అంతరిక్ష విభాగం
భారత అంతరిక్ష రంగంలో పెట్టుబడులను పెంచాల్సిందిగా పరిశ్రమవర్గాలకు పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
అంతరిక్ష రంగంలో సంస్కరణల ఫలితంగా 400కు పైగా అంకుర సంస్థలకు విస్తరించిన భారత ప్రైవేటు అంతరిక్ష వ్యవస్థ
ప్రారంభ మూలధన (వెంచర్ క్యాపిటల్), సాంకేతిక స్వావలంబన నిధులతో భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం: డాక్టర్ జితేంద్ర సింగ్
పరిశోధన - అభివృద్ధిలో మరింత ఉదారంగా ఉంటామన్న మంత్రి.. విజ్ఞాన శాస్త్రంలో పెట్టుబడి మానవాళికి సేవ చేయడమేనని వ్యాఖ్య
प्रविष्टि तिथि:
11 JUN 2026 5:43PM by PIB Hyderabad
ప్రపంచస్థాయిలో పోటీపడేలా దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అభివృద్ధి చేయడం, విదేశీ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం లక్ష్యంగా.. అంతరిక్ష రంగంలో పెట్టుబడులనూ, భాగస్వామ్యాన్నీ భారీగా విస్తరించాలని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ, భౌగోళిక విజ్ఞాన శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పీఎంవో- అణు ఇంధన - అంతరిక్ష విభాగం - సిబ్బంది, ప్రజా వ్యవహారాలు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ పారిశ్రామిక ప్రముఖులకు పిలుపునిచ్చారు.
పదో ఇన్‌స్పేస్ పారిశ్రామిక సదస్సులో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు. దేశ అంకుర సంస్థలు అద్భుతమైన ఆవిష్కరణలనూ, సాంకేతిక సామర్థ్యాన్నీ ప్రదర్శిస్తున్నాయన్నారు. అయితే ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా ఎదగాలంటే నిధుల లభ్యత, ఉత్పాదక సామర్థ్యం, మార్కెట్ లభ్యతను పెంచుకుంటూ.. ప్రముఖ పరిశ్రమల నుంచి మరింత పటిష్టమైన భాగస్వామ్యం ఆవశ్యకమని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అందుబాటులోకి తేవడాన్ని.. వ్యూహాత్మక రంగాల పట్ల భారత్ విధానంలో చరిత్రాత్మక మార్పుగా డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. సాహసోపేత నిర్ణయంగా ఈ సంస్కరణలను అభివర్ణించారు. ఇది దేశంలోని అంతర్గత పారిశ్రామిక నైపుణ్యాన్ని వెలికితీయడమే కాకుండా.. అనతికాలంలోనే భారత అంతరిక్ష వ్యవస్థ రూపురేఖలను మార్చేసిందని వ్యాఖ్యానించారు.
అంతరిక్ష రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం చేపట్టిన విధానపరమైన కార్యక్రమాలను డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. అంతరిక్ష రంగ సంస్కరణల అనంతరం రూపొందించిన భారత అంతరిక్ష విధానం - 2023 ఈ రంగంలోని భాగస్వాములకు వ్యూహాత్మక దిశానిర్దేశాన్నీ, నియంత్రణపరమైన స్పష్టతనూ అందించిందన్నారు. దీనితోపాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని సరళీకరణ పెట్టుబడులను ఆకర్షించిందనీ, అన్ని దశల్లోనూ అంతర్జాతీయంగా భారత్ మరింతగా అనుసంధానమయ్యేందుకు దోహదపడిందని వివరించారు. భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక, ఆధీకృత కేంద్రం (ఇన్-స్పేస్) ఏర్పాటును ఒక విశిష్టమైన సంస్థాగత సంస్కరణగా అభివర్ణించారు. ఇది అంతరిక్ష రంగంలోని అన్ని దశల్లోనూ ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో, అనుమతించడంలో, పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
ఆర్థిక, సంస్థాగత సహాయక వ్యవస్థల ద్వారా దేశంలో ఆవిష్కరణలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వ కృషిని డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా వివరించారు. అంతరిక్ష రంగంలో ఆవిష్కరణలనూ, వాటి వాణిజ్యీకరణనూ సులభతరం చేయడం కోసం రూ. 1,000 కోట్ల ప్రారంభ మూలధన నిధినీ, రూ. 500 కోట్ల సాంకేతిక స్వావలంబన నిధినీ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. వీటితోపాటు ప్రాథమిక మూలధనం, ప్రారంభస్థాయి సహకారం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఏఐసీటీఈ ఆమోదించిన అంతరిక్ష సాంకేతికతా పాఠ్యప్రణాళిక వంటి కార్యక్రమాలు.. దేశంలో వేగంగా విస్తరిస్తున్న అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు అవసరమైన భవిష్యత్ అవసరాలకు తగిన ప్రతిభావంతులైన మానవ వనరులను సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
దేశంలో ప్రైవేటు అంతరిక్ష వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. కేవలం కొద్దిపాటి అగ్రగామి సంస్థలతో మొదలైన ఈ ప్రయాణం.. నేడు 400కు పైగా అంకుర సంస్థలు, వందలాదిగా చిన్నా పెద్దా కంపెనీలతో భారీ వ్యవస్థగా అవతరించిందని గుర్తుచేశారు. భారతీయ సంస్థలు నేడు ప్రయోగ వాహనాలు, చోదక వ్యవస్థలు, భూ పరిశీలన అప్లికేషన్లు, అంతరిక్ష పరిస్థితుల అవగాహన సామర్థ్యాలతోపాటు అనేక రకాల అనుబంధ సేవలనూ అభివృద్ధి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్, గెలాక్సీ, దిగంతర, ధ్రువ స్పేస్ వంటి కంపెనీలు దేశ పారిశ్రామిక సామర్థ్యానికీ, సాంకేతిక ఆవిష్కరణలకూ నిదర్శనమని మంత్రి అభినందించారు.
వైజ్ఞానిక పరిశోధనల రంగంలో ఉదారంగా వ్యవహరించే ధోరణిని పెంపొందించుకోవాలని డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. మన సంప్రదాయంలో దాతృత్వ విరాళాలు సేవా కార్యక్రమాలకే పరిమితమవుతున్నాయన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణల్లో పెట్టుబడులను కూడా ముఖ్యమైన సామాజిక సేవగా గుర్తించాలన్నారు.
క్రమంగా విస్తరిస్తున్న అంతరిక్ష వ్యవస్థలో పనిచేసేటప్పుడు తాము ఎదుర్కొంటున్న సవాళ్లను, ఇబ్బందులను ఉన్నదున్నట్టుగా తెలియజేయాలని పరిశ్రమ వర్గాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. వారికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. విధానరూపకర్తలకూ, పరిశ్రమ వర్గాలకూ మధ్య ఎప్పటికప్పుడు బహిరంగ, నిర్మాణాత్మక చర్చలు జరగడం అత్యంత కీలకమన్నారు.
వేగవంతమైన అనుమతులు, సరళీకృత ప్రక్రియలు, సమర్థమైన ఏకగవాక్ష విధానం అవసరమంటూ.. పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేసిన ఆందోళనలను డాక్టర్ జితేంద్ర సింగ్ అంగీకరించారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడమే పరిపాలనలో ముఖ్య లక్ష్యంగా ఉండాలనీ, అంతే తప్ప అనవసర అడ్డంకులను సృష్టించేలా ఉండకూడదనీ అన్నారు.
ఆత్మనిర్భర అంతరిక్ష రంగాన్ని సాకారం చేసుకునే దిశగా.. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, పెట్టుబడిదారులు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత బలమైన సమన్వయం ఆవశ్యకమని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. అంకుర సంస్థల వేగానికి – ప్రముఖ పరిశ్రమల భారీ వనరులు, ఆర్థిక బలం, కార్యాచరణ సామర్థ్యాలు తోడు కావాలని అభిప్రాయపడ్డారు.
భారత్‌లో అపారమైన ప్రతిభ, పారిశ్రామిక శక్తి ఉన్నాయనీ, అయితే అనుకూలమైన విధానపరమైన వాతావరణమే ఇన్నాళ్లూ లేకుండా పోయిందనీ మంత్రి అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో చేపట్టిన సంస్కరణలు.. ఆ వ్యవస్థను సృష్టించాయనీ, దీంతో ఆవిష్కరణలకూ, వ్యాపార విస్తరణకు సరికొత్త దారులు తెరచుకున్నాయనీ ఆయన వ్యాఖ్యానించారు.
ఒక్క ప్రభుత్వ ప్రయత్నం వల్లే అంతరిక్ష రంగంలో భారత కాంక్షలు సంపూర్ణంగా నెరవేరవని డాక్టర్ జితేంద్రసింగ్ అన్నారు. ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్‌ను అగ్రగామి శక్తిగా నిలిపేలా.. ఆశయం, ఆత్మవిశ్వాసం, అంకితభావంతో కలిసి పనిచేయాలని భాగస్వామ్య పక్షాలకు పిలుపునిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
***
(रिलीज़ आईडी: 2272024)
आगंतुक पटल : 17