లోక్‌సభ సచివాలయం
ప్రజాస్వామ్య చైతన్యాన్ని పటిష్ఠపరచడంలో పార్లమెంటరీ వారసత్వ పరిరక్షణ పాత్ర ఎంతో కీలకం: లోక్‌సభ స్పీకర్
భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచానికే దారిదీపంగా ఉందన్న లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా
ప్రజాస్వామ్య గౌరవాన్ని నిలబెట్టాలంటే వాస్తవాల ఆధారంగా చర్చించడం అత్యంత ముఖ్యం: లోక్‌సభ స్పీకర్
శ్రీ విఠల్‌భాయి పటేల్ వారసత్వం నవ తరం చట్టసభ సభ్యులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్న లోక్‌సభ స్పీకర్
కేంద్ర చట్టసభ కార్యకలాపాలకు సంబంధించిన 89 సంపుటాలతో పాటు ‘విధాన్-చేతన’ పత్రికనూ ఆవిష్కరించిన లోక్‌సభ స్పీకర్
నాడు పోస్టు చేయడమైనది:
28 MAY 2026 5:10PM by PIB Hyderabad
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ యావత్ ప్రపంచానికే దారిదీపంగా నిలుస్తోందని లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ఈ రోజు వర్ణించారు. చర్చలు, భాగస్వామ్యం, రాజ్యాంగ విలువలకు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పట్టం కడుతూ, ప్రపంచ దేశాలకు స్ఫూర్తిని అందిస్తోందని కూడా ఆయన అన్నారు.
కేంద్ర చట్టసభ (1924-1930) కార్యకలాపాలకు సంబంధించిన 89 సంపుటాల ఆవిష్కరణతో పాటు, ‘విధాన్-చేతన’ త్రైమాసిక పత్రిక తొలి సంచికను కూడా విడుదల చేయడానికి న్యూఢిల్లీలోని ఢిల్లీ విధానసభలో ఈ రోజు ఏర్పాటు చేసిన ఒక సభను ఉద్దేశించి శ్రీ ఓం బిర్లా ప్రసంగించారు. సమాచారాన్ని తెలుసుకొని మరీ చర్చించడం, వాస్తవాలపై ఆధారపడిన చర్చలతో పాటు క్రియాశీల ప్రజా భాగస్వామ్యం ద్వారానే ప్రజాస్వామిక సంస్థలు తమ సిసలైన బలాన్ని సమకూర్చుకుంటాయని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాబోయే తరాలలో ప్రజాస్వామిక చైతన్యాన్ని బలోపేతం చేయడానికి భారత్ పార్లమెంటరీ వారసత్వాన్ని సంరక్షించుకోవడమే కాకుండా ఆ వారసత్వంపై లోతైన అధ్యయనాన్ని నిర్వహించడం కూడా ఎంతో అవసరమని ఆయన సూచించారు.
ఢిల్లీ విధాన సభా భవనం భారత ప్రజాస్వామిక చైతన్యానికి, పార్లమెంటరీ సంప్రదాయాలకు, స్వాతంత్య్ర ఉద్యమానికే కాకుండా వైభవోపేత వారసత్వానికి కూడా సజీవ ప్రతీకగా విరాజిల్లుతోందని లోక్‌సభ స్పీకర్ అన్నారు. విధాన సభా భవన సముదాయానికి ఉన్న చరిత్రాత్మక ప్రాధాన్యాన్ని ఆయన స్మరించుకుంటూ, ఈ భవనం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రాథమిక దశకు సాక్షిగా నిలిచిందన్నారు. దేశ స్వాతంత్య్ర సమర యోధులతో పాటు జాతీయ నేతలు ప్రాతినిధ్యం, హక్కులు, స్వపరిపాలన కోసం రాజ్యాంగబద్ధ కోర్కెలను ఎలుగెత్తి చాటిన వేదికగా కూడా ఇది ఒక ప్రధాన పాత్రను పోషించిందని ఆయన వివరించారు.
కేంద్ర చట్టసభ ప్రథమ భారతీయ స్పీకర్ శ్రీ విఠల్‌భాయి పటేల్ సేవలను శ్రీ బిర్లా గుర్తుచేస్తూ, ప్రజాస్వామ్య మర్యాద, నిష్పాక్షికత్వం, అధ్యక్ష స్థానానికి ఉన్న గౌరవాలకు ఆయన ఒక బలమైన పునాదిని వేశారన్నారు. వలసవాద పాలన కాలంలో శ్రీ పటేల్ ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ, ఈ చట్టసభ స్వయంప్రతిపత్తిని, ప్రతిష్ఠ నీ నిలబెట్టారని శ్రీ బిర్లా కొనియాడారు. శ్రీ విఠల్‌భాయి పటేల్ అందించిన ఈ సేవలు దేశవ్యాప్తంగా ప్రిసైడింగ్ అధికారులకు, పార్లమెంటు సభ్యులకు, శాసన సభ్యులకు ఎల్లవేళలా స్ఫూర్తిని ఇస్తూ ఉంటాయన్నారు.
తర్కం, గంభీరత్వం, వాస్తవాలపై ఆధారపడి సాగే మాటామంతీ, చర్చలు.. ఇవి ప్రజాస్వామిక సంస్థల గౌరవాన్ని పరిరక్షించగలుగుతాయని, ప్రజావిశ్వాసాన్ని బలపరచగలుగుతాయని లోక్‌సభ స్పీకర్ స్పష్టం చేశారు. భారత ప్రజాస్వామ్య సంస్కృతికి చర్చలు, ఏకాభిప్రాయసాధన, అర్థవంతమైన సంప్రదింపులు మూలస్తంభాలుగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కారణంగా, పార్లమెంటుతో పాటు రాష్ట్రాల చట్టసభలు సదా దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే సర్వోన్నత వేదికలుగా వ్యవహరించాలని ఆయన కోరారు.
పరిపాలనలో, చట్టసభల పనితీరులో సాంకేతికత ప్రాధాన్యాన్ని శ్రీ బిర్లా వివరించారు. డిజిటలీకరణ, (ఎలక్ట్రానిక్స్ ఆధారిత) ‘ఈ-చట్టసభ’లు, కృత్రిమ మేధ (ఏఐ) వంటి సరికొత్తగా తెర మీదకు వచ్చిన సాంకేతికతలు విధాన రూపకల్పన, చట్టసభలకు సంబంధించిన పరిశోధనను ఇదివరకటి కన్నా ఎక్కువ పారదర్శకత్వం కలిగి ఉండే, సమర్థ, సులభతర ప్రక్రియగా తీర్చిదిద్దాయని ఆయన అన్నారు.
ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో, శ్రీ బిర్లా కేంద్ర చట్టసభ కార్యకలాపాలకు సంబంధించిన 89 సంపుటాలతో పాటు, ‘విధాన్- చేతన’ తొలి సంచిక ని ఆవిష్కరించారు. కేంద్ర చట్టసభ కార్యకలాపాలను గ్రంథ రూపంలో తీసుకు రావడం ఒక కీలక ప్రగతి ప్రస్థానమని శ్రీ బిర్లా వ్యాఖ్యానించారు. ఈ సంకలనం భావి తరాల వారికి ప్రజాస్వామిక విలువలనూ, పార్లమెంట్ సంప్రదాయాలనూ తెలియజేసే దారిదీపంగా నిలుస్తుందన్న ఆశను ఆయన వ్యక్తం చేశారు. ఈ అరుదైన చర్చలు, సభా కార్యకలాపాలకు ఢిల్లీ విధానసభ చక్కని గ్రంథ రూపాన్ని ఇచ్చి భారత చట్టసభల చరిత్రను పరిరక్షించే దిశగా చాలా ముఖ్యమైన అంతరాన్ని భర్తీ చేసిందని కూడా ఆయన అన్నారు.
‘విధాన్-చేతన’ పత్రికను తీసుకువచ్చినందుకు శ్రీ బిర్లా ప్రశంసలు కురిపిస్తూ ఇది ఒక ముఖ్య మేధా సంబంధ కార్యక్రమమన్నారు. ఇది పార్లమెంటుకు సంబంధించిన అధ్యయనాన్ని, చట్టసంబంధిత పరిశోధనల్ని, ప్రజాస్వామ్య అవగాహనని మరింత దృఢంగా మారుస్తుందని ఆయన చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల మేధాపరమైన సామర్థ్యం ఇలాంటి ప్రయత్నాలతో పెరగడమే కాకుండా, ప్రజాస్వామ్యానికి దిశానిర్దేశం, పౌరులలో చైతన్యం మెరుగుపడతాయని ఆయన అన్నారు. చరిత్రాత్మక సభా కార్యకలాపాలతో పాటు ‘విధాన్-చేతన’ పత్రికను పరిశోధకులకు, విద్యార్థులకు, పౌరులకు విస్తృత స్థాయిలో డిజిటల్ ఫార్మేట్లలో అందుబాటులోకి తీసుకువస్తారన్న ఆశాభావాన్ని శ్రీ బిర్లా వ్యక్తం చేశారు. భారత పార్లమెంటరీ వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు ప్రజాస్వామిక చేతనత్వానికి సరికొత్త ఉత్సాహాన్ని అందిస్తూ ఈ చరిత్రాత్మక కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఢిల్లీ విధాన సభను ఆయన ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజూ, ఢిల్లీ విధాన సభ స్పీకర్ శ్రీ విజేందర్ గుప్తా, ఢిల్లీ మంత్రి శ్రీ పర్వేశ్ సాహిబ్ సింగ్, ఢిల్లీ విధాన సభ డిప్యూటీ స్పీకర్ శ్రీ మోహన్ సింగ్ బిస్త్ కూడా పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2266591)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10