలను మాత్రమే కాకుండా పౌర మౌలిక సదుపాయాలు, ఇతర ముఖ్యమైన సంస్థల భద్రతను కూడా నిర్ధారిస్తుంది. అవసరమైన ఏ సమయంలోనైనా శత్రువును గట్టిగా దెబ్బతీసే సామర్థ్యాన్ని ఈ వ్యవస్థ కలిగి ఉంటుంది. దీని మూడు అంచెల రక్షణ కవచం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తూనే వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అత్యంత ప్రాముఖ్యత కలిగిన దేశ ఆస్తులన్నింటికీ బలమైన రక్షణ కవచాన్ని అందించేలా ఈ వ్యవస్థ రూపొందింది" అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
వేగంగా మారిపోతున్న యుద్ధ తంత్రాలు, ప్రపంచ అనిశ్చితుల దృష్ట్యా జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవడానికి 'ముప్పులను తట్టుకునే సామర్థ్యం', 'శత్రువును నిరోధించే శక్తి' కలిగి ఉండటం ఎంతైనా ముఖ్యమని రక్షణ మంత్రి చెప్పారు. "కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాలు, సమగ్ర వైమానిక రక్షణ వ్యవస్థలు, హైపర్‌సోనిక్ ఆయుధాలు, స్వయం ప్రతిపత్తి ప్లాట్‌ఫామ్‌లు, కృత్రిమ మేధ, ఎలక్ట్రానిక్ యుద్ధరంగం, అత్యాధునిక సెన్సార్ సాంకేతికతలు.. ఆధునిక యుద్ధాల స్వరూపాన్నే మార్చేస్తున్నాయి. అంతర్జాతీయ వ్యవస్థ ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు, మార్పుల గుండా వెళ్తోంది. పాత నమ్మకాలు మారిపోతున్నాయి.. కొత్త కూటములు, సవాళ్లు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనకు 'రెసిలియన్స్' అంటే ఎలాంటి షాక్‌నైనా తట్టుకుని మళ్లీ పుంజుకునే సామర్థ్యం, 'డిటెరెన్స్' అంటే మనపై కన్ను పడితే తగిన సమాధానం లభిస్తుందనే భయాన్ని దురాక్రమణదారుడి మనస్సులో నాటగల శక్తి ఎంతో అవసరం" అని ఆయన వ్యాఖ్యానించారు.
దేశంలో 'ముప్పులను తట్టుకునే సామర్థ్యం', 'శత్రువును నిరోధించే శక్తి'ని పెంపొందించడంలో డీఆర్‌డీఓ చేస్తున్న కృషిని రక్షణ మంత్రి అభినందించారు. దేశం ఎటువంటి అస్థిరతకు లొంగదని, తన సన్నద్ధతలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వబోదనే నమ్మకాన్ని ఈ సంస్థ దేశ ప్రజల్లో నింపుతోందని ఆయన పేర్కొన్నారు. "ఈ రోజు జరిగిన ఈ ప్రారంభోత్సవం.. ప్రతి సవాలును ఎదుర్కోవడంలో మనం మరింత అప్రమత్తంగా, సమర్థవంతంగా, స్వయంసమృద్ధిగా మారాలనే మన సంకల్పానికి ప్రతీక" అని ఆయన అన్నారు.
భారత్‌కు వ్యూహాత్మక ఆధిక్యతను అందించే భవిష్యత్ సాంకేతికతలపై పనిచేస్తూనే ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడంలో డీఆర్‌డీఓ నిరంతరం చేస్తున్న కృషిని రక్షణ మంత్రి ప్రశంసించారు. "డీఆర్‌డీఓ బాధ్యత కేవలం సాంకేతిక మార్పులకు అనుగుణంగా మారడమే కాదు.. భవిష్యత్తు అవసరాలను ముందే ఊహించడం కూడా. ఈ సవాలును డీఆర్‌డీఓ పూర్తి ఆత్మవిశ్వాసంతో స్వీకరించింది. ఇటీవలి సంవత్సరాలలో స్వదేశీ క్షిపణి సాంకేతిక పరిజ్ఞాన రంగంలో ఈ సంస్థ ఎన్నో ఘనతలను సాధించింది. అత్యాధునిక క్షిపణి వ్యవస్థలను విజయవంతంగా పరీక్షించింది. అలాగే స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాత్మక రక్షణ ఆయుధ కార్యక్రమాలలో నిరంతరం పురోగతి సాధిస్తున్నాం. ఈ విజయాలు కేవలం సాంకేతిక ఘనతలను మాత్రమే కావు.. ఇవి భారతదేశ పెరుగుతున్న స్వయంసమృద్ధి, ఆత్మవిశ్వాసం, వ్యూహాత్మక సామర్థ్యాలను చాటిచెబుతున్నాయి" అని ఆయన అన్నారు.
భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు రక్షణ దళాలకు అత్యాధునిక వ్యవస్థలను తగిన పరిమాణంలో సరైన సమయంలో అందించాల్సిన అవసరం ఉందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రధానంగా చెప్పారు. యుద్ధంలో విజయం అనేది కేవలం సాంకేతిక ఆధిక్యం వల్ల మాత్రమే లభించదని.. పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయగల సామర్థ్యం కూడా అంతే కీలకమని ఆయన అన్నారు. సాంకేతికతలను కేవలం అభివృద్ధి దశకే పరిమితం చేయకుండా వాటిని వేగంగా భారీ ఉత్పత్తి స్థాయికి తీసుకెళ్లి సకాలంలో సైన్యంలోకి చేర్చేలా డీఆర్‌డీఓ, సాయుధ దళాలు, రక్షణ పరిశ్రమలు ఒక సమగ్ర వ్యవస్థగా కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఉత్పత్తి ప్రక్రియను అభివృద్ధి ప్రక్రియలో ఒక అంతర్భాగంగా పరిగణించాలని డీఆర్‌డీఓకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి సూచించారు. అభివృద్ధి దశ నుంచి ఉత్పత్తి దశకు మారే సమయాన్ని తగ్గించడం, తయారీ ప్రక్రియలను సులభతరం చేయడం, స్వదేశీ పరికరాల వాటాను పెంచడం, అవసరమైన సమయంలో రక్షణ దళాల కోసం వేగంగా భారీ మొత్తంలో ఉత్పత్తి చేయగల వ్యవస్థలను అభివృద్ధి చేయడం ఎంతైనా ముఖ్యమని ఆయన చెప్పారు.
రక్షణ సాంకేతిక రంగంలో ‘భారత్‌లో తయారీ’, ‘ఆత్మనిర్భర్ భారత్’ దార్శనికతను సాకారం చేసే లక్ష్యంతో గత 12 ఏళ్లుగా ప్రభుత్వం పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకుందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ ప్రయత్నంలో డీఆర్‌డీఓ అందించిన సహకారాన్ని ఆయన అభినందించారు. డీఆర్‌డీఓ ప్రయోగశాలలు, రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు (డీపీఎస్‌యూ), ప్రైవేట్ పరిశ్రమలు, అంకురాలు, ఎంఎస్ఎంఈలు, విద్యాసంస్థల మధ్య పెరిగిన పరస్పర సహకారం వల్ల దేశ రక్షణ వ్యవస్థ రూపాంతరం చెందిందని ఆయన గుర్తుచేశారు. "ఈ ఉమ్మడి భాగస్వామ్య నమూనా ఆవిష్కరణల నుంచి ఉత్పత్తికి, ఉత్పత్తి నుంచి కార్యాచరణ సామర్థ్యం వైపు భారత్ సాగించే ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి సహాయపడుతుంది" అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో, సాంకేతికత విషయంలో మరో దేశంపై ఆధారపడటాన్ని తగ్గించడంలో, రక్షణ దళాల కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడంలో డీఆర్‌డీఓ నిరంతరం కృషి చేస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రక్షణ మంత్రి డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన అత్యాధునిక రక్షణ సాంకేతికతలు, అధునాతన ఆయుధ వ్యవస్థలు, స్వదేశీ క్షిపణి ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన ఒక సాంకేతిక ప్రదర్శనను కూడా సందర్శించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ (క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థలు) శ్రీ యూ. రాజా బాబు, డీఆర్‌డీఎల్ డైరెక్టర్ డాక్టర్ అంకతి రాజు, ఇతర డీఆర్‌డీఓ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2272457)
आगंतुक पटल : 13