శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
స్వచ్ఛతా పక్వాడా-2026ను నిర్వహించిన శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన బయో టెక్నాలజీ విభాగం
प्रविष्टि तिथि:
08 JUN 2026 2:35PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన బయో టెక్నాలజీ విభాగం (డీబీటీ).. మే 1 నుంచి మే 15, 2026 వరకు స్వచ్ఛతా పక్వాడా-2026ను నిర్వహించింది. న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంతో పాటు ఈ విభాగం పరిధిలోని అన్ని స్వయంప్రతిపత్తి సంస్థలు (ఏఐలు), ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్ యూలు) ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. భారత ప్రభుత్వ కేబినెట్ సెక్రటేరియట్ జారీ చేసిన స్వచ్ఛతా పక్వాడా-2026 మార్గదర్శకాలు, క్యాలెండర్‌కు అనుగుణంగా ఈ పక్వాడా నిర్వహించారు.
న్యూఢిల్లీలోని సీజీఓ కాంప్లెక్స్‌లో బయో టెక్నాలజీ (డీబీటీ) కార్యాలయంలో మే 1, 2026న ప్రతిజ్ఞ కార్యక్రమంతో స్వచ్ఛతా పక్వాడా-2026 ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బయో టెక్నాలజీ విభాగం ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం.. పరిశుభ్రత, క్రమశిక్షణ, పౌర బాధ్యత పట్ల నిబద్ధతను స్పష్టం చేసింది. రాబోయే పదిహేను రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు కీలకంగా నిలిచింది. ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. పక్వాడా ప్రారంభానికి స్ఫూర్తిగా నిలిచింది. ఈ పదిహేను రోజుల్లో డీబీటీ, దాని అనుబంధ సంస్థలైన ఏఐలు, పీఎస్‌యూల భాగస్వామ్యంతో పలు పరిశుభ్రతా కార్యక్రమాలను రూపొందించి, పూర్తి చేశారు. పరిశుభ్రతను పెంపొందించే వివిధ ఉత్తమ పద్ధతులు, నీటి సంరక్షణ, శ్రమదానం వంటివి ఈ కార్యాచరణ ప్రణాళికలో చేర్చారు.
పక్వాడా సందర్భంగా ఆరోగ్య పరీక్షల శిబిరాలు, పర్యావరణ అవగాహనా సదస్సులు, సంతకాల సేకరణ, మొక్కలు నాటే కార్యక్రమాలు, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ పై అవగాహనా సదస్సులను నిర్వహించారు. మానసిక ఒత్తిడి నియంత్రణ కార్యశాలలు, సెమినార్లు, పెయింటింగ్ పోటీలు, వ్యర్థాల నుంచి సంపద వంటి పోటీల నిర్వహణతో పాటు జనపనార సంచుల పంపిణీ, చెక్క ప్యాకింగ్ సామాగ్రిని అందమైన పూల కుండీలుగా మార్చటం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ప్రయోగశాలల్లోని వ్యర్థాల నిర్వహణపై సమీప ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక అవగాహనా సదస్సులను నిర్వహించటమే కాక.. మరుగుదొడ్లు, తరగతి గదుల మరమ్మత్తు పనులను చేపట్టారు. పరిశుభ్రతపై సమాజానికి అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు వ్యాస రచన, కవిత్వం, నినాదాల రచనా పోటీలను ఏఐలు నిర్వహించాయి.
ఈ పక్వాడా కార్యక్రమాలను డీబీటీ ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, దిశానిర్దేశం చేశారు. స్వచ్ఛతా పక్వాడాలో పాల్గొన్న వారిని ప్రోత్సహించి, ఉత్సాహపరుస్తూ, మార్గదర్శకత్వం అందించేందుకు సమీక్షా సమావేశాలను నిర్వహించారు. నిర్దేశిత నిబంధనల ప్రకారం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మూడు కార్యాలయాల ఎంపిక కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి మూడు సంస్థలు (I) బ్రిక్ - నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఐఏబీ) (ii) బ్రిక్ - నేషనల్ అగ్రి-ఫుడ్ బయోటెక్నాలజీ ఇనిస్టిట్యూట్ (ఎన్ఏబీఐ) (iii) బ్రిక్ - ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోరిసోర్సెస్ అండ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ (ఐబీఎస్‌డీ)లను బయోటెక్నాలజీ విభాగం(డీబీటీ) సెక్రటరీ.. జూన్ 2, 2026న జరిగిన అధికారిక కార్యక్రమంలో అవార్డులతో సత్కరించారు.
***
(रिलीज़ आईडी: 2270285)
आगंतुक पटल : 11