యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్ఎస్‌డీఈ పరిధిలో జాతీయ క్రీడా సమాఖ్యల్లో ఐటీ కన్సల్టెంట్లను నియమించేందుకు సిద్ధమవుతున్న క్రీడా మంత్రిత్వ శాఖ... క్రీడా పరిపాలనను బలోపేతం చేయడం, 2030 కామన్వెల్త్ క్రీడల కోసం సన్నద్ధతే లక్ష్యం

నాడు పోస్టు చేయడమైనది: 28 MAY 2026 1:11PM by PIB Hyderabad

దేశ క్రీడా పరిపాలన వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు జాతీయ క్రీడా సమాఖ్యల (ఎన్ఎస్ఎఫ్) కార్యకలాపాల్లో సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కీలక ముందడుగు పడింది. విస్తృత వేదిక అయిన జాతీయ క్రీడా డిజిటల్ వ్యవస్థ (ఎన్ఎస్‌డీఈ) పరిధిలో ప్రత్యేక ఎన్ఎస్ఎఫ్ ఐటీ సాంకేతిక నిపుణుల (ఐటీ కన్సల్టెంట్లు)ను నియమించాలని... కేంద్ర యువజన వ్యవహారాలు - క్రీడల మంత్రిత్వ శాఖ, భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఏఐ) యోచిస్తున్నాయి.

ఈ సరికొత్త ప్రయత్నం గురించి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ‘‘2030 కామన్వెల్త్ క్రీడలు, దీర్ఘకాలిక ఒలింపిక్ లక్ష్యాల దిశగా మరింత బలమైన క్రీడా వ్యవస్థను నిర్మించుకునేందుకు భారత్ సిద్ధమవుతున్న తరుణంలో.. క్రీడా సమాఖ్యల డిజిటల్ వ్యవస్థలను క్రమబద్ధీకరించడం, పోటీల నిర్వహణ, జాతీయ శిక్షణ శిబిరాలు, క్రీడాకారుల భాగస్వామ్యం, పాలన ప్రక్రియలు, నిరంతర సమన్వయాన్ని మరింత సమర్థంగా ప్రణాళికాబద్ధం చేయడమే ఈ ఆలోచన ముఖ్యోద్దేశం’’ అన్నారు.

వార్షిక పునరుద్ధరణ పోర్టల్, వార్షిక శిక్షణ, పోటీల క్యాలెండర్ (ఏసీటీసీ), క్రీడల నిర్వహణ వ్యవస్థ (జీఎంఎస్), మహిళల కోసం క్రీడల పోర్టల్, జాతీయ క్రీడల రిపోజిటరీ వ్యవస్థ, త్వరలో ప్రవేశపెట్టనున్న డిజీలాకర్ అనుసంధానాల వంటి వివిధ డిజిటల్ వేదికల ద్వారా.. కేంద్ర యువజన వ్యవహారాలు - క్రీడల మంత్రిత్వ శాఖ, భారత క్రీడా ప్రాధికార సంస్థలు గత కొన్నేళ్లుగా జాతీయ క్రీడా సమాఖ్యల ముఖ్యమైన నిర్వహణ విధులను క్రమంగా డిజిటలీకరించాయి. ఈ ఐటీ వ్యవస్థలు క్రీడా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, క్రీడాకారుల పర్యవేక్షణ, నిధుల పర్యవేక్షణ, పాలన ప్రక్రియలను గణనీయంగా మెరుగుపరిచాయి.

వార్షిక గుర్తింపు, నిబంధనల అమలు, పోటీల క్యాలెండర్ నిర్వహణ, క్రీడాకారులు, కోచ్‌ల ప్రదర్శనలను మదింపు చేయడం, పోటీలకు నామినేషన్లు, ఫలితాలను అప్‌లోడ్ చేయడం, ఆర్థిక పత్రాల నిర్వహణ, డిజీలాకర్ అనుసంధానిత ధ్రువీకరణ పత్రాల జారీ వంటి అనేక డిజిటల్ పని విధానాలు క్రీడా సమాఖ్యల్లో రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. సమాఖ్యల స్థాయిలో వీటన్నింటినీ పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేకమైన డిజిటల్ సమన్వయ సహకారం అత్యావశ్యకంగా మారింది.

శిక్షణ పొందిన ఈ ఎన్ఎస్ఎఫ్ ఐటీ కన్సల్టెంట్లు.. జాతీయ క్రీడా సమాఖ్యలకు సహాయకులుగా చేదోడువాదోడుగా నిలుస్తారని భావిస్తున్నారు. ఎన్ఎస్‌డీఈ పరిధిలోని వివిధ డిజిటల్ వ్యవస్థలను సమాఖ్యలు సులభంగా స్వీకరించేలా, వాటిని విజయవంతంగా అమలు చేసేలా, సమర్థంగా సమన్వయం చేసుకునేలా వీరు తోడ్పడతారు.

ఏసీటీసీ క్యాలెండర్, ప్రతిపాదనల రూపకల్పన, పోటీల నిర్వహణ వ్యవస్థలో క్రీడాకారులు, అధికారుల నామినేషన్ల నమోదు, వార్షిక పునరుద్ధరణ పత్రాల సమర్పణ, టోర్నమెంట్ ఫలితాలను అప్‌లోడ్ చేయడం ద్వారా క్రీడాకారుల సర్టిఫికెట్లను డిజీలాకర్‌తో అనుసంధానించడం, ఎన్ఎస్ఆర్ఎస్‌లో ప్రొఫైల్ వివరాల ధ్రువీకరణ, నివేదికలు, రికార్డుల నిర్వహణ, అలాగే భారత క్రీడా ప్రాధికార సంస్థ, కేంద్ర యువజన వ్యవహారాలు - క్రీడల మంత్రిత్వ శాఖలతో నిరంతరం డిజిటల్ మాధ్యమాల ద్వారా సమన్వయం చేసుకోవడం వంటి ముఖ్యమైన అంశాల్లో ఈ ఐటీ కన్సల్టెంట్లు పూర్తి స్థాయిలో క్రీడా సమాఖ్యలకు సహకారాన్ని అందిస్తారు.

దీని ద్వారా క్రీడాకారుల సమాచారం, షెడ్యూళ్లు, నామినేషన్లు, ఆమోదాల వంటి అంశాల నిర్వహణ సకాలంలో, సమన్వయంతో జరుగుతుంది. దీంతో పోటీల భాగస్వామ్య ప్రణాళికలు, జాతీయ శిక్షణ శిబిరాల నిర్వహణలో పనితీరు సామర్థ్యం గణనీయంగా మెరుగుపడుతుందని భావిస్తున్నారు. అలాగే, కార్యకలాపాల సమన్వయంలో ఉండే లోపాలను తగ్గించడానికి, డేటా నాణ్యతను మెరుగుపరచడానికి, నిర్దేశిత సమయపాలనను మరింత మెరుగ్గా పాటించడానికి దోహదపడడంతోపాటు.. క్రీడాకారుల నైపుణ్యాభివృద్ధి, క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రతిభను సాధించడంపై సమాఖ్యలు మరింత సమర్థంగా దృష్టి నిలిపేలా ఇది తోడ్పడుతుంది.

దేశ క్రీడా పాలన వ్యవస్థ మరింత ఉన్నత స్థితికి చేరుతోందన్న అంశాన్ని ఈ ఎన్ఎస్ఎఫ్ ఐటీ కన్సల్టెంట్ విధానం స్పష్టం చేస్తోంది. విడివిడిగా ఉండే డిజిటలైజేషన్ ప్రక్రియల నుంచి.. క్రీడాకారులే కేంద్రంగా ఉండేలా, క్రీడా సమాఖ్యలకు పూర్తి సాంకేతిక మద్దతును అందించేలా ఒక సమగ్ర డిజిటల్ సహాయక వ్యవస్థగా ఇది మారుతోంది.

2030 కామన్వెల్త్ క్రీడల కోసం సన్నాహాలను మరింత తీవ్రం చేస్తూ, సొంత గడ్డపై రికార్డు స్థాయిలో పతకాలను సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్న తరుణంలో.. క్రీడాకారుల నిర్వహణ, పోటీల కోసం సంసిద్ధత, క్రీడాకారుల ప్రతిభను పర్యవేక్షించడం, సంస్థాగత సమన్వయాన్ని మెరుగుపరచడంలో ఈ డిజిటల్ పాలన వ్యవస్థల బలోపేతం అత్యంత కీలక పాత్ర పోషించనుంది.

ఎన్ఎస్ డీఈ, ఎన్ఎస్ఆర్ఎస్, సమాఖ్య సహాయక వ్యవస్థలు, ఎన్ఎస్ఎఫ్ ఐటీ కన్సల్టెంట్ల సమష్టి భాగస్వామ్యంతో.. క్రీడా రంగంలో మరింత పారదర్శకతను తీసుకురావడం ద్వారా దేశాన్ని క్రీడల్లో మరింత బలోపేతం చేయాలనే సంకల్పానికీ, అలాగే వికసిత్ భారత్ ఆశయానికీ అనుగుణంగా.. ఎలాంటి అంతరాయాలూ లేని, పారదర్శకమైన, సాంకేతికత చోదకంగా ఉండే క్రీడా వ్యవస్థను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

***


(రిలీజ్ ఐడి: 2266315) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati