ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
‘శాప్లింగ్ (మెరుగైన పోషణ, వృద్ధి సాధనకు ఉద్దేశించిన దక్షిణాసియా విధాన నాయకత్వం) చర్చ- 2026’ను ప్రారంభించిన
ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ చిరాగ్ పాస్‌వాన్
అహమదాబాద్‌లో 2026 జూన్ 9, 10 తేదీల్లో ‘‘విలువను రాబట్టడం’’ అంశంపై ప్రాంతీయ ఉన్నత స్థాయి విధాన చర్చా కార్యక్రమం
భారత ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ప్రపంచ బ్యాంకు గ్రూపుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమ నిర్వహణ.,. దక్షిణాసియాలో ఉపాధి అవకాశాల కల్పనతో పాటు దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆహార శుద్ధిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం
प्रविष्टि तिथि:
09 JUN 2026 11:03AM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎమ్ఓఎఫ్‌పీఐ), ప్రపంచ బ్యాంకు గ్రూపు నాయకత్వంలోని ‘శాప్లింగ్’ కార్యక్రమం సహకారంతో 2026 జూన్ 9న గుజరాత్.. అహమదాబాద్‌లో ప్రాంతీయ ఉన్నత స్థాయి విధాన చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘‘విలువను రాబట్టడం: దక్షిణాసియాలో ఉపాధి అవకాశాల కల్పనతో పాటు దీర్ఘకాలిక అభివృద్ధి కోసం ఆహార శుద్ధిని ముందుకు తీసుకుపోవడం’’ అంశాన్ని ఈ కార్యక్రమానికి శీర్షికగా నిర్దేశించారు.
రెండు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రాంతీయ చర్చా కార్యక్రమంలో సుమారు 200 మంది పాల్గొంటున్నారు. వారిలో విధాన రూపకర్తలు, పరిశ్రమ ప్రముఖులు, అభివృద్ధి భాగస్వాములు, నూతన ఆవిష్కర్తలు, పరిశోధకులు, అంకుర సంస్థలు, దక్షిణాసియా దేశాల ప్రతినిధులు ఉన్నారు. వీరు దక్షిణాసియాలో ఆహార శుద్ధి విస్తారిత అనుబంధ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు దృఢతర, సమ్మిళిత, దీర్ఘకాల ప్రాతిపదిక కలిగిన ఆహార వ్యవస్థలను తీర్చిదిద్దే పద్ధతులపై చర్చిస్తారు.
తొలి రోజు సమావేశాన్ని ఉద్దేశించి కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ చిరాగ్ పాస్‌వాన్ ప్రసంగిస్తూ, ప్రంపచ ఆహార శుద్ధి కేంద్రంగా భారత్ పాత్ర నానాటికీ పెరుగుతోందన్నారు. దక్షిణాసియాలో ఆహార సంబంధిత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చడానికి విలువ జోడింపు, సాంకేతికతను స్వీకరించడం, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
వ్యవసాయానికి, సమృద్ధి సాధనకు మధ్య ఒక వారధిగా ఆహార శుద్ధి నిలుస్తోందని, ఈ రంగంలో ఉపాధి కల్పన , పంట కోతల అనంతర నష్టాల తగ్గింపు, రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు ఆహార భద్రతను బలోపేతం చేసేందుకు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి శ్రీ చిరాగ్ పాస్‌వాన్ అన్నారు. ప్రపంచ స్థాయిలో పోటీపడగలిగిన ఫూడ్ వేల్యూ చైన్లను ఏర్పాటు చేయడంలో భారత్ అమలుచేస్తున్న విధానపరమైన కార్యక్రమాలూ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంబంధిత ప్రయత్నాలూ తోడ్పడుతున్నాయని వివరించారు.
గుజరాత్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ జీతూభాయి వాఘానీ మాట్లాడుతూ, వేరువేరు దేశాల నుంచి పలువురు ఈ ‘శాప్లింగ్- 2026’ చరిత్రాత్మక కార్యక్రమంలో పాలుపంచుకోవడాన్ని ప్రశంసించారు. వ్యవసాయ పరివర్తనకు చోదకశక్తిగా ఆహార శుద్ధి రంగం నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఉపాధికల్పనలో, విలువ పెంపులో, ఆర్థిక వ్యవస్థ సమగ్రాభివృద్ధికి ఊతాన్ని అందించడంలో వ్యవసాయ- పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి గుజరాత్ ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ వాఘానీ తెలిపారు. ఈ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడానికి, వ్యవసాయానికీ పరిశ్రమ రంగానికీ మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేయడానికీ గుజరాత్‌లో జాతీయ ఆహార శుద్ధి, ఔత్సాహిక పారిశ్రామికత్వం, నిర్వహణల సంస్థ క్యాంపసును ఏర్పాటు చేయాలని ఆయన సూచన చేశారు.
మొదటి రోజు సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న వారిలో ప్రపంచ బ్యాంకులో భారత్ తరఫు కార్యనిర్వాహక కంట్రీ డైరెక్టరు శ్రీ పాల్ ప్రోసీ, గేట్స్ ఫౌండేషన్‌లో భారత్ తరఫు కంట్రీ డైరెక్టరు అర్చనా వ్యాస్, ఎమ్ఓఎఫ్‌పీఐ కార్యదర్శి శ్రీ అవినాశ్ జోషీతో పాటు అనేక సీనియర్ ఉన్నతాధికారులు ఉన్నారు.
ఈ చర్చలో కింద ప్రస్తావించిన ఇతివృత్తాలపై కార్యక్రమాలు భాగంగా ఉంటాయి:
• పెద్ద పెద్ద ఆలోచనలు చేయడం, స్థానిక స్థాయిలో పనులు పూర్తి చేయడం: దక్షిణాసియాలో ఆహార శుద్ధికి గల అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం.
• పొలం నుంచి కర్మాగారం దిశగా పయనించడం: ఆహార శుద్ధిని దృష్టిలో పెట్టుకొని వ్యావసాయిక సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం.
• నీడలో నుంచి వెలుగు వైపునకు: అనధికారిక ఆహార శుద్ధి సంస్థలకు అధికారిక గుర్తింపును ఇవ్వడం (చిన్న శుద్ధిసంస్థలను నియంత్రణకు లోబడే వేల్యూ చైన్ల పరిధిలోకి చేర్చడం).
• స్మార్ట్ టెక్, సాహసిక నూతన ఆవిష్కరణలు: సాంకేతికత సాయంతో ఆహార శుద్ధి ప్రక్రియల్లో పరివర్తన.
• సురక్షిత ఆహారం, బలమైన మార్కెట్లు: ఆరోగ్యం, నాణ్యతతో పాటు పోటీతత్వంతో కూడిన వాణిజ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రమాణాలను నిర్దేశించడం.
• సాగు, సంస్థ, ఆర్థిక సహాయం: ఆహార శుద్ధి రంగ అభివృద్ధి కోసం పెట్టుబడి సమీకరణ.
• ఉమ్మడి ఆహార రంగ భవిష్యత్తుకు రూపురేఖలను తీర్చిదిద్దడం: దక్షిణాసియాలో ప్రాంతీయ సహకారంతో పాటు విధాన సంబంధిత కార్యాచరణ.
ఈ చర్చలలో నెస్లే, బాయర్, రాబోబ్యాంకు, అజినోమోటో, ఐటీసీ, సేవా, నాబార్డ్‌లతోపాటు ఫూడ్ ఇండస్ట్రీ ఏషియా సహా ప్రముఖ భారతీయ సంస్థల, ప్రపంచ సంస్థల సీనియర్ ప్రతినిధులు పాలుపంచుకొంటున్నారు.
ఒక నూతన ఆవిష్కరణ మేళాను కూడా ఈ చర్చా కార్యక్రమంతో పాటు నిర్వహిస్తున్నారు. కోల్డ్ చైన్ లాజిస్టిక్స్, డిజిటల్ ట్రేసబులిటీ, మన్నికైన ప్యాకేజింగ్, స్మార్ట్ ప్రాసెసింగుకు సంబంధించిన సాంకేతికతలు, నిల్వ వ్యవస్థల్లో ఇంతవరకూ ఎరుగని సేవలను ఈ మేళాలో ప్రదర్శిస్తున్నారు. నూతన ఆవిష్కర్తలు, విధాన రూపకర్తలతో పాటు పరిశ్రమకు చెందిన ఆసక్తిదారుల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఈ మేళా లక్ష్యం.
ఈ సందర్భంగా, ‘‘భారత్‌లో ఆహార శుద్ధి స్థాయి నిర్ధారణ’’ శీర్షికతో ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన నివేదికను మంత్రులు, ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ నివేదికలో ప్రధాన వ్యావసాయిక ఉత్పాదనలలో ఆహార శుద్ది స్థాయిల విస్తృత నిర్ధారణను ప్రస్తావించారు. అలాగే భారత్ ఆహార శుద్ధి రంగంలో చోటు చేసుకున్న కీలక ప్రగతిని కూడా పొందుపరిచారు. దీనిలో 2016లో ఇంచుమించు 10 శాతంగా ఉన్న మొత్తంమీద శుద్ధి స్థాయిలు, 2023కల్లా వృద్ధి చెంది.. దాదాపు 17 శాతానికి చేరాయని పేర్కొన్నారు. పండ్లు, కాయగూరలు, పాడి ల వంటి త్వరగా చెడిపోయే ఉత్పాదనలకు విలువను జోడించడానికి ఉన్న కీలక అవకాశాలను ఈ అధ్యయనంలో గుర్తించారు. ఈ నివేదిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు, పంట కోతల తరువాత జరిగే నష్టాన్ని తగ్గించేందుకు, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, ఆహార సంబంధిత ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడటాన్ని ప్రోత్సహించడానికి విధానపరంగా అనుసరించదగ్గ వ్యూహాత్మక సిఫారసులను కూడా అందించింది.
ప్రపంచ బ్యాంక్ గ్రూపునకు చెందిన అగ్రికనెక్ట్ కార్యక్రమం, శాప్లింగ్ వేదికకు అనుగుణంగా ప్రాంతీయ ఉన్నత స్థాయి విధాన చర్చ ‘శాప్లింగ్’ కార్యక్రమాన్ని రూపొందించారు. విధానపరమైన సంస్కరణ, పెట్టుబడి సమీకరణ, సాంకేతికత ఆధారిత పరిష్కారాలను అమల్లోకి తీసకువస్తూ దక్షిణాసియాలో దృఢతర, పోషణ ప్రధాన ఆహార వ్యవస్థలకు వేగాన్ని సంతరించడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం.
ఈ చర్చా కార్యక్రమ నిర్వహణతో దేశాల మధ్య జ్ఞానాన్ని పెంచుకొనే ప్రక్రియ జోరందుకొనేటట్లు చూడడం, ప్రాంతీయ సహకారాన్ని పటిష్టపరచడం, ప్రయివేటు రంగ పెట్టుబడిని ప్రోత్సహించడం, ఎమ్ఎస్ఎమ్ఈలకు మద్దతును అందించడంతో పాటు, దక్షిణాసియాలో ఆహార శుద్ధి ఆధారిత అభివృద్ధిని, ఉపాధి అవకాశాల కల్పనను ప్రోత్సహించడానికి ఆచరణయోగ్య పద్ధతులను కూడా గుర్తించవచ్చన్న అంచనాలు ఏర్పడ్డాయి.
***
(रिलीज़ आईडी: 2270692)
आगंतुक पटल : 15