మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 'సముద్ర ఆహార ఎగుమతులపై జాతీయ సదస్సు' నిర్వహించిన కేంద్ర మత్స్యశాఖ
హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర వాణిజ్య- పరిశ్రమల శాఖ మంత్రి, కేంద్ర మత్స్య- పశుసంవర్ధక- డైయిరీ శాఖ మంత్రి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి
భారతదేశ సముద్ర ఆహార ఎగుమతుల వ్యవస్థను బలోపేతం చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అందించిన సదస్సు
प्रविष्टि तिथि:
05 JUN 2026 7:29PM by PIB Hyderabad
అన్ని రాష్ట్రాలు, భాగస్వామ్య పక్షాల సహకారంతో భారతదేశ సముద్ర ఆహార ఎగుమతుల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 2026 జూన్ 5, 6 తేదీల్లో 'సముద్ర ఆహార ఎగుమతులపై జాతీయ సదస్సు'ను నిర్వహిస్తున్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, డైయిరీ మంత్రిత్వ శాఖకు చెందిన మత్స్యశాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. ప్రారంభ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య- పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్.. కేంద్ర మత్స్య- పశుసంవర్ధక- డైయిరీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ చిరాగ్ పాశ్వాన్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంపీఈడీఏ (మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ), ఈఐసీ (ఎక్స్‌పోర్ట్ ఇన్‌స్పెక్షన్ కౌన్సిల్), ఎన్‌ఎఫ్‌డీబీ (నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్), నాబార్డ్, ఎన్‌సీడీసీ, ఎన్‌సీఈఎల్, ఎస్‌ఎఫ్‌ఏసీ, ఇన్వెస్ట్ ఇండియా వంటి ప్రముఖ జాతీయ సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యాయి. వీటితో పాటు సముద్ర ఆహార ఎగుమతిదారులు, పారిశ్రామిక సంఘాలు, ప్రాసెసర్లు, అంకురాలు, విలువ గొలుసు అనుబంధ పక్షాలు కూడా పాల్గొనటంతో సముద్ర ఆహార ఎగుమతుల వ్యవస్థకు సంబంధించిన అన్ని రంగాల వారికి ఇందులో సమగ్ర ప్రాతినిధ్యం లభించింది.
భవిష్యత్తు ఆర్థిక వృద్ధికి 'బ్లూ ఎకానమీ' కీలక శక్తిగా నిలుస్తుందన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు.. ఇందులో మత్స్య రంగం పరివర్తనాత్మక పాత్ర పోషిస్తుందని చెప్పారు. మత్స్య ఉత్పత్తి, ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. విలువ జోడింపు, ఆవిష్కరణలు, బలమైన ఎగుమతి వ్యవస్థల ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో భారత్ వాటాను గణనీయంగా పెంచుకోగలదనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నాణ్యత, సుస్థిరత, మూలాలను గుర్తించే విధానం (ట్రేసబిలిటీ), చక్రీయ ఆర్థిక వ్యవస్థ పద్ధతులకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచవ్యాప్తంగా పోటీ పడగల నమ్మకమైన 'భారత సముద్ర ఆహార బ్రాండ్'ను తయారుచేసేందుకు భాగస్వామ్య పక్షాలన్నీ సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, బలమైన ఆక్వాకల్చర్ వ్యవస్థను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పూర్తి మద్దతు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
భారతదేశ మత్స్య, జలవనరుల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి సరికొత్త ఆవిష్కరణలను అలవర్చుకోవాలని, అధునాతన సాంకేతికతలను స్వీకరించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రధానంగా చెప్పారు. నాణ్యత, స్థిరత్వం, మూలాలను గుర్తించే విధానం (ట్రేసబిలిటీ), విలువ జోడింపునకు మారుపేరుగా ప్రపంచవ్యాప్తంగా నమ్మకమైన 'సముద్ర ఆహార బ్రాండ్'గా భారతదేశాన్ని నిలపాలనేది ప్రభుత్వ దార్శనికత అని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లలో మన పోటీతత్వాన్ని పెంచడానికి ఉమ్మడి ప్రయత్నాలు చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, సులభతర వ్యాపారాన్ని పెంపొందించేందుకు విశాఖపట్నంతో పాటు ఇతర ప్రధాన కేంద్రాలలో క్వారంటైన్, వాటి అనుబంధ వసతుల ఏర్పాటును పరిశీలించనున్నట్లు తెలిపారు. ఎగుమతి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
గడిచిన దశాబ్ద కాలంలో మత్స్య రంగం గణనీయమైన వృద్ధిని సాధించిందన్న కేంద్ర మత్స్య- పశుసంవర్ధక- డైయిరీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్.. దేశీయ ఉత్పత్తి, ఎగుమతులు రెండింతలకు పైగా పెరిగి 197 లక్షల టన్నులకు, రూ. 73,000 కోట్ల పైచిలుకు చేరాయని ప్రముఖంగా చెప్పారు. మొత్తం ఉత్పత్తిలో ప్రధాన వాటా ఇన్‌ల్యాండ్ మత్స్య రంగానిదే అయినప్పటికీ ఎగుమతుల్లో దీని వాటా తక్కువగా ఉండటాన్ని ఒక గొప్ప అవకాశంగా భావించాలన్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌ల్యాండ్ రాష్ట్రాల నుంచి ఎగుమతులను ప్రోత్సహించడానికి ఒక ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్ఓపీ) రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. టీఈడీలు, సముద్ర క్షీరదాల పోలిక (మెరైన్ మామల్ కంపారబిలిటీ), ఈఈజెడ్, అంతర్జాతీయ సముద్ర జలాల నిబంధనలతో కూడిన సుస్థిరత చర్యలను మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎగుమతి ఆధారిత అభివృద్ధి కోసం ద్వీప ప్రాంతాలపై నిరంతరం దృష్టి సారించడంతో పాటు ఈఈజెడ్ యాక్సెస్ పాస్‌ల ప్రాధాన్యతను ఆయన గుర్తుచేశారు.
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) కింద ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో స్మార్ట్, ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆయన ప్రకటించారు. సామర్థ్యం, సేవల నాణ్యతను పెంచేందుకు ఆధునిక మౌలిక సదుపాయాలు, స్మార్ట్ సాంకేతికతలతో రూ. 72.42 కోట్ల వ్యయంతో ఈ హార్బర్‌ను నిర్మించనున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం రూ. 43.45 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనుంది. ఈ హార్బర్ పూర్తయిన తర్వాత సుమారు 423 నౌకలకు బెర్తింగ్ సౌకర్యం లభిస్తుంది. అలాగే ఏటా దాదాపు 74,448 టన్నుల ల్యాండింగ్‌లకు ఇది వేదిక కానుంది. దాదాపు 12,345 మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ రాష్ట్రంలోని మత్స్య రంగం సమగ్ర అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. పీఎంఎంఎస్‌వై రెండో దశను ఎగుమతి ఆధారిత అభివృద్ధి వైపు మళ్లించామని పేర్కొంటూ ఎగుమతి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రముఖంగా చెప్పారు.
సముద్ర ఆహార ఎగుమతులను బలోపేతం చేయడానికి ప్రభుత్వం మొత్తంగా ఒకే సమగ్ర విధానంతో ముందుకు సాగాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇందులో సమర్థవంతమైన లాజిస్టిక్స్, కార్గో మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ అనుసంధానత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నందుకు సంబంధిత భాగస్వామ్య పక్షాలను ఆయన అభినందించారు. నాణ్యత, భద్రతకు సంబంధించి ఉన్నత ప్రమాణాలను పాటిస్తూనే అంతర్జాతీయ మార్కెట్లకు సముద్ర ఆహార ఉత్పత్తులను సకాలంలో తక్కువ ఖర్చుతో చేర్చాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎగుమతులకు పట్టే సమయం, వ్యయాన్ని తగ్గించి అంతర్జాతీయంగా మన పోటీతత్వాన్ని పెంచే లక్ష్యంతో ఎయిర్ కార్గో నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడం, ప్రత్యేక కార్గో హబ్‌లను అభివృద్ధి చేయడం, మల్టీమోడల్ లాజిస్టిక్స్‌ను మెరుగుపరచడం, ట్రాన్స్‌షిప్‌మెంట్ ప్రక్రియలను సరళీకృతం చేయడం, 'ఒక విమానాశ్రయం, ఒక ఉత్పత్తి (వన్ ఎయిర్‌పోర్ట్, వన్ ప్రొడక్ట్)’ వంటి కార్యక్రమాలను ప్రోత్సహించడానికి జరుగుతున్న నిరంతర ప్రయత్నాలను మంత్రి ఈ సందర్భంగా వివరించారు.
సముద్ర ఆహార ఎగుమతులు భారత్‌కు, మొత్తం మత్స్య రంగ విలువ గొలుసుకు అత్యంత కీలకమైనవని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ వృద్ధిని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నందుకు సంబంధిత భాగస్వామ్య పక్షాల ప్రయత్నాలను ఆయన అభినందించారు. మనం పరిమాణం నుంచి విలువ వైపు, ఉత్పత్తి నుంచి తుది ఉత్పత్తి వైపు మారాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల అభివృద్ధి, విలువ జోడింపుపై బలమైన దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. మత్స్య రంగంలో ఇంకా వెలికితీయని అపారమైన సామర్థ్యం దాగి ఉందని గుర్తుచేసిన ఆయన.. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్న 'వెంటనే తినగలిగే (రెడీ-టు-ఈట్), వెంటనే వండుకోగలిగే (రెడీ-టు-కుక్)' విభాగాలలో ఉన్న విస్తృత అవకాశాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఆహార శుద్ధి వ్యవస్థ, విలువ గొలుసులను బలోపేతం చేయాలని.. ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలపై ఉన్న అపోహలను తొలగించాలని, భారతీయ ఉత్పత్తులపై అంతర్జాతీయంగా నమ్మకాన్ని పెంచేందుకు నాణ్యత, స్వచ్ఛతను నిర్ధారించాలని మంత్రి కోరారు. ఆహార ఉత్పత్తుల నిల్వ కాలాన్ని పెంచడంలో సాంకేతికత పాత్రను ప్రధానంగా చెప్పిన ఆయన.. భారత్‌ను ప్రపంచ ఫుడ్ బాస్కెట్‌గా నిలిపేందుకు పరిశ్రమకు చెందిన భాగస్వామ్య పక్షాలన్నీ చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సదస్సు ముఖ్య ఉద్దేశాన్ని కేంద్ర మత్స్య- పశుసంవర్ధక- డైయిరీ మంత్రిత్వ శాఖలోని మత్స్య విభాగానికి చెందిన కార్యదర్శి డాక్టర్ అభిలాష్ లిఖి వివరించారు. భారతదేశ సముద్ర ఆహార ఎగుమతుల వ్యవస్థను బలోపేతం చేయడానికి వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయంతో కూడిన చర్యలు అవసరమని ఆయన చెప్పారు. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వివిధ మంత్రిత్వ శాఖల నిరంతర ప్రయత్నాలు, భాగస్వామ్య పక్షాల చురుకైన భాగస్వామ్యం వల్లే భారతదేశం రికార్డు స్థాయి ఎగుమతులను సాధించగలిగిందని ఆయన తెలిపారు. ఎగుమతి ఆధారిత వ్యవస్థలో ఉన్న లోపాలను, ముఖ్యంగా ఇన్‌ల్యాండ్ మత్స్య రంగంలో ఉన్న అంతరాలను ఆయన గుర్తుచేశారు. మౌలిక సదుపాయాలు, ధ్రువీకరణ విధానాలు, మార్కెట్ యాక్సెస్ యంత్రాంగాలలో నిర్దేశిత పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ద్వీప పర్యావరణ వ్యవస్థలు, సముద్ర తీర ప్రాంత వనరులలో లభిస్తున్న సరికొత్త అవకాశాలను ఆయన వివరించారు. విలువను పెంచడం, అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని పెంపొందించడం కోసం పీఎంఎంఎస్‌వై-II కింద క్లస్టర్ ఆధారిత అభివృద్ధి, ఆవిష్కరణలు, ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తాయని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ-యోజన (పీఎంఎంకేఎస్ఎస్‌వై), కిసాన్ క్రెడిట్ కార్డులు(కేసీసీ), ఇతర కార్యక్రమాల కింద లబ్ధిదారులకు వివిధ రకాల ప్రయోజనాలను కూడా పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన శ్రీ పారుపల్లి బస్వంత్ చౌదరి, శ్రీమతి పుష్పలత న్యాత్రి.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శ్రీమతి పోలిశెట్టి దేవి శ్రీలక్ష్మి, శ్రీ ఈంటి ప్రేమానందం, శ్రీ పోలిశెట్టి మురళిలకు 'ఆక్వా ఇన్సూరెన్స్' పత్రాలను అందజేశారు.
సముద్ర ఆహార ఎగుమతులను ప్రోత్సహించేందుకు చేపట్టిన వివిధ పథకాలు, విధానాలు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలపై పలు కేంద్ర మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు, పరిశ్రమల ప్రతినిధులు ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఎగుమతుల అభివృద్ధి, నాణ్యతా ప్రమాణాలను పాటించడం, విలువ జోడింపునకు సంబంధించిన కార్యక్రమాలను వివరిస్తూ.. కేంద్ర మత్స్యశాఖ, వాణిజ్య శాఖ, డీపీఐఐటీ, ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఎక్స్‌పోర్ట్ ఇన్‌స్పెక్షన్ కౌన్సిల్, మధ్యప్రదేశ్ ప్రభుత్వ మత్స్యశాఖ ప్రతినిధులు ప్రజెంటేషన్లను సమర్పించారు. ఆ తర్వాత సీఈఏఐ (సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా), ఐఎఫ్ఏఎఫ్ఈఏ (ఇండియన్ ఫిష్‌మీల్ అండ్ ఫిష్ ఆయిల్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్), ఇండియన్ మెరైన్ ఇంగ్రెడియెంట్స్ అసోసియేషన్ (ఐఎంఐఏ) ప్రతినిధులు ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఈ సందర్భంగా భారతదేశ సముద్ర ఆహార ఎగుమతుల వ్యవస్థను బలోపేతం చేయడానికి పరిశ్రమ దృక్పథాన్ని, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు- ఉన్న అవకాశాలను వారు ప్రస్తావించారు.
సముద్ర ఆహార ఎగుమతుల్లో రూ. 1 లక్ష కోట్ల లక్ష్యాన్ని సాధించే దిశగా భారత్ అడుగులు వేస్తున్న తరుణంలో ఈ సదస్సు సరికొత్త ఆవిష్కరణలు, సమన్వయం, అంతర్జాతీయ నాయకత్వం విషయంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఈ సదస్సు ద్వారా లభించిన ఫలితాలు భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనగల, అంతర్జాతీయంగా పోటీ పడగల, అందరినీ కలుపుకుపోయే సముద్ర ఆహార ఎగుమతుల వ్యవస్థను వేగవంతం చేస్తాయని.. తద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో ఒక నమ్మకమైన అగ్రగామిగా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేస్తాయని భావిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2269932)
आगंतुक पटल : 6