రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2026 - 27లో ద్రవ్యార్జన కోసం జాతీయ రహదారి ప్రాజెక్టుల తాత్కాలిక జాబితాను సిద్ధం చేసిన ఎన్‌హెచ్ఏఐ

నాడు పోస్టు చేయడమైనది: 28 MAY 2026 2:20PM by PIB Hyderabad

ప్రస్తుతం అందుబాటులో ఉన్న జాతీయ రహదారులు, సంబంధిత ఆస్తుల నుంచి ఆదాయాన్ని పొందడం కోసం.. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను టోల్- నిర్వహణ - బదిలీ (టీవోటీ), మౌలిక సదుపాయాల పెట్టుబడి నిధి (ఇన్విట్) పద్ధతుల్లో ఆదాయాన్ని పొందేందుకు ప్రతిపాదించిన జాతీయ రహదారి మార్గాల తాత్కాలిక జాబితాను ఎన్‌హెచ్ఏఐ ఖరారు చేసింది. అయితే 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను రాజ్‌మార్గ్ ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (ఆర్ఐఐటీ) ద్వారా ఆదాయం పొందాలని ప్రతిపాదించిన ఆస్తులను ఈ జాబితాలో చేర్చలేదు.

మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడం కోసం అవసరమైన మూలధనాన్ని సమీకరించడం, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, జాతీయ రహదారుల నెట్‌వర్క్ విస్తరణతోపాటు ఆధునికీకరణను వేగవంతం చేయడం లక్ష్యంగా.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జాతీయ రహదారి ఆస్తులను సద్వినియోగం చేసుకుంటూ, ఆస్తుల ద్వారా ద్రవ్యార్జన (మానిటైజేషన్) చేయాలన్న భారత ప్రభుత్వ వ్యూహంలో ఈ కార్యక్రమం భాగం. పెట్టుబడిదారులు లేదా బిడ్డర్లు తమ పెట్టుబడులను అత్యంత సమర్థమైన రీతిలో ప్రణాళిక చేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది.

గుర్తించిన జాతీయ రహదారుల మొత్తం పొడవు 1692.5 కిలోమీటర్లు. హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. సుస్థిర రవాణా సామర్థ్యం, పటిష్టమైన రవాణా ప్రాధాన్యం కలిగిన ఆర్థిక, లాజిస్టిక్స్ కారిడార్లుగా ఈ రహదారి ఆస్తులు ఉంటాయి. 17 ప్రాజెక్టుల జాబితాను ఎన్‌హెచ్ఏఐ వెబ్‌సైట్‌ (https://nhai.gov.in/nhai/sites/default/files/mix_file/Tentative_list_of_assets_for_monetization_in_FY-2026-27.pdf)లో చూడవచ్చు.

టీవోటీ, ఇన్విట్ పద్ధతుల్లో అత్యంత పారదర్శకమైన, నిర్మాణాత్మక విధానాల ద్వారా ఈ ద్రవ్యార్జన ప్రక్రియ జరుగుతుంది. సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం వినూత్న ఆర్థిక విధానాలను అవలంబించడం, ఆస్తుల సమర్థ నిర్వహణ - కార్యాచరణలో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడం ద్వారా.. జాతీయ రహదారి మౌలిక సదుపాయాలను మరింత విస్తరించడానికి అవసరమైన దీర్ఘకాలిక సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ రెండు విధానాలు అత్యంత విజయవంతమైన నమూనాలుగా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంపొందించే, అంతరాయం లేకుండా అనుసంధానాన్ని అందించే.. ఆధునిక, పటిష్టమైన, సుస్థిర జాతీయ రహదారి వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఎన్‌హెచ్ఏఐ కట్టుబడి ఉందని ఈ చర్యతో స్పష్టమవుతోంది. 

***


(రిలీజ్ ఐడి: 2266321) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , Bengali , English , Urdu , हिन्दी