శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పన్నెండేళ్ల సాంకేతిక రూపాంతరీకరణతో 2047 లక్ష్య సాధనకు పునాది: డాక్టర్ జితేంద్ర సింగ్


గడచిన పుష్కర కాలం రెండు దశాబ్దాల దేశ భవిష్యత్తును నడిపే ఆవిష్కరణావరణ వ్యవస్థను సృష్టించింది

ప్రపంచ శాస్త్రవిజ్ఞాన రంగంలో భారత్‌ మౌలిక స్వరూపాన్ని ఆధునిక సాంకేతికతల అనుసరణ దేశం నుంచి అగ్రగ్రామి స్థాయికి తీర్చిదిద్దింది ఈ రూపాంతరీకరణే

క్వాంటం మిషన్లు.. అంతరిక్ష రంగ సంస్కరణలు.. కృత్రిమ మేధను అందిపుచ్చుకోవడం వంటివి భారత సాంకేతిక పరిపక్వతకు ప్రతీకలు

ఆవిష్కరణ.. పరిశోధన.. సాంకేతికతలే రాబోయే దశాబ్దాల్లో భారత్‌ ప్రగతి ప్రస్థానాన్ని నిర్వచిస్తాయి

నాడు పోస్టు చేయడమైనది: 31 MAY 2026 4:04PM by PIB Hyderabad

   భారత్‌ 2047 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాల సాకారంలో గడచిన పన్నెండేళ్ల సాంకేతిక రూపాంతరీకరణ పునాది వేసిందని కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్ర, (స్వతంత్ర బాధ్యత) ప్రధానమంత్రి కార్యాలయ, సిబ్బంది-ప్రజా సమస్యలు-పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష మంత్రిత్వ శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన ఆధునిక సాంకేతికతలను అనుసరించే దేశం స్థాయి నుంచి అగ్రగ్రామిగా భారత్‌ ఎదిగిందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ శాస్త్ర విజ్ఞాన రంగంలో భారత్‌ మౌలిక స్వరూపాన్ని ఇలా తీర్చిదిద్దింది ఈ రూపాంతరీకరణేనని వివరించారు.

ఈ అంశంపై ‘దూరదర్శన్ న్యూస్‌’ చానెల్‌తో ఒక ‘పాడ్‌కాస్ట్‌’లో డాక్టర్ జితేంద్ర సింగ్ అనేక అంశాలను ప్రస్తావించారు. ఇతర దేశాల్లో ఆవిర్భవించిన సాంకేతిక పరిజ్ఞానాలను భారత్‌  దశాబ్దాలపాటు అనుసరిస్తూ వచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఆ క్రమంలో అత్యాధునిక సాంకేతిక రంగాల్లో ప్రవేశించడంలో అగ్రగామి దేశాలకన్నా ఎన్నో ఏళ్లు వెనుకబడిందని చెప్పారు. అయితే, సరికొత్త సాంకేతికతలను ఆవిష్కరించడంలో నేడు అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. అనేక రంగాల్లో ఆవిష్కరణలకు భవిష్యత్ దిశను నిర్దేశించడంలో తోడ్పాటునిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ మేరకు “గడచిన పన్నెండేళ్ల రూపాంతరీకరణే ఆధునిక సాంకేతికతల అనుసరణ దేశం నుంచి అగ్రగ్రామి స్థాయికి భారత్‌ను తీర్చిదిద్దింది. ఈ పుష్కర కాలంలో దేశం సృష్టించిన శాస్త్రవిజ్ఞాన సామర్థ్యాలు, రూపొందించిన ఆవిష్కరణారణ వ్యవస్థ, సాంకేతిక మౌలిక సదుపాయాలు ‘వికసిత భారత్@2047'కు పునాది వేశాయి” అని డాక్టర్ జితేంద్ర సింగ్ విశదీకరించారు.

జాతీయ విధాన రూపకల్పనలో శాస్త్ర, సాంకేతిక రంగాలకు ప్రధాని మోదీ కీలక స్థానమిచ్చారని గుర్తుచేశారు. ప్రైవేట్ రంగ భాగస్వామ్యం పెంపు, ఆవిష్కరణాధారిత వ్యవస్థాపనకు ప్రోత్సాహం, శాస్త్రీయ పురోగమనాన్ని పౌర ప్రయోజనకరంగా మార్చడంపై శ్రద్ధ వహించారని చెప్పారు. ఆర్థిక వృద్ధి, వ్యూహాత్మక సామర్థ్య వికాసం, ప్రజాసేవా ప్రదానంలో ఒకేసారి మద్దతివ్వగల సాంకేతికావరణ వ్యవస్థ నిర్మాణంలో ఈ విధానమే చోదకశక్తిగా నిలిచిందన్నారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలలో భారత్‌ ప్రాబల్యం ఇనుమడిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. అంతరిక్షం, అణుశక్తి, క్వాంటం-జీవసాంకేతికతలు, కృత్రిమ మేధ (ఏఐ), కాలుష్యరహిత ఇంధనం వంటి అనేక రంగాలలో దేశ గణనీయ పురోగమనమే ఇందుకు నిదర్శనమని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఈ రంగాలన్నీ దేశం 2047 నాటికి వికసిత భారత్‌గా రూపొందడానికి అవసరమైన శాస్త్ర-సాంకేతిక పునాది వేశాయన్నారు.

అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి వీలు కల్పించడంతో ప్రపంచంలో అత్యంత చైతన్యవంతమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థలలో ఒకటిగా భారత్‌ ఆవిర్భవించిందని చెప్పారు. ఈ క్రమంలో అంతరిక్ష రంగ అంకుర సంస్థల సంఖ్య ఒకటి నుంచి 400 దాటిందని తెలిపారు. దీంతో భారత్‌ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ నేడు దాదాపు 9 బిలియన్ డాలర్లు కాగా, భవిష్యత్తులో గణనీయంగా విస్తరించగలదని అంచనాలు చెబుతున్నాయని పేర్కొన్నారు.

భారత్‌ సాధించిన అంతరిక్ష విజయాల వల్ల శాస్త్రవిజ్ఞానంతో ప్రజల అనుబంధం పూర్తిగా పరిణామం చెందిందని చెప్పారు. నవ తరం ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలకు ఈ విజయాలు ఎనలేని స్ఫూర్తినిచ్చాయని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తుచేశారు. సమాచార ఆదానప్రదానం, మౌలిక సదుపాయాల ప్రణాళిక, పరిపాలన, విపత్తుల నిర్వహణ, వ్యవసాయం, జాతీయ భద్రత వంటి అంశాల్లో నేటి అంతరిక్ష సాంకేతికతలు పూర్తి మద్దతిస్తున్నాయని చెప్పారు. తద్వారా అవి దైనందిన ప్రజా జీవనంలో మరింతగా వినియోగంలోకి వస్తున్నాయని వివరించారు.

భారత దీర్ఘకాలిక ఇంధన వ్యూహంలో ‘ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్’ రూపకల్పన ఓ  ప్రధాన ఘట్టమని మంత్రి అభివర్ణించారు. డాక్టర్ హోమీ జహంగీర్ భాభా నిర్దేశించిన 3 దశల అణు కార్యక్రమానికి ఈ విజయం సారథ్యం వహిస్తుందని తెలిపారు. దేశ ఇంధన భద్రత, స్వావలంబన దిశగా భారత్‌ ప్రగతి ప్రస్థానాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందన్నారు.

అణుశక్తి రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం పెంపు లక్ష్యంగా ఇటీవల ప్రవేశపెట్టిన సంస్కరణలతో అంకుర సంస్థలు, పారిశ్రామికవేత్తలు, సాంకేతికత ఆధారిత సంస్థలకు కొత్త అవకాశాలు కల్పించాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ సంస్కరణల ద్వార ఆవిష్కరణలు వేగం పుంజుకుంటూ అత్యాధునిక ఇంధన సాంకేతికతలలో భారత్‌ సామర్థ్యాన్ని మరింత విస్తరిస్తాయని తెలిపారు.

జాతీయ క్వాంటం మిషన్ సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. ఇది ప్రారంభమయ్యాక తొలి సంవత్సరాల్లోనే 2,000 కిలోమీటర్ల క్వాంటం కమ్యూనికేషన్ సామర్థ్య సాధన లక్ష్యంలో దాదాపు సగం స్థాయిని భారత్‌ అందుకున్నదని ఆయన సగర్వంగా ప్రకటించారు. ప్రపంచంలో అత్యంత వ్యూహాత్మక సాంకేతిక రంగాలలో ఒకటైన క్వాంటం రంగంలో విస్తరిస్తున్న భారత్‌ నైపుణ్యాన్ని ఈ పురోగమన వేగం ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. సురక్షిత కమ్యూనికేషన్లు, రక్షణ సంసిద్ధత, భావితరం డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతంలో క్వాంటం కమ్యూనికేషన్ సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. తద్వారా క్వాంటం విజ్ఞానంలో అగ్రస్థానాన గల కొన్ని దేశాల జాబితాలో  భారత్‌ స్థానం పొందగలదని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

జీవసాంకేతిక రంగం గురించి వివరిస్తూ- ‘బయోఈ3’ విధానం ద్వారా ఈ సాంకేతిక ఆధారిత పారిశ్రామిక రూపాంతరీరణకు భారత్‌ సిద్ధమవుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. బయోటెక్నాలజీ, జన్యుశాస్త్రం, బయో-మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగాల్లో ప్రగతితోనే భవిష్యత్ ఆర్థిక వ్యవస్థ అధికశాతం రూపుదిద్దుకుంటుందని ఆయన చెప్పారు. ఈ రంగాల్లో అగ్రస్థానం దిశగా దేశం చురుగ్గా చర్యలు చేపడుతున్నదని తెలిపారు. జీనోమ్ సీక్వెన్సింగ్, అరుదైన వ్యాధుల నిర్ధారణ-చికిత్స, స్వదేశీ ఔషధ రూపకల్పన, జన్యు-చికిత్సలో ప్రగతి వంటి కార్యక్రమాలు ఇనుమడిస్తున్న భారత శాస్త్రవిజ్ఞాన సామర్థ్యానికి కొన్ని ఉదాహరణలని ఆయన పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యంగల పరిష్కారాల ఆవిష్కరణలో భారత్‌ సామర్థ్యాన్ని ఇవన్నీ బలోపేతం చేస్తున్నాయని తెలిపారు.

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో దేశం ముందంజను వివరిస్తూ- పరిపాలన, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, సమాచార ప్రసారం, శాస్త్ర పరిశోధనలు, ప్రజాసేవా ప్రదానం వంటి రంగాల్లో ‘ఏఐ’ ఒక పరిణామాత్మక శక్తిగా ఆవిర్భవిస్తున్నదని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ చెప్పారు. సామర్థ్యం, ఆవిష్కరణలు, పౌర-కేంద్రక పరిపాలన వగైరాల మెరుగుదలలో మానవ నైపుణ్యాన్ని కృత్రిమ మేధ సమర్థ వ్యవస్థలతో జోడించే సమతుల విధానాన్ని దేశం నేడు అనుసరిస్తోందని ఆయన గుర్తుచేశారు. కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు, సమాచార నిధులు, ఆవిష్కరణలు, ఆధనిక అనువర్తనాలలో పెట్టుబడులు పెడుతున్నదని పేర్కొన్నారు. తద్వారా అత్యాధునిక డిజిటల్ సాంకేతికతలలో భారత్‌ భవిష్యత్ అగ్రగామిగా ఎదిగే దిశగా ‘ఇండియాఏఐ మిషన్’ బలమైన పునాది వేస్తోందని పేర్కొన్నారు.

భారత విస్తృత ఆవిష్కరణావరణ వ్యవస్థ గడచిన దశాబ్దంలో వేగంగా పురోగమించిందని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ అన్నారు. ప్రపంచ అగ్రగామి అంకుర గమ్యాల్లో భారత్‌ ఒకటిగా ఎదగడం, పేటెంట్ దరఖాస్తుల సమర్పణలో గణనీయ వృద్ధి, ప్రపంచ ఆవిష్కరణల ర్యాంకింగ్‌ మెరుగుదల, శాస్త్రవిజ్ఞాన ప్రచురణ సంఖ్య పెరుగుదల వంటివి ఇందుకు కొన్ని నిదర్శనాలని మంత్రి గుర్తుచేశారు. ఇతర దేశాల్లో రూపొందిన సాంకేతికతల వాడుకునే దేశంగా కాకుండా ప్రపంచ సవాళ్లకు అసలైన ఆవిష్కరణలు, పరిష్కారాలను సృష్టించేదిగా భారత్‌ గుర్తింపు నానాటికీ విస్తరిస్తున్నదని ఆయన చెప్పారు.

కాలుష్య రహిత ఇంధన రంగాన్ని ప్రస్తావిస్తూ- అణుశక్తి, గ్రీన్ హైడ్రోజన్, సౌరశక్తి, వర్ధమాన అత్యాధునిక సముద్రాధారిత ఇంధన వ్యవస్థల సమ్మేళనంతో భారత్‌ ఒక వైవిధ్యభరిత వ్యూహాన్ని అనుసరిస్తున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. సుస్థిర ప్రగతి, 2070 నాటికి నికరశూన్య ఉద్గార లక్ష్య సాధనపై భారత్‌ దీర్ఘకాలిక నిబద్ధతకు అనుగుణంగా ఈ కార్యక్రమాలన్నీ అమలవుతున్నాయని ఆయన అన్నారు.

ప్రపంచం ఇప్పటిదాకా పెద్దగా దృష్టి సారించని నీలి ఆర్థిక వ్యవస్థ, అగాధ సముద్ర వనరులు, హిమాలయ జీవ వనరులు, అధునాతన బయోటెక్నాలజీ, భావితరం తయారీ సాంకేతికతలు వంటివి భారత వృద్ధి పథంలో తదుపరి దశకు సారథ్యం వహిస్తాయని మంత్రి చెప్పారు. ఈ రంగాలకు సంబంధించి భారత దేశానికి అధికశాతం ప్రత్యేక, సహజ వనరులతోపాటు శాస్త్రీయ ప్రయోజనాలు లభిస్తాయని చెప్పారు. వీటిని ప్రగతి ప్రస్థానానికి చోదక శక్తులుగా మార్చగల అనువైన పరిస్థితులు భారత్‌లో ఉన్నాయని వివరించారు.

గడచిన పుష్కర కాలంలో భారత్‌ పయనాన్ని బృహత్తర జాతీయ రూపాంతరీకరణకు నాందిగా పరిగణించాని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. భారత్‌ అగ్రగామి విజ్ఞానార్థిక వ్యవస్థగా ఆవిర్భవించడంలో ఈ పన్నెండేళ్లు  కీలక పాత్ర పోషించాయని చెప్పారు. దేశంలో శాస్త్ర విజ్ఞానంపై విశ్వాసంతోపాటు సాంకేతిక సామర్థ్యం, ఆవిష్కరణారణ వ్యవస్థ బహుముఖంగా విస్తరించి, ‘వికసిత భారత్‌@2047’ స్వప్న సాకారానికి బాటలు వేశాయని చెబుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

 

 

చిత్రం: న్యూఢిల్లీలోని దూరదర్శన్ భవన్‌లో ఆదివారం ‘దూరదర్శన్‌ న్యూస్‌’ చానెల్‌లో ప్రత్యేక ‘పాడ్‌కాస్ట్‌’లో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

 

***


(రిలీజ్ ఐడి: 2267347) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Tamil , Urdu , Marathi , हिन्दी