మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
నాలుగో విడత యువ సంగం కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం
प्रविष्टि तिथि:
10 JUN 2026 6:49PM by PIB Hyderabad
‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ కార్యక్రమంలో భాగంగా విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత విద్యా విభాగం 'యువ సంగం నాలుగో విడత' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువత మధ్య సాంస్కృతిక మార్పిడి, ప్రయోగాత్మక అభ్యాసం, జాతీయ సమైక్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) తిరుపతి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) పూణె ఆతిథ్యం ఇచ్చింది. ఈ ఐదు రోజుల కార్యక్రమంలో పాల్గొన్న యువతకు.. మహారాష్ట్రకు సంబంధించిన గొప్ప సాంస్కృతిక వారసత్వం, విద్యా నైపుణ్యం, ఆవిష్కరణల వ్యవస్థ, అభివృద్ధి విషయంలో సాధించిన విజయాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించింది.
ఈ ప్రతినిధి బృందం 2026 జూన్ 08న ముంబయిలోని రాజ్ భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా నాయకత్వం, దేశ నిర్మాణం, జాతీయ సమైక్యతపై గవర్నర్ తన ఆలోచనలను విద్యార్ధులతో పంచుకున్నారు. భారతదేశ వైవిధ్యభరితమైన సాంస్కృతిక నేపథ్యాన్ని అర్థం చేసుకోవటానికి, అభినందించటానికి ఉన్న ప్రాముఖ్యతపై ఈ చర్చ సాగింది. ఇది కార్యక్రమంలో పాల్గొన్న యువతకు పాలన, ప్రజా సేవపై విలువైన అవగాహనను అందించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతినిధి బృందం 2026 జూన్ 5న మహారాష్ట్ర సాంస్కృతిక, ఆధ్యాత్మిక, గ్రామీణ ప్రాంతాల గుండా ఒక అద్భుతమైన పర్యటనను చేపట్టింది. ఈ రోజు కార్యక్రమాలను పర్యటన్ (పర్యాటకం), ప్రగతి (అభివృద్ధి), పరస్పర సంపర్క్ (ప్రజల మధ్య సంబంధాలు) అనే ప్రధానాంశాల కేంద్రంగా రూపొందించారు. ఇందులో భాగంగా ప్రతినిధి బృందం మహారాష్ట్రలోని ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదేశాలలో ఒకటైన జేజూరిలోని చారిత్రాత్మక ఖండోబా మందిరాన్ని సందర్శించింది. ఆ తర్వాత ఈ బృందం ఆదర్శ గ్రామం అయిన అదాచివాడిని సందర్శించి.. అక్కడ సర్పంచ్, గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామస్తులతో మాట్లాడింది. ఈ పరస్పర చర్చలు క్షేత్రస్థాయి పాలన, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, సమాజ భాగస్వామ్యం, గ్రామాల నేతృత్వంలో జరుగుతున్న మార్పులపై విలువైన అవగాహనను అందించాయి. సుస్థిర, సమ్మిళిత అభివృద్ధిని ప్రతినిధులు ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడానికి ఈ పర్యటన ఎంతగానో దోహదపడింది.
2026 జూన్ 6న ఈ ప్రతినిధి బృందం పర్యావరణ్ (పర్యావరణం), పరంపర (సంప్రదాయాలు) అనే ఇతివృత్తాల ఆధారంగా చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొంది. పర్యావరణ అవగాహన, పరిరక్షణ, సుస్థిరతను పెంపొందించే లక్ష్యంతో ఐఐఎస్ఈఆర్ పూణె క్యాంపస్‌లో జీవవైవిధ్య కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమంతో ఈ రోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ప్రతినిధులు పూణె నగరంలోని చారిత్రాత్మక ప్రాంతాల్లో సాంస్కృతిక సంపద నడక (హెరిటేజ్ వాక్) చేస్తూ శనివార్ వాడను సందర్శించారు. ఈ పర్యటన ద్వారా వారు మహారాష్ట్రకు ఉన్న గొప్ప చారిత్రాత్మక, సాంస్కృతిక వారసత్వాన్ని తెలుసుకోవటమే కాకుండా ఆ రాష్ట్ర నిర్మాణ, సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని గురించి అద్భుతమైన అవగాహనను పెంపొందించుకున్నారు.
దక్కన్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ సోనాల్ కులకర్ణి జోషి నేతృత్వంలో భాషకు సంబంధించి జరిగిన ప్రత్యేక సదస్సుకు కూడా ప్రతినిధులు హాజరయ్యారు. ఇది మహారాష్ట్ర భాషా వారసత్వాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని వారికి పరిచయం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఉన్నత- సాంకేతిక విద్యాశాఖ మంత్రి శ్రీ చంద్రకాంత్ దాదా పాటిల్, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి మాధురి తాయ్ మిసాల్‌లతో ప్రతినిధులు జరిపిన చర్చలు మరింత స్ఫూర్తినింపాయి. శ్రీ చంద్రకాంత్ దాదా పాటిల్ ప్రతినిధులకు స్వాగతం పలికారు. దేశాన్ని ఏకం చేసే ఉమ్మడి సాంస్కృతిక విలువలను అభినందిస్తూనే మహారాష్ట్ర విశిష్ట సంప్రదాయాలను తెలుసుకోవాలని ఆయన వారిని కోరారు. పట్టణాభివృద్ధిపై శ్రీమతి మాధురి తాయ్ మిసాల్ ఆలోచనలను పంచుకున్నారు. యువత తమ మూలాలను, విలువలను మరువకుండానే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె అన్నారు. ఈ రోజు కార్యక్రమాలు సంప్రదాయ మహారాష్ట్రీయ విందుతో ముగిశాయి. ఇది ప్రతినిధులకు ఆ రాష్ట్రానికి సంబంధించిన గొప్ప వంటకాలను రుచి చూసే అవకాశాన్ని కల్పించడమే కాకుండా వారి మధ్య స్నేహ బంధాలను, సాంస్కృతిక మార్పిడిని, పరస్పర అవగాహనను మరింత బలోపేతం చేసింది. ఈ కార్యక్రమం 2026 జూన్ 09న జరిగిన ముగింపు వేడుకతో విజయవంతంగా ముగిసింది.
***
(रिलीज़ आईडी: 2271370)
आगंतुक पटल : 9