ప్రధాన మంత్రి కార్యాలయం
మహిళల నాయకత్వంలో విభిన్న రంగాల్లో అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని స్పష్టం చేసిన ప్రధానమంత్రి
దేశ నిర్మాణానికి మూలాధారం, సిసలైన శక్తికి ప్రతీకా మహిళాశక్తేనని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
प्रविष्टि तिथि:
12 JUN 2026 12:39PM by PIB Hyderabad
మహిళల నాయకత్వంలో అభివృద్దిని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా కృషి చేస్తోందనీ, ఇది అన్ని రంగాలలో స్పష్టంగా కనిపిస్తోందనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు. అభివృద్ధి ఫలాలను సమాజంలో అన్ని వర్గాలకు చేరవేయడం మొదలు ఔత్సాహిక పారిశ్రామికత్వం, విద్య, ఆరోగ్యసంరక్షణ, స్వచ్ఛత, గృహనిర్మాణం, క్రీడలు, విజ్ఞానశాస్త్రం, పరిపాలన.. ఇలా వివిధ రంగాల్లో మహిళలు ప్రముఖ పాత్రను పోషిస్తున్నారని ఆయన తెలిపారు.
ప్రభుత్వ ప్రయత్నాలు ఆత్మగౌరవం, అవకాశాలు, సాధికారత కల్పనలపై ఆధారపడి ఉన్నాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ ప్రయత్నాలు మహిళలు వారి శక్తిసామర్ధ్యాలను గ్రహించడంతో పాటు దేశ నిర్మాణంలో మరింత ఎక్కువగా తమ వంతు తోడ్పాటును అందించగల వాతావరణాన్ని ఏర్పరచడంలో దోహదం చేశాయని ఆయన అన్నారు.
ముఖ్యంగా విజ్ఞానశాస్త్రం, అంతరిక్షం, నూతన ఆవిష్కరణల వంటి రంగాలలో భారత నారీశక్తి తనదైన ముద్ర వేయడం సంతోషాన్ని కలిగిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. డ్రోన్ సాంకేతికత వంటి వినూత్న రంగాలలో వారి భాగస్వామ్యం పెరుగుతూ ఉండడం అవకాశాలకు సంబంధించిన కొత్త తలుపులను తెరుస్తోందనీ, దీంతో పూర్తి దేశంలో అభివృద్ధి రూపురేఖలు మారుతున్నాయనీ ఆయన అన్నారు.
స్వయంసహాయ బృందాలకు ప్రభుత్వం మద్దతిస్తోందనీ, మహిళలు ఆర్థికంగా సొంత కాళ్ల మీద నిలబడడంలో ఈ సంఘాలు కీలక పాత్రను పోషిస్తున్నాయనీ శ్రీ మోదీ వివరించారు.
ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకుంటూ, భారత మహిళా శక్తి దేశ నిర్మాణానికి మూలాధారంగా ఉందన్నారు. ప్రస్తుతం ప్రతి రంగంలో మన తల్లులు, అక్కచెల్లెళ్లు, కుమార్తెలు అద్భుత ప్రతిభతోనూ, నైపుణ్యాలతోనూ భరత మాతకు గొప్ప గర్వకారణంగా నిలుస్తున్నారని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి వరుస సందేశాలను పొందుపరుస్తూ:
‘‘గత 12 సంవత్సరాల్లో, మహిళల నాయకత్వంలో చోటుచేసుకొనే అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా ఎన్‌డీఏ ప్రభుత్వం పనిచేసింది. ఇది అన్ని రంగాల్లో కనిపిస్తోంది.
అభివృద్ధి ఫలాలను సమాజంలో అన్ని వర్గాల చెంతకు చేరడం మొదలు ఔత్సాహిక పారిశ్రామికత్వం, విద్య, ఆరోగ్యసంరక్షణ, స్వచ్ఛత, గృహనిర్మాణం, క్రీడలు, విజ్ఞానశాస్త్రం, పరిపాలన వంటి భిన్న రంగాల్లో మహిళలు ప్రధాన భూమికను పోషిస్తున్నారు.
ఎన్‌డీఏ ప్రభుత్వ ప్రయత్నాలు ఆత్మగౌరవం, అవకాశాలు, సాధికారత కల్పనలపై ఆధారపడి ఉన్నాయి. ప్రభుత్వ ప్రయత్నాలు.. మహిళలు వారి పూర్తి శక్తియుక్తులను గ్రహించడంతో పాటు దేశ నిర్మాణంలో మరింత ఎక్కువ బలంగా తమ వంతు తోడ్పాటును అందించగల వాతావరణాన్ని ఏర్పరచడంలో దోహదపడ్డాయి.
‘‘విజ్ఞానశాస్త్రం, అంతరిక్షం, నూతన ఆవిష్కరణల వంటి రంగాలలో భారత నారీ శక్తి తనదైన ముద్ర వేయడం చూస్తే నాకు సంతోషం కలుగుతోంది. డ్రోన్ సాంకేతికత వంటి వినూత్న రంగాల్లో వారి భాగస్వామ్యం పెరగడం వల్ల కొత్త అవకాశాలు అందిరావడంతోపాటు దేశంలో అభివృద్ధి చోటుచేసుకుంటున్నది. మా ప్రభుత్వం స్వయంసహాయ బృందాలకు మద్దతిస్తోంది. ఈ బృందాలు మహిళలు ఆర్థికంగా సొంత కాళ్ల మీద నిలబడడంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి’’.
‘‘దేశ నిర్మాణానికి భారత నారీశక్తి మూలస్తంభంగా ఉంది. మన తల్లులు, ఆడపడుచులు, కుమార్తెలు ప్రతి రంగంలో అద్భుత ప్రతిభనీ, నైపుణ్యాన్నీ చాటుతూ భరత మాత గౌరవాన్ని పెంపొందింపచేస్తున్నారు.
నారీ త్రైలోక్యజననీ
నారీ త్రైలోక్యరూపిణీ
నారీ త్రిభువనాధారా
నారీ శక్తిస్వరూపిణీ
(మూడు లోకాలకు తల్లి మహిళయే. మూడు లోకాల సాక్షాత్తు అభివ్యక్తీకరణా ఆమే. యావత్తు విశ్వానికీ ఆమె ఆధారం. శక్తికి వాస్తవిక రూపం మహిళ).
***
(रिलीज़ आईडी: 2272116)
आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Urdu
,
English
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam