నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీఎమ్-సేతు కింద తొలి వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక ఆమోదాన్ని దక్కించుకున్న ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా


పరిశ్రమల నేతృత్వంలోని ఐటీఐ పరివర్తనలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

రూ. 60,000 కోట్ల పీఎంమ్-సేతు పథకం కింద తొలి కార్యాచరణ పారిశ్రామిక భాగస్వామ్యంగా జాతీయ స్టీరింగ్ కమిటీ ఆమోదం పొందిన విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్

నాడు పోస్టు చేయడమైనది: 30 MAY 2026 1:40PM by PIB Hyderabad

‘ప్రధానమంత్రి - నైపుణ్యాభివృద్ధి, ఉన్నతీకరించిన ఐటీఐల ద్వారా ఉపాధి కల్పన పరివర్తన’ (పీఎం-సేతు) పథకం కింద ఒక చరిత్రాత్మక పరిణామంగా... ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ కోసం ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా (ఏఎం/ఎన్ఎస్ ఇండియా) సమర్పించిన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక (ఎస్ఐపి)కి జాతీయ స్టీరింగ్ కమిటీ (ఎన్ఎస్‌సీ) ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం ద్వారా… పీఎం-సేతు కింద ఆమోదం పొందిన తొలి వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికగా నిలవడమే కాకుండా, ఈ పథకం కింద ఒక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని కార్యాచరణలోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.

భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికీకరణ మంత్రిత్వ శాఖ (ఎమ్ఎస్‌డీఈ) ఆధ్వర్యంలో, న్యూఢిల్లీలోని కౌశల్ భవన్‌ వేదికగా నిర్వహించిన 3వ జాతీయ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ ఆమోదం లభించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రముఖ పారిశ్రామిక సంస్థల మధ్య బలమైన భాగస్వామ్యాల ద్వారా ప్రభుత్వ ఐటీఐలను పరిశ్రమల నిర్వహణలో నడిచే, ఫలితాల-ఆధారిత సంస్థలుగా అబివృద్ధి చేసే పీఎమ్-సేతు పథకం దార్శనికతను అమలు చేసే దిశగా ఇది తొలి కీలక ముందడుగు.

నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికీకరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి దేబాశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి... జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యులతో పాటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీ) డైరెక్టర్ జనరల్ శ్రీ దిలీప్ కుమార్ హాజరయ్యారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (సీబీసీ), నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీవీఈటీ), వాణిజ్యం-పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, కార్మిక-ఉపాధి మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, ఐటీసీ లిమిటెడ్, ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (ఏఎమ్/ఎన్ఎస్) ఇండియా వంటి పారిశ్రామిక దిగ్గజాలు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ), ప్రపంచ బ్యాంక్ వంటి అభివృద్ధి భాగస్వాముల నుంచి సీనియర్ ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ కోసం ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా సమర్పించిన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికకు ఆమోదం లభించడం ఈ సమావేశ కీలక ఫలితం. ఈ ఆమోదంతో, పీఎమ్-సేతు పథకం కింద ఒక యాంకర్ ఇండస్ట్రీ పార్టనర్ (ఏఐపీ)ని చేర్చుకున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. తద్వారా, ఈ పథకం కింద అంచనా వేసిన పరిశ్రమల నేతృత్వంలోని హబ్-అండ్-స్పోక్ నమూనా కార్యాచరణలో ఇది కీలక మైలురాయిగా నిలిచింది.

విశాఖపట్నం క్లస్టర్‌కు లభించిన ఆమోదం... మారుతున్న శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా స్పందించగల, పరిశ్రమల నిర్వహణ గల, ఫలితాల-ఆధారిత సంస్థలుగా పారిశ్రామిక శిక్షణా సంస్థలను మార్చే దిశగా కీలక ముందడుగు అవుతుంది. ఈ ప్రతిపాదనకు లభించిన ఆమోదం... వృత్తి విద్యా శిక్షణలో పరిశ్రమల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని, దేశవ్యాప్తంగా పీఎమ్-సేతు కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలనీ కోరుకుంటున్న ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తున్నారు.

భాగస్వామ్య రాష్ట్రాల్లో పీఎమ్-సేతు అమలు పురోగతిని జాతీయ స్టీరింగ్ కమిటీ సమీక్షించింది. పరిశ్రమల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, సంస్థాగత పాలనను మెరుగుపరచడం, ప్రత్యేక ప్రయోజన వాహనాల (ఎస్‌పీవీల) ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం, పథకం కింద ప్రాజెక్టుల కార్యాచరణను వేగవంతం చేయడం లక్ష్యంగా నిర్దేశించుకున్న విధానపరమైన, అమలు చర్యలను కమిటీ చర్చించింది.

దేశంలో వృత్తి విద్య-శిక్షణా వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్న రంగాల డిమాండ్లకు, భవిష్యత్ శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు గానూ... పరిశ్రమల నేతృత్వంలోని పాలనా యంత్రాంగాలను అభివృద్ధి చేయడం, ఫలితాధారిత నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం, పరిశ్రమలు-రాష్ట్ర ప్రభుత్వాలు-శిక్షణా సంస్థల మధ్య భాగస్వామ్యాలను బలోపేతం చేయడంపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు.

రూ.60,000 కోట్ల కేటాయింపుతో భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన పీఎమ్-సేతు... పరిశ్రమల నేతృత్వంలోని హబ్-అండ్-స్పోక్ నమూనా ద్వారా 1,000 ప్రభుత్వ ఐటీఐల పరివర్తన సాధనను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ పథకం మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడం, పరిశ్రమల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, అధిక వృద్ధి ఉన్న రంగాల్లో జాతీయ శ్రేష్ఠతా కేంద్రాలను (ఎన్‌సీవోఈ) స్థాపించడం, బలమైన ప్రభుత్వ-పరిశ్రమల భాగస్వామ్యాల ద్వారా అధునాతన తయారీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు సన్నద్ధమైన, భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని అబివృద్ధి చేయడం వంటి లక్ష్యాలను కలిగి ఉంది.

32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ రాష్ట్ర స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేయగా... 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు యాంకర్ ఇండస్ట్రీ భాగస్వాముల ఎంపికలో పరిశ్రమల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ తమ ప్రతిపాదనల కోసం అభ్యర్థనలను జారీ చేశాయి. వీటిలో చాలా వరకు రాబోయే వారాల్లో ముగింపు దశకు చేరుకుంటున్నాయి. పూర్తిస్థాయి, పరిశ్రమల నేతృత్వంలోని అమలు దశకు పీఎమ్-సేతు చేరువలో ఉంది. ఇప్పటికే పలు దఫాలుగా ముగిసిన, రాబోయే వారాల్లో మరిన్ని దఫాలుగా నిర్వహించనున్న రాష్ట్రం-పరిశ్రమల సంప్రదింపుల పటిష్ఠమైన పరంపర... పరిశ్రమల ప్రయోజనాలకు, రాష్ట్రాల సంసిద్ధతకు మధ్య పెరుగుతున్న సమన్వయాన్ని ప్రతిబింబిస్తోంది.

సన్నాహకాల్లో సాధించిన విజయాల ద్వారా లభించిన ఊపును త్వరితగతిన ప్రాజెక్టుల క్షేత్రస్థాయి అమలులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నిహిత సమన్వయంతో పనిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఐటీఐ పరివర్తనను పెద్ద ఎత్తున ముందుకు నడిపించడానికి పారిశ్రామిక భాగస్వామ్యాలూ సిద్ధంగా ఉన్నాయి. రాబోయే నెలల్లో, మరిన్ని వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికలు జాతీయ స్టీరింగ్ కమిటీ ఆమోదం పొందుతాయని భావిస్తున్నారు. ఇది వికసిత్ భారత్-2047 కోసం రూపాంతరం చెందిన వృత్తి విద్య-శిక్షణా వ్యవస్థకు మార్గం సుగమం చేస్తుంది.

***


(రిలీజ్ ఐడి: 2267166) సందర్శకుల సూచీ సంఖ్య : : 25
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil , Telugu_Vw