మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో సముద్ర ఆహార ఎగుమతులపై కేంద్ర మత్స్య, పశుసంవర్ధక పాడిపరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన మత్స్య విభాగం, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ సదస్సు


సదస్సుకు హాజరుకానున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి

విలువ ఆధారిత, గుర్తింపు కలిగిన సముద్ర ఆహార ఎగుమతుల వృద్ధికి మార్గదర్శక ప్రణాళిక రూపకల్పనపై సదస్సు దృష్టి

प्रविष्टि तिथि: 03 JUN 2026 3:24PM by PIB Hyderabad

రాష్ట్రాలు, సంబంధిత భాగస్వాముల స్థాయిలో సముద్ర ఆహార ఎగుమతుల వ్యవస్థను బలోపేతం చేయడానికి సమగ్ర  సమగ్ర కార్యాచరణను  రూపొందించే ఉద్దేశంతో. 2026 జూన్ 5, 6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో సముద్ర ఆహార ఎగుమతులపై జాతీయ సదస్సు'ను నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక పాడిపరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన మత్స్య విభాగం, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నాయి.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ,పంచాయతీ రాజ్ శాఖల మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ చిరాగ్ పాశ్వాన్ ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, పంచాయతీ రాజ్ శాఖల సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మైనారిటీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి శ్రీ జార్జ్ కురియన్ కూడా ఈ సదస్సుకు హాజరవుతారు. 

 

ఈ సదస్సులో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొంటారు. మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంపీఈడిఏ), ఎక్స్‌పోర్ట్ ఇన్‌స్పెక్షన్ కౌన్సిల్ (ఈఐసీ), ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ), బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్ఎఫ్డీబీ), నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డు), నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ), నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (ఎన్సీఈఎల్), స్మాల్ ఫార్మర్స్ అగ్రిబిజినెస్ కన్సార్టియం (ఎస్ఎఫ్ఏసే), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), ఇన్వెస్ట్ ఇండియా మొదలైన ప్రముఖ జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. సముద్ర ఆహార ఎగుమతుల వ్యవస్థకు సంబంధించిన అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా ఈ సదస్సులో సముద్ర ఆహార ఎగుమతిదారులు, సముద్ర ఆహార ఎగుమతిదారుల సంఘాలు, పరిశ్రమల భాగస్వాములు, సముద్ర ఆహార శుద్ధి పరిశ్రమల. ప్రతినిధులు, స్టార్టప్‌లు,  ఈ విలువ శ్రేణిలోని ఇతర ప్రతినిధులను కూడా సదస్సుకు ఆహ్వానించారు.

 

సదస్సులో భాగంగా రాష్ట్రాల వారీగా ప్రత్యేక ఎగుమతి వ్యూహాలను గుర్తించడం, విలువ జోడింపు,  గుర్తింపు ప్రక్రియల కోసం ఒక సూచనాత్మక కార్యాచరణను రూపొందించడం, నియంత్రణ, మౌలిక సదుపాయాల మెరుగుదలకు అవసరమైన సిఫార్సులను సిద్ధం చేయడం వంటి అంశాలపై సాంకేతిక సెషన్లు నిర్వహిస్తారు. ప్రపంచ సముద్ర ఆహార మార్కెట్లలో భారత పోటీతత్వాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో.. స్టార్టప్‌లు,  ఎంఎస్ఎంఈలను ఈ ఎగుమతి వ్యవస్థలోకి మరింత ఎక్కువగా అనుసంధానించే మార్గాలను కూడా ఈ సదస్సు అన్వేషిస్తుంది. ఈ రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభ సమావేశం తరువాత భాగస్వాముల మధ్య ముఖాముఖి చర్చలు, సదస్సులో పాల్గొంటున్న వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు,  విభాగాల ప్రజెంటేషన్లు ఉంటాయి. రెండు సాంకేతిక సదస్సులు కూడా నిర్వహిస్తారు. జాతీయ సదస్సు తొలిరోజున, భాగస్వామ్య పక్షాలు,  స్టార్టప్‌లతో నిర్వహించే ముఖాముఖి చర్చా కార్యక్రమం ఒకరి అభిప్రాయాలను మరొకరు నేరుగా పంచుకోవడానికి పటిష్టమైన వేదికను అందిస్తుంది. ఆ తర్వాత మత్స్యశాఖ, వాణిజ్య శాఖ, ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ, డీపీఐఐటీ, కార్మిక శాఖ, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఎక్స్‌పోర్ట్ ఇన్‌స్పెక్షన్ కౌన్సిల్ వంటి సంబంధిత ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల ప్రజెంటేషన్లు ఉంటాయి. ఇవి ప్రభుత్వ పథకాలు, విధానపరమైన చర్యలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి ప్రముఖంగా వివరిస్తాయి. ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ-యోజన  (పీఎంఎంకేఎస్ఎస్వై)), కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ),  ఇతర ప్రభుత్వ పథకాల కార్యక్రమాల లబ్ధిదారులకు ఈ సందర్భంగా ప్రయోజనాలను పంపిణీ చేస్తారు. సదస్సు రెండవ రోజున రెండు సాంకేతిక సమావేశాలు  జరుగుతాయి. ఇవి ప్రధానంగా విలువ జోడింపు,  ధృవీకరణ గుర్తింపు ప్రక్రియల  ద్వారా సముద్ర ఆహార ఎగుమతులను మరింత ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి సారిస్తాయి. ఎగుమతుల వృద్ధి, వైవిధ్యీకరణను ప్రోత్సహించడంలో స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలు, కొత్తగా ఎదుగుతున్న రంగాల పాత్రపై చర్చిస్తారు. చివరిగా, ఈ సదస్సు ద్వారా వచ్చిన కీలక ఫలితాలు,  సిఫార్సులను సంక్షిప్తంగా వివరిస్తూ ముగింపు సమావేశంతో సదస్సు ముగుస్తుంది.

2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ. 73,890.46 కోట్లకు (8.45 బిలియన్ యూఎస్ డాలర్లు) చేరుకున్నాయి. ఎగుమతి పరిమాణం 19.72 లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదైంది. ఇది భారతీయ సముద్ర ఆహారానికి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న స్థిరమైన వృద్ధిని, పెరుగుతున్న డిమాండ్‌ను స్పష్టం చేస్తోంది. ఈ బలమైన పనితీరును ఆధారంగా చేసుకుని, ఈ రంగం ఎగుమతులను  లక్ష కోట్ల రూపాయలకు చేర్చే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రాష్ట్రాలు, సంబంధిత భాగస్వాముల సామర్థ్యాలను బలోపేతం చేయడం, ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించడం, మొత్తం ఎగుమతి సిద్ధతను మెరుగుపరచడం ద్వారా ఈ జాతీయ సదస్సు ఈ వృద్ధి గమనాన్ని మరింత బలోపేతం చేయనుంది. తద్వారా ఈ బృహత్తర లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించనుంది.

దేశీయంగా చేపల ఉత్పత్తిలోనూ, సముద్ర ఆహార ఎగుమతుల్లోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దేశంలోని మొత్తం ఆక్వాకల్చర్ ఉత్పత్తిలో ఈ రాష్ట్రం సింహభాగాన్ని కలిగి ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 55.39 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించింది. సుదీర్ఘమైన తీరప్రాంతం, అభివృద్ధి చెందిన ఆక్వాకల్చర్ మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్, ఎగుమతి యూనిట్ల బలమైన ఉనికితో.. ఆంధ్రప్రదేశ్ మెరైన్,  ఆక్వాకల్చర్ ఎగుమతులకు ఒక ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించింది.  ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గణనీయమైన మద్దతు లభించింది, దీని కింద మొత్తం రూ. 2,324.17 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది.

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన' కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన మత్స్య రంగాన్ని బలోపేతం చేసేందుకు గణనీయమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను చేపట్టింది. మత్స్య సంపద నిర్వహణ, ల్యాండింగ్ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు విశాఖపట్నం (2), విజయనగరం, కాకినాడ, తిరుపతి, అనకాపల్లి జిల్లాల వ్యాప్తంగా  రూ. 126.91 కోట్ల వ్యయంతో ఆరు ఆధునిక సమీకృత ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సముద్ర మౌలిక సదుపాయాలను, నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో పుడిమడక, బుడగట్లపాలెం, కొత్తపట్నంల వద్ద  రూ. 1137.20 కోట్ల భారీ పెట్టుబడితో మూడు మత్స్య రేవులను  అభివృద్ధి చేస్తున్నారు. విలువ జోడింపు, ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో.. బాపట్లలో రూ. 88.08 కోట్ల వ్యయంతో ఒక సమీకృత ఆక్వా పార్క్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా, మత్స్య రంగ మౌలిక సదుపాయాలను ఆధునికికరించడం,  ఈ రంగంలో వృద్ధిని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. రాష్ట్రంలో రూ. 1352.19 కోట్ల పెట్టుబడితో  ఈ కార్యక్రమాలను చేపట్టారు. ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎఫ్ఐడిఎఫ్) కింద రాష్ట్రంలో మొత్తం రూ. 259.28 కోట్ల పెట్టుబడితో 9 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద ఆంధ్రప్రదేశ్‌లో 4 లక్షల మందికి పైగా లబ్ధిదారుల జీవనోపాధికి అవసరమైన మద్దతును అందించింది. తద్వారా మత్స్య రంగంలో అందరికీ భాగస్వామ్యం కల్పించే సమ్మిళిత, సుస్థిరమైన వృద్ధికి దోహదపడింది.

ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లలో సుంకాలు,  సుంకాల రహిత అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ, భారత సముద్ర ఆహార ఎగుమతులు స్థిరమైన వృద్ధిని, ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాయి. మత్స్య రంగంలో ఉత్పత్తిని, మౌలిక సదుపాయాలను,  ఎగుమతి పోటీతత్వాన్ని సంయుక్తంగా బలోపేతం చేసిన పీఎంఎంఎస్‌వై నీలి విప్లవ పథకం, ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ-యోజన, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు, విధానపరమైన జోక్యాలు ఈ వృద్ధికి చేదోడుగా నిలిచాయి. నిర్దేశిత విధానపరమైన చర్యల ద్వారా ఎగుమతి పోటీతత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్ (ఎఫ్పీఎం) కూడా ఈ అద్భుతమైన నిర్వహణకు పూర్తి మద్దతునందించింది. ఎగుమతులపై అమలు చేస్తున్న  జీరో రేటెడ్ జీఎస్టీ  విధానం కూడా ఈ ప్రయత్నాలకు తోడైంది. ఇది పన్నుల భారం లేకుండా ఉత్పత్తి వ్యయాలను తగ్గిస్తూ అంతర్జాతీయ సముద్ర ఆహార మార్కెట్లలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. దేశంలో సముద్ర ఆహార ఎగుమతుల అభివృద్ధికి మరింత సమన్వయంతో, సమ్మిళితంతో  భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ప్రగతిశీల విధానాన్ని పెంపొందించడంలో ఈ జాతీయ సదస్సు ఒక కీలకమైన అడుగుగా నిలుస్తుందని భావిస్తున్నారు.

***


(रिलीज़ आईडी: 2268658) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil