కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సూరత్ వైద్య రంగంలో భారీ పురోగతి: 220 పడకల ఈఎస్‌ఐసీ ఆసుపత్రిని వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ఈఎస్‌ఐ పథకం ద్వారా 3.20 లక్షల మందికి పైగా బీమా దారులు, 12 లక్షల మంది లబ్ధిదారులకు సేవలు అందించనున్న ఆసుపత్రి


శ్రమకు సముచిత గౌరవం: ప్రారంభోత్సవ వేదిక వద్ద ఆసుపత్రి నిర్మాణ కార్మికులకు సన్మానం, ఈఎస్‌ఐ నగదు ప్రయోజనాల పంపిణీ

प्रविष्टि तिथि: 05 JUN 2026 6:55PM by PIB Hyderabad

దేశంలోని వ్యవస్థీకృత రంగ కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలను అందించే నిరంతర ప్రయత్నాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక మైలురాయిని అధిగమించింది. గుజరాత్‌లోని సూరత్‌లో నూతనంగా నిర్మించిన 220 పడకల ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) ఆసుపత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. సూరత్ ఇండోర్ స్టేడియం నుంచి జరిగిన ఈ అధికారిక కార్యక్రమంలో ఆసుపత్రితో పాటు మొత్తం రూ. 18,800 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి శ్రీకారం చుట్టారు.

 

ఈ సందర్భంగా ఈఎస్‌ఐసీ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈఎస్‌ఐసీ డైరెక్టర్ జనరల్, ప్రముఖ ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజలు పాల్గొన్నారు. వీరంతా ప్రధానమంత్రి ప్రారంభోత్సవ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. కార్మికుల సంక్షేమానికి, శ్రామిక గౌరవానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను చాటిచెబుతూ.. ఈ ఆసుపత్రిని నిర్మించిన నిర్మాణ కార్మికులను ఈ వేదికపై ఘనంగా సన్మానించారు. అలాగే ఈఎస్‌ఐ లబ్ధిదారులకు అందాల్సిన నగదు ప్రయోజనాలను అక్కడే పంపిణీ చేశారు.

 

రూ. 216 కోట్ల వ్యయంతో 8.60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కొత్త 220 పడకల ఈఎస్‌ఐసీ ఆసుపత్రి ఈ ప్రాంత కార్మికులకు సంజీవనిలా మారనుంది. సూరత్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం 20 నిమిషాల దూరంలో ఉన్న ఈ ఆసుపత్రి... జనరల్ మెడిసిన్, సర్జరీ, ప్రసూతి, గైనకాలజీ, ఆంకాలజీ, మానసిక వైద్యం, ఆప్తాల్మాలజీ, ఈఎన్‌టీ, దంత వైద్యం వంటి సమగ్ర వైద్య సేవలను అందిస్తుంది. అలాగే అత్యాధునిక రేడియాలజీ, పాథాలజీ, 24 గంటల అత్యవసర వైద్య సేవలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా దాదాపు 3.20 లక్షల మంది బీమా చేసుకున్న ఉద్యోగులకు, వారిపై ఆధారపడిన సుమారు 12.16 లక్షల మంది లబ్ధిదారులకు అత్యాధునిక వైద్య సేవలు అందుతాయి.

 

ఈ నూతన ఆసుపత్రి ఏర్పాటు గుజరాత్‌లోని విస్తృతమైన ఈఎస్ఐ వైద్య రంగ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. 1964 అక్టోబర్‌లో రాష్ట్రంలో ప్రారంభమైన ఈ వ్యవస్థ.. ప్రస్తుతం రాష్ట్రంలోని 34 జిల్లాల్లో దాదాపు 20.04 లక్షల మంది బీమా దారులకు ఈ సామాజిక భద్రతా వలయం విస్తరించింది. ఇందులో భాగంగా సూరత్ ప్రాంతీయ ఉప-కార్యాలయ నెట్‌వర్క్.. సూరత్, నవసారి, వల్సాద్ జిల్లాల పరిధిలోని కార్మికులకు సేవలు అందిస్తోంది. 

 

సూరత్ ప్రాంతంలో వైద్య సదుపాయాలను మరింత బలోపేతం చేస్తూ కార్మిక వర్గ సంక్షేమానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవమే ఒక నిదర్శనం.


(रिलीज़ आईडी: 2269935) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil