రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రోడ్డంతా నిఘా: ఎన్ఎస్వీలతో ఇక దేశ జాతీయ రహదారులు మరింత సురక్షితం

प्रविष्टि तिथि: 11 JUN 2026 1:45PM by PIB Hyderabad

ఒక ఆహ్లాదకరమైన ఉదయం వేళ, ఎంతో రద్దీతో గందరగోళంగా ఉండే జాతీయ రహదారులపై తెల్లగా మెరుస్తూ ఒక వాహనం మెల్లిగా ముందకు కదులుతూ ఉంటుంది. అది పోలీస్ కారు కాదు. రహదారుల నిర్వహణ ట్రక్కు కూడా కాదు. అంతకు మించిన ఒక అత్యాధునిక సాంకేతిక వాహనమది. దాని పైకప్పుపై అమర్చిన స్కానర్లు కంటికి కనిపించని కిరణాలను ప్రసరింపజేస్తాయి. హై రిజల్యూషన్ కెమెరాలు చప్పుడు చేయకుండా గిర్రున తిరుగుతుంటాయి. అధునాతన 3డీ లేజర్ సెన్సార్లు రోడ్డుపై ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా మ్యాపింగ్ చేస్తాయి.

అదే ‘నెట్‌వర్క్ సర్వే వెహికల్ (ఎన్ఎస్వీ).’ లేజర్ ప్రొఫైలర్లు, జీపీఎస్, అత్యాధునిక ఇమేజింగ్ సాంకేతికతలతో రూపుదిద్దుకున్న ఒక సరికొత్త ఆవిష్కరణ ఇది. ఈ వాహనం అలా రోడ్డుపై వెళ్తూ.. రోడ్డుపై ఉన్న పగుళ్లను, గుంతలను, మిట్టపల్లాలను క్షుణ్ణంగా స్కాన్ చేస్తుంది. తద్వారా రహదారులను స్పష్టమైన డిజిటల్ మ్యాపులుగా చిత్రీకరిస్తుంది. చూడడానికి సాధారణ విషయంగానే కనిపించినప్పటికీ.. జాతీయ రహదారుల పర్యవేక్షణ, నిర్వహణ, పరిరక్షణలో భారత్ అనుసరించే విధానంలో నిజంగా ఇదొక విప్లవం.

దేశంలో జాతీయ రహదారులపై ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే ధ్యేయంగా.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక కీలక ముందడుగు వేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, రహదారి వ్యవస్థల్లో అధునాతన త్రీడీ లేజర్ ఆధారిత వ్యవస్థలతో కూడిన నెట్‌వర్క్ సర్వే వెహికళ్లను (ఎన్ఎస్వీ)లను మోహరిస్తున్నట్టు ప్రకటించింది.

పలు జాతీయ రహదారి కారిడార్లలో మోహరించిన ఈ అత్యాధునిక సాంకేతిక వాహనాలు కేవలం సర్వేలు చేసే యంత్రాలు మాత్రమే కాదు.. రోడ్డు నాణ్యతను కాపాడే డిజిటల్ రక్షకులు. రహదారిలోని ప్రతి భాగాన్ని క్షుణ్ణంగా స్కాన్ చేయడం ద్వారా.. ఈ ఎన్ఎస్వీలు రోడ్డు విస్తీర్ణం, ఉపరితల స్థితిగతులకు సంబంధించి సమగ్ర డేటాను సేకరిస్తాయి. దాంతో రహదారులపై ఉన్న గుంతలు, పగుళ్లు వంటి లోపాలను సులభంగా గుర్తిస్తాయి.

ప్రజా సంక్షేమం కోసం ఆవిష్కరణలు

త్రీడీ లేజర్ సాంకేతికతను వినియోగించుకోవడమన్నది.. ప్రజా శ్రేయస్సు కోసం వినూత్న ఆవిష్కరణలను ఉపయోగించుకోవడంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిబద్ధతకు నిదర్శనం. ఈ కార్యక్రమంతో రహదారుల నిర్వహణలో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయి. లోపాలను గుర్తించడమే కాకుండా.. వాటిని వేగంగా సరిదిద్దేలా చేస్తుంది. తద్వారా లక్షలాది ప్రయాణికులకు మరింత సురక్షితంగా, సాఫీగా ప్రయాణాన్ని అందిస్తుంది.

ఒకప్పుడు నెలల సమయం పట్టిన పనులు ఇప్పుడు కొన్ని రోజుల్లోనే పూర్తవుతున్నాయి. ఇది రహదారుల భద్రతను పెంచడంతోపాటు.. వేగవంతమైన మరమ్మతులకు, సంబంధిత వర్గాల మధ్య పారదర్శకమైన సమాచార వినిమయానికి అవకాశాన్నిస్తుంది.

రోజుకు 80 కి.మీ నుంచి 300 కి.మీ వరకు

గతంలో అయితే ఒక రోజులో 20 నుంచి 80 కిలోమీటర్ల మేర మాత్రమే సర్వేలు సాధ్యమయ్యేవి. కానీ నేడు ఈ అధునాతన సాంకేతికతతో కూడిన ఎన్ఎస్వీ.. రోజుకు 300 కిలోమీటర్ల వరకు సర్వే చేయగలదు. సామర్థ్యంలో వచ్చిన ఈ భారీ మార్పు వల్ల రహదారులపై లోపాలను వేగంగా గుర్తించడమే కాకుండా, క్షేత్రస్థాయిలోనూ వేగంగా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది.

3 దశల ప్రక్రియ ద్వారా సురక్షితంగా, కేంద్రీకృతంగా డేటా వినిమయం

  • క్షేత్రస్థాయిలో సేకరించిన ఈ సర్వే మౌలిక డేటాను ఎన్‌క్రిప్ట్ చేసి, 48 గంటల వ్యవధిలోనే కేంద్రీకృత ఎన్ఎస్వీ కేంద్రానికి చేరవేస్తారు.
  • అయిదు జోన్‌లలో వ్యూహాత్మకంగా మోహరించిన నిపుణుల బృందాలు.. పరిశీలనలను క్రమపద్ధతిలో పర్యవేక్షించి నివేదిస్తాయి.
  • గతంలో ఈ మౌలిక డేటాను విశ్లేషించడానికి దాదాపు 4 నుంచి 6 నెలల సమయం పట్టేది. కానీ ఇప్పుడు, 10 రోజుల్లోనే ఆ డేటాను క్షేత్రస్థాయిలో ఉపయోగపడే నివేదికలుగా మారుస్తున్నారు.

నాణ్యతకు హామీ, డిజిటల్‌ సేవలు

ఆమోదించడానికి ముందు.. ప్రతి నివేదికను అత్యంత కఠినమైన నాణ్యత ప్రమాణాల (ప్రశ్న- జవాబుల ప్రక్రియ)తో నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ విధంగా ధ్రువీకరించిన వెంటనే, డిజిటల్ వేదికల ద్వారా సంబంధిత వర్గాలకు స్వయంచాలకంగా నోటీసులు జారీ అవుతాయి. దీనివల్ల సిబ్బంది ప్రమేయానికి తావులేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా సమాచార మార్పిడికి వీలవుతుంది.

సాఫీగా నిర్వహణ కోసం ఏఐ ఆధారిత రహదారి పర్యవేక్షణ

ఈ సరికొత్త ఎన్ఎస్వీ వ్యవస్థ ద్వారా దేశ జాతీయ రహదారులపై సేకరించిన ప్రతి సమాచారాన్నీ నేరుగా ఎన్‌హెచ్‌ఏఐకి చెందిన కృత్రిమ మేధ ఆధారిత ‘డేటా లేక్’ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. దీంతో నిపుణుల బృందాలు ఆ నివేదికలను వేగంగా విశ్లేషించడానికీ, అలాగే క్షేత్రస్థాయి ఆధారాలతో మరమ్మతులు, నిర్వహణ పనులను జాప్యం లేకుండా చేపట్టడానికీ వీలవుతుంది.

ప్రాంతమేదైనా సరే...

రెండు వరుసల నుంచి ఎనిమిది వరుసల జాతీయ రహదారుల వరకు.. విభిన్న భౌగోళిక ప్రాంతాల్లో ఈ సర్వేలు జరుగుతాయి. బిజీగా ఉండే సరుకు రవాణా కారిడార్లు, నిరంతరం ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోయే రహదారుల నుంచి వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల వరకు.. అన్ని ప్రాంతాలూ ఇందులో ఉంటాయి. ప్రతి ఆరు నెలలకొకసారి క్రమం తప్పకుండా నిర్వహించే ఈ సర్వేల వల్ల.. రహదారులపై ఎలాంటి చిన్న లోపం ఉన్నా సరే, అది అధికారుల కంట పడకుండా ఉండదు.

ప్రజలకు మెరుగైన ఫలితాలు

దీర్ఘకాలికంగా చూస్తే.. ఇది రహదారి ఆస్తుల నిర్వహణను, పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తుంది. సురక్షితంగా, సాఫీగా ప్రయాణాలతోపాటు వ్యవస్థలో మరింత పారదర్శకత సాధ్యమవుతుంది. కృత్రిమ మేధను, అధునాతన సర్వే సాంకేతికతలను వినియోగించుకోవడం ద్వారా.. దేశంలో జాతీయ రహదారులను నిర్మిండం మాత్రమే కాదు, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా వాటిని నిరంతరం అత్యుత్తమ ప్రమాణాలతో నిర్వహించవచ్చని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిరూపిస్తోంది.

ప్రయాణంలో ఉపయోగపడే యాప్

కొత్తగా అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ సైట్ ఇన్స్పెక్టర్లకు కింది విధంగా సహాయపడుతుంది:

·         ఎన్ఎస్వీ పరిశీలనలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం

·         తనిఖీల సమయంలో వ్యాఖ్యలను, జియో స్టాంప్ చేసిన ఫొటోలను పోస్ట్ చేయడం

·         పరిష్కార చర్యలకు సంబంధించి నేరుగా క్షేత్రస్థాయిలోనే పర్యవేక్షించడం

దీంతో ప్రతి దశలోనూ పారదర్శకతకు, జవాబుదారీతనానికి అవకాశముంటుంది.

మరమ్మతులతో ప్రక్రియ సంపూర్ణం

కేవలం లోపాలను పర్యవేక్షించడంతోనే సరిపెట్టే పాత పద్ధతులకు భిన్నంగా.. ఈ సరికొత్త ఎన్ఎస్వీ విధానంలో ఆయా లోపాలను పూర్తిగా సరిదిద్దిన తర్వాతే ప్రక్రియ పూర్తవుతుంది. నివేదికలో నమోదైన ప్రతి సమస్య వంద శాతం పరిష్కారమయ్యేంత వరకు రహదారుల నిర్వహణ సంస్థలదే పూర్తి బాధ్యత. ఈ కొత్త కార్యక్రమం హైవేల నిర్వహణలో ఒక నిర్ణయాత్మక మార్పునకు నాంది పలికింది. సమస్య వచ్చాక స్పందించే పద్ధతి నుంచి.. ముందుగానే అప్రమత్తమయ్యే విధానం దిశగా అడుగులు వేయిస్తోంది. రోడ్డు సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా.. వాటి కారణంగా జరిగే ప్రమాదాలను తగ్గించడంతోపాటు, ప్రయాణికులందరికీ ఎన్ఎస్వీలు సాఫీగా ప్రయాణాన్ని అందిస్తాయి. ఇది కేవలం ఒక సాంకేతిక ఆధునికీకరణ మాత్రమే కాదు.. జవాబుదారీతనం, డిజిటల్ పాలన, డేటా ఆధారంగా మౌలిక సదుపాయాల నిర్వహణ దిశగా ప్రభుత్వం వేసిన ఒక ధీటైన ముందడుగు.

మరిన్ని వివరాల కోసం కింద ఇచ్చిన లింకును చూడండి:

https://drive.google.com/file/d/1nFtKZHQFqCE7ZpSYeMZsbacvue9BHUu_/view?usp=drivesdk 

***


(रिलीज़ आईडी: 2271709) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil